వైద్య సేవల్లో ఎలాంటి లోపం ఉండకూడదు

ప్రతి పార్లమెంట్‌కు ఒక బోధనాస్పత్రి ఉండేలా చూడండి

ఆస్పత్రుల్లో ‘నాడు–నేడు’ పనులు నాణ్యంగా ఉండాలి

మార్చి 15 కల్లా ఆరోగ్యశ్రీ కార్టులు అందరికీ అందాలి

వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: ప్రజా వైద్య సేవల్లో ఎలాంటి లోపం ఉండకూడదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆస్పత్రుల్లో నాడు – నేడు కార్యక్రమం, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ, ఆరోగ్య ఉపకేంద్రాలు, మూడో విడత కంటి వెలుగుపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా మార్చడంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. అయితే రాష్ట్రంలో తొమ్మిది చోట్ల బోధనాస్పత్రులు పెట్టేందుకు అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ప్రతి పార్లమెంట్‌కు ఒక బోధనాస్పత్రి ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. ప్రజారోగ్య రంగంపై గత ప్రభుత్వం ఆలోచన చేయలేదని, అందువల్లే ఇవాళ పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయన్నారు. భవిష్యత్తు తరాలకు మెరుగైన ఆరోగ్య వ్యవస్థను అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్పత్రుల్లో నాడు – నేడు కార్యక్రమాన్ని కర్నూలులో సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. అదే రోజు సబ్‌ సెంటర్ల (ఆరోగ్య ఉపకేంద్రాలు) నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
సిబ్బంది కొరత లేకుండా చూడండి
ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. నాడు – నేడు కార్యక్రమంలో చేపట్టే పనులు నాణ్యంగా ఉండాలని ఆదేశించారు. ఆరోగ్య ఉపకేంద్రాల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు. రాష్ట్రంలోని సూపర్‌ స్పెషాలిటీ మెడికల్‌ కోర్సులపై దృష్టిపెట్టాలన్నారు.  
మార్చి 15 నాటికి అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు
ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ కార్డుల జారీపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష చేపట్టారు. మే మాసం నాటికి వైద్య, ఆరోగ్య శాఖలో కావాల్సిన సిబ్బంది నియామకం జరగాలన్నారు. ప్రజలకు వైద్య సేవల్లో ఎలాంటి లోపం ఉండకూడదని ఆదేశించారు. ఏప్రిల్‌ నుంచి ప్రమాణాలతో కూడిన మందుల పంపిణీకి సీఎం ఆదేశించారు. మార్చి 15వ తేదీ కల్లా అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందజేయాలని సూచించారు.
సమాయానికి ఆర్థికసాయం అందించాలి
వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా కింద సమయానికి రోగి చేతికి ఆర్థిక సాయం అందించాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా చేపట్టాలన్నారు. తీవ్ర రోగాలతో బాధపడుతున్న వారికి ఇస్తున్న పెన్షన్లపై సీఎం ఆరా తీశారు. వీరిపై మానవతా దృక్పథం చూపించాలని, ఇంకెవరైనా అర్హులు మిగిలిపోయి ఉంటే వలంటీర్ల ద్వారా గుర్తించాలని ఆదేశించారు. అదే విధంగా పశ్చిమగోదావరి జిల్లాలో రూ. వెయ్యి దాటితో ఆరోగ్యశ్రీ వర్తింపు పైలట్‌ ప్రాజెక్టుపై సీఎం వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. అమలు వివరాలను అధికారులు  సీఎంకు వివరించారు.  
17న మూడో విడత కంటి వెలుగు
ఫిబ్రవరి 17 నుంచి మూడో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టి అవ్వాతాతలకు కంటి పరీక్షలు చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మూడో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు.

Back to Top