విజయవాడ: పేదల ఆవసరాలు- ఆకాంక్షలు- ప్రగతి లక్ష్యంగా వీరి ఆకాంక్షల్ని – అవసరాల్ని– ప్రగతిని దృష్టిలో ఉంచుకుని, గత 50 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యానికి అర్ధం తెచ్చిందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక న్యాయం అన్నది కేవలం నినాదం కాదు... అది అమలు చేసే విధానం అని నిరూపిస్తూ... రాష్ట్ర మంత్రి మండలిలో ఏకంగా 68 శాతం పదవుల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకే ఇచ్చామన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి వైయస్.జగన్, వైయస్.భారతి దంపతులు హాజరయ్యారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం వైయస్ జగన్ జాతీయజెండాను ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవవందాన్ని స్వీకరించచారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే...: మహనీయుల త్యాగనిరతిని గుర్తు చేస్తూ... గాంధీజీ ఇచ్చిన అహింస–శాంతి సందేశాన్ని... భగత్‌సింగ్ –సుభాష్ చంద్రబోస్ సాహసాన్ని... మన టంగుటూరి, అల్లూరి, పింగళి త్యాగ నిరతిని... వేలూ, లక్షల స్వాతంత్య్ర సమర యోధుల బలి దానాల్ని... గుర్తు చేస్తూ ఈ రోజు మన జాతీయ జెండా ఎగురుతోంది. మువ్వన్నెల జెండా- 140 కోట్ల భారతీయుల గుండె. ఈ జెండా... 140 కోట్ల భారతీయుల గుండె. ఈ జెండా... కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు... జాతీయ పోరాటానికి, దానికి సమాంతరంగా జరిగిన సంఘ సంస్కరణ ఉద్యమాలకు ప్రతీక. ఇది ఎప్పటికీ చెక్కు చెదరని భారతీయ సమైక్యతకు, భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నం. ఇది మన దేశ సార్వ భౌమత్వానికి, ప్రజాస్వామ్యానికి... 76 సంవత్సరాల క్రితం.. మన పూర్వీకుల త్యాగాల పునాదులమీద మన దేశం సాధించిన స్వతంత్రానికి గుర్తు. అంతటి గొప్ప జెండా.. నిరంతరం మనకు స్ఫూర్తినిస్తుంది. అలాంటి ఈ జెండాకు మొత్తం రాష్ట్ర ప్రజల తరఫున సెల్యూట్ చేస్తూ... ఈ రోజు కొన్ని ప్రత్యేక విషయాలను ఈ వేదికమీద నుంచి ప్రస్తావిస్తున్నాను. 76 ఏళ్ల ప్రయాణంలో ఈ దేశం, మన రాష్ట్రం ఎంతగానో పురోగమించాయని చెప్పటానికి కావాల్సిన ఉదాహరణలు అనేకం కనిపిస్తాయి. ఆర్థిక వ్యవస్థకు మూలమైన మూడు రంగాల్లోనూ... అంటే వ్యవసాయం, పరిశ్రమ, సేవల రంగం... ఈ మూడింటిలోను ఇంతటి సుదీర్ఘమైన ఈ 76 ఏళ్ల కాలంలో ఎంతో ప్రగతి కనిపిస్తుంది. కానీ, అదే సమయంలో, స్థూలంగా కనిపించే ఈ వేగాన్ని అందుకోలేని... అందుకునే అవకాశాలు తగినంతగా రాని కుటుంబాలు, వర్గాలు, సామాజిక వర్గాలు, ప్రాంతాలు ఈ ఏడు దశాబ్దాల ప్రయాణంలో ఇంకా వెనకబడే ఉన్నాయి, కనిపిస్తాయి. పేదల ఆవసరాలు- ఆకాంక్షలు- ప్రగతి లక్ష్యంగా.. వీరి ఆకాంక్షల్ని – అవసరాల్ని– ప్రగతిని దృష్టిలో ఉంచుకుని, గత 50 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా... మనం చేసిన ప్రధాన మార్పుల్ని క్లుప్తంగా వివరిస్తాను. 1) మొదటిది... గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం అంటే.. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అదే గ్రామంలో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, విలేజ్ క్లినిక్కుల ఏర్పాటుతో ఈ 50 నెలల్లోనే గ్రామ స్వరాజ్యానికి అర్ధం తెచ్చాం. వీటన్నింటితోపాటు బ్రాడ్ బ్యాండ్ సదుపాయంతో అక్కడే కడుతున్న డిజిటల్ లైబ్రరీలు కూడా గ్రామాల్లో మన కళ్ల ఎదుటే నిర్మాణంలో ఉన్నాయి. ఇది... ఈ 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మరే ప్రభుత్వం చేయని గొప్ప మార్పు. గ్రామ స్వరాజ్యానికి ఇది గొప్ప నిదర్శనం. పౌర సేవల్లో ఏది కావాలన్నా... అంటే బర్త్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, పెన్షన్, రేషన్, ప్రభుత్వ పథకాలు... ఇలా ఏది కావాలన్నా ఎక్కడెక్కడో ఉన్న కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితిని పూర్తిగా మార్చి... పౌర సేవల్ని ఇంటింటికీ వెళ్ళి తలుపుతట్టి, చిక్కటి చిరునవ్వుతో డెలివర్ చేసే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం, వాలంటీర్ వ్యవస్ధను తీసుకువచ్చాం. ఇది ఈ 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో డెలివరీ సిస్టంలో మరే ప్రభుత్వం చేయని గొప్ప మార్పు. 