మీ బిడ్డ కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు 

 
సామ‌ర్ల కోట బ‌హిరంగ స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారు. 

పేదవాడి బతుకులు మార్చాలన్న తాపత్రయంలో ప్రభుత్వం పనిచేస్తోంది. 

నవరత్నాల్లోని ప్రతీ పథకాన్ని బాధ్యతతో అమలు చేస్తున్నాం. 
 
సామర్లకోట లేఔట్లో వెయ్యికిపైగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 
 
 మన ప్రభుత్వంలో 35‍కు పైగా పథకాలు అమలవుతున్నాయి.  

పేదవాడికి చంద్రబాబు ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. 
 
తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు బాబు సెంటు స్థలం ఇవ్వలేదు. 

మన ప్రభుత్వం వచ్చాకే కుప్పంలో కూడా 20 వేల ఇళ్ల పట్టాలిచ్చాం. 

పేద అక్కచెల్లెమ్మలకు శాశ్వత చిరునామా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. 

రాష్ట్రంలో 87 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. 

కష్టమొచ్చినా నష్టమొచ్చినా నిలబడేవాడే నాయకుడు

చంద్రబాబు సొంతిళ్లు పక్క రాష్ట్రంలో ఉంది

వైయ‌స్ జగన్‌ పేరు చెబితే స్కీంలు.. చంద్రబాబు పేరు చెబితే స్కాంలు గుర్తుకు వస్తాయి

కాకినాడ:  మీ బిడ్డ క‌డుతున్న‌వి ఇళ్లు కాదు..ఊళ్ల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. మ‌నంద‌రి ప్ర‌భుత్వం వ‌చ్చాక ఇళ్లు లేని  31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించామ‌న్నారు. రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చామ‌ని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 17వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు.  రాష్ట్రంలో 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామ‌ని వెల్ల‌డించారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 14.33లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంద‌ని తెలిపారు. ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంద‌ని స‌గ‌ర్వంగా చెప్పారు. లక్షల విలువైన ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నామ‌ని సంతోషం వ్య‌క్తం చేశారు.  చంద్రబాబు కంటిన్యూగా నెలరోజులపాటు మన రాష్ట్రంలో ఉన్నారా?. చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి జైలు సెంట్రల్‌ జైలులో ఉన్నారు. చంద్రబాబు, లోకేష్‌, దత్తపుత్రుడు, బాలకృష్ణ ఎవరూ మన రాష్ట్రంలో ఉండరు. చంద్రబాబు సొంతిళ్లు పక్క రాష్ట్రంలో ఉంది. దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్‌. దత్తపుత్రుడి ఇల్లాలు మాత్రం మూడు నాలుగేళ్లకు మారుతుంద‌ని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ స్టార్‌కు భీమవరంతో, గాజువాకతో సంబంధం లేదు. ఎల్లో బ్యాచ్‌కు ప్రజల మీద ప్రేమలేదు. వీళ్లు కావాల్సింది కేవలం అధికారం. వీళ్లు కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం. హైదరాబాద్‌లో దోచుకున్నది పంచుకుంటారు. వీళ్లంతా మనతోనే చేసేది కేవలం వ్యాపారమే. తన అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకు అప్పుడప్పుడు వస్తుంటాడు ప్యాకేజీ స్టార్‌. సొంత పార్టీని, సొంతవర్గాన్ని అమ్ముకేనే ఓ వ్యాపారి పవన్ అని విమ‌ర్శించారు. వివాహ వ్యవస్థపై దత్తపుత్రుడికి గౌరవం లేదు. మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు వీరు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు కూడా అనలేరు.  సీఎం వైయ‌స్ జగన్‌ పేరు చెబితే స్కీంలు గుర్తుకువస్తాయి.. అదే చంద్రబాబు పేరు చెబితే స్కాంలు గుర్తుకు వస్తాయి. జగన​ పేరు చెబితే లంచాలు లేని డీబీటీ పాలన గుర్తుకు వస్తుంది..బాబు పేరు చెబితే గజదొంగల ముఠా, పెత్తందారి అహంకారం గుర్తొస్తుంద‌న్నారు. గురువారం సామర్లకోట లో ఏర్పాటు చేసిన సామూహిక గృహ ప్ర‌వేశాల కార్య‌క్ర‌మంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొన్నారు. అనంత‌రం  జూనియర్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు. 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే.. 

*పేదల సొంతింటి కలను నిజం చేస్తూ...*
పేదల సొంత ఇంటి కలను నిజం చేస్తూ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే.. బహుశా దేశంలోనే ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎన్నడూ చూడని విధంగా దేశంలో కూడా ఎప్పుడూ జరగని విధంగా చేశాం.  ఏకంగా రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు అంటే రాష్ట్ర జనాభాలో 20 శాతం పైచిలుకు ఉన్న ఇళ్లు లేని నిరుపేదల ముఖాల్లో చిరునవ్వులు చూడాలన్న తపన తాపత్రయ పడుతూ మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి మంచి చేశాం. నా పేద అక్కచెల్లెమ్మలకు దేవుడి దయతో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు... అక్కడ 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఆ ఇళ్ల నిర్మాణం కూడా వేగంగా జరుగుతుంది. 

