మ‌నం చేసిన మంచే మ‌న ధైర్యం

వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధినేత‌, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

ప్ర‌తి ఇంటికీ సంక్షేమాన్ని అందించిన‌ప్పుడు వై నాట్ 175

ఎన్నిక‌ల కురుక్షేత్రానికి సిద్ధం కావాల‌ని క్యాడ‌ర్‌కు పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు

మీరంతా నా కుటుంబ సభ్యులే 

అధికారాన్నిప్రజలకు తొలి సేవకుడి బాధ్యతగా తీసుకున్నాం

52 నెలల కాలంలో సువర్ణాక్షరాలతో లిఖించేలా పాలన అందించాం

మూడు ప్రాంతాల ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ మూడు రాజధానులు

వైయ‌స్‌ జగన్‌ అంటే మాట నిలబెట్టుకుంటాడని నిరూపించుకున్నాం

సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు సమన్యాయం చేశాం

రూ. 2లక్షల 35వేల కోట్లు డీబీటీ ద్వారా అందించాం

నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతానికి పైగా ఎస్పీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చాం
 
స్థానిక సంస్థల నుంచి కేబినెట్‌ వరకూ సామాజిక న్యాయం చేశాం

వైయ‌స్ఆర్‌సీపీ తప్ప ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ దేశంలోనే లేదు

జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలి

రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా వ్యాధుల బారిన పడకూడదు

నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 10వరకూ వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాన్ని చేపడతాం

అక్టోబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 31వరకు బస్సుయాత్ర

మూడు ప్రాంతాల్లో బస్సుయాత్ర నిర్వహిస్తాం

రాబోయే రోజుల్లో జరిగేది క్లాస్‌ వార్‌

పెత్తందార్లుపై గెలవాలంటే పేదవారంతా ఏకం కావాలి

డిసెంబర్‌ 11 నుంచి జనవరి 15 వరకూ ఆడుదాం ఆంధ్రా క్రీడా సంబరం

జనవరి 1 నుంచి పెన్షన్‌ పెంపు

జనవరి 10 నుంచి వైయ‌స్ఆర్‌ చేయూత

జనవరి 20 నుంచి 30 దాకా వైయ‌స్ఆర్‌ ఆసరా

ఫిబ్రవరిలో ఇంటింటికీ వైయ‌స్ఆర్‌సీపీ మేనిఫెస్టో 

మార్చిలో ఎన్నికలకు సన్నద్ధం అవుదాం

చంద్రబాబు అవినీతి గురించి తెలుసు కాబట్టే కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులిచ్చాయి

చంద్ర‌బాబు ప్ర‌జ‌ల్లో ఉన్నా, జైల్లో ఉన్నా పెద్ద తేడా లేదు

చంద్ర‌బాబు, ద‌త్త‌పుత్ర‌డు క‌లిసివ‌చ్చినా సున్నాయే

ప్ర‌జ‌ల‌తోనే మ‌న‌పొత్తు

రాజ‌కీయ‌మంటే చ‌నిపోయాక కూడా బ‌తికుండ‌ట‌మే

దేవుడిని, ప్ర‌జ‌ల్నే న‌మ్ముకున్నా

విజ‌య‌వాడ‌:  ప్ర‌తి ఇంటికీ సంక్షేమాన్ని అందించిన‌ప్పుడు వై నాట్ 175, ప్ర‌జ‌ల‌కు ఇన్ని మంచి ప‌నులు చేసిన‌ప్పుడు వై నాట్ 175 అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విప్ల‌వాత్మక మార్పులు తీసుకువ‌చ్చామ‌ని, రాష్ట్రంలో 87 శాతం కుటుంబాల‌కు సంక్షేమ ప‌థ‌కాలు నేరుగా అందించామ‌న్నారు. నాలుగేళ్ల పాలనలో వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చాం. గ్రామస్థాయిలోనే సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చాం. ప్రతి 50 ఇళ్లకు ఒకరు ఉండేలా వలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చాం. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 99 శాతం హామీలను నెరవేర్చాం. వైయ‌స్‌ జగన్‌ అంటే మాట నిలబెట్టుకుంటాడని నిరూపించుకున్నాం. వ్యవస్థలోగానీ, పాలనలోగానీ ఇన్ని మార్పులు తెచ్చిన పార్టీ లేదన్నారు.
‘రాబోయేది కురుక్షేత్ర యుద్ధం. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య యుద్ధం. పేదవాడి పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ. రాబోయే రోజుల్లో జరిగేది క్లాస్‌ వార్‌. పేదవాడు ఒక వైపు.. పెత్తందారు మరోవైపు. పేదవాళ్లు మొత్తం ఏకం కావాలి. అప్పుడే పెత్తందార్లను ఎదుర్కోగలమ‌న్నారు. ‘ఫిబ్రవరిలో  వైయ‌స్  మేనిఫెస్టోతో ప్రజల వద్దకు వెళదాం. మార్చిలో ఎన్నికలకు సన్నద్ధమవుదాం. వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా గ్రామస్థాయి నుంచే మమేకమవ్వాలి. నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా అడుగులు వేయాల‌ని పిలుపునిచ్చారు.  విజయవాడ ఇందిరా గాంధీ మున్సి­పల్‌ స్టేడియంలో వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా సీఎం వైయ‌స్ జగన్‌ మాట్లాడారు.

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..  

*ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నా సేనానులు..*
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నా కుటుంబసభ్యులు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ రెండు మెట్లు ఎదిగి, మరో రెండు మెట్లు ఎదగడానికి సిద్ధంగా ఉన్న ప్రజాసేవకులు, నా సేనానులు. 

ఈ రోజు ఇక్కడికి వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రీజనల్‌ కో ఆర్డినేటర్లు, జేసీఎస్‌ కో ఆర్డినేటర్లు, నియోజకవర్గాల పరిశీలకులు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ అధ్యక్షులు, ఏఎంసీ అధ్యక్షులు, పార్టీ సీనియర్‌ నాయకులు, జడ్పీసీలు,ఎంపీపీలు, జిల్లా పరిషత్‌ అధ్యక్షులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్లు, కార్పొరేటర్లు.. ఒక్క వాక్యంలో చెప్పాలంటే పార్టీ గుర్తుమీద ఎన్నికైన మండలం, ఆపై స్ధాయిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు, వారితో పాటు ఈ సమావేశానికి వచ్చిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నా మంత్రిమండలి సహచరులు అందరికీ.. మీ తమ్ముడిగా,అన్నగా నిండు మనస్సుతో స్వాగతం పలుకుతున్నాను.

*రాలేకపోయిన నా కుటుంబసభ్యులకీ అభినందనలు..*
అలాగే ఈ సమావేశానికి రాలేకపోయిన గ్రామస్ధాయిలో ఉన్న ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు.. నా కుటుంబసభ్యులైన వీరందరికీ కూడా ఇదే వేదిక పై నుంచి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.

*అధికారం మనకు బాధ్యత మాత్రమే...*
దేవుడి దయతో ప్రజలిచ్చిన అధికారంతో ఈ రోజు ఇక్కడ మీ అన్న, మీ తమ్ముడి నేడు ... అధికారం అన్నది మనకి బాధ్యతను మాత్రమే నేర్పిందని తెలియజెప్పే విధంగా ప్రజలకు తొలిసేవకుడిగా మీ కళ్లెదుటే మాట్లాడుతున్నాను.
అలా బాధ్యతగా వ్యవహరించాం  కాబట్టే... ఈ 52 నెలల కాలంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా... సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా, రాష్ట్రం గతంలో ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా గ్రామస్ధాయిలోనే అవినీతికి ఏమాత్రం తావులేకుండా, లంచాలకు, వివక్షకు చోటు లేకుండా పౌరసేవల డెలివరీలో డీబీటీ ద్వారా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని గొప్ప విప్లవాత్మక మార్పులు చేయగలిగాం.

