గౌతమ్‌రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా..

శాసనసభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

నాకూ, పార్టీకి, రాష్ట్రానికి మేకపాటి గౌతమ్‌ మరణం తీరనిలోటు

నా సహచరుడు, మిత్రుడు లేరన్న ఆలోచన చేయడానికి కష్టంగా ఉంది

కాంగ్రెస్‌ నుంచి బయటకొచ్చినప్పుడు నాతో నడిచిన కొద్దివ్యక్తుల్లో గౌతమ్‌ ఒకరు

నాపై ఉన్న విశ్వాసం, నమ్మకం తనను, తన కుటుంబాన్ని నడిపించింది

మంత్రిగా ఆరు శాఖలు కూడా సమర్థవంతంగా నడిపించాడు

చిరకాలం గుర్తుండేలా సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు

‘మెరిట్స్‌’కు గౌతమ్‌ పేరు, మంచి వ్యవసాయ, హార్టికల్చర్‌ కాలేజీగా తీర్చిదిద్దుతాం

బాధలోనూ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరినవాటన్నింటినీ నెరవేరుస్తాం

గౌతమ్‌రెడ్డి కల, తన ప్రాంతానికి మంచి జరగాలనే ఆశ కచ్చితంగా నెరవేరుస్తాం 

గౌతమ్‌ కుటుంబానికి నాతో పాటు వైయస్‌ఆర్‌ సీపీ అండగా ఉంటుంది

అసెంబ్లీ: ‘‘నా సహచరుడు, మిత్రుడు మేకపాటి గౌతమ్‌రెడ్డి లేరన్న ఆలోచన చేయడానికి కూడా కష్టంగా ఉంది. నాకూ, పార్టీకి, తాను చేసిన మంచి పనుల దృష్ట్యా రాష్ట్రానికి కూడా గౌతమ్‌రెడ్డి లేకపోవడం నష్టమే. మంచి స్నేహితుడిని పోగొట్టుకోవడం చాలా బాధాకరం’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతిపై శాసనసభలో సంతాప తీర్మానాన్ని సీఎం ప్రవేశపెట్టారు. సభ్యులందరూ చర్చించిన అనంతరం సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..
‘గౌతమ్‌రెడ్డి నాకు చిన్నతనం నుంచి స్నేహితుడు. నాకంటే సంవత్సరం వయస్సులో పెద్దవాడు అయినప్పటికీ నన్ను స్వయంగా అన్నగా భావించేవాడు. అంతగా నన్ను విశ్వసించేవాడు, నమ్మకం ఉంచేవాడు. నేను ఏమైనా చెబితే నాకు ఏం కావాలి.. ఏం నచ్చుతుందని తపించి చేసేవాడు. అటువంటి మంచి స్నేహితుడిని, మంచి ఎమ్మెల్యేలను పోగొట్టుకోవడం జీర్ణించుకోవడానికి కూడా కష్టంగా ఉంది. 

మంచి చదువులు చదివాడు. యూకేలో ప్రముఖ యూనివర్సిటీలో చదువులు పూర్తిచేసి వచ్చాడు. నేను కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చినప్పుడు గౌతమ్‌ రాజకీయాల్లో లేడు. గౌతమ్‌ తండ్రి రాజమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్నారు. ఆరోజుల్లో నేను ఈ స్థానానికి వస్తానని నాతో సహా, ఎవరూ ఊహించిఉండకపోయి ఉండొచ్చు. విలువల కోసం కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో అతితక్కువ మంది నాతోపాటు ఉండటానికి సాహసించారు. అటువంటి కొద్దివ్యక్తుల్లో గౌతమ్‌రెడ్డి ఒకరు. గౌతమ్‌ రాజకీయాల్లో లేకపోయినప్పటికీ అతని తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీద కూడా గౌతమ్‌ ఆలోచనలు ప్రభావితమయ్యాయి. గౌతమ్‌రెడ్డితో నాకున్న స్నేహం, నాపై ఉన్న విశ్వాసం, నమ్మకం తనను, తన కుటుంబాన్ని నడిపించింది. 

మంచి స్నేహితుడిని పోగొట్టుకోవడం చాలా బాధాకరం. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. కేబినెట్‌లో ఆరు శాఖలకు ప్రాతినిధ్యం వహించాడు. ఇండస్ట్రీస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్‌మెంట్స్, ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్, హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్, షుగర్‌ ఇండస్ట్రీస్‌ ఆరు శాఖలు కూడా సమర్థవంతంగా నడిపించాడు. ఈ మధ్యకాలంలో దుబాయ్‌ ఎక్స్‌పోకు వెళ్లకముందు నన్ను కలిశాడు. ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాను. అక్కడకు వెళ్లి ఎవరెవరిని కలిశాను.. ఫలానా ఇండస్ట్రీ కోసం కష్టపడుతున్నానని సీఎంకు చూపించండి అని సీఎంఓకు సోషల్‌ మీడియా ద్వారా పంపించేవాడు. గౌతమ్‌రెడ్డి కష్టపడిన తీరు గురించి పేపర్లు, మీడియా చెప్పడం చూశాం. 

బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి, ఇంగ్లిష్‌ మాట్లాడ కలిగిన వ్యక్తి కాబట్టి ఇండస్ట్రీ పరంగా కూడా రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ వినని పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలను రాష్ట్రానికి తీసుకువచ్చాడు. భజాంకాలు, సెంచురీ ఫ్లైఉడ్, బంగర్లు అని శ్రీసిమెంట్స్‌ ఫ్యాక్టరీ పెట్టడానికి అడుగులు ముందుకుపడుతున్నాయి. భజాంకాలు, బంగర్లు, సన్‌ఫార్మా, దిలీప్‌ సింఘ్వీ, అదానీ, ఆదిత్య బిర్ల ఇవన్నీ మన ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలోకి అడుగుపెట్టాయి. వీరందరినీ తీసుకువచ్చేందుకు వారితో  గౌతమ్‌ మాట్లాడటం, భరోసా ఇవ్వడం, నా దగ్గరకు తీసుకురావడం, వారు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవరకు అన్ని రకాలుగా గౌతమ్‌ చేసిన కృషి చాలా ఉందని కొనియాడుతున్నాను. 

అటువంటి మంచి వ్యక్తి, మంచి మంత్రి, అన్ని రకాలుగా తోడుగా ఉన్న వ్యక్తి ఈరోజు లేకపోవడం బాధాకరం. తాను లేకపోయినా కూడా తన కల, తన ప్రాంతానికి మంచి జరగాలనే ఆశ, కచ్చితంగా నెరవేరుస్తాం. 

గౌతమ్‌రెడ్డి చనిపోయినప్పుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి అడిగిన కొన్ని విజ్ఞప్తులు.. ఉదయగిరిలో ఉన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (మెరిట్స్‌) కాలేజీకి గౌతమ్‌రెడ్డి పేరుపెట్టి.. ఆ కాలేజీని అగ్రికల్చర్‌ అండ్‌ హార్టికల్చర్‌కు అనువుగా మంచి బోధన కాలేజీగా మార్చండి అని అడగటం జరిగింది. ఆ కాలేజీకి గౌతమ్‌రెడ్డి పేరు పెడతాం. మేకపాటి కుటుంబం ఆశించినట్టుగా మంచి వ్యవసాయ, హార్టికల్చర్‌ కోర్సులను తీసుకువచ్చి మంచి కాలేజీగా తయారు చేస్తాం. 

మేకపాటి రాజమోహన్‌రెడ్డి చాలా బాధతో అడిగిన రెండు మూడు విషయాలు..  వెలిగొండ పరిధిలో ఉదయగిరి ప్రాంతాన్ని కూడా ఫేస్‌–2 నుంచి ఫేస్‌–1లోకి తీసుకువచ్చి వేగవంతంగా పూర్తిచేస్తాం. ఉదయగిరి ప్రాంతానికి నీరు ఇవ్వాలని రిక్వస్ట్‌ చేసిన మాటలను కూడా కచ్చితంగా నెరవేరుస్తాం. ఉదయగిరిలోని డిగ్రీ కాలేజీలో వసతులు మెరుగుపర్చాలని కోరారు. నాడు–నేడు ఫేజ్‌–2 కిందకు తీసుకువచ్చి ఆ కాలేజీకి మెరుగులు దిద్దుతాం. మేకపాటి రాజమోహన్‌రెడ్డి అడిగిన ఈ మూడు విషయాలను కచ్చితంగా అమలు చేస్తాం. 

గౌతమ్‌రెడ్డిని చిరస్థాయిగా గుర్తుంచుకునేలా ఆ జిల్లా ప్రజల్లో తనస్థానం ఉండేలా చేస్తాం. మరో ఆరువారాల్లో సంగం బ్యారేజీ పనులు కూడా పూర్తవుతాయి. మంత్రి అనిల్‌ యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నాడు. ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లి.. ఆ ప్రాజెక్టుకు గౌతమ్‌రెడ్డి పేరు పెడతాం. మేకపాటి గౌతమ్‌ సంగం బ్యారేజీ అని పేరుపెడతాం. మంచివాడు కాబట్టి పైలోకంలో కూడా తనను దేవుడు చల్లగా చూస్తాడని, తాను లేకపోయినా తన కుటుంబ సభ్యులకు దేవుడి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఆ కుటుంబానికి నాతో పాటు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి ఎప్పుడూ అండగా తోడుగా ఉంటారని భరోసా ఇస్తున్నాను. ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను’’ సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు.  

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top