*17వేల వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీలు– ఇళ్లు కాదు ఊళ్లు.*
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13వేల పంచాయితీలు ఉంటే.. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 17వేల వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీలు వస్తున్నాయి. కాసేపటి కింద ఇక్కడ కాలనీలలో ఇళ్లు చూసి...  ఇవి ఇళ్లు కాదు ఊళ్లు అని గర్వంగా చెపుతున్నాను. 
ఇంత భారీగా 31 లక్షల ఇళ్ల స్ధలాలిచ్చి.. అందులో 22 లక్షల ఇళ్లను కడుతూ.. ఇవాల్టికి 7.43లక్షల ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేసి... మీ అందరి సంతోషాల మధ్య మీ బిడ్డగా మీతో పంచుకోవడానికి సంతోషపడుతున్నాను. 

ఇవాళ కడుతున్న 7.43 లక్షల ఇళ్లకు సంబంధించి మన ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్ధలాలలోనే 5.85 లక్షల ఇళ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. 
టిడ్కో కింద మరో 1,57,566 ఇళ్లు పూర్తి చేశాం. ఈ రెండూ కలిపి 7.43 లక్షల ఇళ్లను ఇవాళ పూర్తి చేసుకున్నాం. 
మరో 14,33,000 ఇళ్లు నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా శరవేగంగా  జరుగుతోంది. ప్రతి పేదవాడి ముఖంలోనూ, అక్కచెల్లెమ్మల ముఖంలోనూ చిరునవ్వులు చూస్తున్నాం. దేవుడిని నేను ఇంతకన్నా ఏమడగగలను. దేవుడి నా చేత పేదింటి అక్కచెల్లెమ్మలకు ఇంత మంచి చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు  ఎల్లప్పుడూ దేవుడికి రుణపడి ఉంటాను.

ఇదే కాకినాడ జిల్లాలో సామర్లకోట ఇంటి స్థలాలకు సంబంధించి పేదల ఇళ్లు చూశాను. ఈ పక్కనే ఉన్న లే అవుట్‌లో ఇళ్లను చూసి.. అక్కడ  నాన్నగారి విగ్రహం ప్రారంభించి వస్తున్నప్పుడు అడిగాను. దొరబాబు ఇక్కడ ఇంటి స్థలం ఎంత ఉందని అడిగాను.  కేవలం ఇంటి స్థలం విలువ అక్షరాలా రూ. 12 లక్షలు పలుకుతోందని దొరబాబు చెప్పాడు. 
ఇక్కడే 54 ఎకరాల లేఅవుట్‌ లో 2,412 ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 1000కి పైగా ఇళ్లు ఇదే లే అవుట్లో పూర్తి అయిపోయి వాళ్లంతా గృహప్రవేశాలు చేశారు.
 

*పేదలపై ప్రేమ, బాధ్యతతో 35 కార్యక్రమాలు...*
ఒక్క ఇళ్ల పట్టాల విషయమే కాదు.. ఇళ్ల నిర్మాణం విషయమే కాదు, నవరత్నాల్లోని ఏ పథకం అమలు తీసుకున్నా, టీబీటీ, నాన్‌ డీబీటీ తీసుకున్నా, మనము ఇదే ప్రేమ, బాధ్యతతో అడుగులు వేశాం. అమ్మఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ పథకం, అవ్వాతాతలకు పెన్షన్‌ తీసుకున్నా, రైతు భరోసా కార్యక్రమం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 35 పై చిలుకు కార్యక్రమాలు రాష్ట్రంలో ఈరోజు మన ప్రభుత్వంలో... అమలు అవుతున్నాయి.
పేదవాడి మీద ప్రేమతో వారి జీవితాలు మారాలి, మార్చాలన్న తపన, తాపత్రయంతో 52 నెలలుగా అడుగులు వేస్తూ వస్తున్నాం. 

ఇంతకు ముందున్న ప్రభుత్వం ఏనాడైనా ఇలా పేదల మీద ప్రేమగానీ, బాధ్యత గానీ వాళ్లు చూపలేదు కాబట్టే మనం అధికారంలోకివచ్చేటప్పటికి 31 లక్షల కుటుంబాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటిమందికి పైగా సొంత ఇళ్లు లేని నిరుపేదలుగా మిగిలిపోయిన పరిస్థితి. అదే ప్రభుత్వం, అదే రాష్ట్రం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. ఇవాల 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్ధలాలు అక్కచెల్లెమ్మల పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేశాం. 

*రాక్షసులు యాగాలను భగ్నం చేసినట్లే...*
 బుుషులు, మునులు, దేవతలు మంచి కోసం యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి దుర్మార్గంగా కుట్రలు చేస్తారని విన్నాం. ఇలాగే మనందరిప్రభుత్వం పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తున్నప్పుడు.. అక్కచెల్లెమ్మలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నప్పుడు... ఇదే పెద్ద మనిషి చంద్రబాబు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదు, ఇళ్లు నిర్మించకూడదని ఏకంగా కోర్టులకు వెళ్లి కేసులు వేసి ఆపాలని చేసిన ప్రయత్నాలు ఎన్ని జరిగాయో మీకు తెలుసు. ఎన్ని అవరోధాలు వచ్చాయో మీకు తెలుసు.