మూడు ప్రాంతాల ఆత్మగౌరవాన్ని ఒకవైపున కాపాడుతూ.. మూడు రాజధానులను ప్రకటించే నిర్ణయం తీసుకున్నాం. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ను 26 జిల్లాలు ఏర్పాటు చేసేటట్టుగా అడుగులు వేశాం. గ్రామస్ధాయిలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా సచివాలయ వ్యవస్ధను తీసుకురావడం దగ్గర నుంచి మొదలుపెడితే... ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ వ్యవస్ధను తీసుకుని రాగలిగాం. ఇవన్నీ కూడా ఇంతకముందెప్పుడూ... జరగని విధంగా, చూడని విధంగా ప్రభుత్వ పథకాలు ఆర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ అందించగలుగుతామా ? ఇది సాధ్యమేనా ? అనుకునే పరిస్థితి నుంచి.. ఎక్కడా లంచాలు లేకుండా, వివక్షకు తావులేకుండా, గ్రామ స్ధాయిలోనే ప్రతి ఒక్కరికీ అందించగలిగిన ఒక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలిగాం. 

*గత పాలనకు భిన్నంగా మేనిఫెస్టో అమలు...*
మేనిఫెస్టో అంటే ఎన్నికలు అప్పుడు మాత్రమే ప్రజానాయకులు, పార్టీ నాయకులు చెబుతారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేస్తారు అని మనం నేర్చుకున్న గత పాలనకు, గత పాలకులకు భిన్నంగా.. .మనం∙మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం వాగ్ధానాలు అమలు చేయడం ద్వారా.. జగన్‌ చెప్పాడంటే... చేస్తాడని మాట నిలబెట్టుకుంటాడని, కష్టమైనా, నష్టమైనా కూడా అండగా ఉంటాడని మంచి పేరు దేవుడి దయతో ఈ నాలుగు సంవత్సరాల పాలన  ద్వారా తెచ్చుకోగలిగాం.

సామాజిక వర్గాలను, ప్రాంతాలను గుండెల నిండా ప్రేమతో అభిమానించాం. ప్రతి మాటకు ముందు నా ఎస్సీలు, నా ఎస్టీలు, బీసీలు, మైనార్టీలంటూ.. ప్రతి మాటకు ముందు నా అనే మాటకు అర్ధం చెబుతూ రూ.2.35 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా  బటన్‌ నొక్కి నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా జమ చేశాం. నా అనే మాటకు అర్ధం చెబుతూ... నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు 75 శాతం పై చిలుకు ఇవ్వగలిగాం.

*నాలుగేళ్లలో 2.07 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు...*
రాష్ట్రం మొత్తమ్మీద స్వతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ... 4  లక్షల  ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే.. కేవలం ఈ 4 నాలుగు సంవత్సరాల కాలంలో మాత్రమే మరో  2.07 లక్షలు ప్రభుత్వఉద్యోగాలు మీ బిడ్డ ప్రభుత్వం ఇవ్వగలిగింది. 
ఇందులో నా  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటూ...  ఏకంగా 80 శాతం పై చిలుకు ఉద్యోగాలు వీరికే ఇవ్వగలిగాం.

31 లక్షల ఇళ్లపట్టాలు నా అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగాం. 22 లక్షల ఇళ్లు ఈ రోజు నా అక్కచెల్లెమ్మల పేరుతో వేగంగా కడుతున్నాం. ఇందులో అత్యధికంగా 80 శాతం పైచిలుకు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మెల చేతుల్లో పెట్టగలిగాం. సామాజిక న్యాయం అనే పదానికి అర్ధం చెబుతూ.. రాష్ట్రంలో ఇంతకముందెప్పుడూ జరగని విధంగా... ఎప్పుడూ చూడని విధంగా నామినేటెడ్‌ పోస్టులు, నామినేటెడ్‌ కాంట్రాక్టుల్లో ఏకంగా 50 శాతం కచ్చితంగా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు  చట్టం చేసి మరీ ఇవ్వగలిగాం.

*సామాజిక న్యాయం వర్ధిల్లేలా...*
స్ధానిక సంస్ధల మొదలు రాష్ట్ర కేబినెట్‌ వరకూ సామాజిక న్యాయం వర్ధిల్లిన పాలన ఎక్కడైనా కనపించిందంటే.. అది మీ అన్న, తమ్ముడు ప్రభుత్వ పాలనలో మాత్రమే.
బీద, సాద, బడుగు బలహీన వర్గాల వాళ్లు అందరూ నావాళ్లు. అంతా నా కుటుంబం. అందరికోసం ఈ ప్రభుత్వం అని నిరూపించుకుంటూ.. 52 నెలల కాలంలో ప్రతి అడుగూ ఈ దిశగానే వేశాం.

విద్యారంగం, వైద్య రంగం, వ్యవసాయ రంగాలు బాగుంటేనే మారుమూల పల్లెల్లో ఉన్న పేదల కుటుంబాలకు మంచి జరుగుతుందని, ఆ పేద సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని నమ్మి..ఈ మూడు రంగాల్లో ఇంతకముందెప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చాం.
ఈ మార్పులు వల్ల పేదరికం పోవాలని, పేదరికంలో ఉన్నవాళ్లు పైకి రావాలని, పేదరికం అడ్డు రాకూడదని ఈ మూడు స్తంభాలను బలపర్చాం.

సమాజంలో 62 శాతం ఉన్న రైతులు, రైతు కూలీలను వ్యవసాయం, వ్యవసాయ అనుబంధరంగాలను కానీ, సమాజంలో 50 శాతం ఉన్న అక్కచెల్లెమ్మల సాధికారత కానీ గతంలో ఏ ఒక్క ప్రభుత్వమూ ఆలోచన చేయడానికి కూడా సాహసించని విధంగా ఈరోజు ఈవర్గాలకు తోడుగా నిలబడగలిగాం.

*ప్రతి వర్గం సమస్యకూ పరిష్కారం చూపుతూ..*
ఒక్కమాటలో చెప్పాలంటే.. నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో నేను వేసిన ప్రతి అడుగులోను కూడా ప్రాంతాలవారీగా, సామాజికవర్గాల వారీగా, వృత్తివర్గాల వారీగా, పేదలుగా, మహిళలుగా, అవ్వాతాతలుగా వారు ఎదుర్కుంటున్న ప్రతి సమస్యకూ ఈ 52 నెలల కాలంలో పరిష్కారం చూపగలిగాం.
ఈ రోజు గర్వంగా, సవిన యంగా, మీ బిడ్డగా, మీ అన్నగా, తమ్ముడిగా తెలియజేస్తున్నాను... మన పార్టీ తప్ప ప్రజలకిచ్చిన మాటను, మేనిఫెస్టోను ఇంతగా నిలబెట్టుకున్న పార్టీ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు. 52 నెలల్లోనే వ్యవస్ధల్లోనూ, పరిపాలనలోనూ, గ్రామస్ధాయి నుంచి రాష్ట్ర స్ధాయి వరకూ ఇన్ని మార్పులు తీసుకొచ్చిన పార్టీ దేశచరిత్రలో మరెక్కడా లేదు.
పేదలపట్ల చిత్తశుద్ధితో ఆలోచన చేసిన పార్టీ కూడా మనదే.
ఇవన్నీ చేయగలిగామంటే దానికికారణ ం మీరు నాపై ఉంచిన నమ్మకం మాత్రమే.  ఆ దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ రోజు కనీవినీ ఎరుగని మార్పులు గొప్పగా చేయగలిగాం.

*రాబోయే నెలల్లో ..*
ఇంతగా పేదలకోసం నిలబడగలిగాం అని సవినయంగా తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు చాలా అడుగులు వేశాం. ఇప్పుడు అక్టోబరులో ఉన్నాం. బహుశా ఎన్నికలు మార్చి, ఏఫ్రిల్‌లో జరుగుతాయి. ఇన్ని అడుగులు మనం వేశాం. రాబోయే నెలల్లో వేసే అడుగులు గురించి మీ అందరితో  నా ఆలోచనలు ఇవాళ పాలు పంచుకుంటాను. మీరు గ్రామస్ధాయిలోకి తీసుకునిపోవాలి. ఈ ఆలోచనలు గ్రామస్ధాయిలో కచ్చితంగా, బాగా అమలయ్యేటట్టుగా మీరు పర్యవేక్షించాలి. గ్రామస్ధాయిలోకి ఈ బాధ్యతను మీరు తీసుకుని పోవాలి. మీకు అర్ధమైన విషయాలు గ్రామస్ధాయిలో మీరు మీటింగ్‌లు పెట్టి చెప్పి... గ్రామస్ధాయిలో గొప్పగా అడుగులు పడేటట్టు చర్యలు తీసుకోవాలి.  మీ అందరి భాగస్వామ్యంతో రాబోయే నెలల్లో ఏ కార్యక్రమాలు చేస్తున్నామో చెప్పడానికి ఈ వేదికను ఉపయోగించుకుంటున్నాను. 