3) ప్రభుత్వం ఖర్చుపెట్టే ప్రతి రూపాయిలోనూ కేవలం 15 పైసలు మాత్రమే లబ్ధిదారులైన ప్రజలకు చేరుతున్నాయని దాదాపు 38 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని చెప్పిన మాటలు నానుడిగా మారిపోయి, ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి. అడుగడుగునా లంచాలు, వివక్ష వల్ల ప్రభుత్వ ధనం పేద లబ్ధిదార్లకు చేరని.. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చి ఈ 50 నెలల కాలంలోనే, ఏకంగా రూ.2.31 లక్షల కోట్లను నేరుగా... ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్షకు తావులేకుండా... లబ్ధిదార్ల రాజకీయ పార్టీలు కూడా చూడకుండా పేదల చేతికందేలా.. వారి ఖాతాల్లో వేశాం. ఇది... ఈ 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో గతంలో మరే ప్రభుత్వం అమలు చేయని గొప్ప మార్పు. 4) ఇలా లంచాలు, వివక్ష లేకుండా మనందరి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులో ప్రతి ఒక్క రూపాయినీ, లబ్ధిదార్లు పూర్తిగా సద్వినియోగం చేసుకుని, వారి కుటుంబాలకు గరిష్ఠ ప్రయోజనం కలగాలంటే... ఆ డబ్బును అక్కచెల్లెమ్మల పేరుమీద ఇవ్వాలని నిర్ణయించి... సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రధానంగా అక్కచెల్లెమ్మల పేరుమీద ఉన్న వారి బ్యాంక్ ఖాతాలకే ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం. మహిళా సాధికారత ద్వారా, వారి కుటుంబాల సాధికారతకు ఇలా దార్లు తెరుస్తున్నాం. ప్రతి పథకం అమలులోనూ గతంలో జరగని విధంగా సోషల్ ఆడిట్‌ను తప్పనిసరి చేయటం ద్వారా పారదర్శకంగా లబ్ధిదార్ల జాబితాలను ఎంపిక చేయటంలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నాం. ఇది ఈ 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మరే ప్రభుత్వం చేయని మరో గొప్ప మార్పు కూడా. 5) సామాజిక న్యాయం అన్నది కేవలం నినాదం కాదు... అది అమలు చేసే విధానం అని నిరూపిస్తూ... రాష్ట్ర మంత్రి మండలిలో ఏకంగా 68 శాతం పదవుల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకే ఇచ్చాం. మన ప్రభుత్వంలో అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటే అందులో నలుగురు... ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాల వారే. ఆలయ బోర్డులు మొదలు, వ్యవసాయ మార్కెట్ కమిటీల వరకు అన్నింటా చట్టం చేసి మరీ... ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు 50 శాతం పదవులు ఇచ్చిన తొలి ప్రభుత్వం కూడా మనదే. – ఇది కూడా... ఈ 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మరే ప్రభుత్వం చేయని గొప్ప మార్పుల్లో ఇది కూడా ఒకటి. 6) వికేంద్రీకరణను విధానంగా మార్చుకుని... రాష్ట్రం ఏర్పడిన తరవాత, ఇంతకు ముందు వరకు ఉన్న 13 జిల్లాలకు తోడు, మరో 13 జిల్లాలను ఏర్పాటు చేశాం. – రాజధానుల్ని కూడా మూడు ప్రాంతాల హక్కుగా, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా వికేంద్రీకరణ చేయబోతున్న ప్రభుత్వం కూడా మనదే. – ఏకంగా 15 వేలకు పైగా విలేజ్, వార్డ్ సెక్రెటేరియట్లను ఏర్పాటు చేయటం ద్వారా, వికేంద్రీకరణలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించినది కూడా మనందరి ప్రభుత్వమే. – ఇది... ఈ 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మరే ప్రభుత్వం చేయని ఇంకో గొప్ప మార్పు. 7) ఈ నాలుగేళ్ల పాలనలోనే, రూపం మార్చుకున్న అంటరానితనం మీద, పేద వర్గాలను అణచివేస్తున్న ధోరణులమీద యుద్ధాన్ని ప్రకటించాం. –అంటరాని తనం అంటే, ఫలానా వ్యక్తులు కేవలం భౌతికంగా ముట్టుకోటానికి వీల్లేదని దూరం పెట్టటం మాత్రమే కాదు... అంటరాని తనం అంటే... పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టటం, డబ్బున్నవారి పిల్లలకు ఒక మీడియం... పేదల పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటించి... పేదల పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని బరితెగించి వాదించటం కూడా అంటరానితనమే. – అంటరాని తనం అంటే... పేదలు ఏ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారో ఆ ఆసుపత్రుల్లో ఉచిత సేవలు అందకుండా చేయటం... పేదలు ఏ బస్సు ఎక్కుతున్నారో ఆ బస్సును ప్రై వేటుకు అమ్మేయాలని చూడటం... అంటరానితనం అంటే... పేదలు కోరుకునే చిన్నపాటి