*కోవిడ్‌ కష్టకాలంలోనూ...*
ఒకవైపు చంద్రబాబునాయుడు లాంటి దుర్మార్గులు కోర్టుకు వెళ్లి ఆపాలని ప్రయత్నం చేయడం, మరోవైపు మీ బిడ్డ ప్రభుత్వం రాగానే కోవిడ్‌ వచ్చి పడింది. ఆ  రెండు సంవత్సరాలు కోవిడ్‌ వచ్చినప్పుడు రాష్ట్రానికి రావాల్సిన వనరులు తగ్గిపోయాయి. రాష్ట్రం కోవిడ్‌ విషయంలో పెట్టవలిసిన ఖర్చు పెరిగిపోయింది. 
అయినా ఎక్కడా మీ బిడ్డ సాకులు చెప్పలేదు, కారణాలు చెప్పలేదు. 
మీ బిడ్డ కింద మీదా పడి, ఏదో ఒకటి చేశాడు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే పతన, తాపత్రయంతో అడుగులు వేశాడు. ఆ 31 లక్షల ఇళ్ల స్ధలాలులో 22 లక్షల ఇళ్లు వేగంగా నిర్మాణంలో ఉంటూ.. 7.43 లక్షల ఇళ్లు పూర్తయిన పరిస్థితుల మధ్య ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకునేందుకు ఇక్కడికి వచ్చాను.
నా అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాల కోసం .. ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో 72 వేల ఎకరాలు సేకరించి. 30.75 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. 
ఈ ఇళ్లపట్టాల మార్కెట్‌ విలువ చూస్తే.. .ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కో ఇంటి స్థలం విలువ కనీసం రూ. 2.5 లక్షలతో మొదలు రూ. 12 లక్షలు, రూ.15 లక్షల వరకు కనిపిస్తోంది. 
కనీసం రూ.2.50 లక్షలు అనుకున్నా ...31 లక్షల ఇళ్ల పట్టాల విలువ రూ. 75 వేల కోట్లు నా అక్కచెల్లెమ్మల పేర్లతో కేవలం ఇంటి స్థలాల రూపంలోనే ఇవ్వగలిగాం. ఇళ్లపట్టాలు ఇవ్వడమే కాదు, ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంత అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటాను.

*ఇళ్ల నిర్మాణంలోనూ తోడుగా...*
ఇళ్లపట్టాలివ్వడంతో పాటు ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇవాళ రాష్ట్రంలో 21.76 లక్షల ఇళ్లు ఈరోజు వేగంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.  ప్రతి పేదవాడికీ ఇచ్చే ఇంటి కట్టడానికి అయ్యే ఖర్చు రూ. 2.70 లక్షలు. ఇందులో రూ.1.80 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇస్తూ.. మరో రూ.35వేలు అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీకే రుణాలు వచ్చేటట్టు చేశాం. 
ఆ తర్వాత ప్రతి అక్కచెల్లెమ్మకూ మంచి జరగాలని ఇంటి నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నాం. దాని విలువ మరో రూ.15 వేలు. సిమెంట్, మెటల్‌ ప్రేమ్స్, స్టీల్‌ తదితర నిర్మాణసామాగ్రి అంతా కూడా ధర తగ్గించి అమ్మడం వలన ప్రతి అక్కచెల్లెమ్మకు జరుగుతున్న మేలు మరో రూ.40వేలు. 
మొత్తం కలిపి ఒక్కో ఇంటికి రూ.2.75 లక్షలు ఖర్చువుతుంది. 

ప్రతి అక్కచెల్లెమ్మకూ మంచి జరగాలని... ఇంటి స్ధలం, ఇళ్లు కట్టించి ఇవ్వడంతో పాటు  ఆ కాలనీల మధ్య డ్రెయినేజీ, నీటి సరఫరా, కరెంటు సరఫరా కోసం  మరో 32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. 

*మనది మనసున్న ప్రభుత్వం...*
ఇంతకుముందు జరగనిది, ఈరోజు ఎందుకు జరుగుతోందంటే కారణం కేవలం ముఖ్యమంత్రి మారాడు. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రికి ఈనాడు ఉన్న ముఖ్యమంత్రికి తేడా...  నేడు ఉన్న ముఖ్యమంత్రికి మనసు ఉంది, మీ పట్ల అభిమానం, బాధ్యత ఉంది. ఇదొక్కటే గత ప్రభుత్వానికి, మీ బిడ్డకు ఉన్న తేడా. 
అలాంటి మనసున్న ప్రభుత్వం మనందరి ప్రభుత్వం కాబట్టే.. ప్రతి అక్కచెల్లెమ్మకూ ఒక శాశ్వత చిరునామా ఉండాలని.. ఆ శాశ్వత చిరునామా అంటే ఏమిటన్న విలువ తెలిసిన ప్రభుత్వంగా నా పాదయాత్రలో ప్రతి గ్రామంలోనూ ఎక్కడైతే నేను వాళ్ల కష్టాలన్నీ చూశానో.. ఆ ప్రతి కష్టానికీ పరిష్కారం ఇస్తూ.. ఈ 52 నెలల పరిపాలన సాగింది. 

