తాడేపల్లి: మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ జుగుప్సాకరంగా మాట్లాడారని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారును వెంటనే అరెస్టు చేయాలని ఆమె డీజీపీని కోరారు. ఈ మేరకు డీజీపీకి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ లేఖ రాశారు. రాష్ట్ర మంత్రి ఆర్.కే. రోజా పై సభ్య సమాజం తలదించుకునే వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణ పై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ కోరారు. బండారు మాట్లాడిన నీచమైన భాష జుగుప్సాకరంగా ఉందని పేర్కొన్నారు. ఒక మంత్రిపై రాజకీయాల్లో ఉన్న మహిళా నేతపై ప్రెస్ మీట్ లు పెట్టి బండబూతులు మాట్లాడుతున్నారని, వీటిని ఎంత మాత్రం సహించరాదని కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలని వాసిరెడ్డి పద్మ డిజిపిని కోరారు. మంత్రి రోజాపై బండారు చేసిన అనుచిత వ్యాఖ్యలపై పలువురు మహిళా నేతలు న్యాయవాదులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారని పద్మ తెలిపారు. బండారు వంటి మహిళా వ్యతిరేకులకు తగిన గుణపాఠం చెప్పాలని అతని వ్యాఖ్యలపై అందరూ సీరియస్ గా స్పందించాలని వాసిరెడ్డి పద్మ కోరారు. మంత్రులుగా ఉన్న మహిళల పట్ల కూడా క్రూరంగా వ్యవహరిస్తున్న బండారు సత్యనారాయణ వంటి మాజీ మంత్రుల బండారాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ దృష్టికి తీసుకు వెళుతూ వాసిరెడ్డి పద్మ లేఖ రాశారు. మహిళా కమిషన్ సభ్యులు కె.జయశ్రీ,గజ్జల లక్ష్మి, గెడ్డం ఉమ, బూసి వినీత, రోఖయా బేగం మంత్రి రోజాకు సంఘీభావంగా మాట్లాడారు.