సీఎం వైయ‌స్ జగన్‌ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

అధికారులను ఆదేశించిన జిల్లా ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఈ నెల 23న ఉర‌వ‌కొండ‌లో వైయ‌స్ఆర్ ఆస‌రా కార్య‌క్ర‌మం

 ఉరవకొండలో ఇంచార్జ్ వై. విశ్వేశ్వరరెడ్డి, సీఎం కో ఆర్డినేటర్ తలసిల రఘురాంతో కలిసి ఏర్పాట్లను పరిశీలన

ఉరవకొండ: ఈనెల 23 న ఉరవకొండ నియోజకవర్గానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర అటవీ, విద్యుత్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈనెల 23 వ తేదీ మంగళవారం ఉరవకొండకు రానున్నారు. ‘వైయ‌స్ఆ ర్‌ ఆసరా’ పథకం కింద డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించి నాలుగో విడత సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు సంబంధించిన వేదిక ఇతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గౌతమి, ఎస్పీ అన్బురాజన్, ఉరవకొండ ఇంచార్జ్ వై. విశ్వేశ్వరరెడ్డి, సీఎం కో- ఆర్డినేటర్ తలసిల రఘురాం, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, యువజన విభాగం జోనల్ ఇంచార్జ్ వై. ప్రణయ్ రెడ్డి, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శనివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. భారత్ పెట్రోల్ బంకు సమీపంలో సభాస్థలిని, జూనియర్ కళాశాల మైదానంలో హెలీప్యాడ్‌ను ఎంపిక చేశారు. సెక్యూరిటీ జోన్‌పరంగా చూసుకుంటే ఇక్కడే అన్ని విధాలా బాగుందని అధికారులు నివేదించారు. అనంతరం డిగ్రీ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఏపీఐఐసీ చైర్ పర్సన్ మెట్టు గోవిందరెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు మంగమ్మ, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర నారాయణ, ఉన్నత విద్య మండలి సలహాదారులు ఆలూరు సాంబశివరెడ్డి,జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, నగరపాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top