ఇళ్ళ స్థలాన్ని, ఇంటిని వారికి ఇవ్వకుండా, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం కూడా అంటరానితనమే. – అంటరానితనం అంటే... చివరికి కోర్టుల్లో రకరకాల కేసులు వేసి... పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి, ఇళ్ళు కట్టటానికి వీల్లేదని అడ్డుకోవటం కూడా అంటరానితనమే. –అంటరానితనం అంటే... ఏ పౌర సేవ కావాలన్నా పేదలు, మధ్యతరగతి వర్గాలవారు కార్యాలయాలు, కమిటీల చుట్టూ తిరిగేలా వారి సహనాన్ని పరీక్షించటం... – అవ్వాతాతలు పెన్షన్ అందుకోవాలన్నా, రైతన్నలకు ఎరువులు కావాలన్నా పొద్దున్నే లేచి పొడవాటి క్యూల్లో నిలబడి... చివరికి ఆ క్యూలలోనే మనుషులు చనిపోతున్నా పాలకుల గుండెలు కరగకపోవటం... ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరాని తనంలో, పేదల మీద పెత్తందారీ భావజాలంలో భాగాలే. రూపం మార్చుకున్న అంటరానితనంపై పోరాటం –స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్ళు గడుస్తున్నా, ఇప్పటికీ అలాగే మిగిలి ఉన్న... ఈ రూపం మార్చుకున్న అంటరానితనం మీద, పలు రూపాల్లో ఉన్న ఈ పెత్తందారీ భావజాలం మీద యుద్ధం చేస్తున్న ప్రభుత్వం మనది. –పేదలు గెలిచే వరకు... వారి బతుకులు బాగుపడేవరకు ఈ యుద్ధం కొనసాగుతుంది. – 1947కు ముందు మనల్ని వేరే జాతి, వేరే దేశం పరిపాలిస్తే... దాన్ని మనం పరాయి పాలన అన్నాం. గొప్పదైన ఈ ప్రజాస్వామ్యంలో, ఇప్పటికి కూడా, మేం ఎప్పటికీ అధికారాన్ని అందుకోలేం అని, ఎప్పటికీ ఫలానా వారితో పోటీ పడలేం అని ఏ ఒక్క సామాజిక వర్గం, ఏ ఒక్క ప్రాంతం... ఏ ఒక్క కుటుంబం అనుకోకుండా మనమంతా సహకరిస్తేనే ప్రజాస్వామ్యానికి, స్వాతంత్య్రానికి సహజమైన అర్థం. అదే మన నవరత్నాల పాలనకు పరమార్థం. 8) ఇక, మరో ముఖ్యమైన మార్పును కూడా తీసుకు రాగలిగాం. – గొప్పదైన మన ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సమయంలో పార్టీ తరఫున ఇచ్చిన మేనిఫెస్టోను... ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేసే దుష్ట సంప్రదాయాన్ని తుదముట్టించాం. –ఎన్నికలు అయిన తరవాత... మళ్ళీ అదే మేనిఫెస్టోను ఇంటింటికీ పంపి... ఈ మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి, ఇందులో ఇవి చెప్పాం.. ఇవి చేశాం... ఇలా 98.5 శాతం వాగ్దానాల్ని ఇప్పటికే అమలు చేశాం అని ప్రింట్ కొట్టి మరీ ప్రజల గడపగడపకూ వెళ్ళటం.., వారికి ఆ అమలు చేసిన మేనిఫెస్టోను చూపి వారి ఆశీస్సులు తీసుకోవటం ఇది, ఈ 76 ఏళ్ల స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో... మరే ప్రభుత్వం చేయని ఒక మహా సాహసం... ఒక పెద్ద మార్పు కూడా. 9) మరో మార్పు– అర్హత ఉండి కూడా ఏ కారణం చేత అయినా, ప్రభుత్వ పథకాలను అందుకోలేకపోయిన వారికి న్యాయం చేయటానికి సంబంధించినది. – సకాలంలో దరఖాస్తు చేసుకోకపోవటం వల్లో, వెరిఫికేషన్ సమయంలో అందుబాటులో ఉండకపోవటం వల్లో, ఇతరత్రా మరే కారణాల వల్లో సంక్షేమ పథకాలను అందుకోలేకపోయిన వారందరికీ మళ్ళీమళ్ళీ అవకాశం ఇచ్చి... ఈ లెఫ్ట్ ఓవర్ బెనిఫీషియరీలకు కూడా పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా భారతదేశ చరిత్రలో... మనది మాత్రమే. ఇది ఈ 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మరే ప్రభుత్వం చేయని ఇంకో గొప్ప మార్పు. ఆరు ప్రధాన రంగాల్లో మార్పు- క్లుప్తంగా.. నా ప్రసంగాన్ని ముందుకు తీసుకువెళుతూ... 6 ప్రధాన రంగాల్లో, మన ప్రభుత్వం తీసుకు వచ్చిన మార్పుల్లో మచ్చుకు 10 ప్రధాన మార్పుల్ని క్లుప్తంగా మీ ముందు ఉంచుతాను. అన్నదాతకు అండగా- సాగురంగంలో మార్పులు మొదటగా– మన వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన ప్రధానమైన 10 మార్పుల్ని చూస్తే... 1) రాష్ట్రంలోని 52 లక్షల మంది రైతన్నలకు ప్రతి ఏటా రూ.13,500 చొప్పున రైతు భరోసా పెట్టుబడి సాయంగా అందిస్తున్న ప్రభుత్వం మనది. 2) విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతుకు తోడుగా ఉండేలా, దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఏకంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను గ్రామ స్థాయిలోనే ఏర్పాటు చేసి రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తున్న ప్రభుత్వం కూడా మనది. 