తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కొద్దిసేపటి క్రితమే తాడేపల్లిలోని తన నివాసం నుంచి విజయనగరం జిల్లా పర్యటనకు బయల్దేరారు. 11:15 గంటలకు విజయనగరం జిల్లా గుంకలాం చేరుకోనున్నారు. వైయస్‌ఆర్ జగనన్న కాలనీల నిర్మాణ విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన గుంకలాం లేఅవుట్‌లో ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పైలాన్‌ను సీఎం ఆవిష్కరిస్తారు. పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి తొలి విడత ఇళ్ల నిర్మాణ పనులను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం లేఅవుట్‌లో నిర్మించిన మోడల్ హౌస్‌ను పరిశీలించి.. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
విజయనగరం రూరల్ మండలం గుంకలాం వద్ద 397.36 ఎకరాల్లో 12,301 మంది లబ్ధిదారుల కోసం అతి పెద్ద లేఅవుట్ రూపొందించారు. రూ.4.37 కోట్లతో ఈ లేఅవుట్‌ను అభివృద్ధి చేశారు. జిల్లాలో మొత్తం 1,08,230 మందికి పేద అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తోంది. వీరిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 65,026 మంది, పట్టణ ప్రాంతాలకు చెందిన 43,204 మంది ఉన్నారు. ఆడపడుచులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు విజయనగరం జిల్లా వ్యాప్తంగా 1,164 లేఅవుట్‌లను ప్రభుత్వం సిద్ధం చేసింది.