ఒకవైపున నా పేదింట అక్కచెల్లెమ్మలకు మంచి చేసేందుకు తపన తాపత్రయపడుతూ మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తుంటే.. ఇలాంటి మనసు గత పాలకులుకు ఉండదు. వారిపాలనలో కనిపించదు. గతంలో 2014–19 మధ్య చంద్రబాబు పాలన చూస్తే పేదవాడికి ఒక్కటంటే ఒక్క సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. తేడా గమనించండి.

*కుప్పంలోనూ పేదలకు సెంటు స్ధలం ఇవ్వని బాబు*
ఆ పెద్ద మనిషి చంద్రబాబుకు వేల కోట్ల రూపాయల సంపద ఉంది కానీ, తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు ఆయన ఒక్క సెంటు కూడా స్థలం ఇవ్వలేదు. 
చివరికి  కుప్పంలో కూడా దాదాపుగా 20 వేల ఇళ్ల పట్టాలు, 8 వేల ఇళ్ల నిర్మాణాలు ఈరోజు జరిగాయి అంటే అది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే. ఆ పెద్ద మనిషి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశాడు. 35 ఏళ్లుగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు. 3 సార్లు సీఎంగా చేశాడు.  పేద వాడి గడపకు మంచి జరిగింది అంటే అది కూడా కేవలం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. 

ఈ రోజు ఈ పెద్ద మనిషి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 35ఏళ్లుగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు. 3 సార్లు సీఎంగా చేశాడు. అయినా కూడా రాష్ట్ర ప్రజల మీదగానీ, రాష్ట్రం మీదగానీ, చివరికి కుప్పం మీద గానీ అభిమానం లేదు. అనురాగం లేదు. బాధ్యత లేదు. అక్కడ పేదవాడి ముఖంలో చిరునవ్వు లేదు. అది జరిగింది ఎప్పుడంటే.. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరిగింది.

*కుప్పంలో సొంతిళ్లు కూడా లేని చంద్రబాబు..*
మూడుసార్లు, 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 35 సంవత్సరాలు కుప్పానికి ఎమ్మెల్యే అయిన ఈపెద్ద మనిషి రాష్ట్రంలో కానీ, కుప్పంలో కానీ ఇళ్లు కూడా కట్టుకున్న పరిస్థితి లేదు. చంద్రబాబు గారి ఇళ్లు పక్క రాష్ట్రం హైదరాబాద్‌ లో కనిపిస్తుంది.  అది ఈ రాష్ట్రంతో పెద్దమనిషికి ఉన్న అనుబంధం. ఇది ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఈ పెద్దమనిషికి ఉన్న అనుబంధం. 

గత ఐదేళ్లలో మీరే చూశారు. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చి 52 నెలలు అవుతుంది. ఈ 52 నెలల్లో  చంద్రబాబు అనే వ్యక్తి కంటిన్యూస్‌ గా ఒక నెల అయినా ఎప్పుడైనా మన రాష్ట్రంలో కనిపించాడా? 
కేవలం ఇప్పుడు రాజమండ్రిలో కనిపిస్తున్నాడు. ఇంతకు ముందెప్పుడూ కనిపించలేదు. 

*బాబు అండ్‌ కోకు రాష్ట్రంపై ప్రేమలేదు....*
రాష్ట్ర ప్రజలంతా ఆలోచన చేయాలని అడుగుతున్నా, విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయనకు గానీ, ఆయన్ను సమర్థించేవారికి గానీ, వీళ్లెవరికైనా మన రాష్ట్రం మీద ప్రేమ ఉందా? వీళ్లెవరూ మన రాష్ట్రంలో ఉండరు. 
ఆయన ఉండడు, ఆయన పార్టనర్‌ దత్తపుత్రుడూ ఉండడు. ఆయన కొడుకు ఉండడు, ఆయన బావమరిదీ ఉండడు. 
ఆయన గజదొంగల ముఠాలో పార్టనర్స్‌ అయిన ఈనాడు రామోజీరావు ఉండడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 నాయుడు ఉండడు. 
వీళ్లెవరూ మన రాష్ట్రంలో ఉండరు. వీరికి మన ఆంధ్రరాష్ట్రం, ప్రజలు ఎందుకు కావాలి ? అంటే ఆంధ్రరాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది హైదరాబాద్‌ లో పంచుకొవడానికే. 
 ఇదీ వీరికి ఆంధ్రరాష్ట్రం మీద ఉన్న ప్రేమ. 
ఇవన్నీ కూడా నిజాలు అవునా కాదా? అన్నది ఆలోచన చేయాలని కోరుతున్నా. 

*ఇదీ బాబు దత్తపుత్రుడి స్టోరీ....*
బాబు దత్తపుత్రుడి స్టోరీ మీ అందరికీ తెలిసిందే.  శాశ్వతంగా దత్తపుత్రుడి ఇళ్లు హైదరాబాద్‌లోనే.  కానీ ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడు సంవత్సరాలకు, నాలుగు సంవత్సరాలకు మారిపోతుంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్‌. మరి తర్వాత ఎక్కడికి పోతాడో?  ఆడవాళ్లన్నా, పెళ్లిళ్ల వ్యవస్థ అన్నా ఈ పెద్దమనిషికి ఉన్న గౌరవం ఏంటనేది ఆలోచన చేయాలి.  మన ఇళ్లలో మన అక్కచెల్లెమ్మలను మనం గౌరవించలేకపోతే, మూడేళ్లకు, నాలుగేళ్లకు ఇళ్లాళ్లను మారుస్తుంటే, ఆడవాళ్లపై ఇటువంటి చులకన భావం చూపిస్తుంటే ఎలాంటి పాలకులం మనం? ఎలాంటి నాయకులం మనం అన్నది ఆలోచన చేయాలి.

