ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టుకోవడమే లక్ష్యం

ఐసీఐడీ సదస్సులో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

ఏపీలో సాగునీటి రంగం, వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉంది

సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం

విశాఖ: ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యమ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోంద‌ని, వర్షం కురిసేది తక్కువ కాలమే.. ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకుంటున్నామ‌ని చెప్పారు. రాష్ట్రంలో సాగునీటి రంగం, వ్య‌వ‌సాయ రంగాల‌పై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారించింద‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తెలిపారు. విశాఖ‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో ఐసీఐడీ కాంగ్రెస్‌ ప్లీనరీని కేంద్రమంత్రి షెకావత్‌తో కలిసి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించారు. ఈ స‌ద‌స్సులో సుమారు 90 దేశాల నుంచి ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు హాజ‌ర‌య్యారు.  ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌సంగించారు.  

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏమ‌న్నారంటే..
 

గౌరవనీయులైన కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్‌ షెకావత్‌ గారికి, ఐసీఐడీ అధ్యక్షులు శ్రీ రగాబ్‌ రగాబ్, ఐసీఐడీ ఉపాధ్యక్షుడు కుష్వేందర్‌ ఓహ్రా, ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యులకు, అంతర్జాతీయ మరియు జాతీయ సంస్థల ప్రతినిధులకు, ఇతర ప్రతినిధులందరికీ శుభోదయం.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 25వ ఇంటర్నేషనల్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌ కాంగ్రెస్‌(ఐసీఐడీ) మరియు 74వ అంతర్జాతీయ కార్యనిర్వాహక కమిటీ (ఐఈసీ) సమావేశాన్ని  ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు వారం రోజులపాటు అందమైన విశాఖపట్నం నగరంలో నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం.

ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖులకు  నా హృదయపూర్వక స్వాగతం. ఈ సదస్సుకు హాజరైన మీ అందరికీ విశాఖపట్నం చాలా ఆహ్లాదకరమైన మరియు చక్కటి అనుభూతి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్‌ను నిర్వహించాలనే మా ప్రతిపాదనను అంగీకరించినందుకు ఇండియన్‌ నేషనల్‌ కమీషన్‌ ఫర్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజీ (ఐఎన్‌సీఐడీ)కు, భారత ప్రభుత్వానికి మరియు  ఐసీఐడీకు చెందిన ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి కృతజ్ఞతలు. 

సుస్థిర వ్యవసాయ నీటి నిర్వహణ అనే విస్తృత లక్ష్యానికి అనుగుణంగా ఐసీఐడీ స్థాపించడం జరిగింది. ఈ ఫోరమ్‌ నీటిపారుదల, డ్రైనేజ్‌ మరియు వరద నిర్వహణ రంగాలలో అందిస్తున్న సహకారం ప్రశంసనీయమైనది.  

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 40 ప్రధాన, మధ్యతరహా, చిన్న నదులు ఉన్నాయి. ఈ రాష్ట్రం వ్యవసాయం, నీటిపారుదల రంగాలలో  శతాబ్దాలుగా గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. కరువు పీడిత, మెట్ట ప్రాంతాలలో నీటిపారుదల సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి గౌరవనీయులైన ప్రధానమంత్రి ఊహించిన విధంగా ’మోర్‌ క్రాప్‌ పర్‌ డ్రాప్‌’ అనే భావనను అవలంభించడం ద్వారా ప్రతి నీటి బొట్టుకు వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశంలోని ప్రతి రాష్ట్రం ఈ తరహా సవాళ్లను ఎదుర్కొంటుందనడంలో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పెద్ద తీరప్రాంతాన్ని కలిగి ఉన్నప్పటికీ, రాయలసీమ మరియు దక్షిణ కోస్తాలోని పశ్చిమ ప్రాంతాలు తక్కువ వర్షపాతం కారణంగా తరచుగా కరువు బారిన పడుతున్నాయి. ఇది ఆ ప్రాంతాల ప్రజల జీవన స్థితిగతులను దెబ్బతీస్తుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్‌ అన్నింటికన్నా దిగువ నదీతీర రాష్ట్రంగా ఉన్నందున వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా మరియు పెన్నా వంటి ప్రధాన అంతర్రాష్ట్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో  తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు నీటి కొరత సమస్యను ఎదుర్కొంటుంది. అధికవర్షాల కారణంగా వరదల వలన ఈ నదుల పరివాహక ప్రాంతాల్లో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాం. 
దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి  సమర్ధవంతమైన  నీటిపారుదల నిర్వహణ మాత్రమే మంచి పరిష్కారం చూపుతుంది. ఇవాల్టి టాపిక్‌ కూడా వ్యవసాయరంగంలో నీటి కొరతను అధిగమించడం ఎలా అన్న అంశంపైనే.