*నాలుగు కార్యక్రమాలు.*
మరో నాలుగు కార్యక్రమాలు గురించి ముందుగా మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఇందులో ఒకటి జగనన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమం. ఇది ఇప్పటికే జరుగుతుంది. మీరు మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన కార్యక్రమం ఇది. మీ వల్ల ప్రజలకు మరింత ఉపయోగం ఈ కార్యక్రమం ద్వారా జరగాలి. గత నెల30న మొదలుపెట్టిన ఈ కార్యక్రమం నవంబరు 10 వరకు కొనసాగుతుంది. ఈ జగనన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమం ఎందుకు తీసుకొచ్చామంటే...  రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా వ్యాధుల బారిన పడకూడదనే తపన, తాపత్రయంతోనే. ఒకవేళ పడినా వారికి మంచి వైద్యం అందించాలన్న తపనతోనే ప్రారంభించాం.

*ప్రివెంటివ్‌ కేర్‌ దిశగా....*
మామూలుగా ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దేన్‌ క్యూర్‌ అని చెబుతారు. అంటే మన గ్రామాలలో మన పేదవాళ్లను వ్యాధిబారిన పడకమునుపే ఆ పేదవాళ్లను కాపాడుకోగలిగితే.... ఆ వ్యాధులే పేదవాళ్లకు రాకుండా చూసుకోగలిగితే ఆ కుటుంబాలకు మనం మంచి చేసినవాళ్లమవుతాం అని అడుగులు వేస్తున్నాం. ప్రివెంటివ్‌ కేర్‌లో దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అడుగులు వేస్తున్నాం. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా రాష్ట్ర పరిధిలో 15,004 సచివాలయాల పరిధిలో 15వేల క్యాంపులు అర్భన్, రూరల్‌ ప్రాంతాల్లోనూ నిర్వహిస్తున్నాం. మొత్తంగా 1.60 కోట్ల ఇళ్లను కవర్‌ చేస్తున్నాం. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ప్రతి ఇంటికీ వెళ్లి.. జల్లెడ పడుతూ ప్రతి పేదవాడికి అండగా, తోడుగా నిలబడే కార్యక్రమం జరుగుతుంది. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని మ్యాప్‌ చేస్తున్నాం. ప్రతి ఇంటిలో ఉండే ప్రతి ఒక్కరికీ ఇంటివద్దనే ఉచితంగా పరీక్షలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇందుకోసం ప్రతి గ్రామంలోని, ప్రతి ఇంటినీ జల్లెడ పడుతున్నాం. ఆ ఇంటిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వారిని చేయిపట్టుకుని నడిపించడమే కాకుండా వారికి అన్ని రకాలుగా తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తున్నాం.

*ఆరోగ్య సురక్ష- వ్యాధి నిర్ధారణ నుంచి నయమయ్యే వరకూ చేయూత*
జగనన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమాన్ని మొత్తం 5 దశలలో చేస్తున్నాం. ఇందులో చాలా ముఖ్యమైనది, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇది కేవలం ప్రివెంటివ్‌ కేర్‌ మాత్రమే కాదు. వ్యాధి బారిన పడిన వారిని గుర్తించి వారికి అన్నిరకాలుగా తోడ్పాటు నందిస్తూ.. వారికి నయమయ్యే వరకు వారి చెయ్యిపట్టుకుని తోడుగా ఉండే గొప్ప కార్యక్రమమిది.
ఐదు దశలలో జరిగే ఈ కార్యక్రమంలో ఐదవ దశ అన్నింటికన్నా కీలకమైనది. 5వ దశ మీరు ఎక్కువగా నిమగ్నం కావాల్సినదశ. నాలుగో దశలో జరిగే ఆరోగ్య సురక్ష క్యాంపులలో... గుర్తించిన వారికి వ్యాధి నయమయ్యేంత వరకు ఉచితంగా పూర్తి స్ధాయిలో చేయూత నిచ్చే కార్యక్రమం, వారిని చేయిపట్టుకుని తోడుగా నిలబడుతూ నడిపించే కార్యక్రమమిది. వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు(సీహెచ్‌ఓలు), ఫ్యామిలీ డాక్టర్లు, స్పెషలిస్టు డాక్టర్లు, ఇతర సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో చొరవ చూపుతున్నారు. జగనన్న సురక్షకార్యక్రమంతో పాటు ప్రజల పట్ల బాధ్యత గల పార్టీగా మనం పూర్తిస్ధాయిలో ఈ కార్యక్రమంలో మమేకం కావాలి. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఓన్‌ చేసుకోవాలి. ప్రజలకెంతో మేలు చేసే ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలకు ఎంత ఎక్కువ చేరువ చేస్తే.. ఆ ఫలాలు అంత ఎక్కువగా పేదవాడికి అందుతాయి. ఆ పేదల ఆశీస్సులు ఘనంగా మనందరికీ, మన పార్టీకి లభిస్తాయి. గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్నందరినీ మరొక్కసారి అడుగుతున్నాను.

ఇక్కడ జరిగేది కేవలం  హెల్త్‌ క్యాంపు మాత్రమే కాదు... అదొక్కటే ముఖ్యమైన అంశం కాదు. వ్యాధిగ్రస్తులకు నయమయ్యే వరకు చేయిపట్టుకుని నడిపించే ఈ కార్యక్రమంలో మీరు మీ వంతుగా.. బాగా జరిగేటట్టుగా మీ పాత్ర పోషించాలి.
ఇక మీదట ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియగా జరుగుతుంది. గ్రామాల్లో ప్రతి 6 నెలలకొకమారు ఇదే క్యాంపు జరుగుతుంది. విలేజ్‌ క్లినిక్కులు, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అన్నీ అనుసంధానమవుతాయి. వ్యాధిని పడిన వారిని చేయిపట్టుకుని నడిపిస్తూ.. ఆ వ్యాధి నయమయ్యే వరకు వారికి ఉచితంగా వైద్యం నుంచి మందులు వరకు వారికిస్తూ.. తోడుగా చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమంలో మీ వంతు మీరు పోషించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దీనివల్ల గ్రామస్ధాయిలో మన నాయకత్వానికి, మన పార్టీకి మెండుగా ఆశీస్సులు ఇస్తారు. ప్రజల గుండెల్లో చెరగని చోటు సంపాదించుకుంటారు. 

*రెండో కార్యక్రమం– వై ఏపీ నీడ్స్‌ జగన్‌.*
ఆ తర్వాత రెండో కార్యక్రమం... వై ఏపీ నీడ్స్‌ జగన్‌.  ప్రజలందరి ఆశీస్సులతో ప్రజలకు మరింత సేవ చేయడానికి, ప్రజలకు మరింత మంచి చేయడానికి, కొనసాగాల్సిన అవసరాన్ని వివరించే కార్యక్రమమే... ఇది.  ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలి అని చెప్పే.. వై ఏపీ నీడ్స్‌ జగన్‌ అనే కార్యక్రమం. 
ఇది నవంబరు 1 తేదీ నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే అనే ఈ కార్యక్రమం నవంబరు 1 నుంచి డిసెంబరు 10 వరకు దాదాపు 40 రోజులపాటు జరుగుతుంది.

ఇందులో రెండు ముఖ్యమైన దశలుంటాయి. మొదటిది మన గ్రామాల్లోని సచివాలయాలను సందర్శించడం. ఇక్కడున్నవాళ్లు అందరూ మండలస్ధాయి, ఆ పై నున్నవాళ్లే కాబట్టి... ప్రతి అడుగులోనూ మీరు అక్కడకి వెళ్లి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ప్రారంభించాలి,పర్యవేక్షించాలి. అక్కడికి వెళ్లి కార్యక్రమం మెరుగ్గా జరిగేటట్టు అడుగులు వేయించాలి. అందుకే ఇందులో రెండు ముఖ్యమైన దశలున్నాయి. మొదటికి సచివాలయాలను మనం సందర్శించాలి. ప్రతి సచివాలయాన్ని సందర్శించాలి.
ఆ తర్వాత రెండో కార్యక్రమం రాష్ట్రంలో ఉన్న 1.60 కోట్ల ఇళ్లకు ప్రతి గడపకూ వెళ్లేట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. 

వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో పార్టీగా, ప్రభుత్వంగా మనం చేయాల్సిన 4 ప్రధానమైన పనులను వివరిస్తారు. మీరు గ్రామాలలో, సచివాలయ పరిధిలో వెళ్లేటప్పుడు.. ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమం, అక్కడ జరిగిన సంక్షేమ పథకాల కార్యక్రమాలు, ఎంతమందికి లబ్ధి జరిగింది వీటికి సంబంధించిన   బోర్డుల ఆవిష్కరణ పనుల కార్యక్రమంలో మీరంతా పాల్గొనాలి. 
మండల స్ధాయి నాయకత్వంలో ఉన్న మీరంతా గ్రామస్ధాయి నాయకత్వంతో మమేకం కావాలి. అక్కడకి వెళ్లి.. సచివాలయంలో ఈ బోర్డుల ఆవిష్కరణకార్యక్రమంలో పాలుపంచుకోవాలి. 

*గ్రామంలో జెండా ఆవిష్కరణ– గ్రామ పెద్దలతో మమేకం.*
ఆ తర్వాత అదే గ్రామంలో వేరేచోట పార్టీ జెండా ఎగరవేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. ఆ తర్వాత ఆ గ్రామంలో ఉన్న స్ధానిక పెద్దల ఇంటికి వెళ్లి కలవాలి. వారితో సమావేశం కావాలి. వారి ఆశీస్సులు, దీవెనలు తీసుకునే కార్యక్రం చేయాలి. ఈ 52 నెలల కాలంలో గ్రామం నుంచి రాజధానుల  వరకు మన ప్రభుత్వం ఎన్నెన్ని మార్పులు తీసుకువచ్చిందో.. ఇటీవల స్వాతంత్రదినోత్సం రోజు నా ప్రసంగంలో సుదీర్ఘంగా వివరించాను. అందులో ప్రతి అంశాన్ని ముందు మన మండలస్ధాయి నాయకత్వం అర్ధం చేసుకోవాలి. దాన్ని గ్రామస్ధాయిలో ఉన్న మన నాయకత్వానికే కాకుండా... పెద్దలకు అందరికీ వివరించే కార్యక్రమం జరగాలి. మరుసటి రోజు ఇంటింటికీ వెళ్లే కార్యక్రమానికి మీరు అందరూ శ్రీకారం చుట్టాలి.  సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, గృహసారధులు, ప్రతి ఇంటినీ, ప్రతి గడపనూ విధిగా సందర్శించాలి. ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ప్రతి ఒక్కరికీ, ప్రతి ఇంటిలో అర్దం అయ్యేటట్టు చెప్పాలి. 2019లో మనం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నాం కాబట్టి... సగర్వంగా, సవినయంగా ఆ మేనిఫెస్టోలో అంశాన్ని కూడా మీరే చూడండి అని ప్రజలకు అర్ధమయ్యేటట్టు చూపించాలి. ప్రతి ఇంటికీ జరిగిన మంచి గురించి చెప్పాలి.  రాష్ట్రంలో జరిగిన మంచి గురించి చెప్పాలి.

ఏ రకంగా 2019లో మనం ఒక మేనిఫెస్టో ఇచ్చి.. దాన్ని భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ఏకంగా 99 శాతం వాగ్ధానాలను పూర్తి చేసిన సంగతిని.. మేనిఫెస్టో చూపిస్తూ వివరించాలి.
ఒకవైపు వాలంటీర్‌ ఈ విషయాలన్నీ ప్రతి ఇంటిలోనూ, ప్రతి గడపలోనూ చెబుతున్నప్పుడు మన సచివాలయ కన్వీనర్లు, మన గృహసారధులు.. వీళ్లు అదే టైంలో 2014లో గత ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో.. అందులో చెప్పిన ప్రతి వాగ్ధానాన్ని వాల్లు ఎలా ఎగ్గొట్టారో, ప్రజలకు వాళ్లు మోసం చేశారో, అప్పుడు కూడా ప్రజలను మోసం చేసేందుకు ఒక కూటమిగా ఏర్పాడి ఇదే టీడీపీ, ఇదే దత్తపుత్రుడు ప్రతి ఇంటికి కరపత్రం ఇచ్చారో.. వాటిని కూడా చూపించాలి. ఇటువంటి వంచన తర్వాత ఇలాంటి వ్యక్తులను నమ్మగలుగుతామా ? అని చెప్పి మన సచివాలయ కన్వీనర్లు, గృహసారధులు, వాలంటీర్లు వెళ్లి 2014లో జరిగిన మోసాలు గురించి కూడా వినయంగా, సుదీర్ఘంగా ప్రతి ఇంట్లో టైం తీసుకుని..ఈ వివరాలన్నీ చెప్పే కార్యక్రమం మీరు చేయాలి. అదే సమయంలో 2019లో మన మేనిఫెస్టో గురించి చెప్పాలి.

ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లాలి. ప్రతి ఇంట్లో కూడా ... ఏ రకంగా చిత్తశుద్ధితో, పేదల ప్రభుత్వంగా ఉండి, మంచి చేసే కార్యక్రమం ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో జరిగిందో చెప్పాలి. 

మండలస్ధాయిలో నిర్వహించే శిక్షణా తరగతుల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కన్వీనర్లు అంతా కూడా ఇంకా సుదీర్ఘంగా ఈ కార్యక్రమం గురించి మీకు అవగాహన కలిగిస్తారు. 

*ఇక మూడో కార్యక్రమం... బస్సు యాత్రలు.*
ఇది ఈనెల అంటే అక్టోబరు 25వ తేదీన మొదలుపెడితే.. డిసెంబరు 31 వరకు దాదాపు 60 రోజుల పై చిలుకు జరిగే కార్యక్రమమిది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో ఈ బస్సు యాత్రలు జరుగుతాయి. ఒక్కో టీమ్‌లో పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సీనియర్‌ నాయకులంతా ఉంటారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన ఈ మీటింగ్‌లు ఆ నియోజకవర్గంలో జరుగుతాయి, మూడు ప్రాంతాల్లో మూడు మీటింగ్‌లు ఉంటాయి. ప్రతి రోజూ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు మీటింగ్‌లు జరుగుతాయి. ఒక్కోరోజు ఆ ప్రాంతంలోని అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి అక్కడ మీటింగ్‌ పెట్టి ప్రభుత్వం చేసిన మంచి గురించి, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, మారిన మన స్కూళ్ళ గురించి, మారిన మన ఆసుపత్రుల గురించి, మారిన మన వ్యవసాయం గురించి, జరిగిన అభివృద్ది గురించి, తీసుకొచ్చిన మార్పుల గురించి వివరిస్తూ స్ధానికంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సాయంత్రానికి మూడు ప్రాంతాల్లో మూడు పబ్లిక్‌ మీటింగ్‌లు, బస్సు పైనుంచే బహిరంగ సభలో ప్రసంగిస్తారు, మన పార్టీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు ఉంటారు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతాయి, ఈ సభకు స్ధానిక ఎమ్మెల్యే లేదా అసెంబ్లీ కన్వీనర్‌ అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమం 60 రోజుల పాటు ప్రతిరోజూ మూడు ప్రాంతాల్లో మూడు మీటింగ్‌లు ఉంటాయి, మీరంతా ఈ బస్సు యాత్ర కార్యక్రమంలో పాల్గొనాలి, మమేకం కావాలి. ఇది మామూలు బస్సు యాత్ర కాదు, ఒక సామాజిక న్యాయ యాత్ర, పేద సామాజిక వర్గాలన్నింటిని కూడా కలుపుకుని వెళ్ళే యాత్ర, పేదవాడికి జరిగిన మంచిని వివరించే యాత్ర, పేదవాడి తరపున నిలబడే యాత్ర.

*రాబోయేది క్యాస్ట్‌ వార్‌ కాదు క్లాస్‌ వార్‌.*
రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో జరగబోయే యుద్దం పేదవాడికి పెత్తందార్లకు మధ్య జరగబోయే యుద్దం. ఆ పేదవాడి పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ, రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో అక్టోబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 31 వరకు ఈ 60 రోజుల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు జరుగుతాయి. ప్రతి రోజూ మూడు సభలుంటాయి, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, ఓసీల్లోని నా నిరుపేదలు ఉంటారు. రేపు జరగబోయేది కులాల మధ్య యుద్దం కాదు, క్లాస్‌ వార్.
పేదవాడు ఒక వైపున, పెత్తందారీ మరో వైపున, పేదవాళ్ళంతా ఏకం కావాలి, అప్పుడే ఈ పెత్తందారులని గట్టిగా ఎదుర్కోగలుగుతాం. దీనికి మన జెండా మోసేది, ప్రతి నియోజకవర్గంలో మీటింగ్‌ లో పాల్గొనేది పేదవాడే అని తెలియజేస్తున్నాను. 

