తాడేపల్లి: ``దేశంతో పోలిస్తే.. మన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీ గోల్స్) మెరుగ్గా ఉండాలి. ఎస్‌డీజీ లక్ష్యాలు వెనక ప్రధాన ఉద్దేశం ఏంటంటే.. ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా సంతృప్తస్థాయిలో, పారదర్శక పద్ధతిలో అర్హులందరికీ ప్రయోజనాలు అందించడం. ఎస్‌డీజీ లక్ష్యాల సాధనపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి`` అని కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో స్పందనపై సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ నివారణా చర్యలు, హౌసింగ్, స్పందన అర్జీలు, అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్ కార్యక్రమాలు, పంటల కొనుగోళ్లు, ఎస్‌డీజీ లక్ష్యాలు, గ్రామ–వార్డు సచివాలయాలతో పాటు వివిధ అంశాలపై కలెక్టర్లకు పలు ఆదేశాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే.. కోవిడ్ పనితీరు : – కోవిడ్ నివారణా చర్యల్లో అద్భుతంగా పనిచేస్తున్నారు. – 32 సార్లు ఇంటింటికీ సర్వే చేసి, డేటాను సేకరించారు. – కోవిడ్ అనుమానితులకు పరీక్షలు చేస్తున్నారు. – కోవిడ్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వచ్చింది. – దీనికి విస్తృతంగా వ్యాపించే లక్షణం ఉంది. – జాగ్రత్తలు పాటించాలి. – విదేశాలనుంచి వచ్చిన వారిని ట్రాక్ చేయడం, ట్రేస్ చేయడం అన్నది చాలా ముఖ్యం. – దీనిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షచేసుకుని తగిన చర్యలు తీసుకోవాలి. – దేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.36శాతం అయితే, రాష్ట్రంలో 99.21 శాతం ఉంది. – మరణాల రేటు దేశంలో 1.37శాతం అయితే మన దగ్గర 0.7శాతం ఉంది. సంపూర్ణ వ్యాక్సినేషన్ దిశగా.. – రాష్ట్రంలో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యేంతవరకూ అన్నిరకాల చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. – ఈనెలాఖరులోగా నూటికి నూరు శాతం సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తిచేయాలి. – అలాగే డబుల్ వ్యాక్సినేషన్ కూడా వీలైనంత త్వరగా చేయాలి. – వ్యాక్సిన్ డోసుకు డోసుకు మధ్య ఇప్పుడున్న గ్యాప్‌ను తగ్గించాల్సిన అవసరం ఉందా? ఉంటే.. ఎలా చేయాలి? అన్నదానిపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడమని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. – వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తిచేయడమే దీని ఉద్దేశం. – నెల్లూరు జిల్లాలో 100శాతం మొదటి డోసు వేశారు. జిల్లా కలెక్టర్‌కు, సిబ్బంది అందరికీ అభినందనలు. – వ్యాక్సినేషన్‌లో వెనకబడ్డ జిల్లాలు ధ్యాసపెట్టాల్సిన అవసరం ఉంది. – శ్రీకాకుళం, తూర్పుగోదావరి, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాలకు చెందిన కలెక్టర్లు వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టాలి. 