తాడేపల్లి: ‘‘ఈ దుష్టచతుష్టయం పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు.. పెత్తందారులపై ఈ కురుక్షేత్ర యుద్ధానికి నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా...?’’ అంటూ భీమిలి వేదికగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి 2024 ఎన్నికల శంఖం పూరించారు. సిద్ధం సభలో ప్రసంగాన్ని ఆయన ట్వీట్ చేశారు. అబద్ధానికి, నిజానికి.. మోసానికి, విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఇక్కడున్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడని సీఎం జగన్ స్పష్టం చేశారు. పొత్తులు, జిత్తుల పద్మవ్యూహాలతో చంద్రబాబు నేతృత్వంలోని కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రజల ఆశీస్సులు, దేవుడి దయ వంటి కృష్ణుడి ఆశీస్సులతో మీ బిడ్డ జగన్ సిద్ధంగా ఉన్నాడని ప్రకటించారు. 2024 జైత్ర యాత్రకు భీమిలి నుంచే శంఖం పూరిస్తున్నామని చెప్పారు. భీమిలి నియోజకవర్గం తగరపువలస జంక్షన్ వద్ద శనివారం ‘సిద్ధం’ పేరుతో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర వైఎస్సార్ కుటుంబ సమావేశానికి సీఎం హాజరయ్యారు. సీఎం వైయస్ జగన్ పూర్తి ప్రసంగం సభలో అభిమాన జనం మధ్య ఏర్పాటు చేసిన ర్యాంపుపై అడుగులు ముందుకు వేస్తూ అభివాదం చేశారు. శంఖం పూరించి.. నగారా మోగించి 2024 ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధమని లక్షలాది మంది శ్రేణుల ఈలలు, కేకలు, నినాదాల మధ్య ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సాధించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. గత 56 నెలలో కాలంలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్ని చూసినా మనం చేసిన మంచి కనపడుతుందని తెలిపారు. సచివాలయం, ఆర్‌బీకేలు, విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ విధానం, నాడు–నేడుతో మారిన పాఠశాలలతో రాష్ట్రమంతటా వైయస్ఆర్ సీపీ మార్క్, జగన్ మార్క్ కనిపిస్తోందన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు హయాంలో ఆయన మార్క్ పని ఒక్కటీ లేదని దుయ్యబట్టారు.