*హోల్‌సేల్‌గా ఓట్లు అమ్ముకునే ప్యాకేజీ స్టార్‌...*
ఈ ప్యాకేజీ స్టార్‌.. మన రాష్ట్రం విషయంలో కూడా అంతే. ఈ అతను పోటీ చేసి ఓడిపోయిన భీమవరంలోనూ సంబంధం లేదు, గాజువాకతో కూడా అనుబంధం లేదు.  కేవలం ఈ నియోజకవర్గాలు తనకు ఒక పనిముట్లుగా మాత్రమే వాటిని చూస్తాడు, యూజ్‌ అండ్‌ త్రోగానే భావిస్తాడు. 
ఈ రోజు ఇక్కడికి ఈ పెద్దమనిషి తన అభిమానుల ఓట్లు హోల్‌ సేల్‌ గా అమ్ముకునేందుకు మాత్రమే అప్పుడప్పుడూ వస్తుంటాడు, పోతుంటాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సరుకును అమ్ముకునే వాళ్లను చూశాం, సరంజామా అమ్ముకునే వాళ్లను చూశాం.  కానీ, సొంత పార్టీని, సొంత వర్గాన్ని వేరే వారికి అమ్ముకునే వ్యాపారిని మాత్రం ఇక్కడే ఈ పెద్ద మనిషి రూపంలో చూస్తున్నాం. 

*దోపిడీ కోసమే వీళ్లకి అధికారం....*
 రెండు షూటింగ్‌ ల మధ్య విరామంలో అప్పుడో, ఎప్పుడో ఒక్కసారి ఇక్కడికి వచ్చి పోతాడు. ఇలాంటి వ్యాపారం చేసే ఈ వ్యక్తికి, విలువలు లేని ఈ వ్యక్తికి, మన రాష్ట్రమైనా, మన ప్రజలైనా, మన కాపులైనా ఇలాంటి వ్యక్తికి ఏమి ప్రేమ, ఆప్యాయత ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. 
వీరందరిదీ ఒక్కటే మనస్తత్వం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదవాడికి మంచి జరగాలని కాదు. వీళ్లకు అధికారం కావాల్సింది... కేవలం దోచుకోవడానికి, దాన్ని హైదరాబాద్‌ లో పంచుకోవడానికి మాత్రమే కావాలి. మన రాష్ట్రంలోని లేని, రాష్ట్రంపై ప్రేమలేని ఇలాంటి మహానుభావులంతా అనుక్షణం ఆంధ్రప్రదేశ్‌ గురించి మాట్లాడుతారు.  బాబుకు ఇక్కడి ప్రజలు అధికారం ఇవ్వలేదని వీళ్లంతా కోపంతో ఊగిపోతుంటారు. బాబుకు అధికారం పోయేసరికే వీళ్లందరికీ ఫ్యూజులు పోతాయి. ఎందుకంటే  ఆదాయాలు పోతాయి కాబట్టి ఫ్యూజులు పోతాయి. 

మన మట్టితోగానీ, మనుషులతో గానీ, రాష్ట్రంతో గానీ ఏ రకమైన బంధం, అనుబంధం ఈ మనుషులకు లేదు. వీళ్లంతా మనతో చేసేది కేవలం వ్యాపారం మాత్రమే.  మన ఎస్సీలను నా ఎస్సీలు అని కూడా వీళ్లు చెప్పుకోలేరు.  మన బీసీలను నా బీసీలు అని, మన మైనార్టీలను నా మైనార్టీలు అని కూడా వీళ్లు చెప్పుకోలేరు. 
కాపులను కూడా నా కాపులు అని కూడా వీళ్లు చెప్పుకోలేరు. మన పేదవాడిని నా పేద వాడు అని చెప్పుకోలేరు.

ప్రేమ, అభిమానం, బాధ్యత వీళ్లు చూపించలేరు. పైపెచ్చు ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అవహేళన చేస్తారు.
బీసీలను తోకలు కత్తిరిస్తా కబడ్దార్‌ అంటారు. పేదలకు ఇంగ్లీష్‌ మీడియం వద్దంటారు. పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టుల్లో కేసులు వేస్తారు.  రైతులను ఓన్‌ చేసుకోలేరు. మన పిల్లల భవిష్యత్‌ గురించి ఆలోచన చేయలేరు. మన అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతల గురించి వీరికి పట్టనే పట్టదు. వీరి మనిషి సీఎంగా లేకపోతే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎంత మంచి చేసినా మంటలు పెట్టి చలికాచుకోవాలనుకుంటారు. 