104 – వన్ స్టాప్ సెంటర్ – 104 కాల్‌సెంటర్‌పై మరోసారి అధికారులు రివ్యూ చేయాలి. – కాల్ చేయగానే వెంటనే స్పందన ఉండాలి. – కోవిడ్ నివారణా చర్యలు, చికిత్సలకు 104 అనేది వన్‌స్టాప్ సొల్యూషన్. – నిర్దేశించుకున్న సమయంలోగా కాల్ చేసిన వారికి సహాయం అందాలి. – కాల్‌చేసినా స్పందనలేదనే మాట ఎక్కడా వినిపించకూడదు. కోవిడ్ సన్నద్ధత – 100 బెడ్లు కన్నా ఎక్కువ ఉన్న ప్రైవేటు ఆస్పత్రులకు కొన్నిమార్గదర్శకాలు జారీచేశాం. – పీఎస్‌ఏ ప్లాంట్లు పెట్టుకోవాలని ఉత్తర్వులు ఇచ్చాం. వారికి సబ్సిడీ కూడా ఇచ్చాం. – దీనిపై కలెక్టర్లు సమీక్ష చేయాలి. – వీటితోపాటు డి–టైప్ సిలెండర్లు, ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లు ఉంచాలి. – రాష్ట్ర ప్రభుత్వం 144 పీఎస్‌ఏ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. – ఈ నెలాఖరున వీటిని ప్రారంభించబోతున్నాం. – దీనిపై కలెక్టర్లు రివ్యూ చేయాలి. – మరే రాష్ట్రంలోనూ ఈ తరహా ఏర్పాటు లేదు. – ఇంత పెద్ద సంఖ్యలో ఎవ్వరూ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేయలేదు – కోవిడ్‌ఆస్పత్రుల సన్నద్ధతపైనా కూడా కలెక్టర్లు దృష్టిపెట్టాలి. హౌసింగ్: – ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పెద్ద ఊరట లభించింది. – హైకోర్టులో అడ్డంకులు తొలగిపోయాయి. – ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. – సిమెంటు, స్టీల్ ఇతరత్రా కొనుగోలుతోపాటు స్థానికంగా ఉన్నవారికి పనులు లభిస్తాయి. – ఇళ్ల నిర్మాణం అన్నది అత్యంత ప్రాధాన్యత కార్యక్రమం. – బిల్లులు పెండింగ్‌లేకుండా అన్నింటినీ చెల్లించాం. మంజూరైన ప్రతి ఇళ్లు నిర్మాణం దిశగా.. – మంజూరు చేసిన ప్రతి ఇంటి నిర్మాణం కొనసాగేలా చూడాలి. – జనవరి 31, కల్లా అన్ని ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయ్యేలా చూడాలి. – జనవరి 31 కల్లా బేస్‌మెంట్ కన్నా దిగువన ఉన్న ఇళ్ల నిర్మాణం.. బేస్‌మెంట్ స్థాయిని దాటి ముందుకెళ్లాలి. – ఆప్షన్ –3 పెట్టుకున్న లబ్ధిదారుల ఇళ్లను నిర్మించడానికి 20 మంది లబ్ధిదారులతో గ్రూపుల ఏర్పాటును ముమ్మరం చేయాలి. జనవరి 31 కల్లా ఈ గ్రూపులు ఏర్పాటు పూర్తయి.. ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావాలి. – కలెక్టర్, జేసీలు, మున్సిపల్ కమిషనర్లు అధికారుల ఇళ్లనిర్మాణాన్ని తనిఖీలు చేయాలి. – ఇదివరకే చెప్పిన విధంగా కలెక్టర్ ప్రతివారం ఒక లే అవుట్‌ను పరిశీలించాలి. జేసీ (రెవెన్యూ, డెవలప్‌మెంట్, ఆసరా)లు వారానికి ఒక సారి, హౌసింగ్ జేసీలు, ఆర్డీఓలు, సబ్‌కలెక్టర్లు వారానికి నాలుగు సార్లు క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించాలి. – ఇళ్ల నిర్మాణం ఖర్చును తగ్గించడంతోపాటు, నియంత్రణలో ఉంచాల్సిన అవసరం ఉంది. – అదే లేఅవుట్ల పరిధిలోనే ఇటుకల తయారీ యూనిట్లు పెట్టాలి. దీని వల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయి. – సిమెంట్‌ను సబ్సిడీ ధరలకు అందిస్తున్నాం. స్టీల్‌ను కూడా సెంట్రల్ ప్రొక్యూర్ చేస్తున్నాం. మెటల్ ధరలపై కూడా కలెక్టర్లు నియంత్రణ ఉండాలి. గృహ లబ్ధిదారులకు రుణాలు – ఇళ్ల లబ్ధిదారులకు రూ.35వేల చొప్పున రుణాలు అందించమని చెప్పాం. – పావలా వడ్డీకే ఈ రుణాలు ఇవ్వమని చెప్పాం. దీనిపై బ్యాంకర్లతో కలెక్టర్లు రెగ్యులర్‌గా సమావేశాలు నిర్వహించాలి. – సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఇళ్ల నిర్మాణ నాణ్యత బాగుండేలా చూడాలి. – ఇళ్లు నిర్మాణం అవుతున్న కాలనీల్లో నీటి సరఫరా కచ్చితంగా ఉండాలి. – వీలైనంత మేర ఇసుక రీచ్‌లను తెరిచి, ఇసుక అందుబాటులోకి తీసుకురావాలి. – పెద్ద లే అవుట్లలో తాత్కాలికంగా గోడౌన్లను ఏర్పాటు చేయండి. ఇందులో మెటీరియల్ ఉంచడానికి ఉపయోగపడుతుంది. – ఇళ్ల నిర్మాణంపై గ్రామ, వార్డు సచివాలయం మొదలు, మండలం నుంచి, జిల్లా స్థాయి వరకూ ప్రతి వారం సమావేశాలు జరగాలి. