పశ్చిమ గోదావరి: పోలవరం ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన జరగాలని నీటి పారుదల శాఖ, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలన అనంతరం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 2022 ఖరీఫ్ నాటికి నీళ్లు అందించేలా పనులు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని, నిర్దేశించిన ప్రకారం ఎఫ్‌ఆర్‌ఎల్ లెవల్ 45.72 మీటర్లు, టాప్ ఆఫ్ మెయిన్ డ్యామ్ లెవల్ 55 మీటర్లు ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం వైయస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. - డ్యామ్‌తో పాటు అదే వేగంతో పునరావాస చర్యలు చేపట్టాలి. - పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. - వచ్చే జూన్ 15 నాటికి మళ్లీ గోదావరిలోకి నీళ్లు వస్తాయి. ఈలోగా యుద్ధప్రాతిపదికన పనులు జరగాలి. - మే నెలాఖరు నాటికి స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పూర్తిచేయాలి. - దేశంలో ఎక్కడ డ్యామ్ కట్టినా మొదటి ఏడాదే నీటిని పూర్తిగా నిల్వచేయరు. భద్రతా నియమాలను పాటించాల్సి ఉంటుంది. - మొదటి ఏడాది 33 శాతం, రెండో ఏడాది 50 శాతం, మూడో ఏడాది పూర్తిగా నిల్వ చేస్తారు. సీడబ్ల్యూసీ నియమం దేశంలో ఉన్న అన్ని డ్యామ్‌లకు వర్తిస్తుంది. - పోలవరం ప్రాజెక్టు 41.5 మీటర్ల తొలిదశలో 120 టీఎంసీల నీటి నిల్వ, తర్వాత నిల్వ పెంచుకుంటూ ఆర్‌అండ్‌ఆర్ పనులు పూర్తిచేస్తాం. - కాఫర్ డ్యామ్ గ్యాప్‌లు మూసివేసే సమయంలో డెల్టాకు సాగునీరు, తాగునీటి కొరత రాకుండా కార్యాచరణ రూపొందించాలి. కార్యాచరణ ప్రణాళికను ప్రజాప్రతినిధులకు తెలియజేయాలి. - డ్యామ్ నిర్మాణంలో తలెత్తే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ. ప్రత్యేక కమిటీలో ఇరిగేషన్ అధికారులు, పీపీఏ సీడబ్ల్యూసీ ఉంటుంది. డిజైన్లు, మోడళ్లు వంటి అంశాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు. ప్రత్యేక కమిటీలో ఇరిగేషన్ అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సీడబ్ల్యూసీ ఉంటుంది.