అన్ని డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లిష్‌ మీడియం

తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో పాఠ్యపుస్తకాలు ముద్రించాలి

ఉన్నత విద్యాశాఖ సమీక్షలో అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: తొలిసారిగా ప్రైవేట్‌ యూనివర్సిటీలు పెట్టేవారికి అత్యున్నత ప్రమాణాలు నిర్దేశించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రైవేట్‌ యూనివర్సిటీ యాక్ట్‌–2006 సవరణపై చర్చించారు. ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో 35 శాతం సీట్లు గవర్నమెంట్‌ కోటా కింద భర్తీకి ప్రతిపాదన చేశారు. 
 
అదే విధంగా అన్ని డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఇంటర్మీడియట్‌ (11, 12 తరగతుల్లో) కూడా ఇంగ్లిష్‌ మీడియం పెట్టాలని ఆదేశించారు. ఒకేసారి ఇంగ్లిష్‌ మీడియం పెట్టడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా పాఠ్యపుస్తకాలన్నీ ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ముద్రించాలని ఆదేశించారు. ఉద్యోగావకాశాలు కల్పించే పాఠ్య ప్రణాళికనూ తయారు చేయాలని సీఎం సూచించారు. 

ఈ సమావేశానికి ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర, ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ (ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌) ఛైర్‌ పర్సన్‌ జస్టిస్‌ వి ఈశ్వరయ్య, ఏపీఎస్‌సీహెచ్‌ఈ (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌) ఛైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 

Back to Top