ఏ కుటుంబానికి అన్యాయం జరగనివ్వను

మీ ఇంట్లో బిడ్డే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు

ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాదం బాధాకరం

సమాచారం అందగానే.. ఓఎన్‌జీసీ ఘటన గుర్తుకొచ్చింది

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓఎన్‌జీసీ మృతులకు రూ. కోటి డిమాండ్‌ చేశాం

ప్రమాదం పునరావృతం కాకుండా ఉండాలంటే పెనాల్టీ సివియర్‌గా ఉండాలి

అప్పుడే కంపెనీలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాయి

ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనపై అధికారులు స్పందించిన తీరు అభినందనీయం

ఎవ‌రిపై వేలెత్తి చూపించకుండా చేయాల్సిన ప‌నిపైనే ఫోక‌స్ పెట్టాం

ఘటనపై యుద్ధప్రాతిపదికన కమిటీలు వేశాం.. రిపోర్టు రాగానే చర్యలు

దీంట్లో తప్పు ఎవరిదైనా ఉపేక్షించే పరిస్థితి ఉండదు

బాధిత గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటాం

ఎవరూ ఆందోళనకు గురికావొద్దు.. అండగా నేను ఉన్నాను

గ్యాస్‌ లీకేజీ బాధితులకు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా

విశాఖపట్నం: ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో ఏ కుటుంబానికి అన్యాయం జరగనివ్వను.. మీ ఇంట్లో బిడ్డే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడని మర్చిపోవద్దు. అందరికీ తోడుగా ఉంటాను అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధితులను ఉద్దేశించి మాట్లాడారు. గ్యాస్‌ ప్రభావిత గ్రామాల్లోనే ప్రజల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటామని, ఇందుకోసం గ్రామాల్లో వైయస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్స్‌ కూడా నిర్మిస్తున్నాం. వీరందరికీ ప్రత్యేకమైన హెల్త్‌ కార్డు జారీ చేయమని కలెక్టర్‌కు ఆదేశాలిచ్చానని సీఎం వివరించారు. గ్యాస్‌ ప్రభావిత గ్రామాల ప్రజలు, మంత్రి అవంతి, కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన చాలా బాధాకరమని, అటువంటి ప్రమాదం ఎక్కడా జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటన వినగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ ప్రమాదం గుర్తుకు వచ్చిందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వివరించారు. గ్యాస్‌ ప్రభావిత ప్రాంతాల్లోనే 19,893 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల సాయం అందిస్తున్నామని, తాళాలు వేసి ఉన్న 12 ఇళ్లలోని వారు వచ్చిన తరువాత వారికి కూడా అందిస్తామన్నారు.

సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూశాం. ఓఎన్‌జీసీకి సంబంధించి గ్యాస్‌ లీకై 22 మంది కాలిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ గ్రామాలకు వెళ్లాను. ఇటువంటి ప్రమాదం ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించాలి.. కంపెనీలో జరిగితే ఆ కంపెనీకి ఎటువంటి శిక్ష వేస్తే ఇటువంటివి పునరావృతం కాకుండా చూసే పరిస్థితి వస్తుందని ఆ రోజున అనిపించింది.

ఓఎన్‌జీసీ సంస్థ రూ.20 లక్షల పరిహారం, కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.3 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షలు మొత్తం కలిసి రూ.25 లక్షలు చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చారు. ఆ రోజున నేను చెప్పాను. ఇటువంటి ప్రమాదం మళ్లీ పునరావృతం కాకుండా చూడాలంటే మనం వేసే పెనాల్టీ ఏ స్థాయిలో ఉండాలంటే.. అటువంటిది ఏమైనా జరిగినప్పుడు ఆ పెనాల్టీ ఎంత సివియర్‌గా ఉంటాయనే సంగతి ఆ కంపెనీ యాజమాన్యాలకు మనసులో ఉంటే వారు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటారు.

ఇటువంటి ప్రమాదం విదేశాల్లో జరిగితే వారు ఇచ్చే కాంపన్సెషన్‌ షాక్‌ కొట్టే మాదిరిగా ఉంటుంది. మన రాష్ట్రంలో మనం ఇచ్చే కాంపన్సెషన్‌ ఏ స్థాయిలో ఉందో పాలకులు ఆలోచన చేయాలని 2014లో ఓఎన్‌జీసీ ప్రమాదం జరిగినప్పుడు రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశాను.  

ఎల్‌జీ పాలిమర్స్‌లో మే 7వ తేదీన గ్యాస్‌ లీకేజీ జరిగినప్పుడు ఓఎన్‌జీసీ సంఘటన గుర్తుకువచ్చింది. ఒక మనిషి ప్రాణం విలువ ఎంత అనే కన్నా.. ఇటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోవడం ఎంత ఇంపార్టెంట్‌ అన్నది నిజంగా అర్థం కావాల్సిన విషయం. సంఘటన జరగ్గానే మనం స్పందించినంత స్పీడ్‌గా ఎక్కడా జరగదేమో..

ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించిన తీరు అభినందనీయం. తెల్లవారుజామున 4:30 గంటలకే కలెక్టర్, పోలీస్‌ కమిషనర్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 110 అంబులెన్స్‌లు చేరుకున్నాయి. తెల్లవారుజామునే అధికారులు అక్కడికి చేరుకోవడం 2 గంటల్లో మొత్తం గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వందల మంది బాధితులను వెంటనే ఆస్పత్రుల్లోకి చేర్చడం అనేది నిజంగా అభినందనీయం. కలెక్టర్, పోలీసులు, హెల్త్‌ వర్కర్స్, డాక్టర్స్‌ అందరికీ అభినందనలు. మనం స్పందించిన తీరు ఏ వెస్టన్‌ వరల్డ్‌లో స్పందించే తీరుకన్నా తీసిపోని విధంగా స్పందించామని గర్వంగా చెప్పగలుగుతున్నా.

ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలనే సంకేతాన్ని కూడా పంపించాం. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా కోటి రూపాయల పరిహారం ఇవ్వడమనేది కూడా దేశంలో ఎక్కడా.. ఎవరూ స్పందించని తీరులో మన ప్రభుత్వం స్పందించింది. వెంటనే రూ. కోటి ఇవ్వడమే కాకుండా.. ఘటనపై కమిటీ కూడా వేయడం జరిగింది. పది మంది డాక్టర్ల చేత మెడికల్‌ ఎక్స్‌పర్ట్స్‌ కమిటీ వేయడమే కాకుండా క్రూషియల్‌ మెడికల్‌ టెస్ట్స్, అప్రాప్రియేట్‌ హెల్త్‌ కేర్‌ కూడా ఫాలోఅప్‌లో పెట్టే కార్యక్రమం చేశారు.

ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు ఘటనకు సంబంధించిన నిజం మనకు తెలియాలి. ఆ నిజాన్ని తెలుసుకోవడానికి, మళ్లీ ఇటువంటి ప్రమాదం పునరావృతం కాకుండా చూసుకోవడానికి వెంటనే రాష్ట్రస్థాయి ఎంక్వైరీ కమిటీ నియమించాం. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, పర్యావరణ, అటవీ శాఖ సెక్రటరీలు నీరబ్‌కుమార్‌ ప్రసాద్, హరికాళ వల్లభన్, ఇండస్ట్ర్సీ అండ్‌ కామర్స్, కలెక్టర్, పోలీస్‌ కమిషనర్, మెంబర్‌ సెక్రటరీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులతో కమిటీ ఏర్పాటు చేశాం.

గ్యాస్‌కు సంబంధించి కంపెనీల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారా.. లేదా..? జిల్లాస్థాయి కమిటీ కూడా నియమించాం. డైరెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్, టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్స్‌తో కూడిన నలుగురు సభ్యులతో కమిటీ వేశాం. అంతేకాకుండా మెడికల్‌ అండ్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌కు సంబంధించిన నలుగురు ఆంధ్రయూనివర్సిటీ ప్రొఫెసర్స్‌తో ఇంకో కమిటీ నియమించాం. ప్రొఫెసర్‌ బాలప్రసాద్, ప్రొఫెసర్‌ ఎస్వీనాయుడు, కెమికల్‌ ఇంజనీర్స్, మెటలాజికల్‌ ఇంజనీర్‌తో కమిటీ వేశాం.

కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు కమిటీలు. నేషనల్‌ ఎన్వాయిర్‌మెంట్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ వారిని పిలిపించాం. కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్‌ లాజికల్‌కు సంబంధించి ఎక్స్‌పర్ట్‌ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ టీమ్‌ను పిలిపించాం. ఇద్దరితో టెక్నికల్‌ ఇష్యూకు సంబంధించిన సలహాల కోసం కమిటీని పిలిపించాం.

సంఘటన జరిగినప్పటి నుంచి పది రోజుల్లోనే మనం స్పందించిన తీరు, వేసిన కమిటీలు ఒక్కసారి గమనిస్తే ప్రతి విషయంలో కూడా కులంకుశంగా.. ఎక్కడా పొరపాట్లు జరగకూడదనే ఆలోచనతో యుద్ధప్రాతిపదికన కమిటీలు నియమించడమే కాకుండా.. ఆ కమిటీలు రిపోర్టులు ఇవ్వడమే కాకుండా పరిస్థితిని చక్కదిద్దాయి. ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి 13 వేల టన్నుల స్టైరిన్‌ రెండు షిప్‌ల ద్వారా పంపించగలిగాం. అధికారులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నా..