*ఇక నాలుగో కార్యక్రమం ఆడుదాం ఆంధ్రా...*
డిసెంబర్‌ 11 నుంచి, వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం అయిపోయిన తర్వాత  ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం మొదలవుతుంది. ఇది డిసెంబర్‌ 11 నుంచి సంక్రాంతి వరకు అంటే జనవరి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించే క్రీడా సంబరం ఈ ఆడుదాం ఆంధ్రా. ఈ క్రీడా సంబరం ద్వారా నైపుణ్యం ఉన్నవారిని గ్రామస్ధాయి నుంచి గుర్తించడం, వారిని ప్రోత్సహించడం మన ప్రభుత్వ ఉద్దేశం, భారతదేశ టీమ్‌లో వైనాట్‌ ఆంధ్రప్రదేశ్‌ అనే కార్యక్రమం జరగాలి, క్రికెట్‌ కావచ్చు వాలీబాల్‌ కావచ్చు కబడ్డీ, ఖోఖో కావచ్చు, బాడ్మింటన్‌ కావచ్చు, ఈ కార్యక్రమం 45 రోజుల పాటు జరుగుతుంది. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి మొదలై మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్ధాయిలో ఈ క్రీడా సంబరాలు జరుగుతాయి.

ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో మీరంతా భాగస్వామ్యం కావాలి, ఎందుకంటే మన గ్రామంలో మరుగునపడి ఉన్న మన పిల్లల టాలెంట్‌ను మన దేశానికే పరిచయం చేసే కార్యక్రమం, ఇక నుంచి ఈ కార్యక్రమం ప్రతి ఏడాదీ జరుగుతుంది, మీరంతా మమేకం కావాలి. ఇలా నిరంతరం మనం శ్రద్ద పెడితే భారతదేశ టీమ్‌లో వైనాట్‌ ఏపీ అనేది ప్రతి క్రీడలోనూ వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం.

*జనవరి 1 నుంచి మరో మూడు కార్యక్రమాలకి శ్రీకారం...*
అక్టోబరు 25 నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమాలు జనవరి 15 వరకు కొనసాగుతున్నాయి. ఈ నాలుగు కార్యక్రమాలే కాకుండా జనవరి 1న ఇక్కడి నుంచి మరో మూడు కార్యక్రమాలు మొదలవుతాయి. జనవరి 1వ తేదీన నా అవ్వాతాతలకు, నా వితంతు అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రూ.3000 వరకూ పెంచుకుంటూ పోతామని చెప్పిన... పెన్షన్‌ పెంపు కార్యక్రమానికి శ్రీకారం చుడతాం.
ఈ కార్యక్రమం 10 రోజుల పాటు జనవరి 1 నుంచి జనవరి 10 వ తారీఖు వరకు జరుగుతుంది. గ్రామస్ధాయిలో సంబరాలు జరగాలి. గ్రామ స్ధాయిలో జరిగే సంబరాలలో మీరంతా మమేకం కావాలి. గ్రామ స్ధాయిలో ఆ అవ్వాతాతలు, వితంతు అక్కచెల్లెమ్మల సంతోషాల్లో మనం కూడా భాగస్వాములు కావాలి.

ఆ సంబరాల్లో మీరు మైకు పట్టుకుని చెప్పాలి. ఎన్నికలకు రెండు నెలలు మందు వరకు.. జగనన్న రాకమునుపు, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాకమునుపు.. మీ పెన్షన్‌ ఎంత అవ్వా ? అని అవ్వలను అడగాలి. రూ.1000 మాత్రమే.
మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు. వెంటనే ఆ పెన్షన్‌ను రూ.2250 తీసుకునిపోయాడు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం పెంచుతూ..  రూ.3000 వరకు పెంచుకుంటా పోతామన్న మాటను ఆ అవ్వలకు గుర్తు చేయాలి. 
మనం అధికారంలోకి రాకమునుపు గత ప్రభుత్వ హయాలంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌లు ఇస్తే...  ఇవాళ మీ బిడ్డ హయాంలో 66లక్షల మందికి పెన్షన్‌లిస్తున్నామన్న సంగతి ప్రతి అవ్వాతాతకు, ప్రతి అక్కచెల్లెమ్మకూ చెప్పాలి.

మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు వరకు పెన్షన్‌ల ఖర్చు.. కేవలం రూ.400 కోట్లు. ఈ రోజు చిరునవ్వుతో మీ బిడ్డ భరిస్తున్న భారం నెలకు అక్షరాలా రూ.2000 కోట్లు. ప్రతి అవ్వా, తాత ముఖాన చిరునవ్వును చూస్తూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలి. ఆ వితంతు అక్కాచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ.. వారితో మీ అన్న, తమ్ముడు మీతో ఎప్పుడూ తోడుగా ఉంటాడన్న మెసేజ్‌ తీసుకువెళ్లాలి. జనవరి 1 నుంచి 10 వరకు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలి.

*జనవరి 10 నుంచి వైఎస్‌ఆర్‌ చేయూత.*
ఆ తర్వాత జనవరి 10 నుంచి రెండో కార్యక్రమం వైఎస్‌ఆర్‌ చేయూత మొదలవుతుంది. జనవరి 10 నుంచి జనవరి 20 వరకు ప్రతి గ్రామంలోనూ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఇచిన మాటను నిలబెట్టుకుంటూ.. వైఎస్‌ఆర్‌ చేయూత కార్యక్రమం ద్వారా ఇప్పటికే మూడు దఫాల్లో రూ.14,129 కోట్లు ఇచ్చాం. జనవరి 10– 20 వ తేదీ వరకు ఇవ్వబోయే మరో రూ.5వేల కోట్లు కలుపుకుంటే... ఈ ఒక్క కార్యక్రమానికే ఏడాదికి రూ.18750 చొప్పున నాలుగేళ్లలో  రూ.75వేలు అదే అక్కచెల్లెమ్మల చేతికిచ్చినట్లవుతుంది.

*అక్కచెల్లెమ్మల విజయగాధలు...*
అంతే కాకుండా వారికి బ్యాంకు రుణాలను కూడా టైఅప్‌ చేసి, ఐటీసీ, హిందుస్ధాన్‌ లీవర్, పీ అండ్‌ జీ, అమూల్, రిలయెన్స్‌ వంటి వారితో ఒప్పందాలు చేయించి, వారిని చేయిపట్టుకుని నడిపించి వారికి ఆర్ధిక సాధికారత అందించే కార్యక్రమం వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా ఎలా జరిగిందని ఆ గ్రామంలో ఉన్న అక్కచెల్లెమ్మలు చెబుతున్న విజయగాధలు.. అదే గ్రామంలో ఉన్న ప్రతిఒక్కరికీ వినిపించేలా చెబుతున్న ఆ పండగ వాతావరణంలో మీరందరూ భాగస్వాములు కావాలి. గ్రామస్ధాయిలో ఆ అక్కచెల్లెమ్మల ఆశీస్సులు తీసుకోవాలి.

