తాడేపల్లి: `పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు నిత్యం ప్రజల్లోనే ఉండాలి. నియోజకవర్గంలోని ప్రతీ సచివాలయ పరిధిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ద్వారా ప్రజలతో మమేకం కావాలి.. ప్రతి ఇంటికీ వెళ్లాలి.. ప్రతి ఒకరినీ కలుసుకుంటూ వారంలో నాలుగు రోజుల పాటు ప్రజల మధ్యే గడపాలి` వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో, అంకిత భావంతో నిర్వహించాలని సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై నిర్వహించిన వర్క్ షాప్‌లో సీఎం వైయస్ జగన్ మాట్లాడారు. ఎన్నికలు ఇంకా 19 నెలలే మాత్రమే ఉన్నందున ఇప్పుడు ఎమ్మెల్యేలే స్వయంగా గడప గడపకూ వెళ్లాలని స్పష్టం చేశారు.
కొందరు ఎమ్మెల్యేలు తమ బంధువులు, వారసులను ఈ కార్యక్రమానికి పంపుతూ ఇతర పనుల్లో నిమగ్నం కావడం సరి కాదన్నారు. ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు నుంచి కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటించాల్సి ఉన్నందున ఇప్పటి నుంచే వారిని కూడా వెంటబెట్టుకుని వెళ్లడం వల్ల ప్రజాసేవపై అవగాహన పెరుగుతుందన్నారు. కొందరు షెడ్యూల్ ప్రకారం పనిచేయడం లేదని, దీన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఎన్నికల హామీల్లో 98.4 శాతం అమలు చేశామని, సంక్షేమ పథకాల ద్వారా పారదర్శకంగా నేరుగా రూ.1.71 లక్షల కోట్లను ప్రజల ఖాతాల్లోకి జమ చేశామని సీఎం జగన్ గుర్తు చేశారు. ఎలాంటి వివక్ష, అవినీతికి తావివ్వకుండా రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందించామన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాం.. మీ ఇంటికి మేలు చేశాం.. ఆశీర్వదించండి అని కోరుతూ ప్రజల ముందుకు వెళ్తున్న ఏకైక ప్రభుత్వం దేశ రాజకీయ చరిత్రలో ఇదేనని చెప్పారు. గడప గడపకూ కార్యక్రమాన్ని వంద శాతం నిర్వహిస్తే 175 శాసనసభ స్థానాలనూ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్నారు.
వర్క్ షాప్‌లో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
అన్నీ అనుకూలం..
గడప గడపకూ తలెత్తుకుని వెళ్లే పరిస్థితి మనకు ఉంది. ఎందుకంటే.. మనం చక్కటి పరిపాలన ప్రజలకు అందించాం. ఆ తర్వాతే ప్రతి గడపకూ వెళ్తున్నాం. ప్రతి ఇంటికీ ఏ మేలు జరిగింది? ఎంత జరిగింది? ఏ స్కీములందాయి? అనే జాబితాలు తీసుకుని వెళ్తున్నాం. ఈ మేరకు ప్రతి కుటుంబానికి లేఖ కూడా అందిస్తున్నాం. మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించాం. ఇచ్చిన హామీలను నెరవేర్చాం. ప్రతి ఇంట్లోనూ మన ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. ఇలాంటి సందర్భాలు చాలా అరుదు. గతంలో నాన్న (వైఎస్సార్) ప్రభుత్వ హయాంలో చూశాం. దానికంటే ఎక్కువగా ఇప్పుడు జరుగుతోంది. ఇంత సానుకూల పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవడం అవసరం.
ప్రతి ఇంటికీ వెళ్లాల్సిందే..
ఒక సచివాలయానికి (గ్రామం) వెళ్లినప్పుడు 100 శాతం.. అంటే ప్రతి ఇంటికీ తప్పనిసరిగా వెళ్లాలి. లేఖ అందించి చేసిన మంచిని వివరించి, చేయనున్న మంచిని చెప్పి ఆశీర్వదించమని కోరాలి. అలా చేయకపోతే నష్టం జరుగుతుంది. ఒకసారి గ్రామ సచివాలయానికి వెళ్తే ఎన్ని రోజులైనా సరే మొత్తం అన్ని ఇళ్లకూ వెళ్లాలి. గడపగడపకూ కార్యక్రమాన్ని నిర్దేశించుకున్న విధంగా సంపూర్ణంగా పూర్తి చేయాలి. ప్రతి సచివాలయానికి రూ.20 లక్షల నిధులు ఇస్తున్నాం. గ్రామానికి బాగా ఉపయోగపడే వాటిపై ఖర్చు చేయమన్నాం. గ్రామ సచివాలయాల్లో ఎమ్మెల్యే తిరిగినప్పుడు కేటాయించిన నిధుల ప్రకారం పనులు మంజూరు చేయాలి. గ్రామంలోకి వెళ్లినప్పుడు సమస్య మీ దృష్టికి రాగానే అప్పటికప్పుడే ఆ పని మంజూరు చేయాలి. ఆ సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి. మొదటిసారి వర్క్‌షాప్‌తో పోలిస్తే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పురోగతి బాగుంది. కానీ అందరికీ ఒక విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నా. పరీక్ష రాసేటప్పుడు షార్ట్‌కట్స్ ఉండవు. వాటికి తావిస్తే ఫెయిల్ అవుతాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి.
