పేద కుటుంబాలకు స్థిరాస్తి ఇస్తున్నా 

ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

కుల, మత, పార్టీలకుతీతంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టాం

90 రోజుల్లో ఇంటి పంట్టా ఇచ్చే కార్యక్రమం నిరంతర ప్రక్రియగా చేశాం 

కోటి 35 లక్షల కుటుంబాలకు వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కింద లబ్ధి

ఇంగ్లీష్‌ మీడియం చదువులతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌

ఎన్నికల హామీల్లో 95 శాతం పూర్తి చేశా

ప్రతి పేద కుటుంబానికి ఆస్తి, స్థిరాస్తి అందించే మహాయజ్ఞాన్ని ప్రారంభించాం

రాజధాని ప్రాంతంలో సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని స్టే తెచ్చారు

న్యాయపరమైన చిక్కులు తొలగిపోగానే లబ్ధిదారులకు అన్ని హక్కులు

గుంకలాం లే అవుట్‌లో 12,301 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ

విజయనగరం:  ఇళ్ల పట్టాలు, పక్కా ఇంటి నిర్మాణాలతో పేద కుటుంబాలకు స్థిరాస్తి ఇస్తున్నానని, ఒక్కో కుటుంబానికి మీ అన్నగా..తమ్ముడిగా, మీ బిడ్డగా ఇంటి రూపంలో ఏడెనిమిది లక్షల ఆస్తిని మీ చేతుల్లో పెడుతున్నానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం అక్కడో..ఇక్కడో కొన్ని ఇళ్లు కట్టి ఉండవచ్చు కానీ..మనం కడుతున్నది ఇళ్లు కాదు..ఊళ్లని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మూడు ఆప్షన్స్‌లో పూర్తిగా ఇంటి నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని సీఎం వెల్లడించారు. విజయనగరం జిల్లా గుంకలాం గ్రామంలో ఏర్పాటు చేసి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాల్గొని 12,301 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అక్కడే ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే.. 

ఇక్కడికి వచ్చే ముందు హెలికాప్టర్‌లో ఈ ప్రాంతాన్ని చుట్టి వచ్చా. ఎంత చక్కగా..సుందరంగా ఉంది. ఎవరి ఇంటి స్థలం వద్ద వారు కూర్చొని ఉన్నారు. పై నుంచి చూస్తే..400 ఎకరాలు, 12, 301 మందికి సంబంధించిన ఇళ్ల స్థలాలు చూస్తే ఎంతో చక్కగా ఉంది. దేవుడు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేను. ఇంత మంది అక్క చెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు చూస్తున్నా. 2020 మనకు ఎలాంటి తీపి జ్ఞాపకాలు ఇచ్చిందని నెమరువేసుకునే సమయం ఇది. 2021లోకి ప్రవేశించబోతున్నాం. గత ప్రభుత్వంతో పోలిస్తే ఎంత మంచి జరుగుతుందని ఆలోచన చేస్తే..ఇవాళ సగర్వంగా చెప్పగలను. మీ బిడ్డ మీకు మంచి చేశాడు. దేశ చరిత్రలోనే కనివిని ఎరుగని విధంగా పేదలకు, అక్కాచెల్లమ్మలకు, రైతులకు, వందల సామాజిక వర్గాలకు ఉపయోగపడగలిగానని గర్వంగా చెబుతున్నాను.

