గ్రామాల్లోనే అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం

సచివాలయం పక్కనే వైయస్‌ఆర్‌ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు

మరో పక్క ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల ఏర్పాటు చేస్తాం

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

విజయనగరం: అవినీతికి, వివక్షతకు తావులేకుండా సుపరిపాలన అందిస్తున్నామని, ఏ సమస్య వచ్చినా గ్రామంలోనే పరిష్కారించే విధంగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా దిశ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభించిన అనంతరం గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. ప్రతి 2 వేల జనాభా ఉన్న గ్రామానికి ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశాం. ఏ సమస్య వచ్చినా సచివాలయాల్లో అర్జి పెట్టుకుంటే వెంటనే పరిష్కరిస్తారు. గ్రామ సచివాలయం పక్కనే ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ కూడా రాబోయే రోజుల్లో కనిపిస్తుంది. మన పిల్లలు ప్రైవేట్‌ స్కూళ్లకు వెళ్లాల్సిన పనిలేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ మన గ్రామంలో కనిపిస్తుంది. అంతే కాకుండా రాబోయే రోజుల్లో వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌ అనే ఆస్పత్రి కూడా గ్రామ సచివాలయం పక్కనే కనిపిస్తుంది. ప్రస్తుతానికి రాష్ట్రం మొత్తం మీద 2400 హెల్త్‌ సబ్‌ సెంటర్లు కూడా లేవు. మన ప్రభుత్వ ఆలోచన ఏంటంటే.. మొత్తం 11,158 గ్రామ సచివాలయాల పరిధిలో ఒక్కో వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌ తీసుకువస్తున్నాం. ఈ క్లినిక్‌లో ఒక బీఎస్సీ చదివిన నర్సు, మరో ఏఎన్‌ఎం ఇద్దరు పనిచేస్తారు. 24 గంటలు వైద్య సేవలు అందిస్తారు.

అదే విధంగా ప్రతి విలేజ్‌లో సచివాలయానికి మరో పక్క రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు పంటలపై అవగాహన, నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు అందులోని సిబ్బంది అందిస్తారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సహాయ సహకారాలు కల్పిస్తారు. గ్రామం నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తాం. గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీస్‌ అధికారిని నియమిస్తాం. గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం ఇస్తే చాలు ఎస్పీ స్థాయి అధికారి గ్రామానికి వచ్చి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు’ అని సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు సూచించారు. అనంతరం దిశ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో సీఎం వైయస్‌ జగన్‌ మొక్క నాటారు.  

 

తాజా వీడియోలు

Back to Top