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం: ఓటీఎస్‌పై అవగాహన కార్యక్రమాలు – జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ప్రజలకు పూర్తి అవగాహన కలిగించాలి. – ముందుగా సిబ్బందికి, వలంటీర్లకు అందరికీ సంపూర్ణ అవగాహన కలిగించాలి. – క్షేత్రస్థాయిలో ఈ పథకం ప్రయోజనాలను తీసుకెళ్లాలి. – రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.10వేల కోట్ల రూపాయల భారీ బకాయి మొత్తాన్ని మాఫీచేస్తోంది. – క్లియర్ టైటిల్ ఇస్తోంది. ఆస్తిని అమ్ముకోవడానికి, లేదా తమవారికి బహుమతిగా ఇవ్వడానికి పూర్తి హక్కులు కల్పిస్తోంది. – బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడానికి కూడా అవకాశం వస్తుంది. – ఈ అంశాలను లబ్ధిదారులకు క్షుణ్ణంగా వివరించాలి. – మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తోంది. – చాలావరకు ఈ ఇళ్లు ఉన్న చోట రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకూ ధర ఉంది. - అంత మొత్తంపైన కూడా రిజిస్ట్రేషన్ ఉచితంగా చేస్తున్నాం. – ఉచితంగా రిజిస్ట్రేషన్ వల్ల దాదాపు రూ.6వేల కోట్ల మేర లబ్ధి కలుగుతోంది. – ప్రజలకు అవగాహన కలిగించి.. ఓటీఎస్ నుంచి లబ్ధి పొందేలా చూడాలి. పేదల వ్యతిరేకులు – గత ప్రభుత్వాలు దీన్ని ఎందుకు చేయలేదు? అసలు సంగతి పక్కనపెడితే.. దానిపై వడ్డీని కూడా మాఫీ చేయలేదు. – ఇలాంటి వాళ్లు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. – వీళ్లు పేదలకు వ్యతిరేకులు. – పేదలకు సంపూర్ణహక్కులు రావడం వీరికి ఇష్టంలేదు. – ఓటీఎస్‌కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటివరకూ 5లక్షల మంది లబ్ధి పొందారు. – ఏడాది మొత్తం అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్లు 16 లక్షలు. కాని ఓటీఎస్‌ద్వారా 51 లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. 90 రోజుల్లో ఇంటి పట్టాలు: – అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటిపట్టా అందాలి. – ఇప్పటివరకూ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను గుర్తించారు. – డిసెంబర్ 28న వివిధ కార్యక్రమాలు, పథకాలకు లబ్ధిదారులుగా గుర్తించిన వారికి ప్రయోజనాలను అందిస్తున్నాం. – ప్రతి ఏటా రెండు సార్లు ఇలా చేస్తున్నాం. – లబ్ధిదారులుగా గుర్తించిన వారికి అందుబాటులో ఇళ్లస్థలాలు ఉన్నవారికి అదేరోజున లబ్ధిదారులుగా గుర్తించిన వారికి కూడా పట్టాలు. – మిగిలిన వారికి అవసరమైన భూములను సేకరించండి. ల్యాండ్ స్వాపింగ్ ఆప్షన్‌ను కలెక్టర్లు వినియోగించాలి. అవసరమైన చోట భూమిని సేకరించాలి. వీరికి జనవరి నెలాఖరులోగా పట్టాలు అందించేలా చర్యలు తీసుకోండి. జగనన్న స్మార్ట్‌టౌప్ షిప్స్: – మధ్యతరగతి ప్రజలకోసం వీటిని తీసుకు వస్తున్నాం. – వివాదాల్లేని ప్లాట్లను సరసమైన ధరలకే వారికి అందిస్తున్నాం. – ఆ లేఅవుట్లలో వారికి అన్నిరకాల సదుపాయాలను అందిస్తున్నాం. – మధ్య తరగతి ప్రజలకు లబ్ధి జరుగుతోంది. – ప్లాట్లు కేటాయించిన తర్వాత ఇళ్ల నిర్మాణం చేస్తారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం వస్తుంది. – ఈ కార్యక్రమానికి సంబంధించిన భూ సేకరణపై దృష్టిపెట్టండి. స్పందన అర్జీలు: – స్పందన కార్యక్రమాన్ని కలెక్టర్లు