175కు 175 కొట్టాలి..
మళ్లీ చెబుతున్నా. నూటికి నూరు శాతం 175కి 175 కొట్టాలి. ఒక్క సీటు కూడా మిస్ కాకూడదు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికే గడప గడపకూ రూపంలో మీకు చక్కటి ప్రణాళిక ఇచ్చా. 175కు 175 సీట్లు సాధించడం అన్నది అసాధ్యం కానే కాదు. ముమ్మాటికీ ఇది సాధ్యం. మనసా వాచా, కర్మణా దీన్ని నమ్ముతున్నా కాబట్టి విశ్వాసంతో చెబుతున్నా. రాష్ట్రంలో 87 శాతం ఇళ్లకు మంచి జరిగింది. ప్రతి ఇంటికీ మంచి చేశామని లెటర్ తీసుకుని వెళ్తున్నాం. దీనికి స్పందనగా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. సచివాలయానికి వెళ్లేటప్పుడు ప్రాధాన్యతగా మీరు గుర్తించిన పనులు 2 నెలల్లో మొదలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.
ప్రతి రోజూ పరీక్షలా సిద్ధం కావాలి
గడప గడపకూ కార్యక్రమం ఎందుకంటే రేపు మనల్ని మనం గెలిపించుకోవడం కోసం.. మనకు మనంగా చేస్తున్న కార్యక్రమం ఇది. దీంట్లో ఎక్కడైనా షార్ట్‌కట్స్ ఉపయోగిస్తే నష్టపోయేది మనమే. ఇవాళ్టి నుంచి చూస్తే ఎన్నికలకు బహుశా 19 నెలలు సమయం ఉంది. ప్రతిరోజూ పరీక్షలకు సిద్ధం అవుతున్నామని భావిస్తూ అంతా అడుగులు వేయాలి. అలా పని చేయకపోతే నష్టపోయేది మనమే. అందుకు మీరు చేయాల్సిందల్లా నెలలో కనీసం 16 రోజులు గడప గడపకూ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలి. ఎన్నికలకు 19 నెలలు ఉంది. అంటే మనకు తగిన సమయం ఉంది. మనం చేయాల్సిందల్లా ప్రతి ఇంటికీ వెళ్లడం. తిరిగితేనే మన గ్రాఫ్ పెరుగుతుంది.
గేర్ మార్చడానికే..
కొందరు తమ గ్రేడ్ పెంచుకోవాల్సి ఉంది. ప్రతి ఒక్కరితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ నాతో అడుగులు వేశారు. అందుకే ఎవరినీ పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. వారి గేర్ మార్చడమే నా లక్ష్యం. ఎన్నికలకు 6 నెలల ముందు సర్వే చేయిస్తా. ప్రజాదరణ ఉంటేనే మళ్లీ టికెట్లు ఇస్తా. ఎందుకంటే మనల్ని నమ్ముకుని కోట్ల మంది ఉన్నారు. షార్ట్ కట్స్ లేకుండా 100 శాతం గడపగడపకూ పూర్తిచేయాలి. మీ తరఫు నుంచి ఇది జరిగితే క్లీన్‌స్వీప్ చేస్తాం. తిరిగి డిసెంబరు మొదటి రెండు వారాల్లో సమావేశం అవుదాం. అప్పటికి మనకు 70 రోజుల టైమ్ వస్తుంది. కాబట్టి నెలకు 16 రోజులు ప్రతి సచివాలయంలో ప్రతి ఇల్లు తిరగాలి. ప్రతి సచివాలయంలో కనీసం మూడు రోజులైనా ఉండాలి.
ప్రజలకు మంచి చేయడానికే..
మనల్ని నమ్ముకుని కొన్ని కోట్ల మంది ప్రజలున్నారు. వారికి మనం జవాబుదారీగా ఉన్నాం. జుత్తు ఉంటే ముడేసుకోవచ్చు. అసలు జుత్తు లేకపోతే ముడేసుకోవడానికి ఏమీ ఉండదు. అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేయగలుగుతాం. 175కి 175 టార్గెట్ పెట్టుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్యం మిస్ కాకూడదు. దానికోసం అందరం కష్టపడదాం. రీజినల్ కోఆర్డినేటర్లు మరింత బాధ్యతగా ఉండాలి. గడప గడపకూ విషయంలో ఎవరైనా వెనకబడినట్లు ఉంటే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. వారికి మార్గనిర్దేశం చేయాలి.