రాజమండ్రి: ప్రతి అడుగులోనూ మా ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుంది. ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొట్టమొదటి కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్‌లో లాండ్ ఆర్డర్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తామని, మహిళలపై నేరాలు జరిగితే ఉపేక్షించబోమని, అక్కచెల్లెమ్మలకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పాను. చెప్పిన మాట ప్రకారం.. అక్కచెల్లెమ్మలు, చిన్నారులకు అండగా దేశంలోనే తొలిసారిగా దిశ చట్టాన్ని తీసుకువచ్చినందుకు గర్వంగా ఉందని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించడం గర్వంగా ఉందని, చరిత్రలో ఈ రోజు నిలిచిపోతుందన్నారు. నన్నయ్య యూనివర్సిటీలో దిశ చట్టంపై సెమినార్‌లో సీఎం వైయస్ జగన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘1349 పోలీస్ స్టేషన్స్, వన్‌స్టాప్ సెంటర్ల నుంచి రిలేటెడ్ దిశకు కనెక్ట్ అయ్యిన స్టేషన్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చూస్తున్న పోలీస్ అక్కచెల్లెమ్మలు, సోదరులకు హృదయపూర్వక అభినందనలు. ఎవరూ కూడా బహుశా మర్చిపోలేని రోజు ఇదొకటి. చరిత్రలో ఈ రోజు నిలిచిపోతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొట్టమొదట కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్ జరిగిన రోజున నేను మాట్లాడిన మాటలు నాకు బాగా గుర్తున్నాయి. లాండ్ ఆర్డర్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తామని, మహిళలపై నేరాలు జరిగితే ఉపేక్షించబోమని, అక్కచెల్లెమ్మలకు అందరికీ అండగా ఉంటామని చెప్పడం జరిగింది. నేరాలను ఎవరు చేయడానికి సాహసించినా నిర్దాక్షణ్యంగా చట్టాన్ని ప్రయోగించాలి. అని చెప్పడానికి దేశంలోనే తొలిసారిగా దిశ చట్టాన్ని తీసుకువచ్చాం. ఈ రోజు రాష్ట్రంలో మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్‌ను ఇక్కడ రాజమండ్రిలో ప్రారంభించినందుకు గర్వపడుతున్నా.. ఈ చట్టం దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం. హైదరాబాద్‌లో ఒక చెల్లెమ్మ.. డాక్టర్ ప్రియాంక టోల్ గేట్ వద్ద నుంచి రాత్రిపూట వెళ్తున్నప్పుడు ఆమెపై ఘటన జరిగింది. ఒక చెల్లెమ్మ రాత్రిపూట ప్రయాణం చేయలేని పరిస్థితుల్లో ఈ వ్యవస్థ ఉందని చెప్పడానికి దిశ ఘటన నిదర్శనం. దిశ ఘటన దేశమంతా చర్చణీయాంశం అయ్యింది. మన రాష్ట్రంలో కూడా చిన్న చిన్న పిల్లలను కూడా వదలకుండా ఘటనలు జరుగుతున్న పరిస్థితులను మన సమాజంలో చూస్తున్నాం. మనషులు రాక్షసులు కావడం మన కళ్ల ఎదుట కనిపిస్తుంది. నలుగురు కలిసి తాగినప్పుడు మనుషులు రాక్షసులు అవుతున్నారు. నలుగురు కలిసి తాగి రాక్షసులుగా మారి ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లోకి సమాజం వెళ్లిపోతుంది. ఇలాంటి వాళ్లను ఏం చేసినా తప్పులేదని అందరికీ అనిపిస్తుంటుంది. సినిమాల్లో అయితే ఇటువంటి ఘటనలు జరిగితే హీరో నేరస్తులను కాల్చేస్తాడు.. మనం చప్పట్లు కొడతాం. ఎన్‌కౌంటర్ తప్పుకాదని సినిమాలు చూసినప్పుడు మనకు సంతోషం అనిపిస్తుంది. కానీ, చట్టాలు మాత్రం శాంతిభద్రతల విషయం ఆ స్వేచ్ఛను మనకు ఇవ్వవు. మరోవైపు జరిగిన ఘటన చూస్తే విపరీతమైన