ఓన్‌చేసుకోవాలి. – స్పందనకోసం పెట్టుకున్న మెకానిజాన్ని మరోసారి పరిశీలించండి. – అర్జీ పరిష్కారంలో నాణ్యత అన్నది చాలా ముఖ్యం. – ఒకే సమస్యపైన మళ్లీ అర్జీ వస్తే, అలాంటి సందర్భాల్లో ఎలా డీల్ చేస్తున్నామనేది చాలా ముఖ్యం. – ప్రతిరోజూ సాయంత్రం 3 గంటలనుంచి 5 గంటలవరకూ ప్రతి సచివాలయంలో స్పందన కింద అర్జీలు తీసుకుంటున్నాం. – దీంతోపాటు వారానికి ఒకరోజు అర్జీలు తీసుకుంటున్నాం. – సచివాలయం స్థాయిలో ప్రతిరోజూ వస్తున్న అర్జీలను ఎలా పరిష్కరిస్తున్నామన్నదానిపై అధికారుల సమీక్ష అవసరం. – మండల స్థాయిలో కూడా అధికారులు సమీక్షచేయలి. – ప్రతివారంలో ఒకరోజు.. మండలాల అధికారులతో కలెక్టర్ సమీక్ష చేయాలి. – రెండోసారి ఒకే సమస్యపై తిరిగి అర్జీ వచ్చినప్పుడు, అదివరకూ ఆ దరఖాస్తును పరిశీలించిన వ్యక్తే వెరిఫికేషన్ చేయకూడదు. – పై అధికారి కచ్చితంగా ఆ అర్జీని పరిశీలించాలి. – ఈ కీలక అంశాలూ ఎస్‌ఓపీలో ప్రధానం కావాలి. – ఈ అంశాలపై కలెక్టర్లు తిరిగి దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. – స్పందన విషయంలో కలెక్టర్లు పూర్తిగా మనస్సుపెట్టాల్సి ఉంది. – సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజల పట్ల మానవతాదృక్పథంతో ఉండాలి. – స్పందన కార్యక్రమం మరింత మెరుగుపడాల్సి ఉంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీ గోల్స్): – ఎస్‌డీజీ లక్ష్యాలు వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటంటే.. ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా సంతృప్తస్థాయిలో, పారదర్శక పద్ధతిలో అర్హులందరికీ ప్రయోజనాలు అందించడం. – నవరత్నాల కార్యక్రమం ద్వారా అందరినీ మాపింగ్ చేశాం. – ఆశించిన లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఉంది. – దేశంతో పోలిస్తే.. మన లక్ష్యాలు మెరుగ్గా ఉండాలి. – ఎస్‌డీజీ లక్ష్యాల సాధనపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి. – ఎస్‌డీజీ లక్ష్యాల సాధనకు పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. – ప్రతి జిల్లా కూడా ఎస్‌డీజీ లక్ష్యాల సాధనలో ముందుకు సాగాలి. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన: – ప్రతి గ్రామ సచివాలయంలో కూడా ఆర్బీకే పెట్టాం. – విత్తనం నుంచి కొనుగోళ్ల వరకూ ఆర్బీకేల ద్వారా చేస్తున్నాం. – పంటల ధరలపై పర్యవేక్షణకు సీఎంయాప్ పెట్టాం. – అలాగే గొడౌన్లు, ప్రైమరీ ప్రాససింగ్ సదుపాయలనూ ఏర్పాటు చేస్తున్నాం. – వీటిపై కలెక్టర్లు దృష్టిసారించాలి. – గోడౌన్ల నిర్మాణానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రాససింగ్ యూనిట్లు: – అలాగే పార్లమెంటు స్థాయిలో ప్రాససింగ్ యూనిట్లు పెడుతున్నాం. – 26 చోట్ల సెకండరీ ప్రాససింగ్ యూనిట్లు పెడుతున్నాం. – అవసరాలను బట్టి వీటికి భూములు గుర్తించి, అప్పగించాల్సి ఉంది. – ఈ నెలాఖరు కల్లా ఇది పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి. ధాన్యం కొనుగోళ్లు: – దాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్రను తీసేశాం. – రైతులకు ఎంఎస్‌పీ దక్కేలా చూడ్డానికే ఈచర్య తీసుకున్నాం. – గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదు. – కలెక్టర్లు, జేసీలు రైతులకు ఎంఎస్‌పీ దక్కేలా చర్యలు తీసుకోవాలి. – తడిసిన, రంగు మారిన «ధాన్యాన్నీకూడా