*జనవరి 20 నుంచి వైఎస్‌ఆర్‌ ఆసరా...*
ఆ తర్వాత మూడో కార్యక్రమం...జనవరి 20 నుంచి జనవరి 30 వరకు వైఎస్‌ఆర్‌ ఆసరా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం చివరి విడత నిధుల్ని.. జగన్‌ మాట చెప్పాడు. నిలబెట్టుకున్నాడు. నాలుగు దఫాలుగా నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటానన్నాడు. జగనన్న ప్రభుత్వం రాకమునుపు పొదుపు సంఘాలు 18శాతం ఎన్‌పీఏలు, అవుట్‌ స్టాండింగ్‌లుగా ఉంటూ... కుదేలైపోయిన పరిస్థితి. అప్పుడే మీ జగన్‌ వచ్చాడు. ఈరోజు పొదుపు సంఘాల్లో ఎన్‌పీఏలు, అవుట్‌ స్టాండింగ్‌లు కేవలం 0.3 శాతం మాత్రమే ఉన్నాయి. మీ జగనన్న చేసిన మంచి, మీరు ఆశీస్సులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అక్కచెల్లెమ్మలకు చెప్పాలి. ఏకంగా ఇప్పటికే మూడు దఫాలుగా 
ఆసరా కార్యక్రమం ద్వారా రూ.19,178 కోట్లు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టాం. చివరి విడతగా మరో రూ.6500 కోట్లు నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం జనవరి 20 నుంచి 30 వరకు ఆసరా ద్వారా తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతుంది.  అక్కచెల్లెమ్మలకు కేవలం వైఎస్‌ఆర్‌ ఆసరా ద్వారా దాదాపుగా రూ.26వేల కోట్లు వారి చేతిలో పెట్టాం. సున్నావడ్డీ కార్యక్రమం ద్వారా మరో రూ.5వేల కోట్లు ఇచ్చాం. కేవలం పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను ఆదుకునేందుకు రూ.31 వేల కోట్లు వారి చేతిలో పెట్టిన విషయాలని వారికి చెప్పడం, వారి ఆశీస్సులు తీసుకోవడం, వారు తమ కష్టాల్లోంచి ఎలా బయటపడ్డామో అని చెబుతున్న విజయగాధలను మనం కూడా మమేకం కావడమనే కార్యక్రమం జనవరి 20 నుంచి 30 వరకు జరుగుతుంది.

*ఫిబ్రవరి– మళ్లీ జగనన్ననే తెచ్చుకుందాం.*
ఇక ఫిబ్రవరి వచ్చేసరికి మళ్లీ జగనన్ననే తెచ్చుకుందాం. ఇది జగనన్న పంపించిన మేనిఫెస్టో అని చెప్పి ప్రతి ఇంటికీ మన మేనిఫెస్టోను తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఫిబ్రవరిలో ఈ కార్యక్రమం అయిన తర్వాత మార్చి నెలలో ఎన్నికలకు సన్నద్ధం. 

కాబట్టి మనం చేసిన మంచిని గ్రామ, గ్రామాన ఇంటింట అందరికీ తెలియజేసేలా, పర్యవేక్షించే బాధ్యతను మీ భుజస్కంధాలపై మోపుతున్నాం. మీలో ప్రతి ఒక్కరూ మండలం ఆ పైస్ధాయి నాయకత్వంలో ఉన్నవాళ్లు. ఇక్కడ తెలుసుకున్న ప్రతి విషయం గ్రామస్ధాయిలో అవగాహన కలిగించాలి. గ్రామస్ధాయిలో గృహసారధులు, వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు, నాయకత్వం, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని, జగన్‌ను అభిమానించే ప్రతి అభిమాని.. అందరూ గ్రామస్ధాయిలో మమేకం కావాలి. అందరినీ ఒక తాటిమీదకు తీసుకొచ్చి... అడుగులు ముందుకు వేయించే బాధ్యత మీ భుజస్కందాలమీద మోపుతున్నాను. ఈ రోజు ఈ విషయాలను ఇక్కడికి హాజరైన అందరికీ తెలియజేస్తున్నాను.

*వారు కూడా నా దళపతులే...*
గ్రామస్ధాయినుంచి అందరినీ పిలవలేకపోయినా కూడా.. అనేక మంది నా సేనానులు ఇంటి దగ్గరే ఉండి ఈకార్యక్రమానికి రాలేకపోయిన వారంతా కూడా నా దళపతులే. 
వారందరినీ పేరు, పేరునా అభ్యర్ధిస్తున్నాను. మీరంతా ఈరోజు నేను ప్రస్తావించిన ప్రతి అంశాన్ని కూడా అర్ధం చేసుకోవాలి. ప్రజల్లోకి తీసుకునిపోవాలి.

*మన పొత్తు ప్రజలతోనే...*
జరగబోయే ఎన్నికల సంగ్రామంలో మన పొత్తు ప్రజలతోనే. మీ బిడ్డ పొత్తుల మీద ఆధారపడడు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేముడిని, ఆ తర్వాత నేరుగా ప్రజలనే. కాబట్టి మన పొత్తు ప్రజలతోనే నేరుగా ఉంటుంది. మన ధైర్యం దేవుడి దయతో ప్రజలకు చేసిన మంచి. ఇదే మన ధైర్యం. ఇదే మన ఆత్మ విశ్వాసం.
మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో ఏదైతే చెప్పామో అందులో 99 శాతం అమలు చేసిన ప్రభుత్వం మనది. ఇదీ మన ధైర్యం. రాష్ట్రంలోని 87 శాతం కుటుంబాలకు సంక్షేమపథకాలను ఇంటింటికీ అందించిన ప్రభుత్వం మనది. 

రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు ఇంటింటికీ ప్రభుత్వ పథకాలను నేరుగా బటన్‌ నొక్కి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల సభ్యులఖాతాల్లోకి నేరుగా పంపించగలిగాం. ఎక్కడా లంచాలు లేవు. వివక్షకు చోటు లేదు. 

*ప్రతి పథకం ఓ విప్లవమే...*
ఒక సచివాలయ వ్యవస్ధ, వాలంటీర్‌ వ్యవస్ధ కానీ, ఇంటింటికీ అందే పెన్షన్‌ అయినా, ఇంటి ముందుకే వచ్చే రేషన్‌ కానీ, చివరకి పుట్టినరోజు ధృవీకరణ పత్రం, కుల, ఆదాయ ధృవీకరణపత్రాలు కానీ, గ్రామ, వార్డు స్ధాయిలో మారిన ప్రభుత్వ స్కూళ్లు, మారుతున్న ఆసుపత్రులు, గ్రామాల్లో కనిపించే ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్, జనగన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఇలా మనం అమలు చేసిన ప్రతి ఒక్కటీ కూడా ఒక విప్లవమే. ఇంతకముందు ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా జరిపించగలిగాం. 
ఇటువంటివన్నీ సా«ధ్యపడతాయని కలలోనైనా ఎవరైనా అనుకున్నారా ? అటువంటి విప్లవం ఇవాళ మన సొంతం. మీ జగన్‌ వల్ల, మీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం వల్ల జరిగిన మార్పు ఇది.

నవరత్నాల్లోని ప్రతి సంక్షేమ పథకం అమలూ ఒక విప్లవమే. 
మనం ఇంటింటికీ అందించిన సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ఆ ఇళ్లకు వెళ్లి అక్కడే దేవుడి దయతో మీ ఇంటికి ఇంత మంచి చేయగలిగాం అక్కా అని ఆ ఇంటికి ఏకంగా ఒక లెటర్‌ తీసుకునిపోయి వారికిచ్చి.. ఆ అక్కచెల్లెమ్మల ఆశీస్సులు అడిగిన పార్టీ దేశ చరిత్రలో ఎక్కడైనా? ఎవరైనా చేశారు అంటే అది మన పార్టీనే. 

*ప్రతి ఇంటికీ వెళ్లి ఆశీస్సులు అడగాలి...*
ప్రతి ఇంటికి లెటర్‌ తీసుకొచ్చి ఆ ఇంట్లో ఉన్న అక్కకు లెటర్‌ చూపించి, ఆ అక్కకు రాసిన ఆ లెటర్‌ చదివి వినిపించి.. అక్కా దేవుడి దయతో ఇవన్నీ చేయగలిగాం. మీ ఆశీస్సులు ఎప్పుడూ జగనన్నకు, ఈ ప్రభుత్వానికి అందించాలని ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్లి ఆడగగలగడం దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని గొప్ప విప్లవం.

మన మాదిరిగా ఎన్నికలు అయిన తర్వాత కూడా నాయకులు నిరంతరం జనంలో ఉన్న పార్టీ కూడా మనదే. నిరంతరం మమ్నల్ని ప్రజల్లోకి వెళ్లమంటున్నాడు అని కొద్దిమంది ఎమ్మెల్యేలు బాధపడి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అదే ఎమ్మెల్యేల మొహాల్లో చిరునవ్వు కనిపిస్తోంది.

*ఎన్నికల తర్వాత జనంలో ఉన్న పార్టీ – వైయస్సార్సీపీ మాత్రమే.*
మన మాదిరిగా ఎన్నికల అయిన తర్వాత కూడా నిరంతరం జనంలో ఉన్న పార్టీ కానీ, ప్రభుత్వం కానీ దేశంలో ఇంకొకటి ఏదీ లేదని సగర్వంగా తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం చేసిన మంచే మన బలం. కోవిడ్‌ సమయంలో ఆదాయాలు తగ్గినా కూడా... ఖర్చులు పెరిగినా.. సాకులు చెప్పకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి కష్టమైనా, నష్టమైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు మనం చేసిన మంచి మన బలం.