కోపం వస్తుంది. న్యాయం జరగడం ఆలస్యం అవుతుంది. ఇటువంటి పరిస్థితులు ఎదురుపడుతుంటే మనస్సుకు బాధ కలుగుతుంది. చట్టాలపై మనకు ఉన్న గౌరవం పోతుంది. ఈ పరిస్థితులను పూర్తిగా మార్చేందుకు దిశ చట్టాన్ని తీసుకువచ్చాం. చట్టం పరిధిలోనే న్యాయం జరగాలి.. ఆ న్యాయం త్వరితగతిన అందాలి.. వెంటనే శిక్షలు పడినప్పుడు వ్యవస్థలోకి భయం వస్తుంది. నిర్భయ చట్టం కూడా ఆ రోజుల్లో ప్రేరేపించింది జ్యోతి సింగ్ అనే చెల్లెమ్మ ఘటన. నిర్భయ కేసు ఎనిమిది సంవత్సరాలు కావొస్తుంది. ఇంత వరకు ఆ నిర్భయ ఘటనలో నిందితులకు శిక్షపడని పరిస్థితి. పోలీస్ దర్యాప్తుకు, కోర్టు విచారణకు సంవత్సరాల తరబడి సమయం పడుతుంటే నేరాలు పెరిగే పరిస్థితికి దారితీస్తుంది. మన రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు గమనిస్తే 2014లో దాదాపుగా 13,549 కేసులు నమోదు కాగా.. 2015లో 13,088 కేసులు, 2016లో 13,948 కేసులు, 2017లో 14,696 కేసులు, 2018లో 14,048 కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. వాటిల్లో రేప్ కేసులు 2014లో 937 కేసులు, 2015లో 1014 కేసులు, 2016లో 969 కేసులు, 2017లో 1046 కేసులు, 2018లో 1096 కేసులు నమోదైనట్లుగా కనిపిస్తుంది. బాలికలపై జరిగిన అత్యాచారాలు 2014లో 4032 కేసులు, 2015లో 4114, 2016లో 4477 కేసులు, 2017లో 4672 కేసులు, 2018లో 4215 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ మన కళ్ల ఎదుటనే, మన రాష్ట్రంలోనే గడిచిన ఐదు సంవత్సరాల్లో కంటికి కనిపిస్తున్నాయి. ఇలాంటి నేరాలు జరగకుండా ఉండాలంటే.. ఇవన్నీ ప్రతీ సంవత్సరం జరుగుతాయి.. ఇవేమీ కొత్తేమీ కాదు.. మన ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. మన దాంట్లో కూడా ఇలాగే జరుగుతాయి.. కొత్తేమీ కాదు వదిలేద్దామని అనుకోవడం ఒక ఎత్తు అయితే.. లేదు ఎక్కడో ఒక చోట పులుస్టాప్ పడాలి.. ఎక్కడో ఒక చోట ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకురావాలని ఆలోచన చేస్తే.. ఆ ఆలోచనలోంచి వచ్చిందే ఈ దిశ చట్టం అని ఈ వేదిక నుంచి చెబుతున్నా.. దిశ చట్టంతో ఏం జరగబోతుంది.. ఇంతకు ముందు.. ఇప్పటికీ తేడా చెప్పాలంటే ఎక్కడైనా మహిళలపై గానీ, పిల్లల మీద గానీ అత్యాచారాలు, అఘాయిత్యాలు, వారి మర్యాదకు భంగం కలిగించే నేరాలు ఎక్కడైనా జరిగితే.. వాటిల్లో రెడ్‌హ్యాండెడ్ కేసులు ఉంటే 7 రోజుల్లో దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి ఏకంగా ఉరిశిక్ష వేయడానికి అనువుగా చట్టాన్ని రూపొందించాం. రెడ్‌హ్యాండెడ్‌గా ఒక ఘటన జరిగిన తరువాత కూడా వదిలేస్తే.. ఆ తరువాత ఈ వ్యవస్థలోకి ఎప్పటికీ మార్పు అనేది రాదు. మైకులు పట్టుకొని మాట్లాడడం తప్ప మార్పు రాని పరిస్థితి ఉంటుంది. ఇందుకోసం మనందరి ప్రభుత్వం సీఆర్‌పీసీ, ఐపీసీ చట్టాల్లో కావాల్సిన మార్పులు చేశాం. ఈ చట్టం సెంట్రల్, స్టేట్ రెండింటి మధ్య ఉన్న సబ్జెక్టు కాబట్టి బిల్లును పాస్ చేసి కేంద్రానికి పంపించాం. కేంద్ర హోంశాఖ నుంచి బిల్లు కదులుతుంది. దేవుడు ఆశీర్వదిస్తే.. ఈ బిల్లు చట్టం రూపంలో త్వరలోనే రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. బిల్లును చట్టంగా మార్చడం ఒక ఎత్తు అయితే.. మన రాష్ట్రం పరిధిలో ఉన్న కొన్ని మార్పులు ఉన్నాయి. వెంటనే వాటిపై ధ్యాసపెట్టడం జరిగింది. పిల్లలు, మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై వెంటనే శిక్ష విధించేందుకు 13 జిల్లాల్లో 13 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని, వీటి కోసం రూ. 