తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పర్యటనకు బయల్దేరారు. మరికాసేపట్లో కల్యాణదుర్గం చేరుకోనున్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కళ్యాణదుర్గంలో నిర్వహించే వైయస్ఆర్ రైతు దినోత్సవంలో పాల్గొననున్నారు. ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుని డాక్టర్ వైయస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా 2022– ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన 10.2 లక్షల మందికి రైతులకు లబ్ధి కలిగిస్తూ రూ.1,117 కోట్ల బీమా పరిహారం విడుదల చేస్తారు. తద్వారా ఒక్క అనంతపురం జిల్లాలోనే 1,36,950 మంది రైతులకు రూ.212.94 కోట్ల మేర లబ్ధి చేకూరుతుంది. అనంతరం సీఎం వైయస్ జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కళ్యాణదుర్గం పర్యటన అనంతరం వైయస్ఆర్ జిల్లా పర్యటనకు సీఎం వైయస్ జగన్ బయలుదేరనున్నారు. నేటి నుంచి 10వ తేదీ వరకు ఆ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నేటి మధ్యాహ్నం ఇడుపులపాయలోని దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్దకు చేరుకొని మహానేతకు నివాళులర్పిస్తారు.