పోలవరం పూర్తయితే ఏపీ సస్యశ్యామలం

నిర్వాసితులకు ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేరుస్తా..

పునరావాస పనులపై అధికారులు మరింత ధ్యాసపెట్టాలి

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఇందుకూరులో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ వాసులతో కేంద్రమంత్రి, సీఎం ముఖాముఖి

పోలవరం: పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి, ప్రాజెక్టు పూర్తయితే ఏపీ సస్యశ్యామలం అవుతుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు తీసుకుంటూ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పోలవరంలోని ఇందుకూరు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో 350 ఇళ్లకు సంబంధించిన నిర్వాసితులతో కేంద్రమంత్రి షెకావత్, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘‘ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో ఉన్న పరిస్థితులు, వసతులను తెలుసుకున్నాం. ఇవన్నీ జరుగుతున్న సమయంలో కొన్ని విషయాలు, సమస్యల గురించి చెప్పారు. అధికారులు అన్ని రకాలుగా అందరినీ పట్టించుకుంటూ సహాయ, సహకారాలు అందిస్తున్నారన్న మాట సంతోషంగా ఉంది. అయినప్పటికీ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వాటిని పూర్తిచేసేందుకు ఇంకాస్త ధ్యాస ఎక్కువపెట్టాలని కలెక్టర్లు, అధికారులను ఆదేశిస్తున్నా. 

నిర్వాసితులకు కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న సహాయానికి అదనంగా ఇస్తానని చెప్పిన మాటలు నాకు చాలా బాగా గుర్తున్నాయి. కేంద్రం రూ. 6.80 లక్షలు ఇస్తున్న నేపథ్యంలో మరో రూ.3 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం.. మొత్తం రూ.10 లక్షలు ఇస్తామన్న మాట బాగా గుర్తుంది. కచ్చితంగా ఆ మాట నెరవేరుస్తా. 

2006లో వైయస్‌ఆర్‌ పోలవరం ప్రాజెక్టును మొదలుపెట్టే దిశగా అడుగులు వేసినప్పుడు చాలామంది రైతులు కేవలం రూ.1.5 లక్షలకు భూములు ఇచ్చారు. వారందరికీ కనీసం రూ.5లక్షలు ఇస్తామని చెప్పాం. అప్పట్లో వచ్చిన రూ.1.5లక్షలకు అదనంగా మరో రూ.3.5 లక్షలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని ఆరోజు మాట చెప్పాను. ఆ మాట కూడా నెరవేరుస్తా. ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీల్లో స్కిల్‌డెవలప్‌మెంట్‌కు సంబంధించి కార్యక్రమాన్ని కచ్చితంగా అమలు చేస్తాం. మీ అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుందని మీ అందరికీ భరోసా ఇస్తున్నాను’’.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top