మన బలం మాట నిలబెట్టుకోవడం. మన బలం విశ్వసనీయత అన్న పదానికి నిజమైన అర్ధం చెప్పడం. మన బలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాలకు మనస్సుతో బాధ్యతతో చేసిన మంచి మన బలం. మన రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, పిల్లలకు, అవ్వాతాతలకు ఎప్పుడూ జరగని విధంగా వాళ్ల గురించి పట్టించుకుని, ఆలోచన చేసి క్రమం తప్పకుండా సమయానికి రావాల్సిన సహాయం అందించేటట్టుగా అడుగులు వేసి మంచి చేయడం మన బలం.

మన బలం మన వ్యవసాయంలో తీసుకొచ్చిన మార్పులు. మన బలం విద్యారంగంలో మనం తీసుకొచ్చిన మార్పులు. మన బలం ఆరోగ్యరంగంలో ఎప్పుడూ చూడని విధంగా తీసుకొచ్చిన మార్పులు. మన బలం డీసెంట్రలైజేషన్‌తో పారదర్శక పాలనతో లంచాలు లేని వ్యవస్ధ గ్రామస్ధాయిలోకి తీసుకుని రావడం మన బలం. ఈ విషయాలన్నీ గడప, గడపకూ తిరుగుతున్నప్పుడు ప్రతి గ్రామంలోనూ చూశారు. మరి ఇన్ని బలాలలతో మనం ప్రజా క్షేత్రంలోకి వెళ్తామన్న విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకొండి. ఏగ్రామం చూసినా, ఏ నియోజకవర్గం చూసినా ఇంతే. ప్రతి ఇంటికి మనం చేసిన మంచే కనిపిస్తోంది. ప్రతి గ్రామంలోనూ 87 శాతం పై చిలుకు ఇళ్లలో, ప్రతి నియోజకవర్గంలోనూ 87 శాతం పై చిలుకు ఇళ్లల్లో మనం చేసిన మంచే కనిపిస్తుంది. ప్రతి గ్రామంలోనూ మారిన స్కూళ్లు కనిపిస్తాయి. ప్రతి గ్రామంలోనూ  వైద్య ఆరోగ్యరంగంలో తీసుకొచ్చిన మార్పులే కనిపిస్తాయి. విలేజ్‌ క్లినిక్‌లు దగ్గర నుంచి ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, ఆర్బీకేలు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తాయి. 

*వై నాట్‌ 175....*
ప్రతి ఇంటిలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ జరిగిన మార్పులు కనిపిస్తున్నప్పుడు..మరి వై నాట్‌ 175. వై నాట్‌ 175 అన్నప్పుడు.. 151 ఎక్కువ. .. జగన్‌ వై నాట్‌ 175 అని అడుగుతున్నాడు అని మన గురించి గిట్టని వాళ్లు అనొచ్చు. కానీ నేను ఒక్కటే చెబుతున్నా. మార్పు ప్రతి ఇంటిలోనూ, గ్రామంలోనూ, నియోజకవర్గంలోనూ కనిపించినప్పుడు వైనాట్‌ 171 అని  ఎందుకు అడగకూడదు ? 

*క్రెడిబులిటీ లేని వ్యక్తి– చంద్రబాబు.*
ఇక్కడే మరొక విషయం కూడా చెబుతున్నాను. చంద్రబాబు అనే వ్యక్తి జైల్లో ఉన్నా, ప్రజల్లో ఉన్న పెద్ద తేడా ఏం పడదు అని తెలియజేస్తున్నాను. కారణం ఏమిటంటే.. ఆయనకు క్రెడిబులిటీ లేదు. ఆయన ఎక్కడున్నా విశ్వసనీయత లేదు కాబట్టి.. ఎక్కడున్నా ఒక్కటే.
చంద్రబాబుని, ఆయన పార్టీని చూసినప్పుడు పేదవాడికి, ప్రజలకు మోసాలు, వెన్నుపోట్లు, అబద్దాలు, వంచనలు గుర్తుకు వస్తాయి.

అదే మన పార్టీని చూసినప్పుడు, వాళ్ల అన్న, తమ్ముడు, బిడ్డ జగన్‌ను చూసినప్పుడు ప్రతి రైతన్నకు, ప్రతి అక్కచెల్లెమ్మకు సామాజిక న్యాయం గుర్తుకు వస్తుంది. గ్రామాల్లో మారిన వైద్యం, స్కూళ్లు, వ్యవసాయం, ప్రాంతాల మధ్య న్యాయం, లంచాలు, వివక్ష లేని వ్యవస్ధ గుర్తుకు వస్తాయి. అక్కచెల్లెమ్మలు ఒక ఫోన్‌ పట్టుకుని ఇంట్లోంచి వెళ్లగలిగే ధైర్యం గుర్తుకు వస్తాయి. అక్కచెల్లెమ్మలు ఆపదలో ఉన్నప్పుడు ఫోన్‌ పట్టుకుని ఐదుసార్లు అటూ ఇటూ ఊపినా, ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కిన చాలు ఐదు నిమిషాల్లో పోలీసులు వస్తారు. ఇవాల 1.24 కోట్ల ఫోన్లలో దిశ యాప్‌ ఉంది. కష్టంలో ఉన్నప్పుడు ఇలా ఫోన్‌ షేక్‌ చేసినా, ఎస్‌ఏఎస్‌ బటన్‌ నొక్కిన 30,336 మంది అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడిన మంచి పోలీస్‌ అన్న, ఆ పోలీస్‌ అన్న రూపంలో ఉన్న జగనన్న ఆ అక్కచెల్లెమ్మలకు గుర్తు వస్తారు. 

*బాబు అవినీతిని కేంద్రం నిరూపించింది.*
చంద్రబాబునాయుడిని ఎవరూ కక్షసాధింపుతో అరెస్టు చేయలేదు. చంద్రబాబు అనే వ్యక్తి మీద నాకు ఎటువంటి కక్ష లేదు. పైగా జగన్‌ భారతదేశంలో లేనప్పుడు, లండన్‌లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసారు. చంద్రబాబును ఎవరూ కక్షసాధింపుతో అరెస్టు చేయలేదు. అదే నిజమనుకుంటే కేంద్రంలో బీజేపీ ఉంది. దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నాను అని ఇప్పటికీ అంటున్నాడు. బీజీపే రాష్ట్ర అధ్యక్షురాలితో పాటు సగం బీజేపీ పార్టీ టీడీపీ మనుషులే ఉన్నారు. అయినా కేంద్రంలోని ఇన్‌కమ్‌టాక్స్, ఈడీ చంద్రబాబు మీద విచారణ జరిపి ఆయన అవినీతిని నిరూపించింది. ఈడీ అయితే దోషులను అరెస్టు చేసింది. బాబుకు ఇన్‌కమ్‌టాక్స్‌ డిపార్ట్‌మెంటు నోటీసులు కూడా ఇచ్చారు. 

బాబు మీద మోదీ గారు అవినీతి ఆరోపణలు చేసిన నాటికి మనం ప్రతిపక్షంలో ఉన్నాం. అంటే ఆ నాటికే మోదీ గారికి, కేంద్రానికి అన్నీ తెలుసు కాబట్టే.. సీబీఐ, ఈడీ, ఐటీలను రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని ఇదే పెట్టమనిషి చంద్రబాబు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. పర్మిషన్‌ కూడా విత్‌డ్రా చేశాడు. అంటే ఆనాటికే అవినీతి పరుడని స్పష్టమైన ఈ వ్యక్తి మీద.. విచారణ చేయకూడదట. అధారాలు లభించినా అరెస్టు చేయకూడదట. కోర్టులు ఆ ఆధారాలన్నీ చూసిన తర్వాత రిమాండ్‌కు పంపినా కూడా...  ఒక చంద్రబాబుని కానీ, ఒక గజదొంగల ముఠా వీరప్పన్, ఇటువంటి వాళ్లను ఎవ్వరినీ కూడా చట్టానికి పట్టి ఇవ్వడానికి వీల్లేదని.. ఎల్లో మీడియా, ఎల్లో గజదొంగల ముఠా వాదనలు వినిపిస్తున్నాయి. ఆలోచన చేయండి. ఇలాంటి వ్యవస్ధలో మన యుద్ధం చేస్తున్నాం.