అక్షరాల 18 నెలల కాలంలో 43 మంది అక్కచెల్లెమ్మలకు అమ్మ ఒడి ద్వారా ఉపయోగపడ్డాను. అక్షరాల అరకోటికి పైగా రైతులకు రైతు భరోసా ఇచ్చాం. వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా ప్రతి అక్కకు తోడుగా ఉన్నాను. 87 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మేలు చేశాం. 62 లక్షల మంది అవ్వతాతలకు, వితంతువులకు, దివ్యాంగులకు ప్రతి నెల ఒకటో తారీఖ్‌ వారు నిద్ర లేవకముందే తలుపుతట్టి పింఛన్‌ పెంచి డబ్బులు ఇచ్చామని సగర్వంగా చెప్పగలను. 18.50 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక, వసతి దీవెన కింద ఇచ్చి చదువుల్లో మంచి అన్నగా నిలబడ్డాను. సున్నా వడ్డీ పథకం రైతులు, అక్క చెల్లమ్మలకు బ్రహ్మండంగా ఇస్తూ.. రైతులకు ఇన్సూరెన్స్‌ అందిస్తున్నాం. ఏ సీజన్‌లో రైతులు నష్టపోతే..అదే సీజన్‌లో ఇన్‌ఫుట్‌ సబ్సిడీ సకాలంలో ఇస్తున్నాం. కోటి 30 లక్షల కుటుంబాలకు మెరుగులు దిద్దిన వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ద్వారా మంచి చేస్తున్నాం. గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 1.30 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించాం.మన గ్రామాల్లో ఆర్‌బీకేలు కనిపిస్తున్నాయి. కొత్తగా కడుతున్న విలేజ్‌ క్లినిక్స్‌లు, నాడు–నేడు ద్వారా రూపురేఖలు మారుతున్న ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు కనిపిస్తున్నాయి. 18 నెలల కాలంలో మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులతో ఎన్నికల హామీల్లో 90 శాతం పూర్తి చేశానని గర్వపడుతున్నాను. ఈ  సంక్రాంతికి ప్రతి అక్కా చెల్లమ్మకు ఒక స్థిరాస్తిని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని ఇళ్లు లేని ప్రతి నిరుపేదలకు అక్షరాల 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి రోజున ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టాం. అక్షరాల 28.38 లక్షల ఇళ్లు కట్టబోతున్నాం. 2.60 లక్షల టిడ్కో ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. రెండు దశల్లో ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తాం. ఇదే లే అవుట్లలో మార్కెట్‌ విలువ ఎంత అని కలెక్టర్‌ను అడిగాను. రూ.3 లక్షలు ఉంటుందని కలెక్టర్‌ చెబుతున్నారు.

రేపు ఇళ్లు కట్టి, ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగితే..ప్రతి అక్కకు వాళ్ల అన్నగా, తమ్ముడిగా, వారి బిడ్డగా కనీసం రూ.7, 8 లక్షల ఆస్తిని వారి చేతుల్లో పెట్టినట్లుగా ఉంటుంది. ఇంతకన్న గర్వకారణం ఏముంటుంది. 400 ఎకరాల్లో లే అవుట్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతానికి కరెంటు, డ్రైనేజీ, మంచినీటి సదుపాయాలే కాదు. లే అవుట్ల సైజును బట్టి ..ప్రైమరీ హెల్త్‌ సెంటర్, హైస్కూల్, ట్రాన్స్‌కో, ఆడిటోరియం, రైతు బజార్, బ్యాంకులు, పోలీసు స్టేషన్లు, దోబీ ఘాట్లు, శ్మాశాన వాటిక వస్తుంది. పిల్లలు ఆడుకునేందుకు పార్కులు, గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌లు, గోడౌన్లు, సివిల్‌ సప్లై గోడౌన్లు, చిన్న స్టేడియం, ఆటో స్టాండ్, జనతా బజార్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ వస్తాయి. సినీయర్‌ సిటిజన్లకు ఇళ్లు వస్తాయి. ఇక్కడ 12,301 మంది లబ్ధిదారులకు ఇళ్లు ఇస్తున్నాం.

40వేల మంది ఇక్కడే నివాసం ఉండే పరిస్థితి రాబోతుంది. అక్కచెల్లెమ్మలకు అన్నగా, ఓ తమ్ముడిగా అండగా ఉంటానన్న మాటను నిండు మనసుతో అమలు చేస్తున్నా..ఏ కుటుంబానికైనా కూడా పక్కా ఇళ్లు లేకపోవడం అంటే..ఎండైనా, వాన అయినా, చలి అయినా భరించడం. అద్దె ఇళ్లలలో ఉంటే సంపాదనలో 30 శాతం అద్దెలకు సరిపోతుంది. నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ఇటువంటి కష్టాలు, గాధలు ఎన్నో చూశాను. అక్క చెల్లెమ్మల జీవితాలు మారాలని పాదయాత్రలో అనుకున్నాను. ఎన్నికల మేనిఫెస్టోలో ఇళ్లు కట్టిస్తానని, పూరి గుడిసె లేకుండా చేయాలని రాశాం. 25 లక్షల ఇళ్లు కట్టిస్తానని ఎన్నికల్లో చెప్పాను. ఈ రోజు 30.75 లక్షల ఇళ్ల పట్టాలు, ఇళ్లు ఇచ్చే స్థాయికి ఈ ప్రభుత్వం వచ్చింది. ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో, ఇల్లు కట్టించే లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత చూపించాం. ఎక్కడా వివక్షకు తావులేకుండా చేశాం. కులం, మతం, పార్టీ, ప్రాంతాలు చూడలేదు. జగన్‌కు ఓటు వేయకపోయినా ..అర్హత ఉంటే చాలు వారికి కూడా ఇంటి పట్టా ఇచ్చాం. ఇది ఒక బాధ్యతగా చేయగలిగాం. ఇల్లు లేని పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం. వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలో పేర్లు ఏర్పాటు చేశాం. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే అందరికి ఇంటి స్థలం ఇస్తామని..నిరంతర ప్రక్రియ చేపట్టాం. 