సాగునీటిరంగంలో నీటికొరత అంశం అనగానే ఎవరికైనా వెంటనే మైక్రో ఇరిగేషన్, స్ప్రింక్లర్స్‌ గుర్తుకు వస్తాయి. నీటిని ఎలా వినియోగించుకోవాలనేదానికి ఈ తరహా ఆలోచనలు అవసరమే.
కానీ నా  అభిప్రాయం ప్రకారం వర్షాకాలంలో నీటి బదలాయింపు అంశంపై మరింత విస్తృతంగా చర్చ జరగాలి. జూన్, జూలై, ఆగష్టు, సెప్టెంబరు నెలలు వర్షాకాలం. ఈ కాలంలో వర్షాలు పడి నదులు ప్రవహిస్తూ ఉంటాయి. వర్షాలు కురిసే కాలం తక్కువగా ఉన్నా.... వర్షపాతం అధికంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైన పరిస్థితులకు మనందరం సాక్షులం. 
ఇలాంటి సమయంలో నీటిని ఒక బేసిన్‌ నుంచి మరొక బేసిన్‌కు తరలించడం  సవాల్‌తో కూడుకున్నదైనా.. దీని ద్వారా వ్యవసాయరంగంలో నీటి కొరత సమస్యను అధిగమించవచ్చు. ఇది నా గట్టి నమ్మకం. నిర్ణీత కాలవ్యవధిలో ఇలా ఒక బేసిన్‌ నుంచి మరొక బేసిన్‌కు నీటిని తరలించగలిగితే... ఆయా రిజర్వాయర్లలో నీటి సామర్ధ్యాన్ని సమర్ధవంతంగా నిర్వహించగలుగుతాం. కాలువల ద్వారా అత్యంత తక్కువ ఖర్చుతో ఒక బేసిన్‌ నుంచి మరో బేసిన్‌కు నీటిని తరలించగలుగుతాం. ఈ అంశంపై కౌన్సిల్‌ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దీనిపై చర్చ జరగాలి. 

ఈ కమిషన్‌ స్థిరమైన నీటి నిర్వహణకు సంబంధించిన అన్ని సమస్యలను సమగ్రంగా పరిష్కరిస్తుందని... మరియు సాంకేతికంగా సాధ్యమయ్యే, ఆర్థికంగా లాభదాయకమైన, సామాజికంగా ఆమోదయోగ్యమైన, పర్యావరణ అనుకూల పరిష్కారాలను రూపొందిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. 
మరొక్కసారి ఈ కమిషన్‌కు నా తరపున అభినందనలు తెలియజేస్తున్నాను.
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఈ సదస్సు నిర్వహణకు అవకాశం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, కమిషన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 
మనందరం కలిసి మరింత సురక్షితమైన నీటి మరియు ఆహార ప్రపంచానికి తోడ్పడగలమని భావిస్తున్నాను. ఈ కాంగ్రెస్‌ యొక్క క్రమశిక్షణ, ఆలోచనలు, చర్చ మరియు వాటి సిఫార్సులు.. నీటిపారుదల, డ్రైనేజ్‌ మరియు వరద నిర్వహణ రంగాల భవిష్యత్తుపై శాశ్వత ప్రభావాన్ని చూపుతాయి. అందరికీ మరొక్కసారి అభినందనలు అంటూ సీఎం తన ప్రసంగం ముగించారు.

Back to Top