శ్రీ‌సిటీలో ఆక్సిజ‌న్ ప్లాంట్ ప్రారంభం

క్యాంపు కార్యాల‌యం నుంచి వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

14 నెలల్లో ప్లాంట్‌ ప్రారంభంకావడం ఒక మైలురాయి

తాడేప‌ల్లి: శ్రీ సిటీలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నోవా ఎయిర్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో అండ్‌ ఎండీ గజనన్‌ నబర్, కమర్షియల్‌ హెడ్‌ శరద్‌ మధోక్, శ్రీసిటీ జీఎం (కార్పొరేట్‌ ఎఫైర్స్‌) సీహెచ్‌.రవికృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైయ‌స్‌ జగన్ మాట్లాడుతూ.. 14 నెలల్లో ప్లాంట్‌ ప్రారంభం కావడం ఒక మైలురాయి అన్నారు. 220 టన్నుల ఆక్సిజన్‌ తయారీ చేయడం చాలా ముఖ్యమైన విషయమన్నారు. 144 పీఎస్‌ఏ ప్లాంట్లు కూడా వివిధ ఆస్పత్రుల్లో పెట్టామని, మరో 32 ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తున్న‌ట్టు చెప్పారు. దీనివల్ల ఆక్సిజన్‌ విషయంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని, 24వేల ఆక్సిజన్‌ బెడ్లు తయారు చేశామని సీఎం వైయ‌స్ జగన్‌ అన్నారు. కోవిడ్‌ లాంటి విపత్తులు వచ్చినప్పుడు సరిపడా ఆక్సిజన్‌ అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 300 టన్నుల ఆక్సిజన్‌ తయారీలో ఉందని, ఈ ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి దీనికి అదనంగా వచ్చిచేరుతుందన్నారు. 

దేశంలో తొలిసారిగా ప్లాంట్‌పెట్టామని ఇందుకు ఏపీ సరైనదని ఎంచుకున్నట్లు నోవా ఎయిర్‌ ఎండీ గజనన్‌ నబర్‌ తెలిపారు. రాష్ట్రంలో మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, 14 నెలల్లో ప్లాంట్‌ను నిర్మించామన్నారు. ప్లాంట్ ఏర్పాటుకు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం బాగా సహకరించిందని చెప్పారు. కోవిడ్‌ వేవ్‌ల సమయంలో రవాణాకు, మానవవనరులకు కొరత లేకుండా అధికారులు చూశారని, ఈ సంద‌ర్భంగా అందరికీ గ‌జ‌న‌న్ న‌బ‌ర్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

శ్రీసిటీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, చిత్తూరు కలెక్టర్‌ హరినారాయణన్, శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తాడేప‌ల్లి సీఎం క్యాంపు కార్యాల‌యం నుంచి డిప్యూటీ సీఎం, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్, వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, పరిశ్రమలు, వాణిజ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల్‌ వలవన్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ ఎంటీ. కృష్ణబాబు, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, 104 కాల్‌ సెంటర్‌ ఇంచార్జి ఏ.బాబు, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ జవ్వాది సుబ్రహ్మణ్యం, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ మురళీధర్‌ రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్‌చంద్, వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశాఖ స్పెషల్‌ సెక్రటరీ జీఎస్‌.నవీన్‌కుమార్, ఏపీవీవీపీ కమిషనర్‌ వి.వినోద్‌కుమార్, డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవిశంకర్, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ బి.చంద్రశేఖర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ సాంబశివారెడ్డి, శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్, ఇతర ఉన్నతాధికారులు హాజర‌య్యారు. 

తాజా ఫోటోలు

Back to Top