అదే వారి మనిషి ముఖ్యమంత్రిగా ఉంటే ఎంతటి అన్యాయాలు, దుర్మార్గాలు చేస్తున్నా వీళ్లంతా ఏకమై సమర్థిస్థారు. మసిపూసి మారేడుకాయ చేస్తారు. మన రాష్ట్రంలో లేని వీరందికీ, మన రాష్ట్రంపై మమకారం లేని వీరందరికీ ఉన్నది ఏమిటంటే.. ఒక అరడజను టీవీ చానళ్లు, రెండు పేపర్లు, ఎల్లో సోషల్‌ మీడియా. 
వీరికి అదనపు సపోర్టు.. ఒక దత్తపుత్రుడు. ఇలాంటి రాజకీయాలు మనం సమర్థించవచ్చా? ఆలోచన చేయమని కోరుతున్నాను.  రాజకీయాలంటే విలువలు, విశ్వసనీయత ఉండాలి. చనిపోయిన తర్వాత కూడా బ్రతకాలని తపన, తాపత్రయంతో అడుగులు వేయడం. దీన్నే రాజకీయం అని అంటారు. 

చెప్పాడంటే చేస్తాడని తను చెప్పేదే మాట. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా తాను నిలబడతాడనే వాడే రాజకీయ నాయకుడు. 
అటువంటి విలువలు, విశ్వసనీయత వీరికి ఉన్నాయా? ఆలోచన చేయండి. 

*మరోవంక మనందరి ప్రభుత్వంలో...*
ఈ 52 నెలల్లోనే ఏం చేసిందో ఎక్కడికి పోయినా కనిపిస్తుంది. ఏ పేదవాడి గడపలో అడిగినా చిక్కటి చిరునవ్వుల మధ్య పేదవాడి గొంతులో వినిపిస్తుంది. 
మేనిఫెస్టో అంటే చెత్త బుట్టలో పడేసే ప్రణాళిక కాదు, మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌ అని కొత్త అర్థం చెప్పి 99 శాతం వాగ్దానాలను మీ బిడ్డ ప్రభుత్వం నిలబెట్టుకుంది.

ఇవాళ రాష్ట్రంలో  87 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలను ఎలాంటి లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు, అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయి. ఇలాంటి విప్లవాత్మక మార్పు ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వంలో కనిపిస్తుంది.  ఇంటింటికీ ప్రతి నెలా ఒకటో తారీఖున సెలవైనా, పండగ రోజైనా సూర్యోదయం కాకమనుపే.. చిక్కటి చిరునవ్వుతో తలుపులు కొట్టి గుడ్‌మార్నింగ్‌ అక్కా, చెల్లెమ్మా, అవ్వా అంటూ వాలంటీర్లు నేరుగా వచ్చి మేలు చేసే పాలన కనిపిస్తుంది. ఇంటి ముంగిటకే వస్తున్న రేషన్‌ కనిపిస్తుంది. రేషన్‌ కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు.  52 నెలల మీ బిడ్డ పాలనలో ఈ మార్పు కనిపిస్తోంది. ఇంటి వద్దకే బర్త్‌ సర్టిఫికెట్లు, క్యాస్ట్‌ సర్టిఫికెట్లు, ఇన్‌ కమ్‌ సర్టిఫికెట్లు, మీ గడపకే వచ్చి ఇస్తున్న పాలన కనిపిస్తుంది. 

*మన పాలన – మారిన గ్రామ స్వరూపాలు....*
మీ బిడ్డ పాలనలో గ్రామాలు మారాయి. స్వరూపాలు మరాయి. గ్రామాల్లో పరిపాలన మారింది. సంక్షేమ పథకాలు వివక్ష లేకుండా, లంచాలు లేకుండా మా ఇంటికే వస్తాయని ఎవరైనా అనుకున్నారా ?  

గ్రామాలలో విప్లవం కనిపిస్తోంది. మన కళ్లెదుటనే గ్రామాల్లో రైతన్నను చేయి పట్టుకొని నడిపించే ఆర్బీకేలు వచ్చాయి. ఈ రోజు మన గ్రామాలలో వాలంటీర్లు కనిపిస్తారు. సచివాలయ వ్యవస్థ కనిపిస్తుంది. లంచాలు లేని వ్యవస్థ మన గ్రామంలోనే మీ కళ్ల ఎదుటనే కనిపిస్తోంది. మెరుగైన పాలన కనిపిస్తుంది. 

*విద్యారంగంలో...* 
నాడు–నేడు ద్వారా విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయి.  మన బడులన్నీ ఇంగ్లీష్‌ మీడియం బడులయ్యాయి. మన బడులలో డిజిటల్‌ బోధన 6వతరగతి నుంచి ప్రతి క్లాస్‌రూంలో మన గ్రామంలో కనిపిస్తున్నాయి. 8వతరగతి నుంచి పిల్లలకు ట్యాబులు అందుతున్నాయి. ఇంగ్లిషు మీడియం, బైజూస్‌ కంటెంట్, బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ మన పిల్లలను  చదవిస్తూ.. తల్లులు బడికి పంపితే చాలు అమ్మ ఒడి ఇస్తూ పిల్లల చదువులు ప్రోత్సహించే మార్పు కనిపిస్తుంది. ప్రతిరోజూ మారుతున్న మెనూతో గోరుముద్ద కనిపిస్తోంది. 
విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన కనిపిస్తుంది. ఇలా మన గ్రామంలోనే ఉన్న మన పేద కుటుంబాలకు చదువు అన్నది మన కళ్ల ఎదుటే గొప్ప మార్పు జరిగి కనిపిస్తోంది. 

