నేడు విశాఖ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేడు విశాఖ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. మిలాన్‌–2022 యుద్ధనౌకల సమాహారంలో భాగంగా బీచ్‌రోడ్డులో జ‌రిగే ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ను ప్రారంభించేందుకు విశాఖ వెళ్ల‌నున్నారు. తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి గ‌న్న‌వ‌రం చేరుకోనున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. అక్క‌డి నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి నుంచి నేవల్‌ డాక్‌ యార్డ్‌కి చేరుకుంటారు. మ‌ధ్యాహ్నం 3.10 గంటలకు కార్యనిర్వాహక రాజధాని నగరం పేరుతో రూపుదిద్దుకున్న ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధనౌకను జాతికి అంకితం చేస్తారు. అనంతరం నౌకాదళ సిబ్బందితో కలిసి దానిని పరిశీలిస్తారు. సాయంత్రం 4.10 గంటలకు నేవీ అధికారులతో గ్రూపు ఫొటో దిగుతారు. సాయంత్రం 4.20 నుంచి 4.40 వరకు ఇటీవలే నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామిని సందర్శిస్తారు. అనంతరం ప్రభుత్వ సర్క్యూట్‌ హౌస్‌లో బస చేస్తారు. 

సాయంత్రం.5.30 గంటలకు ఆర్కే బీచ్‌కు చేరుకుని మిలాన్‌ విన్యాసాలను తిల‌కించిన అనంత‌రం స‌భ‌ను ఉద్దేశించి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రసంగిస్తారు. సాయంత్రం 6.04 గంటలకు సిటీపరేడ్‌ను ప్రారంభించి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ దేశాల నౌకాదళ రక్షణ సిబ్బంది నిర్వహించే మార్చ్‌ పరేడ్‌ను తిలకిస్తారు. సాయంత్రం 6.50కు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న అనంత‌రం తాడేప‌ల్లికి తిరుగు ప్ర‌యాణ‌మ‌వుతారు. 

తాజా వీడియోలు

Back to Top