3) పంటల బీమాగా రైతన్న ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా... మొత్తం పంటల బీమాను చెల్లిస్తున్న ప్రభుత్వం మనదే. – ఆర్బీకే స్ధాయిలోనే ఈ క్రాప్‌ను అమలు చేయటం ద్వారా, పంట పండించే రైతన్నకు ప్రతి విషయంలోనూ పారదర్శకంగా మంచి చేస్తున్న ప్రభుత్వం కూడా మనది. 4) ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోగానే, రైతులకు నష్టపరిహారం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా మనదే. 5) వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందిస్తున్న ప్రభుత్వం మనది. ఆక్వా జోన్లలో ఉన్న ఆక్వా రైతులకు, రూ.1.50కే విద్యుత్తు ఇస్తున్న ప్రభుత్వం కూడా మనదే. 6) పాడి రైతుకు పాల వెల్లువ కార్యక్రమం ద్వారా, ఈ 50 నెలల్లోనే... లీటరుకు రూ.10 నుంచి రూ. 22 వరకు అదనంగా ఆదాయం సమకూర్చిన ప్రభుత్వం కూడా మనదే. 7) మూతపడిన చిత్తూరు డెయిరీ సహా... సహకార సంఘాలకు జీవం పోసిన ప్రభుత్వం కూడా మనదే. 100 ఏళ్ల తర్వాత సమగ్ర సర్వే... 8) 100 ఏళ్ళ తరవాత, మళ్ళీ సమగ్ర భూ సర్వే చేసి, రికార్డులు అప్‌డేట్ చేసి... ఇక భూ వివాదాలకు స్వస్తి పలుకుతూ రైతులకు మంచి చేస్తున్న ప్రభుత్వం మనది. 9) ఏకంగా 19.17 లక్షల కుటుంబాలకు మేలు చేస్తూ... 34.72 లక్షల ఎకరాలను, ఈ 50 నెలల కాలంలోనే పూర్తి హక్కులతో రైతులు, భూయజమానుల చేతిలో ఉంచాం. – ఇందులో 20 ఏళ్ళు దాటిన అసైన్డ్ భూముల సాగు హక్కుదార్లకు వాటి మీద పూర్తి హక్కులు కల్పించటం ద్వారా 15.21 లక్షల సాగు హక్కుదార్లను 27.41 లక్షల ఎకరాలకు యజమానులుగా చేయటం జరిగింది. ఇందులో ప్రధానంగా ఎస్సీ బీసీ వర్గాల వారే ఎక్కువగా ఉన్నారు. –1.54 లక్షల ఎస్టీ రైతులకు 3.23 లక్షల ఎకరాలను డీకేటీ/ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాగా ఇవ్వటం జరిగింది. – చుక్కల భూముల జాబితా నుంచి 1.07 లక్షల రైతులకు చెందిన 2.06 లక్షల ఎకరాల భూముల్ని తొలగించి వారిని పూర్తి హక్కుదార్లుగా మార్చటం జరిగింది. – వీరితోపాటు షరతులు గల పట్టా కలిగిన మరో 22 వేల మంది రైతులకు 33 వేల ఎకరాల మీద పూర్తి హక్కులు ఇవ్వటం జరిగింది. వడి,వడిగా సాగునీటి రంగం 10) సాగునీటి రంగాన్ని తీసుకుంటే.. జలయజ్ఞంలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నాం. ఇప్పటికే నెల్లూరు బ్యారేజి, సంగం బ్యారేజి, అవుకు రెండో టన్నెల్ పూర్తి చేశాం. – భూ సేకరణ, పునరావాస సమస్యలన్నింటినీ పరిష్కరించటంతో పాటు కాల్వల సామర్థ్యాన్ని పెంచి పులిచింతల, గండికోట, చిత్రావతి, పైడిపాలెం, బ్రహ్మం సాగర్ రిజర్వాయర్లన్నింటిలో నీటిని పూర్తి స్థాయిలో నింపగలుగుతున్నాం. – రాయలసీమ ప్రాజెక్టుల్లోకి శ్రీశైలం నుంచి వరద సమయంలో త్వరిత గతిన నీరు నింపేందుకు కాల్వల సామర్థ్యం పెంచటంతోపాటు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. –వెలుగొండ ప్రాజెక్ట్‌లో మొదటి టన్నెల్ మనమే పూర్తి చేసి... రెండో టన్నెల్ పనులు మరో రెండు నెలల్లో పూర్తికాబోతున్నాయి. – ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్లో భాగంగా వంశధార ఫేజ్–2, వంశధార–నాగావళి నదుల అనుసంధానం పనులు పూర్తి చేసి డిసెంబర్ కల్లా ప్రారంభించనున్నాం. –తోటపల్లి, తారకరామ తీర్థ సాగర్ పనులు 2024కు పూర్తి చేయబోతున్నాం. – రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, సాంకేతిక సమస్యలన్నింటినీ అధిగమించి వడివడిగా పోలవరం పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టును 2025 జూన్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. – మొత్తం మీద, గత ప్రభుత్వంలో మాదిరిగా ప్రాజెక్టులు ఫలితాలు రాకుండా, అవినీతే ధ్యేయంగా ఇష్టారాజ్యంగా ఖర్చుపెట్టకుండా, ఉన్న వనరుల్ని సద్వినియోగపరుస్తూ... ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకుంటూ ఆయకట్టును పెంచుకుంటూ ప్రాధాన్య క్రమంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తున్నాం. విద్యారంగంలో సమూల మార్పులు... రెండో విషయంగా– మన విద్యా వ్యవస్థలో మచ్చుకు, ప్రధానమైన 10 మార్పులు గురించి చెబుతాను. 