*వైద్యరంగం తీసుకున్నా...* 
గ్రామంలో నాలుగు అడుగులు వేస్తే విలేజ్‌ క్లినిక్‌ కనిపిస్తుంది.  రాష్ట్రంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ రంగంలో 11 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉంటే..  ఈరోజు మరో 17 మెడికల్‌ కాలేజీలు కడుతున్నాం. 
కొత్తగా 104, 108 వాహనాలు కనిపిస్తాయి. ఆరోగ్యశ్రీ పరిథి గతంలో 1000 రోగాలకు ఉంటే ఇప్పుడు 3,300 పైచిలుకు రోగాలకు విస్తరించింది. 
ఆపరేషన్‌ తర్వాత ఆ పేదవాడు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలంటే..  రెస్టు పీరియడ్‌ లో కూడా ఆ  పేదవాడు ఇబ్బంది పడకుండా ఉండేందుకు...నెలకు రూ.5 వేల చొప్పున ఆరోగ్య ఆసరా కూడా ఇస్తూ పంపుతున్నాం. 
ఇవాల గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కనిపిస్తోంది. నా పేదవాడు ఆరోగ్యం కోసం, మందుల కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని... పేదవాడిని చేయిపట్టుకుని నడిపించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ ఇవాళ ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో ప్రతి ఇంటికీ వచ్చి పేదవాడికి తోడుగా నిలబడుతోంది. పేదల ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా 52 నెలల కాలంలో మన కళ్ల ఎదుటనే మన గ్రామంలోనే ఈ మార్పు కనిపిస్తోంది. 

ప్రతి రైతన్నకు, అక్కచెల్లెమ్మకు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకున్న ప్రభుత్వం మీ కళ్లెదుటనే కనిపిస్తోంది.  రైతు భరోసా, అమ్మ ఒడి, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, అవ్వా తాతల పింఛన్‌ ఇలా ప్రతి పథకాన్నీ తీసుకురావడమే కాదు, మనసా వాచా కర్మణా ఆ ప్రతి పథకాన్ని, ప్రతి గడపకూ చేర్చడానికి తపన, తాపత్రయంతో అడుగులు పడుతున్నాయి. 

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రం మొత్తమ్మీద 4 లక్షలు ఉంటే, మీ బిడ్డ నాలుగేళ్ల పాలనలో మరో 2.07 లక్షల ఉద్యోగాలిచ్చాం. ఇందులో 80 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. ఇవాళ రాష్ట్ర కేబినెట్‌ లో 67 శాతం మంత్రుల వరకు సామాజిక న్యాయం కనిపిస్తుంది. 
అక్కచెల్లెమ్మలకు ధైర్యంగా ఇంటికి వెళ్లడానికి ప్రతి ఒక్కరి ఫోన్‌లలో దిశ యాప్‌ కనపిస్తోంది. దిశ యాప్‌ వల్ల 30,367 మంది ఆపదలో ఉన్న అక్కచెల్లెమ్మలను పోలీస్‌ సోదరులు వచ్చి రక్షించిన పరిస్థితులు చూశాం. 1.24 కోట్ల ఫోన్‌లలో దిశయాప్‌ డౌన్లోడ్‌ అయి ప్రతి అడుగులోనూ వారికి తోడుగా నిలబడుతుంది.గతంలో ఇవన్నీ జరిగాయా అన్నది ఆలోచన చేయండి. 

నాలుగేళ్లలో రూ. 2.38 లక్షల కోట్లు డీబీటీ...
నాలుగేళ్లలో రూ. 2.38 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కిగానే.. నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయి. ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్‌ అయినా  మరి ఇంతకు ముందు ఎందుకు చంద్రబాబు హయాంలో ఎందుకు జరలేదు? అప్పులు కూడా చూస్తే.. అప్పులు గ్రోత్‌ రేట్, అప్పటి కన్నా మీ బిడ్డ హయాంలో తక్కువే. మరి అలాంటప్పుడు మీ బిడ్డ రూ.2.38 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలా పంపించగలిగాడు. గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పాలనలో ఈ 2.38 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయిందో ఆలోచన చేయండి ?. 
మార్పు జరిగిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. కానీ ఈరోజు ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. ఇవాల ఎక్కడా లంచాలు అడిగే పరిస్థితి, వివక్ష చూపించే పరిస్థితి కానీ లేదు. ఈరోజు అర్హత ఉంటే చాలు, ఆ వ్యక్తి జగన్‌కు ఓటు వేసినా, వేయకపోయినా నేరుగా ఆ పథకానికి సంబంధించిన సొమ్ము జమ అవుతుంది. నా అక్కచెల్లెమ్మల ముఖంలో కేవలం చిరునవ్వులు చూడాలని తపన, తాపత్రయంతో ఈ రోజు అడుగులు పడుతున్నాయి. ఇవన్నీ ఆలోచన చేయాలని కోరుతున్నాను. గతంలో జరగని మార్పులు ఇవాల జరుగుతున్నాయి. 