ఎల్‌జీ పాలిమర్స్‌కు సంబంధించి ఒక్కటంటే ఒక్క క్లియరెన్స్‌ కూడా మన ప్రభుత్వానికి సంబంధం లేదు. గతంలో ఇంతకు ముందు చంద్రబాబు 1996లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఎల్‌జీ కెమికల్స్‌ కంపెనీ టోక్‌ఓవర్‌ చేయడం నుంచి మొదలుపెడితే.. 2015లో కన్‌సెంట్‌ ఫర్‌ ఆపరేషన్‌ సర్టిఫికేట్లు, కన్‌సెంట్స్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌ సర్టిఫికేట్, రెన్యువల్స్‌ అన్ని ఆ ప్రభుత్వ హయాంలో వచ్చినవే.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు.

అయినప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఇచ్చారని వేలెత్తి చూపించలేదు. కేవలం మనం చేయాల్సిన దానిపై ఫోకస్‌గా వెళ్లాం.. కమిటీ వేశాం. చీఫ్‌ సెక్రటరీని వెంట తీసుకువచ్చి మూడు రోజుల పాటు విశాఖలోనే ఉంచాం. డీజీపీని కూడా విశాఖకు పంపించడం జరిగింది. ఒకరిపై వేలెత్తి చూపించాలనే తాపత్రయం కాకుండా చేస్తున్న పనిపై ధ్యాస పెట్టి పూర్తిగా చర్యలు తీసుకున్నాం. ఎంత మనవతా దృక్పథంతో ప్రదర్శించామంటే 12 మంది చనిపోతే పది రోజులు తిరక్కమునుపే చనిపోయిన కుటుంబానికి దేశంలో లేని విధంగా కోటి రూపాయలు ఇచ్చాం.

గ్యాస్‌ ప్రభావిత గ్రామాలను వెంటనే మార్కింగ్‌ చేయించాం. వెంకటాపురం, వెంకటాద్రినగర్, పద్మానాధపురం, ఎస్‌సీ, బీసీ కాలనీలు, నందమూరి నగర్, ఆర్‌ఆర్‌ వెంకటాపురం అని చెప్పి అధికారులనుంచి రిపోర్టు వచ్చింది. ఆ గ్రామాల ప్రజలు ఎక్కడా ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు మొత్తం 19893 మంది చిన్నా, పెద్ద అందరికీ కూడా ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇవ్వమని చెప్పడం జరిగింది.

ఆస్పత్రుల్లో ప్రాథమిక చికిత్స తీసుకున్న వారికి రూ. 25 వేలు, రెండ్రోజులు మించి ఆస్పత్రిలో ఉంటే రూ. లక్ష ఇవ్వమని, వెంటి లేటర్‌పై ఉంటే రూ.10 లక్షలు ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈ తరహాలో ఇంతగా స్పందించి పరిహారం ఇచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ జరగలేదు. అన్నింటికన్నా గొప్ప విషయం అధికారుల పనితీరు. పది రోజుల్లోనే చెప్పిన పద్ధతి ప్రకారం ప్రతి బాధితుడిని ఆదుకునే కార్యక్రమం చేశారు.

దీంట్లో తప్పు ఎవరిదైనా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. కమిటీల రిపోర్టులో వచ్చే ప్రశ్నలే కాకుండా.. ఇంకా వారం రోజులు టైమ్‌ ఇచ్చి కంపెనీని ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే ఆ ప్రశ్నలను కూడా రాసుకోండి. ఇవన్నీ కలిపి కంపెనీ యాజమాన్యానికి పంపిద్దాం. పది రోజులు టైమ్‌ ఇచ్చిన తరువాత కంపెనీ క్లారిఫికేషన్‌ తీసుకుందాం. మన టెక్నికల్‌ కమిటీ వారు తుది రిపోర్టు ఇచ్చిన తరువాత ఏ యాక్షన్‌ తీసుకోవాలని సలహాలు వస్తాయో.. పారదర్శకంగా ఆ కంపెనీపై యాక్షన్‌ తీసుకోవడం జరుగుతుంది.

తప్పు నిర్ధారణ కావాలి.. తరువాత యాక్షన్‌ తీసుకోవాలి. ఏదైనా పద్ధతి ప్రకారం జరగాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. బాధితులకు అన్ని రకాలుగా భరోసా ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. మీ బిడ్డే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వను. ఏ యాక్షన్‌ తీసుకోవాలన్నా.. వెనకడుగు వేయను. కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మీ అందరికీ మంచి జరగాలనే ఆలోచన చేస్తున్నాం. మీ గ్రామాల్లోనే మంచి క్లినిక్‌ కట్టించమని చెప్పాను. డాక్టర్స్‌ను కూడా పెట్టమని చెప్పాను. 20 వేల మంది గ్రామస్తులకు సపరేట్‌ హెల్త్‌ కార్డు ఇవ్వమని చెప్పాను. అన్ని రకాలుగా తోడుగా ఉంటాం. ఎవరూ ఆందోళనకు గురికావొద్దు. ప్రతి ఒక్కరికి రూ.10 వేలు బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేస్తాం. గ్రామ వలంటీర్లు మీ ఇంటి దగ్గరకు వచ్చి పరిహారం అందిందా.. లేదా.. అని అడిగి తెలుసుకుంటారు.
 

తాజా ఫోటోలు

Back to Top