తాడేపల్లి: కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైయస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ నిధి కింద వరుసగా మూడో ఏడాది మొదటి విడతగా 52.38 లక్షల మంది రైతులకు రూ.3,928.88 కోట్ల పంటల పెట్టుబడి సాయాన్ని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి నేరుగా అన్నదాతల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ..కరోనా కష్టకాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడారు. దేశంలో కేవలం రెండు కంపెనీలే వ్యాక్సీన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయని చెప్పారు. ఈ రెండు కంపెనీలు నెలకు 7 కోట్ల డోసులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని కోరారు. దేశంలో 18 ఏళ్లుపైబడ్డ వారికి 172 కోట్ల టీకా డోసులు అవసరమవుతాయని చెప్పారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం 18 కోట్ల టీకా డోసులు మాత్రమే అన్నారు.ఏపీలో 18 ఏళ్లుపైబడ్డ వారికి 7 కోట్ల టీకా డోసులు కావాలన్నారు. ఇప్పటి వరకు కేంద్రం ఏపీకి ఇచ్చింది 73 లక్షల టీకా డోసులు మాత్రమే అన్నారు. ఉత్పత్తి పెంచితే రాష్ట్రంలో సకాలంలో టీకా వేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.