రైతుపై పైసా భారం ఉండ‌దు.. బిల్లు చెల్లింపు ప్ర‌భుత్వ బాధ్య‌త‌

వ్యవసాయ మోటార్లకు మీటర్ల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు రైతుల‌కు వివ‌రించండి

పైల‌ట్ ప్రాజెక్టు విజ‌య‌వంతం, విద్యుత్ ఆదాపై రైతుల‌కు లేఖ‌లు రాయాలి

ఎక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌ పాడైనా వెంటనే రీప్లేస్‌ చేయాలి

థ‌ర్మ‌ల్ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలి

డిమాండున్న‌ రోజుల్లో పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరాపై స‌రైన ప్రణాళిక అనుసరించండి

సింగరేణి నుంచి అవ‌స‌ర‌మైన బొగ్గు వచ్చేలా యాజమాన్యంతో మాట్లాడండి

కోల్‌స్వాపింగ్‌ లాంటి వినూత్న ఆలోచనలు చేయాలి

అధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

విద్యుత్ శాఖ‌పై సీఎం స‌మీక్ష‌

తాడేప‌ల్లి: ``వ్యవసాయ మోటార్ల‌కు మీటర్ల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో రైతులకు చెప్పాలి.  దీనిపై రైతులకు లేఖలు రాయండి. రైతుపై ఒక్కపైసా కూడా భారంపడదని, బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్నికూడా వారికి వివరించండి. శ్రీకాకుళంలో పైలట్‌ప్రాజెక్ట్‌ ఎలా విజయవంతం అయ్యిందో.. రైతులకు జరిగిన మేలును వివరించండి`` అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. విద్యుత్ శాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, బొగ్గు స‌ప్ల‌య్‌, పోలవరం విద్యుత్‌ ప్రాజెక్ట్‌ పనులపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షించారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగంపై పూర్తిస్థాయి అధికారుల‌తో చ‌ర్చించారు. 

ఈ సంద‌ర్భంగా గడిచిన వేసవికాలంలో డిమాండ్, సప్ల‌య్‌పై గణాంకాలను అధికారులు సీఎంకు వివ‌రించారు. దేశవ్యాప్తంగా విద్యుత్‌కొరత ఉన్న రోజుల్లో వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని భారీగా విద్యుత్‌ కొనుగోలు చేసినట్టుగా తెలిపారు. ఈ ఏడాది మార్చిలో 1268.7 మిలియన్‌ యూనిట్ల కోసం రూ. 1123.7 కోట్లు ఖర్చు చేసిన‌ట్టు, ఏప్రిల్‌ నెలలో 1047.8 మిలియన్‌ యూనిట్లకోసం రూ. 1022.4 కోట్లు ఖర్చు, మే నెలలో 739.72 మిలియన్‌ యూనిట్ల కోసం రూ.832.92కోట్లు, జూన్ నెలలో 936.22 మిలియన్‌ యూనిట్ల కోసం రూ. 745.75 కోట్లు, జూలై 25 వరకూ 180.96 మిలియన్‌ యూనిట్ల కోసం రూ.125.95 కోట్లు ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసింద‌ని అధికారులు వివ‌రించారు. 

అదే విధంగా కృష్ణపట్నం విద్యుత్‌ ప్లాంట్‌ యూనిట్‌–3 నుంచి సెప్టెంబ‌ర్‌లో విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు అధికారులు వివ‌రించారు. విజయవాడ థ‌ర్మల్‌ ప్లాంట్‌ ఐదవ స్టేజ్‌ ఫిబ్రవరి –2023 నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ రెండు యూనిట్ల ద్వారా అదనంగా 1600 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌  ఈ ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు కొరత, థ‌ర్మల్‌కేంద్రాలపై ప్రభావం తదితర అంశాలపై అధికారులతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్చించారు. ఏటా విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్నా, దానికి సరిపడా బొగ్గు.. సరఫరా కేంద్రం నుంచి ఉండటం లేదని అధికారులు వివ‌రించారు. ప్రతి ఏటా కూడా ఈ గ్యాప్‌ పెరుగుతోందన్నారు. 

– 2019–20లో 26.85 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు సరఫరాకు లింకేజి చేసుకుంటే.. 20.84 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు వచ్చిందని, అంటే.. 77.62శాతమే వచ్చిందని, 
– 2020–21లో 25.38 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకోసం లింకేజి చేసుకుంటే 10.51 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు మాత్రమే వచ్చిందని, 31.14 శాతం మాత్రమే సరఫరా చేశారని, 
– 2021–22లో 25.38 మిలియన్‌ మెట్రిక్‌టన్నులు కావాలని అడిగితే 18.12 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు మాత్రమే సప్ల‌య్ అయ్యిందని, 71.40శాతం మాత్రమే బొగ్గు వచ్చిందని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు అధికారులు వివ‌రించారు. 

ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏం మాట్లాడారంటే..

``థ‌ర్మ‌ల్ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలి. దీనికోసం సరైన ప్రణాళికలు రూపొందించండి. విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా రోజుల్లో పూర్తి సామర్థ్యంతో పవర్‌ప్లాంట్లు నడిచేలా చూసుకోవాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ సరఫరా చేయవచ్చు. డిమాండ్‌ అధికంగా ఉన్న రోజుల్లో కూడా పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా విద్యుత్‌ సరఫరాపై సరైన ప్రణాళికను అనుసరించండి. కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు బొగ్గు సప్ల‌య్‌ జరిగేలా చూసుకోవాలి. ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గని నుంచి మరింత మెరుగ్గా ఉత్పత్తి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలి. కృష్ణపట్నం పోర్టు రేవు దగ్గరే విద్యుత్‌ ప్లాంట్‌ ఉంది కాబట్టి, ఓడలద్వారా తెప్పించుకునే బొగ్గు ద్వారా అక్కడ పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి జరిగేలా చూడండి.  దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయి, ఉత్పత్తి ఖర్చు మిగతా వాటితో పోలిస్తే తగ్గుతుంది. సింగరేణి నుంచి కూడా అవసరమైన బొగ్గు వచ్చేలా అక్కడి యాజమాన్యంతో సంప్రదింపులు జరపాలి. కోల్‌స్వాపింగ్‌ లాంటి వినూత్న ఆలోచనలు కూడా చేయాలి``. 

పోలవరం విద్యుత్‌ ప్రాజెక్ట్‌ పనులపై..
పోలవరం విద్యుత్‌ కేంద్ర ప్రాజెక్ట్‌ పనులపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్  స‌మీక్షించారు. పనుల పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. దిగువ సీలేరు వద్ద 115 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు యూనిట్ల నిర్మాణాన్ని కూడా 2024 ఏప్రిల్‌నాటికి పూర్తిచేసేదిశగా అడుగులు ముందుకేస్తున్నామని అధికారులు తెలిపారు. ఎగువ సీలేరులో 150 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 9 యూనిట్ల పంప్డు స్టోరేజీ ప్రాజెక్టుపైనా సీఎం స‌మీక్షించారు. డిసెంబరులోగా టెండర్లు ఖరారు చేయాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే అన్ని ఇళ్లకూ కరెంటు సరఫరా చేశామని అధికారులు సీఎంకు వివ‌రించారు. నీళ్లు పూర్తిగా తగ్గాక వ్యవసాయ పంపులకు కరెంటు ఇస్తామని చెప్పారు. జగనన్న కాలనీల్లో పనులను సైతం వివ‌రించారు. కాలనీల్లో ఇంటింటికీ కరెంటు పనులపై తగిన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశించారు.

వ్యవసాయ మోటార్లుకు మీటర్లు – ప్రయోజనాలు
– వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటో చెప్పాల‌ని, దీనిపై రైతులకు లేఖలు రాయాల‌ని అధికారుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. రైతుపై ఒక్క పైసా కూడా భారంపడదని, బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్నికూడా రైతుల‌కు వివ‌రించాల‌ని సూచించారు. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్‌ ఎలా విజయవంతం అయ్యిందో,  రైతులకు జరిగిన మేలు కూడా వివరించాల‌న్నారు. 33.75 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అక్కడ ఆదా అయిన విషయాన్ని రైతులకు గుర్తుచేయాల‌న్నారు. మోటార్లకు మీటర్లు కారణంగా మోటార్లు కాలిపోవు, ఎంత కరెంటు కాలుతుందో తెలుస్తుందని, నాణ్యంగా విద్యుత్‌ సరఫరా ఉంటుందనే విషయాన్ని వారికి వివరించాల‌న్నారు. వ్యవసాయ కనెక్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరు చేయాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. ఎక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌ పాడైనా వెంటనే రీప్లేస్‌ చేయాలని అధికారుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. 

తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన‌ ఈ సమీక్షా సమావేశానికి విద్యుత్, అటవీ పర్యావరణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్ కె. విజయానంద్, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్‌. గుల్జార్, ట్రాన్స్‌కో సీఎండీ బి శ్రీధర్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top