టెలీ మెడిసిన్‌ వ్యవస్థ బలోపేతం కావాలి

కీలకమైన కాల్‌ సెంటర్ల నంబర్లను సచివాలయాల్లో ఉండాలి

రాష్ట్రానికి వచ్చే వారిని క్వారంటైన్‌లో ఉంచాలి

అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌ వ్వవస్థను బలోపేతం చేయాలని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. కీలకమైన కాల్‌ సెంటర్ల నంబర్లను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో టెలీ మెడిసిన్, వలస కూలీలు, యాత్రికుల అనుమతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దిశ, టెలీ మెడిసిన్, ఏసీబీ, వ్యవసాయ తదితర కీలక నంబర్లను ప్రతి గ్రామ, వార్డు సచివాలయాలకు అందుబాటులో ఉంచాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. వలస కూలీలు, యాత్రికులు, విద్యార్థుల అంశంపై సీఎం ఆరా తీశారు. వలస కూలీలు, ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయినా యాత్రికులు, విద్యార్థులు, గ్రూపులకు అనుమతి ఇస్తామని మరోమారు స్పష్టం చేశారు. వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారిని పరిశీలించి తర్వాత ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి వారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు.

కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం వలస కూలీలకు మాత్రమే అనుమతి ఉందన్నారు. రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఎక్కడి నుంచి వస్తున్నారు..? ఏ జోన్‌ నుంచి వస్తున్నారో వివరాలు సేకరిస్తున్నామన్న అధికారులు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు వివరించారు. స్పందన వెబ్‌సైట్‌ ద్వారా కాకుండా వివిధ మార్గాల ద్వారా కూడా విజ్ఞప్తులు చేసుకున్న వారు ఉన్నారని అధికారులు వివరించారు. వ్యక్తిగతంగా వచ్చేవారికి అనుమతి ఇవ్వడం లేదన్నారు. 

విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి క్వారంటైన్‌లో ఉంచాలని, చేయాల్సిన పరీక్షల విధానంపై మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వారికి అన్ని విధాల సదుపాయాలు కల్పించాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులకు సూచించారు. 
 

Back to Top