ఇళ్ల నిర్మాణ నాణ్య‌త‌పై ప్ర‌తి ద‌శ‌లోనూ దృష్టిపెట్టాలి

నాణ్య‌త విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డొద్దు..

ఆప్షన్‌–3 ఎంచుకున్న వారి ఇళ్ల నిర్మాణం సత్వరమే పూర్తిచేయాలి

కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్ల పట్టాలపై స్పష్టత కోసం ప్రయత్నించాలి

ఆగస్టు మొదటి వారంలో ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయండి

జగనన్న కాలనీల రూపంలో కొన్ని చోట్ల మున్సిపాలిటీలే తయారవుతున్నాయి

కాల‌నీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి

మంత్రులు, ఉన్న‌తాధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

గృహ నిర్మాణ శాఖ‌పై సీఎం స‌మీక్ష‌

తాడేపల్లి: ఇళ్ల నిర్మాణ నాణ్యతపై అధికారులు ప్రతి దశలోనూ దృష్టిపెట్టాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జగనన్న కాలనీల రూపంలో కొన్ని చోట్ల మున్సిపాలిటీలే తయారవుతున్నాయన్నారు. ఆప్షన్‌–3 ఎంచుకున్న వారి ఇళ్ల నిర్మాణం సత్వరమే పూర్తిచేసేలా ఎస్‌ఓపీ పాటించాలన్నారు. కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్ల పట్టాలపై స్పష్టత కోసం ప్రయత్నించాలని సూచించారు. ఆగస్టు మొదటి వారంలో ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధం కావాలన్నారు. 

గృహ నిర్మాణ శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణ ప్రగతి, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై మంత్రులు, అధికారులతో సీఎం చ‌ర్చించారు. ఇంకా ఎక్కడైనా అవసరాలు ఉంటే దానికి అనుగుణంగా నిధులు మంజూరుచేసి పనులు పూర్తిచేస్తున్నామని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు అధికారులు వివ‌రించారు. గత సమీక్షలో ఇచ్చిన ఆదేశాల మేరకు.. ఇంకా అవసరమైన చోట ల్యాండ్‌ లెవలింగ్, ఫిల్లింగ్, అంతర్గత రోడ్లు, గోడౌన్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేస్తున్నామని తెలిపారు. ఆప్షన్‌ –3లో ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. 

ఆప్షన్‌ –3 కింద ఎంపిక చేసుకున్న ల‌బ్ధిదారుల‌ ఇళ్ల నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయడానికి నిర్దేశించుకున్న ఎస్‌ఓపీని పాటించాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వనరులన్నీ కాలనీల్లో ఉన్నాయా..? లేదా..? ఇటుకల తయారీ యూనిట్లను కాలనీలకు సమీపంలోనే పెట్టుకున్నారా..? లేదా..? తదితర వనరుల విషయంలో పరిశీల‌నలు చేయాలని సూచించారు. అలాగే గోడౌన్లు తదితర కనీస అవసరాలను సమకూర్చుకుని..  ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా కోర్టు కేసుల వివాదాల్లోని ఇళ్లపట్టాలపై స్పష్టత కోసం ప్రయత్నించాలని, ఆగస్టు మొదటివారంలో ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధంకావాలని ఆదేశించారు.  

జగనన్న కాలనీల్లో డ్రెయిన్లు సహా కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. డ్రైనేజీ, కరెంటు, నీటి సరఫరా అంశాలపై ప్ర‌త్యేక దృష్టిపెట్టాలన్నారు. ఇళ్లలో పెట్టే ఫ్యాన్లు, బల్బులు, ట్యూబ్‌లైట్లు నాణ్యతతో ఉండేలా చూసుకోవాల‌ని, నాణ్య‌త విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డొద్ద‌ని సూచించారు. జగనన్న కాలనీల రూపంలో కొన్నిచోట్ల ఏకంగా మున్సిపాలిటీలే  తయారవుతున్నాయ‌ని, అలాంటి చోట్ల మౌలిక సదుపాయాల కల్పన, పౌరసేవలు తదితర అంశాలపై ప్రత్యేక ప్రణాళిక ఉండాలని ఆదేశించారు. 

అర్హుల‌కు 90 రోజుల్లో ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చే కార్య‌క్ర‌మంపైనా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షించారు. లబ్ధిదారునికి కేవలం ఎక్కడ ఇంటి స్థలం ఇచ్చిందీ చూపడమే కాకుండా.. పట్టా, దానికి సంబంధించిన డాక్యుమెంట్ల అన్నీకూడా ఇవ్వాల‌ని,  స్థలం ఇచ్చారని, దానికి సంబంధించిన పట్టా, డాక్యుమెంట్లు కూడా ఇచ్చారని లబ్ధిదారుల నుంచి ధృవీకరణ తీసుకోవాలని అధికారులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. 

తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ఈ సమీక్షా సమావేశంలో రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ చైర్మన్‌ దవులూరి దొరబాబు, సీఎస్‌ సమీర్‌ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్ జి.సాయి ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌ ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఎండీ నారాయణ భరత్‌ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top