గ్రామ స్వరూపంలో మార్పు తీసుకొద్దాం 

గ్రామ సచివాలయాల నిర్మాణం వేగవంతం చేయాలి

జనతాబజార్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలి

రూ.12 వేల కోట్లతో కొత్త రోడ్ల పనులు కూడా మంజూరు

అంగన్‌వాడీ సెంటర్ల నిర్మాణానికి స్థలాలను సేకరించాలి

జనవరి 10 నుంచి 45 రోజుల పాటు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న‌ రోడ్ల మ‌ర‌మ్మ‌తులు 

కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం

తాడేపల్లి: ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్‌ క్లినిక్, ప్రీ ప్రైమరీ స్కూల్, జనతా బజార్లతో గ్రామల స్వరూపం మారుతోందని, మార్పు తీసుకొద్దామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. పలు అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రగతిపై చర్చించారు. ఆ తరువాత గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, వైయస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణాలపై, రహదారుల కోసం భూసేకరణపై సీఎం సమీక్షించారు. కలెక్టర్లు, ఎస్పీలకు పలు కీలక ఆదేశాలిచ్చారు.
 
ఒక్క ఏజెన్సీకి ఒక పని మాత్రమే..
గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు, అంగన్‌వాడీ సెంటర్లు, విలేజ్‌ క్లినిక్‌లకు ఉపాధి హామీ పథకం ప్రాధాన్యతా పనుల్లో ఒక ఏజెన్సీకి ఒక పని మాత్రమే అప్పగించాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని నిర్మాణాల ప్రగతిని సమీక్షించాలని, విలేజ్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. 

ఫిబ్రవరి చివరి నాటికి పనులు పూర్తికావాలి..
‘మనబాడి నాడు–నేడు’ కింద ప్రభుత్వ పాఠశాలు, కాలేజీలు, సంక్షేమ హాస్టళ్లలో చేస్తున్న అభివృద్ధి పనులపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షించారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి స్కూళ్లలో నాడు–నేడు పనులు పూర్తి కావాలన్నారు. ప్రతి బిల్డింగ్‌ను ఒక యూనిట్‌గా తీసుకొని దృష్టిపెట్టాలి. నాడు–నేడు పనులు రెగ్యులర్‌గా మానిటరింగ్‌ చేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీ సెంటర్ల నిర్మాణం కోసం స్థలాలను సేకరించాలి. అంగన్‌వాడీ సెంటర్లను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నామని వివరించారు.

భూముల గుర్తింపు పూర్తికావాలి..
ఎంపీఎఫ్‌సీల నిర్మాణానికి భూములు గుర్తించాలని, జనవరి 31 నాటికల్లా భూముల గుర్తింపు ప్రక్రియ పూర్తిచేయాలని కలెక్టర్లు, ఇతర అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. గ్రామాల్లో జనతాబజార్ల నిర్మాణంపై దృష్టిసారించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది గ్రామ స్వరూపంలో పూర్తి మార్పు వస్తుందన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, ఆర్బీకే, విలేజ్‌ క్లినిక్, ప్రీ ప్రైమరీ స్కూల్, జనతా బజార్లతో గ్రామల స్వరూపం మారుతుందన్నారు. రైతు భరోసా కేంద్రాల పక్కనే ఎంపీఎఫ్‌సీలు వస్తాయన్నారు. 

యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు
రోడ్లు, భవనాల శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షించారు. ఆర్‌అండ్‌బీకి సంబంధించి 31 ఎన్‌హెచ్‌ ప్రాజెక్టులు ఉన్నాయని, 915 కిలోమీటర్లకు సంబంధించి రూ.9,751 కోట్ల ఖర్చుతో రోడ్లు నిర్మిస్తున్నారని చెప్పారు. రూ.12 వేల కోట్లతో కొత్త రోడ్ల పనులు కూడా మంజూరయ్యాయని చెప్పారు. వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తిచేయాలని సూచించారు. రోడ్ల మరమ్మతులపై ఈనెల 10 లోగా టెండర్లు పూర్తిచేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో రోడ్లను పట్టించుకోలేదన్నారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయని, జనవరి 10 నుంచి 45 రోజుల పాటు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.

స‌మీక్షలో సీఎంతో పాటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్‌ అండ్ బి ముఖ్యకార్యదర్శి ఎం టి కృష్ణబాబు, గృహనిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

Back to Top