గత ప్రభుత్వం చివరి రెండేళ్లలో అక్కడో ఇక్కడో కొన్ని ఇళ్లు కట్టి ఉండవచ్చు. కానీ ఈ రోజు మనం కడుతున్నది ఇళ్లు కాదు..ఊళ్లూ అని గర్వంగా చెబుతున్నాను. కొన్ని చోట్ల మనం కట్టే ఇళ్లు..పట్టణాలు కాబోతున్నాయి. ఒక్కో కుటుంబంలో సగటున నలుగురు అనుకుంటే..ఏకంగా కోటి 24 లక్షల మందికి మేలు చేస్తున్నాం. వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో లే అవుట్లు వేసి..ఏ ఒక్క పేద నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా స్థలం ఇవ్వడమే కాకుండా, ఇళ్లు కూడా కట్టిస్తున్నాం. మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం. మొదటి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు మొదలుపెడుతున్నాం. రెండో దశలో 12 లక్షల ఇళ్లు వచ్చే ఏడాది ప్రారంభిస్తాం.  తాగడానికి నీరు, డ్రైనేజీ, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఇంటి సైజ్‌ను కూడా మార్చేశాం. 340 ఎస్‌ఎఫ్‌టీ సైజ్‌కు మార్చాం. ప్రతి కాలనీలోనూ నమూనా ఇంటిని నిర్మిస్తున్నాం. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 30.75 లక్షల ఇంటి స్థలాలకు సంబంధించిన విలువ అక్షరాల రూ.25530 కోట్లు, 68300 ఎకరాల్లో లే అవుట్లు వేసి అభివృద్ధి చేశాం. గతంలో ఎన్నడు జరగని విధంగా ఇళ్ల పట్టాల పంపిణీ రోజే..ఆ స్థలాన్ని ఇచ్చాం. ప్రతి ఇంటిలో బెడ్‌రూం, లివింగ్‌ రూమ్, కిచెన్, వరండ,టాయిలెట్, పైన సింటెక్స్‌ ట్యాంకుతో పాటు ప్రతి ఇంట్లో ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌లైట్లు, ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేస్తున్నాం. కాలనీల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు 13 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.

ఈ స్థలంతో పాటు ఇళ్లు మంజూరైన ప్రతి లబ్ధిదారుడికి కూడా వాలంటీర్‌ వచ్చి మంజూరు పత్రాలతో పాటు మీకు మూడు ఆప్షన్స్‌ ఇస్తారు. ఏ పద్ధతిలో ఇళ్లు కట్టుకుంటారో చెప్పమంటారు. మీ ఇష్టం వచ్చినట్లు ఇల్లు కట్టుకోండి. మొదటి పద్ధతిలో ప్రభుత్వం ఇంటి స్థలం ఇస్తుంది. ప్రభుత్వ నమూనా ప్రకారం అవసరమైన నాణ్యమైన మెటిరీయల్‌ ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. లేబర్‌ చార్జీలు మాత్రమే ప్రభుత్వం మీచేతికి ఇస్తుంది. రెండో పద్ధతి..ఇంటి నిర్మాణానికి అవసరమైన సామాగ్రి లబ్ధిదారులే తెచ్చుకోవచ్చు. తామే ఇళ్లు కట్టుకోవచ్చు. ఆ నిర్మాణ దశను బట్టి లబ్ధిదారుల ఖాతాలకు డబ్బులు జమ చేస్తారు. మూడో పద్ధతి..మాకు ఈ బాధలన్ని వద్దు..ఆ ఇళ్లు మీరే కట్టించి ఇవ్వమని, మీరే ఇళ్లు కట్టించమని చెబితే..ప్రభుత్వమే బాధ్యత తీసుకొని నమూనా ఇంటి ప్రకారం..నాణ్యమైన మెటిరీయల్‌తో ఇల్లు కట్టించి మీకు ఇస్తుంది.