1) ఏటా దాదాపు 83 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ, 44 లక్షల తల్లులకు ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్‌లతో కలిపి... ఏటా రూ.15,000 వారి చేతికి అందిస్తూ... వారి కుటుంబాలకు మేలు చేస్తూ, ఆ పిల్లల చదువుల్ని ప్రోత్సహిస్తూ, చదివించే అమ్మలకు తోడుగా,అండగా నిలబడుతూ అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నాం. 2) నాడు–నేడు ద్వారా 45,000 గవర్నమెంట్ బడుల రూపు రేఖల్ని మారుస్తున్నాం. 12 అంశాలను తీసుకుని వాటిని ప్రతి స్కూళ్లో ఉండేటట్టుగా రూపురేఖలు మారుస్తున్నాం. 3) గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను అమలు చేస్తున్నాం. బైలింగ్యువల్ పాఠ్యపుస్తకాలు పిల్లలకు అందజేస్తున్నాం. ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజీ ఏర్పాటు చేశాం. 4) 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ విధానాన్ని అమలు చేస్తున్నాం. 3వ తరగతి నుంచే టోఫెల్ ఓరియంటేషన్‌తో శిక్షణ ఇచ్చేలా ఈటీఎస్ ప్రిన్స్‌టన్‌తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. – మన పేద విద్యార్థుల్ని కూడా గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దే క్రమంలో రాబోయే రోజుల్లో స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను పెంచుతూ.... ఐబీ, ఐజీసీఎస్‌ఈ సిలబస్‌ను, కరిక్యూలమ్‌ను సైతం తీసుకొచ్చే దిశగా... అడుగులు వేస్తున్నాం. మనం ప్రపంచంతో పోటీపడుతున్నాం... ఆ పోటీలో గెలిచే విధంగా సత్సంకల్పంతో అడుగులు వేస్తున్నాం. –ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్‌రూమ్‌నూ డిజిటలైజ్ చేస్తూ, ప్రతి తరగతి గదిలోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్‌పీ)లను ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాది డిసెంబరు కల్లా.. ఆరోతరగతి నుంచి ప్రతి తరగతి గదిలోనూ ఐఎఫ్‌పీల ఏర్పాటు ద్వారా డిజిటలైజేషన్ పూర్తవుతుంది. 5) పేద పిల్లలకు ట్యూటర్‌గా ఉపకరించే బైజూస్ కంటెంట్‌ను గవర్నమెంట్ బడులలో పిల్లలందరికీ ఉచితంగా ఇచ్చాం. 6) ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు అందజేస్తున్నాం. 7)ఈరోజు పిల్లల తినే భోజనం మీద కూడా ధ్యాసపెట్టే ప్రభుత్వం ఉందని రుజువు చేస్తూ.. రోజుకో మెనూతో, ప్రభుత్వ బడుల్లో పౌష్టికాహారంగా గోరుముద్ద అనే పథకాన్ని తీసుకొచ్చి తోడుగా నిలబడుతున్నాం. 8) డిగ్రీ స్థాయిలోనే 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. ఫీజులే కాక, పిల్లల భోజనం, వసతి ఖర్చుల కోసం రూ. 20 వేల వరకు వసతి దీవెనగా ఇస్తున్న ప్రభుత్వం మనది మాత్రమే. – ప్రపంచ స్థాయిలో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న దాదాపుగా 330 కాలేజీల్లో, 21 ఫ్యాకల్టీల్లో సీటు తెచ్చుకున్న మన పిల్లలకు రూ.1.25 కోట్లవరకు ఎంత ఖర్చైనా ఫర్వాలేదని.. విదేశీ విద్యా దీవెన ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా మనది. 9) ఈ నాలుగేళ్ల పాలనలోనే... చదువుతున్న పిల్లల డిగ్రీలకు ప్రయోజనం ఉండేలా... కరిక్యులమ్‌ను జాబ్ ఓరియంటెడ్‌గా మార్పు చేశాం. నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులను తీసుకొచ్చాం. 10 నెలల తప్పనిసరి ఇంటర్న్‌షిప్ విధానాన్ని తెచ్చాం. ఆన్‌లైన్ వెర్టికల్స్‌ను కరిక్యులమ్‌లోకి అనుసంధానం చేశాం. – యూనివర్శిటీల్లో, ట్రిపుల్‌ఐటీల్లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న 3295 టీచింగ్ పోస్టుల్ని సైతం భర్తీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 10) ప్రపంచ విద్యారంగంలో వస్తున్న మార్పులన్నింటినీ అధ్యయనం చేసి... మన పిల్లలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వర్చువల్ రియాల్టీ, ఆగ్‌మెంటెడ్ రియాల్టీ సహా ప్రతి రంగంలోనూ వస్తున్న మార్పుల్ని మన విద్యారంగంతో అనుసంధానం చేసుకుంటూ ప్రపంచంతోపాటు అడుగులు ముందుకు వేసేలా... ప్రపంచ స్థాయి విద్యను వారికి అందించేలా... మన విద్యారంగంలో సమూలంగా మార్పులు చేస్తున్నాం. మూడోది– వైద్య ఆరోగ్య రంగం. మూడో అంశం– మన వైద్య ఆరోగ్య రంగంలో తీసుకువచ్చిన మార్పుల్లో మచ్చుకు 10 ప్రధానమైన మార్పుల్ని మీ ముందుంచుతాను. 1) గత వంద సంవత్సరాల చరిత్రలో మన రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే... ఇప్పుడు ఈ 50 నెలల కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం. 