కొనుగోలు చేశాం. – గతంలో ఎప్పుడూలేని విధంగా రైతులను ఆదుకున్నాం. – ఎంఎస్‌పీకి దక్క పైసా కూడా తగ్గకుండా రైతులకు ధర అందాలి. – రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ దోపిడీకి గురికాకూడదు. – ఈలక్ష్యాలను సాధించడానికి కలెక్టర్లు ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష చేయాలి. – రైతులకు మంచిధర అందించాలన్న తపనతో ముందుకు సాగాలి. – ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కేవలం రైతుల పేర్లను రిజిస్ట్రేషన్ చేయడంతో సరిపెట్టకూడదు. అక్కడితో మీ బాధ్యత అయిపోయిందనుకోకూడదు. – రోజువారీగా కొనుగోలు కేంద్రాలు, చేస్తున్న కొనుగోళ్లపై సమీక్ష చేయాలి. – ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అవసరమైన కూలీలను కూడా ఆర్బీకేల పరిధిలో సమీకరించుకోవాలి. – ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలి. – రైతులనుంచి నిరంతరం ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలి. – ఎంఎస్‌పీ రైతులకు దక్కేలా, కొనుగోళ్ల ప్రక్రియలో మిల్లర్లకు పాత్ర లేకుండా, రైతులకు దోపిడీకి గురికాకుండా చూడ్డమే మన ముందున్న లక్ష్యం. సచివాలయాలు, ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు – సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్ నిర్మాణం ఉగాది నాటికి పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – డిజిటల్ లైబ్రరీలు కూడా త్వరలో అందుబాటులోకి రావాలి. – ఈ మూడింటితోపాటు నాడు నేడు ద్వారా స్కూళ్లు పునరుజ్జీవం పొందాయి. – మరోవైపు విలేజ్ క్లినిక్ అందుబాటులోకి వస్తోంది. – వీటన్నింటి ద్వారా మొత్తం గ్రామాల ముఖచిత్రం మారిపోతోంది. పెన్షన్ పెంపు పెన్షన్ రూ.2500కు పెంపు – జనవరి 1, 2022న అమలు: కొత్త ఏడాదిలో అవ్వాతాతలకు వైయస్.జగన్ సర్కార్ కానుక పెన్షన్‌ను రూ.2500కు పెంచి ఇవ్వనున్న ప్రభుత్వం జనవరి 1, 2022న అవ్వాతాతలు చేతిలో పెట్టనున్న వైయస్.జగన్ సర్కార్ కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా వెల్లడించిన ముఖ్యమంత్రి. డిసెంబర్, జనవరి నెలల్లో చేపట్టనున్న కార్యక్రమాలు డిసెంబరు, జనవరి నెలలో చేపట్టనున్న కార్యక్రమాలను స్పందన వీసీలో వెల్లడించిన ముఖ్యమంత్రి వైయస్.జగన్ డిసెంబర్ 21న సంపూర్ణ గృహహక్కు పథకం. డిసెంబర్ 28న ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాల కింద వివిధ కారణాలవల్ల మిగిలిపోయిన లబ్ధిదారులకు ప్రయోజనాల పంపిణీ జనవరి 1, 2022న న పెన్షన్‌కానుక కింద పెన్షన్లు రూ.2,500కు పెంపు జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు. –అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళలకు (45–60ఏళ్లు వయస్సు) ఏడాదికి రూ.15 వేలు చొప్పున 3 ఏళ్లలో రూ.45వేలు. జనవరిలోనే రైతు భరోసా మూడో విడత చెల్లింపులు. త్వరలోనే తేదీ ప్రకటిస్తాం. అర్హులెవరికీ ఏ పథకం రాకుండా పోరాదు, అనర్హులకు అందకూడదన్నదే మన ప్రభుత్వ ఉద్దేశ్యం : అధికారులకు స్పష్టం చేసిన సీఎం వైయస్.జగన్. ఈ కార్యక్రమంలో సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వ్యవసాయ మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూదన్ రెడ్డి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాథ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.