విజయవాడ: రాష్ట్రంలో నిరక్షరాస్యత శాతం సున్నా చేయాలన్నది తన లక్ష్యమని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్‌లో గురుపూజోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం వైయస్ జగన్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. ‘నాకు చదువు చెప్పిన ప్రతి గురువుకు పాదాభివందనాలు తెలుపుతూ.. గురుపూజోత్సవం మన తెలుగువాడు, మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని దేశమంతా టీచర్స్ డే వేడుకను జరుపుకుంటుంది. అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌గా పనిచేసి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప పాఠం.
ఎంత ఎదిగినా గురువును మర్చిపోకూడదని దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చూపించారు. వైయస్‌ఆర్ తనకు పాఠాలు చెప్పిన ఒక ఎస్సీ కులానికి చెందిన గురువు వెంకటప్పయ్య పేరుతో పులివెందులలో ఒక పాఠశాల స్థాపించారు. వైయస్‌ఆర్ ఫౌండేషన్ ఆ స్కూల్‌ను ఇవాల్టికి నడుపుతుంది. గురువు చేసే పని బహుశా ఎవరూ చేయలేరేమో.. అందుకే అంటారు గురు బ్రహ్మ అని, గురు విష్ణు అని, గురు దేవో మహేశ్వర అని అంటారు.
ఆంధ్రరాష్ట్రంలో చదువుల పరంగా ఏ స్థాయిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం చదువులరాని వారి సంఖ్య మన రాష్ట్రంలో అక్షరాల 33 శాతం. అదే జాతీయ పరంగా 27 శాతం ఉంది. చదువుకోని వారి సంఖ్య మన రాష్ట్రంలో జాతీయ సగటుకన్నా ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో చదువించాలని తపన ఉన్నా.. చదివించలేని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చెప్పడానికి ఇదొక నిదర్శనం. 33 శాతం ఉన్న దాన్ని ఐదేళ్లలో సున్నాకు తీసుకురావాలనేది నా తాపత్రయం. 18 నుంచి 23 సంవత్సరాల వరకు ఉన్న విద్యార్థులు ఎంత మంది కాలేజీలు బాటపడుతున్నారని తిరిగి చూస్తే బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాలతో మనం కంప్యార్ చేసుకుంటాం. బ్రిక్స్ దేశాలు 18 నుంచి 23 సంవత్సరాల విద్యార్థులు ఎంత మంది కాలేజీల్లో చదువుతున్నారని గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో చూస్తే రష్యాలో 81 శాతం, చైనా 48 శాతం, బ్రెజిల్ 50 శాతం, మన దేశానికి వచ్చే సరికి కేవలం 26 శాతం, 75 శాతం పిల్లలు ఇంటర్మీడియట్ దాటి కాలేజీల్లో చదివే పరిస్థితులు లేవు. ఈ పరిస్థితులు మార్చాలి. బ్రిక్స్ దేశంతో పోటీ పడితే.. రష్యాకంటే మన రాష్ట్రం ఎక్కువగా ఉండాలని పూర్తి ఫీజురీయంబర్స్‌మెంట్ పథకానికి శ్రీకారం చుడుతూ అడుగులు ముందుకువేశాం. అమ్మ ఒడి, ఫీజురీయంబర్స్‌మెంట్, హాస్టల్స్‌లో ఉండే పిల్లలకు బోడింగ్, లాడ్జింగ్ పేరుతో సంవత్సరానికి రూ. 20 వేలు ఇస్తున్నాం.
నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో గ్రామాల్లో చాలా పాఠశాలలు కనిపించాయి. పిల్లలు, ఉపాధ్యాయులు చాలా మంది నా దగ్గరకు వచ్చి కలిశారు. ప్రతిపక్షనేతను పాదయాత్రలో కలిసి కంప్లయింట్ ఇచ్చారని గత టీడీపీ సర్కార్ నలుగురిని సస్పెండ్ చేసింది. కానీ, వాస్తవం ఏమిటని గత ప్రభుత్వం ఆలోచనే చేయలేదు. మధ్యాహ్నం భోజనం పథకానికి ఎనిమిది నెలలకుపైగా బకాయిలు, సరుకులు కొనే పరిస్థితి లేదు, ఆయాలకు గౌరవ వేతనం ఇచ్చే పరిస్థితి లేదు ఇంకా పిల్లలు ఎలా చదువుతారనే కనీసం ఆలోచన కూడా గత ప్రభుత్వం చేయలేదు. స్కూళ్లలో అధ్వానమైన పరిస్థితి ఉండేది. బాత్‌రూంలలో నీరు ఉండవు, సరిగ్గా పనిచేయవు. అక్టోబర్, నవంబర్ మాసాలు వచ్చినా పుస్తకాలు పంపిణీ చేయని పరిస్థితి చూశాం. ఉపాధ్యాయుల పరిస్థితి అంతే.. తక్కువగా ఉన్నారని తెలిసినా భర్తీ చేయాలనే ఆలోచనే గత ప్రభుత్వం చేయలేదు. ఒక ప్రభుత్వమే దగ్గరుండి పాఠశాలలను నిర్వీర్యం చేయాలనే కుట్ర చేస్తే ఏరకంగా పాఠశాలలు తయారవుతాయని పాదయాత్రలో గమనించా. ఇవన్నీ చూసిన తరువాతే విప్లవాత్మక మార్పులు చేస్తూ అడుగులు ముందుకు వేశాం అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే.
స్కూళ్లలో దశాదిశా మార్చేట్లుగా ప్రతి స్కూల్ ఫొటో తీయమని చెప్పాం. ఈ రోజు స్కూళ్ల పరిస్థితి ఎలా ఉందని, మూడు సంవత్సరాల్లో దశలవారిగా స్కూళ్ల పరిస్థితి మార్చుతూ నాడు, నేడు అని చూపించాలని అధికారులందరికీ ఫొటోలు తీయమని కోరాం. ప్రతి స్కూల్‌లో మార్పులు చేస్తాం. ప్రేరెంట్స్ బాడీ తీసుకువస్తాం. ప్రతి స్కూల్ ఇంగ్లిష్ మీడియంగా మార్చాలని ఆరాటపడుతున్నాం. పిల్లలకు మంచి చదువులు రావాలని, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తాం. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు చిరునవ్వుతో పంపించాలనే ఆరాటంతో పనిచేస్తున్నాం. ఇవన్నీ సక్సెస్ కావాలంటే ఆ బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ప్రభుత్వం మర్చిపోదు. ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయులవైపే చూస్తున్నారు. ఈ వ్యవస్థలోకి ఏ మార్పు రావాలన్నా.. గురువులు చూపించే బాటలోంచే మొదలవుతాయని మర్చిపోవద్దు. మీ బాధ్యతలను మరోసారి గుర్తుచేస్తూ.. గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు.