శ్రీకాకుళం: వలంటీరు వ్యవస్థపై విమర్శలు చేసిన విపక్ష నేత చంద్రబాబే తాము అధికారంలోకి వచ్చాక ఇదే వ్యవస్థను కొనసాగిస్తామని అంటున్నారని, గతంలో ఈ వ్యవస్థను తిట్టిన నోళ్లే ఇవాళ పొగుడుతున్నారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. స్థానిక బాపూజీ కళా మందిరంలో వలంటీరుకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. గతంలో వలంటీరు వ్యవస్థపై విమర్శలు చేసిన విపక్ష నేత చంద్రబాబే తాము అధికారంలోకి వచ్చాక ఇదే వ్యవస్థను కొనసాగిస్తామని అంటున్నారు. అదేవిధంగా గతంలో ఈ వ్యవస్థను తిట్టిన నోళ్లే ఇవాళ పొగుడుతున్నారు. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక నిజాయితీతో రూపుదిద్దుకున్న వ్యవస్థ వలంటీరు వ్యవస్థ. ఇక్కడ పనిచేస్తున్న వారంతా ఎంతో సేవాభావంతో ఉన్నారు. విపక్షాల విమర్శలు పట్టించుకోక ప్రజా సేవ చేస్తున్న వలంటీర్లను అభినందిస్తూ ఉన్నాను.
ఇన్ని రోజులుగా ఎంతో విలువయిన సేవలు అందిస్తున్నారు. అప్పగించిన ప్రతి పనినీ నిజాయితీగా చేస్తున్నారు. మీ నిబద్ధతనూ, నిజాయితీనీ ప్రభుత్వం గుర్తించి ఈ రోజు మీకు ఈ పురస్కారాలు అందిస్తోంది. మీ పట్ల సమాజంలో గౌరవం పెరిగింది,మీ వల్లనే ప్రభుత్వానికీ మంచి పేరు వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఈ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరిందీ మీ వల్లనే. అందుకే మీ అందరినీ ఇవాళ సన్మానిస్తున్నాం. ఒకనాడు ఇది దుర్మార్గపు వ్యవస్థ అన్న విపక్ష నేత చంద్రబాబు, ఇప్పుడు ఇదే వ్యవస్థను తీసుకు వస్తామని అంటున్నారు. మూడు సార్లు మాట తప్పిన ఆయనను ఎలా నమ్ముతారు ప్రజలు.? మాట మార్చే పెద్ద మనిషి చంద్రబాబు. మాట మీద నిల్చొనే నిఖార్సైన నాయకుడు సీఎం వైయస్ జగన్..అని పునరుద్ఘాటిస్తూ..ఉత్తమ సేవలు అందించిన వారికి నా శుభాకాంక్షలు అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. అనంతరం ఎంపికైన ఉత్తమ వలంటీర్లకు సన్మానం చేశారు.