ఎన్‌పీఆర్‌లో అభ్యంతరకర ప్రశ్నలు తొలగించాలి

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా

అసెంబ్లీ: భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమైన మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్‌పీఆర్, ఎన్‌పీఆర్‌– 2020పై దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల్లో, మరీ ముఖ్యంగా ముస్లిం మైనార్టీ ప్రజానీకంలో అభద్రతా భావం నెలకొందని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా అన్నారు. ఎన్‌పీఆర్‌లో అభ్యంతరకర పశ్నలు తొలగించాలని కోరుతూ మార్చి 4వ తేదీన కేబినెట్‌ ఆమోదం పొందిన తీర్మానాన్ని అసెంబ్లీలో అంజాద్‌ బాషా ప్రవేశపెట్టారు. నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటీజన్స్‌ (ఎన్‌ఆర్‌సీ)ను రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించారన్నారు. అదే విధంగా నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌) 2010, 2015లో నిర్వహించారని, 2020 సంవత్సరంలో నిర్వహించే ఫార్మట్‌లో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయన్నారు. వాటిల్లో తల్లిదండ్రులకు సంబంధించి డేట్‌ ఆఫ్‌ బర్త్, ప్లేస్‌ ఆఫ్‌ బర్త్, మథర్‌ టంగ్‌కు సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయన్నారు. దానికి సంబంధించి సీఎం ఆదేశాల ప్రకారం మార్చి 4వ తేదీన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఒక రిజల్యూషన్‌ను ఆమోదించామన్నారు. కేబినెట్‌ ఆమోదం పొందిన రిజల్యూషన్‌ను సభ ముందు ఉంచి ఆమోదం తెలుపుకునేందుకు ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. 
 

Back to Top