కర్నూలు రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

తాడేప‌ల్లి: కర్నూలు రోడ్డు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశం
కర్నూలు: ప్రమాద ఘటనపై ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్నూలు ప్రమాద ఘటన దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. మృతులు 14 మంది కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని తెలిపారు. గాయపడిన నలుగురికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. రేపు మదనపల్లికి వెళ్లి చెక్కులు అందజేస్తామని ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉండాలని సీఎం ఆదేశించారని ఆయన గుర్తు చేశారు.

 
బాధితులకు అండగా ప్రభుత్వం: ఆళ్ల నాని
కర్నూలు ప్రమాద ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని దిగ్భ్రాంతి చెందారు. కర్నూలు జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌వోతో ఫోన్‌లో ఆళ్ల నాని మాట్లాడారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను అడిగితెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు.

రోడ్డు ప్ర‌మాదం బాధాక‌రం: మ‌ంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం
కర్నూలు జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన‌ ఘోర రోడ్డు ప్రమాదం బాధాక‌ర‌మ‌ని మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం పేర్కొన్నారు.   టెంపో- లారీ ఢీ కొన్న ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఐదుగురు పురుషులు, ఒక బాలుడు ఉన్నారు. మరో నలుగురు చిన్నారులు తీవ్ర గాయాలయ్యాయి. బాధిత కుటుంబాల‌కు మంత్రి జ‌య‌రాం ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్తం చేస్తూ..సంతాపం తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top