చంద్రబాబు హ‌యాంలో రాయలసీమకు తీరని అన్యాయం

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా..?

రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పకుండా సిగ్గులేకుండా వచ్చాడు

సీమ రైతన్నలకు ఏం చేశాడో చెప్పే దమ్మూ, ధైర్యం చంద్రబాబుకు లేదు

నీ 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏనాడైనా పులివెందులలో గెలిచావా..?

పులివెందుల ప్రజలు వైయస్‌ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్నారు

వైయస్‌ఆర్‌ జిల్లా అభివృద్ధి మహానేత వైయస్‌ఆర్, సీఎం వైయస్‌ జగన్‌ చలవే

సీమకు నీళ్లు వస్తున్నాయంటే అది మహానేత వైయస్‌ఆర్‌ ఘనతే..

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను అడ్డుకుంటున్న సీమ ద్రోహి చంద్రబాబు

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా ధ్వజం

వైయస్‌ఆర్‌ జిల్లా: రాయలసీమ గడ్డపై పుట్టి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి సీమకు తీరని అన్యాయం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా ధ్వజమెత్తారు. రాయలసీమ గడ్డపై అడుగుపెట్టే ముందు ఈ ప్రాంత వాసులకు  క్షమాపణలు చెప్పిన తరువాతే గడ్డపై అడుగుపెట్టాలని సూచించినా సిగ్గులేకుండా వచ్చాడని, చంద్రబాబును సీమ ప్రజలంతా అసహ్యించుకుంటున్నారన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేసినట్టు చూపించగలడా..? అని సూటిగా ప్రశ్నించారు. రాయలసీమ రైతాంగానికి నీరు రాకుండా అడ్డుకుంటున్న వ్యక్తి ప్రాజెక్టులను సందర్శించడం సిగ్గుచేటన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా కడపలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ అంజాద్‌ బాషా ఏం మాట్లాడారంటే.. 
రాయలసీమ ప్రాజెక్టులు అంటే గుర్తుకువచ్చే ఏకైక వ్యక్తి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి.. తరువాత ఆయన తనయుడు సీఎం వైయస్‌ జగన్‌. రాయలసీమకు నీరు వస్తున్నాయంటే ఆ ఘనత వైయస్‌ఆర్‌దే. సీమలో ఫలానా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, పూర్తి చేశానని చెప్పే దమ్మూ, ధైర్యం చంద్రబాబుకు ఉందా..? రాయలసీమ వాసులు అనేక దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను చూసి మహానేత వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత శాసనసభలో ఎంతోమంది అడ్డుకున్నా కూడా ప్రతి ఎకరాకు నీరు అందించాలని పోతిరెడ్డి హెడ్‌ రెగ్యులేటర్‌ను 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారు. ఈ ప్రాంతానికి నీరు వస్తున్నాయంటే మహానేత కృషి ఫలితంగానే అనేక రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. 

తండ్రి 44 వేలకు పెంచితే దాని సామర్థ్యాన్ని రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా 80 వేల క్యూసెక్కులకు పెంచాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయిస్తే దాన్ని చంద్రబాబు అడ్డుకుంటున్నాడు. గతంలో వైయస్‌ఆర్‌ 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు చేసేటప్పుడు టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ, ఇతర శాసనసభ్యులతో ధర్నా చేయించిన వ్యక్తి చంద్రబాబు. రాయలసీమ ప్రాంతానికి, రైతాంగానికి నీరు రాకుండా అడ్డుకోవాలని కుట్ర చేశాడు. 

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా సీమను సస్యశ్యామలం చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ముందడుగు వేస్తుంటే దాన్ని అడ్డుకుంటున్న వ్యక్తి చంద్రబాబు. ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా చంద్రబాబుకు లేదు. ప్రాజెక్టులు పూర్తిచేసి రైతాంగానికి నీరు అందించాలనే ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. ఆయన ధ్యాస అంతా కూడా కమీషన్ల మీదే. అలాంటి వ్యక్తి రాయలసీమ ప్రాజెక్టుల సందర్శన అని పేరు పెట్టుకొని పర్యటిస్తున్నాడు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటీ లేదు. రాబోయే రోజుల్లో రాయలసీమ ప్రాంత రైతుల కోసం ఏం చేస్తామనేది చెప్పకుండా సిగ్గులేకుండా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై బురదజల్లుతున్నాడు. 

పులివెందులలో ఇరుకైన పూలఅంగళ్ల సందులో సభపెట్టి బయట నుంచి జనాలకు రప్పించుకొని మాట్లాడుతున్నాడు. వై నాట్‌ పులివెందుల అని మాట్లాడటానికి చంద్రబాబుకు సిగ్గులేదా..? నీ 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏనాడైనా పులివెందులలో గెలిచావా..? పులివెందుల ప్రజలు వైయస్‌ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్నారు.  వైయస్‌ కుటుంబం కూడా పులివెందుల ప్రాంతాన్ని, వైయస్‌ఆర్‌ జిల్లాలను వారి గుండెల్లో పెట్టుకుంది. వైయస్‌ఆర్‌ జిల్లాలో అభివృద్ధి వైయస్‌ఆర్, వైయస్‌ జగన్‌ పాలనలోనే జరిగిందని అందరికీ తెలుసు. 

రాయలసీమ ఫ్యాక్షనిస్టు ప్రాంతంగా, రాయలసీమ గూండాలు అని దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ అనేక సందర్భాల్లో మాట్లాడారు. సీమకు ఫ్యాక్షనిజం అంటగడుతూ కించపరిచేలా మాట్లాడాడు. చంద్రబాబుకు రాయలసీమ మీద ప్రేమ ఉంటే దత్తపుత్రుడి మాటలను ఎందుకు ఖండించలేదు. సీమ గడ్డపై పుట్టి ఈ గడ్డను విమర్శిస్తుంటే మాట్లాడావా..? ఇదేనా నీకు రాయలసీమపై ఉన్న ప్రేమ..? అని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా ప్రశ్నించారు.  
 

తాజా వీడియోలు

Back to Top