2) ఏకంగా మరో 1514 వాహనాలను 108, 104 సేవల కోసం కొనుగోలు చేశాం. దేశంలోకెల్లా గొప్పగా ప్రతి మండలానికీ 2 చొప్పున 104 వాహనాలను, కనీసం ఒక 108 అంబులెన్స్ ఉండేలా అందుబాటులోకి తీసుకువచ్చాం. తల్లీ బిడ్డా ఎక్స్‌ప్రెస్‌తో కలిపి ఏకంగా 2204 వైద్య వాహనాలను నడుపుతున్న ఏకైక రాష్ట్రం మనది మాత్రమే. 3) వైద్య ఆరోగ్య శాఖలో గత నాలుగేళ్ళలో రికార్డు స్ధాయిలో ఏకంగా 53,126 సిబ్బంది నియామకాలు జరిపాం. బహుశా ఈ స్ధాయిలో రిక్రూట్ చేసిన చరిత్ర దేశంలో కూడా ఉందో ? లేదో ? రాష్ట్రంలో మాత్రం ఎప్పుడూ జరగలేదు. –స్పెషలిస్టు డాక్టర్లు దొరక్క, జాతీయ స్థాయిలో 61 శాతం పోస్టులు ఖాళీగా ఉంటే, మన రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ల ద్వారా... ఏకంగా 96.04 శాతం స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల్ని మనందరి ప్రభుత్వం భర్తీ చేసింది. ఇక, కేవలం 3.96 శాతం పోస్టులే ఖాళీగా ఉన్నాయి. – జాతీయ స్థాయిలో నర్సుల పోస్టులు 27 శాతం భర్తీ కాకుండా వదిలేస్తే... మన రాష్ట్రంలో 100 శాతం పోస్టుల్ని భర్తీ చేశాం. జాతీయ స్థాయిలో 33 శాతం ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ కాకుండా వదిలేస్తే... మనందరి ప్రభుత్వం 100 శాతం నియామకాలు పూర్తి చేసింది. 4) ప్రభుత్వ ఆసుపత్రులమీద దృష్టిపెట్టి, ప్రతి మందూ నాణ్యతతో ఉండాలని... డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలు ఉండేలా మార్పులు తెచ్చాం. గతంలో ఈ ప్రమాణాలు లేని 292 రకాల మందులు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటే.. ఈ రోజు ఏకంగా 562 రకాల డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలు కలిగిన మందుల్ని ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులోకి తీసుకువచ్చాం. 5) రాష్ట్ర వ్యాప్తంగా... ఈ నాలుగేళ్లలోనే ఏకంగా 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, 560 అర్బన్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం. ప్రతి వేలేజ్ క్లినిక్‌లోనూ 105 రకాల మందులు, 14 రకాల డయాగ్నస్టిక్ టెస్టులు గ్రామస్ధాయిలోనే అందుబాటులోకి తీసుకువచ్చాం. 6) ప్రతి మండలానికీ రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు ఫుల్‌టైం వైద్యుల చొప్పున ప్రతి మండలానికీ నలుగురితో... ఆయా గ్రామాల్లోని విలేజ్ క్లినిక్‌లకు ఈ నలుగురు డాక్టర్లను అనుసంధానం చేస్తూ... ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్న తొలి ప్రభుత్వం కూడా మనదే. ఇది ప్రివెంటివ్ కేర్‌లో నూతన అధ్యాయం. 7) రూ.5 లక్షల ఆదాయం లోపున్నవారిని... అంటే 95 శాతం జనాభాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చాం. 8) చికిత్స ఖర్చు రూ.1000 దాటితే చాలు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలన్న తపనతో, ఆరోగ్యశ్రీ సేవలు గతంలో 1036 ఉంటే ఇవాళ 3255కు విస్తరించాం. 9) దేశంలో ఎక్కడా లేని విధంగా, చికిత్స చేయించుకున్న రోగికి... విశ్రాంతి సమయంలో తాను ఇబ్బంది పడకూడదని.. నెలకు రూ. 5,000 వరకు ఆరోగ్య ఆసరా ద్వారా సాయం చేస్తున్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే. 10) వైద్య రంగంలో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా, అన్ని ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలను మారుస్తున్నాం. పీహెచ్‌సీల నుంచి మొదలుపెడితే సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రులు... వీటన్నింటì లో కూడా నాడు–నేడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మందుల నుంచి మౌలిక సదుపాయాల వరకు అన్నింటినీ జాతీయ ప్రమాణాలకు అనువుగా మారుస్తున్నాం. మహిళా సాధికారతలో ప్రధానమార్పులు.. నాలుగో అంశం– మన మహిళా సాధికారత పరంగా తీసుకువచ్చిన ప్రధానమైన మార్పుల్లో 10 మార్పుల్ని మీ ముందుంచుతాను. కేవలం ఒక్క రంగంలో కాకుండా... విద్యా, ఆర్థిక, సామాజిక, రాజకీయ, జెండర్, రక్షణ పరమైన సాధికారతలు లక్ష్యంగా ఈ మార్పులు తీసుకువచ్చాం.ఇందులో భాగంగానే... 1) నామినేటెడ్ పోస్టులు, నామినేషన్‌మీద ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం చేసి మరీ అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన తొలి ప్రభుత్వం కూడా మనదే. 