శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం వైయస్‌ జగన్‌

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారికి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలను సమర్పించారు. సోమవారం సాయంత్రం తిరుమల పద్మావతి అతిథి గృహానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేరుకున్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బేడి ఆంజనేయస్వామి వారిని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ దర్శించుకున్నారు. ఇక్కడ ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి స్వామివారి వస్త్రాన్ని తలపాగా కట్టారు. పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్నారు. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం స్వామి వారి సన్నిధికి చేరుకుని ఆలయ అర్చకులకు పట్టువస్త్రాలను అందించి స్వామి వారిని దర్శించుకున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ వెంట డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, రెడ్డెప్ప, టీటీడీ తిరుపతి జేఈఓ బసంత్‌కుమార్, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ పీఎస్‌.గిరీష, ఎమ్మెల్యేలు జంగాలపల్లి శ్రీనివాసులు, చింతల రామచంద్రారెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం ఉన్నారు. 
 

Back to Top