అర్హత కలిగిన ప్రతీ గిరిజనుడికి భూమి పట్టాలు

ఆదివాసీల ఆశలకు ప్రతిరూపం వైయస్‌ఆర్‌ వారసుడు

ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల మంజూరులో రెండు అడుగులు ముందుకేసిన సీఎం వైయస్‌ జగన్‌

వైయస్‌ జగన్‌ పాలనలో అడవిని అమ్ముకున్నోడిది కాదు.. నమ్ముకునేవాడిదే రాజ్యం

గిరిజనులు తన సొంత కుటుంబ సభ్యులుగా గౌరవించి గుండెల్లో పెట్టుకున్నారు

ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు పొందిన గిరిజన రైతులకు రైతు భరోసా పథకం కింద రూ.491.86 కోట్లు పంపిణీ  

గిరిజ‌నుల త‌ర‌ఫున సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ధ‌న్య‌వాదాలు

అటవీ భూములకు పట్టాలిచ్చే కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది

అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, గిరిజన శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి

అసెంబ్లీ: గతంలో అడవిని అమ్ముకునేవాడిది రాజ్యం.. కానీ, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలనలో అడవిని నమ్ముకున్నవాడిదే రాజ్యమని డిప్యూటీ సీఎం, గిరిజన శాఖ మంత్రి పుష్పశ్రీవాణి అన్నారు. ఆదివాసీల ఆశలకు ప్రతిరూపంగా వైయస్‌ఆర్‌ వారసుడిగా వైయస్‌ జగన్‌ 2019లో అధికారంలోకి వచ్చారని, గిరిజనులు తన సొంత కుటుంబ సభ్యులుగా గౌరవించి గుండెల్లో పెట్టుకుంటున్నారన్నారు. అర్హత కలిగిన ప్రతీ గిరిజనుడికి ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు అందజేస్తున్నారని చెప్పారు. పట్టాలు అందించడమే కాకుండా రైతు భరోసా పథకం ద్వారా మూడేళ్లలో గిరిజన రైతులకు రూ.491.86 కోట్లు అందజేశారన్నారు.  

ఆర్‌ఓఎఫ్‌ఆర్, డీకేటీ పట్టాల గురించి అసెంబ్లీలో జరిగిన చర్చలో డిప్యూటీ సీఎం, గిరిజన శాఖ మంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడారు. ప్రభుత్వం గిరిజన రైతులకు, అటవీ భూములపై కల్పిస్తున్న హక్కుల గురించి సభ ద్వారా ప్రజలకు వివరించారు. 

ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి ఇంకా ఏం మాట్లాడారంటే..

అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు వ్యవసాయం చేసుకునే ఆదివాసీ గిరిజనులకు వ్యక్తిగతంగా, సామూహికంగా అటవీ భూములపై హక్కులు కల్పించే కార్యక్రమానికి 2008లో డాక్టర్‌ వైయస్‌ఆర్‌ శ్రీకారం చుట్టాం. అప్పట్లో 56 వేల గిరిజన కుటుంబాలకు 1.30 లక్షల ఎకరాల భూములను వ్యక్తిగత పట్టాలుగా పంపిణీ చేశారు. 4.58 లక్షల ఎకరాల భూమిని సామూహిక పట్టాలుగా అందించారు. వైయస్‌ఆర్‌ ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ ద్వారా గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించిన తరువాత వారి జీవితాల్లో మార్పు మొదలైంది. 2009లో వైయస్‌ఆర్‌ మరణించిన తరువాత 2019 వరకు గడిచిన పదేళ్ల కాలంలో వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ గిరిజనుల కష్టాలను పట్టించుకోలేదు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలను కూడా ఇవ్వలేదు. గత టీడీపీ హయాంలో నామమాత్రం పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 

ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల కోసం గిరిజనులు దరఖాస్తులు చేసుకున్న నేపథ్యంలో వాటిల్లో ఎక్కువ భాగం తిరస్కరణకు గురయ్యే్య పరిస్థితి ఉండేది. ఎందుకు తిరస్కరిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. వైయస్‌ఆర్‌ తరువాత గిరిజనుల కష్టాలను కడతేర్చడానికి ఇంకెవరు వస్తారని ఎదురుచూస్తున్న తరుణంలో ఆదివాసీల ఆశలకు ప్రతిరూపంగా వైయస్‌ఆర్‌ వారసుడిగా వైయస్‌ జగన్‌ 2019లో అధికారంలోకి వచ్చారు. గిరిజనులు అంటే తన సొంత కుటుంబ సభ్యులుగా గౌరవించి గుండెల్లో పెట్టుకున్నారు. ఇంతటి గౌరవం మరే ముఖ్యమంత్రి హయాంలో కూడా దక్కలేదు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలను మంజూరు చేసే విషయంలో వైయస్‌ఆర్‌ కంటే రెండు అడుగులు ముందుకేసి రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతీ గిరిజనుడికి పట్టాలు అందించడం జరిగింది. 

ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ ద్వారా భూమి పట్టాలను అందించిన నామమాత్రపు కార్యక్రమం కాకూడదనేది సీఎం ముఖ్య ఉద్దేశం. కనీసం రెండు ఎకరాల భూమి ఉండాలని, అంతకంటే తక్కువ ఉంటే దానిపై వచ్చే ఆదాయం వారి జీవిత అవసరాలకు సరిపోయే అవకాశం లేదని సీఎం గుర్తించారు. గిరిజన కుటుంబాలకు ఇచ్చే భూమి రెండు ఎకరాలకు తక్కువ కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో 2020 అక్టోబర్‌ 2 నుంచి ఈ నెల వరకు 1,07,769 మంది గిరిజనులకు 2,08,794 ఎకరాల అటవీ భూములకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు అందించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది. 

ఇంత వరకు గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూములు షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉన్న అటవీ భూములు అయినప్పుడు మాత్రమే ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చేవారు. రెవెన్యూ భూములు అయితే ఆ భూముల హక్కు పత్రాల కోసం గిరిజనులు పెట్టుకున్న అర్జీలు తిరస్కరించడం గతంలో జరిగేది. ఈసారి నుంచి అలా కాకుండా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు ఒకవేళ అటవీ శాఖకు చెందని ప్రభుత్వ భూములు అయిన పక్షంలో వారు సాగు చేసుకుంటున్న భూములకు డీకేటీ పట్టాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీయేతర భూములకు కూడా డీకేటీ పట్టాలు ఇవ్వడం జరిగింది. 

25,573 మంది గిరిజన కుటుంబాలకు 38,801 ఎకరాల భూములకు డీకేటీ పట్టాలు ఇవ్వడం జరిగింది. 2020 అక్టోబర్‌ నుంచి ఈనెల వరకు మొత్తం 1,33,342 మంది గిరిజనులకు మొత్తం 2,47,595 ఎకరాల భూమిని ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ డీకేటీ పట్టాల రూపంలో అందించడం జరిగింది. అర్హత కలిగిన ప్రతీ గిరిజన కుటుంబానికి ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ ఇప్పటికే పూర్తయింది. సీఎం వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధి కాలంలోనే కేవలం ఏడాది కాలంలోనే ఇది సాధ్యమైంది. 

మన రాష్ట్రంలో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ గురించి అధ్యయనం చేసిన తెలంగాణ అధికారుల బృందం సీఎం వైయస్‌ జగన్‌ చొరవను ఎంతగానో ప్రశంసించారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల ద్వారా పొందిన భూమిలో ఉపాధి హామీ పథకం కింద భూమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మొత్తం 12 రకాల పనులను ప్రభుత్వం అమలు చేస్తోంది. అభివృద్ధి పనులు, కొత్త బావుల తవ్వకం, పాత బావుల పూడికతీత, అంతర్గత కందకాల తవ్వకం, నేల నూర్పిడి, కట్టలపై మొక్కల పెంపకం, ఉద్యాన తోటల పెంపకం, పట్టుతోటల పెంపకం, ఫాంపౌండ్‌ల నిర్మాణం, మేకల షెల్టర్ల నిర్మాణం, కోళ్ల షెడ్‌ నిర్మాణం, శాశ్వత గడ్డి పెంపకం, కూరగాయల సాగు తదితర పనులను చేపట్టడం జరుగుతుంది. 

గిరిజన ఆదివాసీ రైతులకు పట్టాలు అందించడంతోనే సరిపెట్టకుండా ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు పొందిన ప్రతీ రైతుకు రైతు భరోసా పథకం కింద ఆర్థికసాయం అందించడం జరిగింది. కొత్త పట్టాలు పొందిన గిరిజన రైతులకు తొలి, మలి విడతల రైతు భరోసా మొత్తాన్ని కలిపి ఒక్కో రైతుకు రూ.13,500 ఒకేసారి అందించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు పొందిన రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. 2019–20లో 53,462 మంది రైతులకు రైతు భరోసా కింద రూ.72.17 కోట్లు అందించడం జరిగింది. 2020–21 సంవత్సరంలో 1,50,068 మందికి అందించాం. 2021–22లో 1,60,816 మంది రైతులకు రూ.217.10కోట్లు రైతు భరోసా కింద పంపిణీ చేయడం జరిగింది. గడిచిన మూడేళ్ల కాలంలో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు పొందిన గిరిజన రైతులకు రైతు భరోసా పథకం కింద రూ.491.86 కోట్లు పంపిణీ చేయడం జరిగింది. 

ఒకప్పుడు అడవిని అమ్ముకున్నోడిదే రాజ్యం ఉండేది.. కానీ, సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో అడవిని నమ్ముకునేవాడిదే రాజ్యం. సీఎం వైయస్‌ జగన్‌ గిరిజనులకు ఎంతగానో అండగా నిలిచారు. దశాబ్దాలుగా గిరిజనులు ఎదుర్కొంటున్న ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ ఇబ్బందులను తీర్చిన సీఎం వైయస్‌ జగన్‌కు గిరిజనుల తరఫున ధన్యవాదాలు. 

తిరస్కరణకు గురవుతున్న క్లెయిమ్స్‌కు సంబంధించి వారంతా సరైన ఆధారాలతో అధికారులకు తిరిగి అందజేసేందుకు సమయ ఇవ్వడం జరిగింది. 13–12–2005కు ముందు స్వాధీనంలో ఉన్న అటవీ భూములకు పట్టాలిచ్చే కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్క అర్హుడికి సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో పోడు పట్టాలు అందజేస్తాం. 
 

Back to Top