2) చదివించే తల్లులకు ప్రోత్సాహకంగా అమ్మ ఒడి తీసుకువచ్చి... 44 లక్షల తల్లులకు ఏటా రూ. 15,000 అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా మనది మాత్రమే. 3) జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన మొదలు... కల్యాణమస్తు–షాదీ తోఫా వరకు ప్రతి పథకంలోనూ పిల్లల చదువుల్ని ప్రోత్సహిస్తూ, ప్రతి రూపాయినీ వారి తల్లుల అకౌంట్‌లోనే జమ చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా మనది మాత్రమే. 4) వైయస్సార్ ఆసరా ద్వారా పొదుపు సంఘాల ఉద్యమానికి మళ్ళీ ఊపిరిపోసి... ఈ రోజు 99.67 శాతం రుణాల రికవరీతో, దేశంలోనే పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు అగ్రగామిగా నిలబడేలా ఆర్థిక సాధికారతకు సహకరించిన ప్రభుత్వం కూడా మనది. 5) వైయస్సార్ చేయూత ద్వారా... 45–60 మధ్య వయసున్న.. 26.39 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు... వారి ఆర్థిక పటిష్ఠతకు ఈ నాలుగేళ్ళలోనే రూ.14,129 కోట్లు సహాయం అందించిన ప్రభుత్వం కూడా మనదే. 6) అలాగే... 45–60 మధ్య వయసున్న కాపు అక్క చెల్లెమ్మలకు, ఈబీసీ అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15,000 కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ద్వారా ఇస్తూ, వారి ఆర్థిక పటిష్ఠతకు తోడ్పాటు ఇస్తున్న ప్రభుత్వం కూడా మనదే. 7) ఇంటికి దీపం ఇల్లాలే కాబట్టి, పేదింటి అక్కచెల్లెమ్మల పేరుమీద, కేవలం ఈ నాలుగేళ్లలోనే ఏకంగా 30 లక్షల ఇళ్ళ పట్టాలు అందజేసిన ప్రభుత్వం కూడా మనదే. 8) ఇలా ఇన్ని లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి, 22 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇళ్ళ నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం దేశ చరిత్రలో మరి ఏ ఇతర రాష్ట్రంలోనూ లేదు. 9) దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసెక్యూటర్ల వ్యవస్థ నెలకొల్పిందీ మనమే. – ఇప్పటివరకు 1.24 కోట్ల మంది అక్కచెల్లెమ్మలు తమ ఫోన్‌లో దిశ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుని... అత్యవసర సమయాల్లో వారు పంపిన ఎస్‌వోఎస్ ఆధారంగా, ఇప్పటి వరకు ఏకంగా మన పోలీసు సోదరులు 30,369 మంది అక్కచెల్లెమ్మలను అత్యవసర సమయంలో ఆదుకున్నది కూడా మన ప్రభుత్వ హయాలంనే. 10) వీటన్నింటితోపాటు... గ్రామగ్రామాన, పట్టణాల్లో వార్డు స్థాయిలో గ్రామ/వార్డు సచివాలయాల్లో దాదాపు 15,000 మంది మహిళా పోలీసుల్ని తీసుకువచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో వీరు కనిపిస్తున్నారు. గ్రామ స్దాయిలోనే మహిళా పోలీసులును తీసుకుని వచ్చి తోడ్పాడు అందిస్తున్న ప్రభుత్వం మనది మాత్రమే. – గ్రామగ్రామానా సేవలందిస్తున్న సేవా సారథుల్లో... ఏకంగా 60 శాతం వాలంటీర్లు.. చదువుకున్న మన ఇరుగుపొరుగు మన ఆడపిల్లలే. ఇది కూడా మనమే తీసుకువచ్చిన అతి పెద్ద మార్పు. సామాజిక మార్పులు దిశగా.. ఇక, అయిదో అంశం– మన సామాజిక వర్గాల పరంగా మనం తీసుకువచ్చిన 10 ముఖ్యమైన మార్పులు మీ ముందు ఉంచుతున్నాను. 1) రాష్ట్ర మంత్రి మండలిలో 68 శాతం పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఇచ్చాం.మన ప్రభుత్వంలో అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటే అందులో నలుగురు... ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాల వారే. ఇది ఒక గొప్ప మార్పు కూడా. 2) శాసన సభ స్పీకర్‌గా ఒక బీసీ, శాసన మండలి ఛైర్మన్‌గా ఒక ఎస్సీ, శాసన మండలి డెప్యూటీ ఛైర్మన్‌గా ఒక మైనార్టీ మహిళను నియమించాం. 3) నామినేటెడ్ పోస్టుల్లో... అంటే, ఆలయ బోర్డుల్లో, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు ఇలా ఏది తీసుకున్నా.. ఛైర్మన్లుగాను, డైరెక్టర్లుగాను 50 శాతం పదవుల్ని, ఏకంగా చట్టం చేసి మరీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కల్పించాం. 4) నామినేషన్ కాంట్రాక్టుల్లో కూడా 50 శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలకు ఇచ్చేటట్టుగా చట్టం చేసిన ప్రభుత్వం మనదే. ప్రతి మాటకు ముందూ నా అంటూ వారికి తోడ్పాటు ఇస్తున్న ప్రభుత్వమూ మనదే. 5) 139 బీసీ కులాలకు 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. 