మానవతా దృక్పథంతో వ్యవహరించాలి

అనంత, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 400 బెడ్లను అందుబాటులో ఉంచాలి

ఎన్‌-95 మాస్కులు రాష్ట్రంలోనే ఉత్పత్తయ్యే ప్రయత్నం చేయాలి

కార్డులు లేకుండా రేషన్‌ అడిగినా వెంటనే ఇచ్చేయండి

కరోనా నివారణ సమీక్షలో అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మరోసారి అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై సీఎం అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం ముగిసింది. సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. కుటుంబ సర్వే ద్వారా వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించిన వారికి ముందుగా వైద్య పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎయిమ్స్‌ వైద్యులతోనూ మాట్లాడి అత్యుత్తమ వైద్య విధానాలను అందించాలి.  అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కోవిడ్‌ పేషంట్ల కోసం 400 బెడ్లను అందుబాటులోకి తీసుకురావలని ఆదేశించారు. ఎన్‌-95 మాస్కులు కూడా రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేలా ప్రయత్నాలు చేయాలన్నారు. క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కేంద్రాల్లో శానిటేషన్‌ సమస్యలు ఉండకూడదని సూచించారు. 

కరోనా నేపథ్యంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మరోసారి అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. విపత్తు నేపథ్యంలో దేన్నైనా ప్రజలకు ఇచ్చే కోణంలోనే అధికారులు ఆలోచన చేయాలని సీఎం సూచించారు. అలాగే రేషన్‌ ఇచ్చిన వారందరికీ రూ. 1000 ఆర్థికసాయం అందేలా చూడాలన్నారు. ప్రస్తుతం కార్డులు లేకుండా రేషన్‌ అడుగుతున్న వారికి వెంటనే పరిశీలించి రేషన్‌ ఇవ్వాలని ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కార్డులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 
 

Back to Top