*బాబు ముఖం చూస్తే స్కాములు గుర్తొస్తాయి...*
ఇంతకముందు చంద్రబాబునాయుడు ఇక్కడే.. జగన్‌ ముఖం  చూసి ఎవరైనా ఓట్లు వేస్తారా అని అన్నాడని దొరబాబు అన్నారు. నిజమే చంద్రబాబు నాయుడు గారి ముఖం చూస్తే...స్కాములు గుర్తుకొస్తాయి. జగన్‌ ముఖం చూస్తే స్కీములు గుర్తుకొస్తాయి. 
చంద్రబాబు నాయుడు గారి ముఖం చూస్తే లంచాలు, జన్మభూమి కమిటీలు, పంచుకున్న గజదొంగల ముఠా, వెన్నుపోట్లు, పెత్తందారీ అహంకారం గుర్తుకొస్తుంది. కానీ  మీ జగన్‌ ముఖం చూస్తే మాత్రం చిక్కటి చిరునవ్వు కనిపిస్తుంది. లంచాలు లేని డీబీటీ పాలన, నేరుగా బటన్‌ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లే పాలన కనిపిస్తుంది. 
మేనిఫెస్టో  అన్నది భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ గా భావించి 99 శాతం వాగ్దానాలు నిలబెట్టుకున్న ప్రభుత్వం గుర్తుకు గుర్తుకొస్తుంది. జగన్‌ ముఖం చూసినప్పుడు, చంద్రబాబు ముఖం చూసినప్పుడు ఇదీ తేడా అన్నది గజదొంగల ముఠా అందరికీ చెబుతున్నాను. 

మీ బిడ్డగా నేను ఒక విషయం గర్వంగా చెబుతున్నాను. మీ బిడ్డకు వీళ్ల మాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తోడుగా ఉండకపోవచ్చు. దత్తపుత్రుడి అండ లేకపోవచ్చు. కానీ  మీ బిడ్డ వీళ్లను నమ్ముకోలేదు. మీ బిడ్డ అడిగేది ఒక్కటే ?  మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా? లేదా ? అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి.  మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీరే సైనికులుగా నిలబడండి. మీ బిడ్డ నమ్ముకున్నది ఈ పొత్తుల్ని కాదు, ఈ గజదొంగల ముఠాని, దత్తపుత్రుడిని కాదు.
మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, కింద ఉన్న మిమ్మల్ని తప్ప ఇంకొకర్ని నమ్ముకోలేదు. చేసిన మంచినే నమ్మాడు. అలా మంచి చేసిన ఆత్మవిశ్వాసంతో మీ బిడ్డ అడుగులు వేస్తున్నాడు.

నా పక్కనే నా తమ్ముడు దొరబాబు ఉన్నాడు. రేపు మీరందరూ ఆశీర్వదిస్తే నా తమ్ముడు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా వస్తాడు. ఇతను గురించి నేను ఎందుకు చెప్పానంటే... నేను ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ రాష్ట్రం కోసం నేను ఎంతగా తపించానో.. ఈ నియోజకవర్గం కోసం దొరబాబు కూడా అంతే తపించాడు. ఈ నియోజకవర్గాన్ని వదిలపెట్టలేదు. ఇదే నియోజకవర్గంలో నిలబడ్డాడు. ప్రతి మనిషికి దగ్గరయ్యాడు. ప్రతి గుండెకు దగ్గరయ్యాడు. లీడర్‌ అంటే ఈ మాదిరిగా ఉండొచ్చని చూపించాడు. ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేసి.. గాజువాకలో పోటీ చేసి.. ఆ తర్వాత భీమవరం, గాజువాక అడ్రస్‌ మర్చిపోయిన కొంతమంది నాయకులు, దత్తపుత్రుడి వంటి æ వాడు కాదు ఈ దొరబాబు. నిజమైన లీడర్‌. తాను ఈ నియోజవర్గం అభివృద్ధి గురించి తాను అడిగాడు.
గడపగడపకూ ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు నిధులు కేటాయించాం. గడపగడపకూ తిరగమని చెప్పాను. ఆ రూ.20 లక్షలు ఖర్చు చేసి, ఆ సచివాలయం పరిధిలో మంచి చేయమని చెప్పాను. ఇంకోసారి తిరగమన్నాను. మరోసారి రూ.20 లక్షలు ఇస్తామని చెప్పాను. అదే విధంగా పెద్దాపురం మండలంలో కాండ్రకోట, తూర్పుపాకలు  హైలెవల్‌ బ్రిడ్జి కావాలని, దానికి రూ.4 కోట్లు ఖర్చవుతుందన్నాడు. అది మంజూరు చేస్తున్నాను. అదే విధంగా కాండ్రకోట గ్రామం పరిధిలో డ్రాప్‌ కమ్‌ బెడ్‌ రెగ్యులేటర్‌ను పునర్నిర్మాణం కోసం మరో రూ.6 కోట్లు అవుతుందన్నాడు. అది కూడా మంజూరు చేస్తున్నాను. అదేవిధంగా సామర్లకోట జూనియర్‌ కాలేజిని డిగ్రీ కాలేజీగా మార్చేందుకు రూ.18 కోట్లు ఖర్చు అవుతుందన్నాడు. అది కూడా మంజూరు చేస్తున్నాను. మీ అందరికీ మంచి జరగాలని, దేవుడు ఆశీర్వదించాలని, ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం తన ప్రసంగం ముగించారు.

Back to Top