26 కోట్లు మంజూరు కూడా చేసి హైకోర్టుకు అభ్యర్థించడం జరిగింది. హైకోర్టు నుంచి మనకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ప్రతి జిల్లాల్లో డెడికేటెడ్ ఎక్స్‌క్లూజివ్ కోర్టు దిశ మీద ఉంటుందని చెప్పడానికి గర్వపడుతున్నాను. 13 కోర్టుల్లో 13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను వెంటనే నియమించేందుకు చర్యలు తీసుకున్నాం. స్పెషల్ కోర్టుల కోసం రూ.25.74 కోట్లు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కోసం రూ.1.65 కోట్లను మంజూరు చేసి ఇవ్వడం జరిగింది. మన చేతుల్లో ఉన్న రెండో అంశం.. రాష్ట్రంలో మహిళల రక్షణ, పిల్లల రక్షణ కోసం డెడికేటెడ్ పోలీస్ స్టేషన్ అందులో భాగంగానే రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించాం. దిశ పోలీస్ స్టేషన్‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు కల్లా 18 ఉంటాయని గర్వంగా చెబుతున్నాను. ఇందులో డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో 5 మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు మొత్తం దాదాపు 36 నుంచి 47 మంది సిబ్బందితో స్టేషన్లు పనిచేస్తాయి. ఇందులో అత్యధికంగా మహిళా సిబ్బందే ఉంటారని గర్వంగా చెబుతున్నాను. రాజమండ్రి పోలీస్ స్టేషన్‌లో ఒక అడుగు ముందుకు వేసి ఎస్పీ కూడా మహిళే కాబట్టి ఏకంగా 47 మందిని నియమించారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలనుకున్నాం. మన రాష్ట్రంలో ఒకే ఒక్కచోట ఫోరెన్సిక్ ల్యాబ్ ఉంది. అక్కడ కూడా సిబ్బంది, పరికరాలు సరిగ్గా లేని పరిస్థితి. ఒకటి సరిపోదని చెప్పి ఫోరెన్సిక్ ల్యాబ్‌ల కోసం ఏకంగా రూ. 31 కోట్లు కేటాయించాం. విశాఖ, తిరుపతిలో ఇంకా రెండు ఫోరెన్సిక్ ల్యాబ్‌లు యాడ్ చేస్తూ.. మంగళగిరిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ కలిపి మొత్తం మూడు ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. అందులో 118 మంది సిబ్బంది పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ రాష్ట్రం పరిధిలో ఉన్నవి. ఆ చట్టం వచ్చే సరికి అన్ని రకాలుగా ముందుండాలని ఆలోచించి చేశాం. ఆపదలో ఉన్న మహిళలకు వెంటనే సాయం చేసే వ్యవస్థ ఏర్పాటుకు దిశ కాల్ సెంటర్, దిశ యాప్ ఇప్పుడే ప్రారంభించాం. ఆపద సమయంలో దిశ యాప్ అందుబాటులో ఉంటుంది. ప్లే స్టోర్‌లో అవేలబుల్‌గా ఉంది.. ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌లో ఉన్న ఎస్‌ఓఎస్ బటన్ నొక్కితే వెంటనే మొబైల్ టీమ్‌లకు సమాచారం వెళ్తుంది. ఏకంగా 5,048 మొబైల్ టీమ్‌లకు యాప్ లింక్ చేయడం జరిగింది. ఎస్‌ఓఎస్ బటన్ నొక్కితే కేవలం 10 సెకన్లలో ఆడియో, వీడియోతో సహా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుంది. ఆ వెంటనే మన దగ్గరకు పోలీసులు వచ్చి కాపాడుతారని ఇంతకుముందే చూశాం. దిశ చట్టం అమలు చేయడానికి, దర్యాప్తు వేగంగా చేయడానికి పోలీస్ స్టేషన్లు, ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, ప్రత్యేక న్యాయస్థానాలు ఇవన్నీ రాష్ట్రం పరిధిలో ఉన్నాయి. మూడు నెలల్లో ఇవన్నీ అమలులోకి వచ్చేస్తాయి. దిశ చట్టం తీసుకురావడంలో నా ముఖ్య ఉద్దేశం నేరాలను నియంత్రించడం.. నేరం జరిగితే వెంటనే నేరస్తులను శిక్షించడం ద్వారా నేర మనస్తత్వం ఉన్నవారికి గట్టిగా ఒక సంకేతం వెళ్తుంది. ఒక సమాజం అభివృద్ధికి మహిళల అక్షరాస్యత, మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు కావడం, మహిళలు నిర్భయంగా సంచరించడం వంటివి ప్రామాణికాలు. పురుషులతో సమానంగా మహిళలకు అన్ని రకాల అవకాశాలు ఉండాలనే తపన ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ఉంది. వారందరి కుటుంబ సభ్యుడిగా.. ఒక అన్నగా, తమ్ముడిగా.. చివరకు వారి పిల్లలకు మంచి మేనమామగా ఆలోచన చేశాను కాబట్టే అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు తిరక్కమునుపే 42 లక్షల మంది తల్లులకు, 82 లక్షల మంది పిల్లలకు అమ్మఒడి పథకం ద్వారా.. దేవుడి దయతో గొప్పగా మేలు చేసే అవకాశం లభించింది. ఈ ప్రభుత్వం ప్రతి అడుగులో మహిళలకు తోడుగా ఉంటుంది. ఈ ఉగాది నాటికి ఆ అక్కచెల్లెమ్మల చేతుల్లో 25 లక్షల ఇళ్ల పట్టాలు పెట్టి.. వారి పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయబోతున్నామని ఈ వేదిక నుంచి గర్వంగా చెబుతున్నా. నాడు – నేడు కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మార్చబోతున్నాం.. ఇంగ్లిష్ మీడియం ద్వారా పిల్లల జీవితాలను మేలి మలుపు తిప్పబోతున్నాం. అక్కచెల్లెమ్మల కుటుంబాల్లో ఆనందం నింపేలా మద్యాన్ని నియంత్రించే కార్యక్రమం చేస్తున్నాం. మద్యనిషేధంలో అడుగులు ముందుకుపడుతున్నాయి. ప్రతి అడుగులో మహిళలకు తోడుగా ఉండే ప్రభుత్వం మాది. మహిళల కోసం 50 శాతం రిజర్వేషన్ క్రియేట్ చేసి నామినేటెడ్ పదవి, పనుల్లో ప్రతి అంశంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉండాలని ఏకంగా చట్టాన్ని తెచ్చిన ప్రభుత్వం మనది అని గర్వంగా చెబుతున్నాను. పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు మళ్లీ సున్నావడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అప్పట్లో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగింది.. 2016 అక్టోబర్ నుంచి సున్నావడ్డీకే రుణం పూర్తిగా రద్దు చేశారు. మళ్లీ సున్నావడ్డీకే అక్కచెల్లెమ్మలకు రుణాలు ఇచ్చే కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని ఈ వేదిక మీద నుంచి సగర్వంగా చెబుతున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే.. రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపరిచేందుకు ఈ శతాబ్దపు భారతీయ మహిళా ఆంధ్రప్రదేశ్ నుంచే ఆవిర్భవించాలని.. ఆవిర్భవిస్తుందని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా.. అక్కచెల్లెమ్మలకు అన్నిరకాలుగా తోడుగా ఉండే మీ అన్నను, మీ తమ్ముడిని చల్లగా దీవించాలని, ఆశీర్వదించాలని, ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం ఆ దేవుడు నాకు కల్పించాలని కోరుకుంటూ.. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ను అని సీఎం వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.