*బాబును సమర్ధించడమంటే....*
మరొక విషయం అందరికీ తెలియజేయాలి. ప్రజలకు మీరంతా చెప్పాల్సిన అవసరం ఉంది. మరొక విషయం ఏమిటంటే.. బాబును సమర్ధించడమంటే.. ఈ రాష్ట్రంలో ఉన్న పేద సామాజిక వర్గాలన్నింటినీ కూడా వ్యతిరేకించడమే అన్నది ప్రజల్లోకి తీసుకునిపోవాలి. బాబును సమర్ధించడం అంటే పేదవాడికి వ్యతిరేకంగా ఉండటమే అని ప్రజల్లోకి తీసుకుని పోవాలి.
బాబును సమర్ధించడం అంటే పెత్తందారీ వ్యవస్ధను, నయా జమీందారీ తనాన్ని సమర్ధించడమే అని ప్రజల్లోకి తీసుకునిపోవాలి.

బాబుని సమర్ధించడం అంటే పేద వర్గాల పిల్లలకు ఇంగ్లిషు మీడయం అందకుండా చేయడమే. బాబును సమర్ధించడం అంటే పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వటాన్ని వ్యతిరేకించడమే. డెమొగ్రాఫిక్‌ ఇంబేలన్స్‌ అంటూ వారు కోర్టులలో వేసిన దావాలను సమర్ధించినట్టే అవుతుందనేది కూడా ప్రజల్లోకి తీసుకునిపోవాలి.
బాబును సమర్ధించడమంటే.. కొన్ని వర్గాలు ఎప్పుడూ పేదలగానే మిగిలిపోవాలని, ఎప్పటికీ కూడా కూలీలుగానే మిగిలిపోవాలనే పెత్తందారీ భావజాలాన్ని సమర్ధించినట్టే. బాబును సమర్ధించడమంటే.. ఆయన మనస్తత్వం... ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా ? బీసీల తోకలను కత్తిరిస్తాను అనే ఆయన పెత్తందారీ భావజాలాన్ని సమర్ధించడమే. ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకునిపోవాలి. అర్ధం అయ్యేటట్టు ప్రజలందరికీ చెప్పాలి.

*ఇక పొత్తుల విషయానికొస్తే – నాలుగు సున్నాలు కలిస్తే సున్నాయే.*
మన ప్రతిపక్షాలన్నీ పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయి. ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. వారు ఎంత మంది వచ్చినా, కలిసినా.. రెండు సున్నాలు కలిస్తే... లేదా నాలుగు సున్నాలు కలిసినా... వచ్చే ఫలితం సున్నాయో.
ప్రజలకు వాళ్లు చేసిన మంచి ఒక పెద్ద సున్నా కాబట్టి. ఎన్ని సున్నాలు కలిసినా కూడా వచ్చేది ఒక పెద్ద సున్నా మాత్రమే.
వారు మంచి చేసే ఉంటే.. వారి మీద వారికే నమ్మకం ఉంటే.. 

ఒకరు పార్టీ పెట్టి 15 సంవత్సరాలు అయింది. ఇవాల్టికి  కూడా ప్రతి నియోజకవర్గంలోనూ అభ్యర్ధి లేడు. ప్రతి గ్రామంలోనూ జెండా మోసేందుకు మనిషి లేడు. ఆయన జీవతమంతా కూడా చంద్రబాబునాయుడు గారిని భుజానెత్తుకుని మోయడానికే 15 సంవత్సరాలు పట్టింది. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన చంద్రబాబు నాయుడు చేసిన మోసాలలోనూ, ఆయన దోచుకున్నదానిలోనూ పార్టనర్‌. కాబట్టి ఇద్దరూ కలిసి ప్రజలను ఎలా మోసం చేయాలన్నది ఆలోచిస్తారు కానీ, నిజంగా ప్రజలకు మంచి చేయాలి. నిజంగా ప్రతి గ్రామంలో మన జెండా ఎగరాలి. ప్రతి నియోజకవర్గంలో మన జెండా ఎగరాలి అన్న ఆలోచన చేసే మనస్తత్వం వీరెవ్వరికీ లేదు. 

*బిస్కెట్లు, చాక్‌లెట్స్‌ వేసినట్టు...*
దోచుకున్న దానిలో ఇంత ఈనాడుకు, ఇంత ఆంధ్రజ్యోతికి, టీవీకి ఇంత అని, ఇంత దత్తపుత్రుడికి భాగం పంచడమే. 
అందరూ దోచుకోవడం దాన్ని పంచుకోవడం.. పంచుకుని తినుకోవడం తప్ప.. రాజకీయం అంటే విశ్వసనీయత అని, రాజకీయం అంటే విలువలు అని, రాజకీయం అంటే చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో ఫోటో ఉండాలని ఆరాట పడటం అని, రాజకీయం అంటే ప్రతి పేదవాడు చిరునవ్వు నవ్వనప్పుడు ఆ చిరునవ్వులో మనం గుర్తుకు రావాలని ఆరాటపడటం అని వీరెవ్వరికీ లేదు.

వీళ్లకు తెలిసిన రాజకీయం అంటే.. సీట్లోకి రావడం అంటే దోచుకోవడం. దోచుకుంది పంచుకోవడం, పంచుకున్నది తినుకోవడమే. ఇది కాదు రాజకీయం. రాజకీయాలు అంటే ఆ మనిషి చనిపోయిన తర్వాత కూడా ప్రతి మనిషి గుండెల్లో బ్రతికుండడం.  రాజకీయం అంటే ప్రతి ఇంట్లో ఫోటో ఉండడం అన్నది మనకు తెలిసిన రాజకీయం. అందుకే మీ బిడ్డ ఇవాళ ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోడు.

*అబద్దాలు, మోసాలు నమ్మకండి...*
అందుకే మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడిని, మంచి చేసిన ప్రజలను మాత్రమే. అందుకే దేశ, రాష్ట్ర రాజకీయచరిత్రలో ఏ ఒక్క రాజకీయనాయకుడూ అనని మాటని మీ బిడ్డ అనగలుగుతున్నాడు. ప్రతి మీటింగ్‌లోనూ ప్రతి అక్కా, చెల్లెమ్మకు, ప్రతి అన్నాతమ్ముడికి చెప్పగలుగుతున్నాడు. అబద్దాలు నమ్మకండి. మోసాలు నమ్మకండి. మీ ఇంట్లో మంచి జరిగిఉంటే అది ఒక్కటే కొలమానంగా తీసుకొండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం.. నీ బిడ్డకు మీరే సైనికులు కండి అని పిలుపు ఇవ్వగలుగుతున్నాడు. రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా అడగలేని విషయాలు, అడగడానికి ధైర్యం లేని విషయాలను మీ బిడ్డ నేరుగా ప్రజలనుద్దేశించి చెప్పగలుగుతున్నాడు.

ఈ రోజు మన ధైర్యం మనం చేసిన మంచి. అది ప్రతి ఇంట్లో జరిగింది. ప్రతి గ్రామంలో జరిగింది. ప్రతి నియోజకవర్గంలో జరిగింది. అందుకే వై నాట్‌ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం. ఇవన్నీ గ్రామస్ధాయిలోకి తీసుకువెళ్లాలని మిమ్నల్నిందరినీ అభ్యర్ధిస్తున్నాను. గ్రామ స్ధాయిలో మన సచివాలయ కన్వీనర్లు, గృహసారధులు, వాలంటీర్లు, ఎంపీటీలు, సర్పంచులు, కేడర్, మనల్ని అభిమానించే ప్రతి ఒక్కరినీ సమాయత్తం చేయాలి. ప్రతి విషయం అందరికీ చెప్పాలి. ప్రతి గ్రామంలోనూ మన జెండా రెపరెపలాడే విధంగా చేస్తూ.. ప్రతి ఇంటినీ సందర్శిస్తూ... ప్రతి ఇంట్లో ఉన్న అక్కచెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ అడుగులు ముందుకు వేయించాల్సిన బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన మీ ఆందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఇక్కడికి రాలేకపోయిన, గ్రామస్ధాయిలో నిల్చిపోయిన ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, గ్రామస్ధాయిలో ఉన్న ప్రతి వ్యక్తికి, పార్టీ కేడర్‌ ఈ సందేశాన్ని మీరు వినాలని, గ్రామంలో ప్రతి ఒక్కరికీ చేరవేయాలని మనసారా ప్రార్ధిస్తూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.

 

Back to Top