ఏ పద్ధతిలో మీరు ఇల్లు కట్టుకున్నా..మీ ఇష్టానికే వదిలేస్తున్నాం. టిడ్కో ఇళ్లకు సంబం«ధించి..దాదాపుగా 2.60 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చే పనులు మొదలయ్యాయి. మూడేళ్లలో పూర్తి చేస్తాం. దాదాపుగా రూ.9500 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయబోతోంది. 300 చదరపు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. ఒక్క రూపాయికే ఇంటిని రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తాం. మీ పేరుతో రూ.2.50 లక్షల లోన్‌ రాసుకొని, నెల నెల 3 వేల కడుతూ..వడ్డీలు చెల్లించే చంద్రబాబు స్కీమ్‌ కావాలా? టిడ్కో లబ్ధిదారుల వద్ద ఏ స్కీమ్‌ కావాలని లక్ష 43 వేల మందిని అడిగితే..చంద్రబాబు స్కీమ్‌ కావాలన్నది కేవలం ఒకే ఒక్కరు. అది కూడా పొరపాటున పెట్టారేమో?. 300 చదరపు అడుగుల ప్లాట్లకు ఒక్క రూపాయికే ఇస్తున్నాం. అంతకు మించి బుక్‌ చేసుకున్న వారికి ముందస్తు చెల్లించే సొమ్మును 50 శాతం ప్రభుత్వమే చెల్లిస్తుంది. టిడ్కో ఇళ్లు ద్వారా రూ.3860 కోట్లు భారం పడుతుంది. ముందస్తు వాటా సొమ్ములో 50 శాతం ప్రభుత్వమే చెల్లించేందుకు సిద్ధం కావడంతో మరో 482 కోట్లు, ఈ రెండు కలిపిపే అక్షరాల రూ.4287 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతోంది. అక్కచెల్లెమ్మల కోసం చిరునవ్వుతో భరించేందుకు సిద్ధంగా ఉన్నాం.

ఇంటి స్థలానికి సంబంధించి గతంలో ఎప్పుడు లేని వి«దంగా ఐదేళ్ల తరువాత అక్కచెల్లెమ్మలకు అవసరం వస్తే..ఆ ఇంటి ద్వారా అప్పు పొందెందుకు మన ప్రభుత్వం వారి అభిమతం మేరకు రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తున్నాం. అర్హులందరికీ ప్రస్తుతం భీ పట్టాలు ఇస్తున్నాం. రేపు పొద్దున న్యాయపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే సర్వ హక్కులతో అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తాం. చంద్రబాబు ఆయన సహచరులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించి కేసులు వేయడం, స్టేలు తెచ్చారు. దుర్మార్గంగా ఆలోచనలు చేసి కోర్టుల్లో కేసులు వేయడంతో అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన 30.75 లక్షల ఇళ్ల పట్టాల్లో చంద్రబాబు తెచ్చిన స్టేల వల్ల 10 శాతం మందికి ప్రస్తుతం ఇవ్వలేకపోతున్నాం. డిసెంబర్‌ 25న ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని తెలిసీ కూడా అంతకుముందు రోజు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పులివెందులలో కూడా దుర్భుద్ధితో స్టే తెచ్చారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే వీరు అడ్డుకుంటున్నారు. అమరావతి అంటారు. రాజధాని అంటారు. ఆ ప్రాంతంలో అక్షరాల పేదలకు 54 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం అడుగులు ముందుకు వేసి చంద్రబాబు, ఆయన బినామీలు కోర్టుకు వెళ్లి డెమెగ్రఫీ ఇన్‌బ్యాలెన్స్‌ వస్తుందని, కులాల మధ్య తేడాలు వస్తాయని కోర్టులో పిటిషన్లు వేశారు. కుల వివక్ష ఉన్నా కూడా కోర్టులు స్టేలు ఇచ్చాయి. ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామో ఆలోచన చేయండి.

రాష్ట్ర పరిపాలన రాజధానిగా విశాఖను మనం చేయాలని ఆలోచన చేశాం. విశాఖలో లక్ష 20 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సంకల్పించాం. ల్యాండ్‌ పూలింగ్‌ పద్ధతిలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకున్నాం. పట్టాలు తీసుకున్న పేదలు సంతోషపడ్డారు. ఎవరికి సమస్య లేదు. ల్యాండ్‌ పూలింగ్‌కు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి చంద్రబాబు ప్రమేయంతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. రాజమండ్రిలో ప్రభుత్వం ప్రజల నుంచి భూములు కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అక్కడ ఆవా భూములు లేవు. అయినా కూడా అబద్దాలు చెప్పి స్టేలు తెచ్చారు. ప్రభుత్వ భూములపై కూడా పిటిషన్లు వేయడం, వాటిపై కోర్టులు స్టే ఇవ్వడంతో 10 శాతం మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతున్నాం. 

1978లో 44వ రాజ్యాంగ సవరణ చేసి ఆస్తి హక్కును ఒక లీగల్‌ హక్కుగా పేర్కొన్నారు. అటువంటి హక్కును కూడా ఎవరో కోర్టుకు వెళ్లడం, కోర్టులు స్టేలు ఇవ్వడం చూస్తే..రాజ్యాంగం ఏమవుతుంది? ఇటువంటి వ్యవస్థను చూస్తే బాధనిపిస్తుంది. ఇళ్ల నిర్మాణం పునాదులతో మొదలుపెడితే..ఇటుకలు చేసే వారికి, సిమెంట్‌ కంపెనీలకు ,కూలీలకు, వండ్రంగులకు ఇలా 30 రకాలుగా పనులు చేసే వారికి ఉపాధి దొరుకుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎకనామిక్‌ భూస్టు వస్తుంది. ఇటువంటి గొప్ప కార్యక్రమం జరుగుతున్నా..అవంతరాలు ఎదురైనా కూడా చివరకు న్యాయమే గెలుస్తుంది. పైనుంచి దేవుడు ఆశీర్వదిస్తారు. మిగిలిన 3.74 లక్షల మందికి కూడా త్వరలోనే అన్ని సమస్యలు తొలిగిపోతాయి. అందరికీ మేలు జరుగుతుంది ఆశీస్తున్నాను. మీ అందరికి మంచి జరగాలని మనసారా కోరుకుంటూ..మంచి కార్యక్రమాలు నా ద్వారా దేవుడు అవకాశం కల్పించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.

విజయనగరం జిల్లాకు సీఎం వైయస్‌ జగన్‌ వరాల జల్లు..

  • కురుపాంలో జెఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కాలేజికి నిన్ననే టెండర్లు పిలిచాం. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి.
  • సాలూరులో ట్రైబల్‌ యూనివర్సిటీ త్వరలోనే ఏర్పాటు చేస్తాం. ఇటీవలే కేంద్ర బృందం వచ్చి వెళ్లింది. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి.
  • విజయనగరంలో రూ.500 కోట్లతో జనవరిలోనే మెడికల్‌ కాలేజీకి టెండర్లు పిలిచి మార్చిలో పనులు ప్రారంభిస్తాం
  • ఉత్తరాంధ్ర స్రుజల స్రవంతి పనులు వేగవంతం చేస్తాం. ఆయకట్టుకు నీరిస్తాం.
  • తోటపల్లి ప్రాజెక్టు, గజపతినగరం బ్రాంచ్‌ పనులను త్వరితగతిన పూర్తిచేస్తాం. మరో రెండేళ్లలో రైతులకు అంకితం చేస్తాం
  • తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి రెండేళ్లలో పూర్తి చేస్తాం
  • వెంగళరాయ సాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించి అదనపు ఆయకట్టుకు నీరిచ్చేందుకు ఏడాదిలోపే పూర్తి చేస్తాం
  • రాముడువలస లిప్ట్‌ ఇరిగేషన్, మరో ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలోనే పూర్తి చేస్తాం
  • 12,301 ఇళ్ల పట్టాలు ఇస్తున్న వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీలో మౌలిక వసతులకు ఇప్పుడే శ్రీకారం చుడుతున్నాం. 18 నెలల్లోనే పూర్తి చేస్తామని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
Back to Top