6) శాశ్వత బీసీ కమిషన్‌ను నియమించిన తొలి రాష్ట్రంగా నిలిచాం. 7) ఎస్సీ సోదరుల కోసం... మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ఎస్సీ కమిషన్‌ను వేరుగా, ఎస్టీ కమిషన్‌ను వేరుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం మనదే. 8) అసైన్డ్ భూముల మీద పూర్తి హక్కుల్ని, చట్టంలో సవరణ తీసుకువచ్చి మరీ ఆ బడుగు బలహీన వర్గాల పట్టాదార్లకు పూర్తి హక్కులతో ఇచ్చిన ప్రభుత్వం కూడా మనదే. 9) మన పాలనలో ఈ 50 నెలల్లో అందించిన డీబీటీ అక్షరాలా రూ.2.31 లక్షల కోట్లు అయితే... అందులో ఏకంగా 76 శాతం... ఎక్కడా లంచాలు లేకుండా, వివక్షకు చోటు లేకుండా.. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకే చేరింది. 10) ఇటీవలే.. ఈ నాలుగేళ్ళ కాలంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా, గతంలో ఎన్నడూ చూడని విధంగా ఏకంగా 2,06,638 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను మనం భర్తీ చేశాం. అందులో 80 శాతం ఉద్యోగులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే. పారిశ్రామిక మార్పులు... ఆరో అంశం– మన పారిశ్రామిక–మౌలిక రంగంలో తీసుకు వచ్చిన మార్పుల్లో మచ్చుకు ప్రధానమైన 10 మార్పుల్ని చూస్తే... 1) ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరసగా మూడేళ్ళు మన రాష్ట్రమే దేశంలో నంబర్ వన్ స్ధానంలో ఉంది. 2) రాష్ట్రం ఏర్పడిన తరవాత, ఏర్పడక ముందు... ఈ మొత్తం రాష్ట్ర చరిత్రలో మన రాష్ట్ర సముద్రతీరంలో కేవలం నాలుగు ప్రదేశాల్లోనే పోర్టులున్నాయి. ఈ నాలుగేళ్ల మన పరిపాల మనం నిర్మాణం ప్రారంభించిన పోర్టులు మరో 4. మరో 10 ఫిషింగ్ హార్బర్లు, మరో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తున్నాం. 3) విశాఖలో ఇప్పటికే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇప్పటికే శంకుస్థాపన చేసి...పనులు ప్రారంభించాం. కర్నూల్ ఎయిర్‌పోర్టును ప్రారంభించాం. కడప విమానాశ్రయాన్ని విస్తరించాం. 4) దేశంలో ఏకంగా 11 పారిశ్రామిక కారిడార్లు కడుతుంటే.. అందులో ఏ రాష్ట్రానికీ లేని విధంగా 3 పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం మన రాష్ట్రంలోనే జరుగుతుంది. 5) పెట్టుబడుల ఆకర్షణలో కూడా దేశంలో ముందు వరసలో ఉన్నాం. రాష్ట్రానికి ఇంతకు ముందు ఏనాడూ రాని పారిశ్రామిక దిగ్గజాలు సైతం మన రాష్ట్రానికి ఈ నాలుగేళ్లలోనే పెట్టుబడులతో వచ్చారు. 6) 2019 జూన్ నుంచి నేటి వరకు రాష్ట్రంలో నెలకొల్పిన భారీ పరిశ్రమలు 127. వచ్చిన పెట్టుబడులు– రూ.67,196 కోట్లు. ఇందులో ప్రత్యక్ష ఉద్యోగాలు 84,607. 7) విశాఖలో ఇటీవల మనందరి ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్‌లో ఏకంగా రూ.13.42 లక్షల కోట్లకు ఎంవోయూలు కుదిరాయి. తద్వారా రానున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు 6 లక్షలు. 8) ఈ నాలుగేళ్ళలోనే రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైన ఎంఎస్‌ఎంఈ యూనిట్లు 2,00,995. ఇందులో ఉద్యోగం, ఉపాధి పొందినవారు 12.61 లక్షలు. 9) కోవిడ్ విసిరిన పెను సవాళ్లను తట్టుకుని మన రాష్ట్ర పారిశ్రామిక ర్యాంకును, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈని రక్షించుకోగలిగాం. – ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు, ఎంఎస్‌ఎంఈలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. 10) తమ ఉపాధికి ఊతంగా, తమ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టాలని స్థానికులే ఆహ్వానించేలా, తద్వారా ఉద్యోగ–ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే విధంగా రాష్ట్ర పారిశ్రామిక రంగంలో 75 శాతం ఉద్యోగాలను చట్టం చేసి మరీ స్థానికులకే కేటాయించినది కూడా మన ప్రభుత్వమే. చివరిగా... ఈ విజయవాడ నడిబొడ్డున ఈ నవంబర్ 26న, రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం నాడు... మనం ఆవిష్కరించబోతున్న ఒక మహానుభావుడి ఆకాశమంత వ్యక్తిత్వం సాక్షిగా... మనందరి కర్తవ్యాన్ని గుర్తు చేసే ఆ అంబేద్కర్‌గారి మాటల్ని మీ అందరి ముందు ఉంచి... నా ప్రసంగాన్ని ముగిస్తాను. ‘‘భౌతికంగా ఒక మనిషికి సంకెళ్లు లేకపోయినా... *ఆ మనిషికి భావాల పరంగా స్వేచ్ఛ లేకపోతే...* *అతడు స్వతంత్రంగా బతుకుతున్నట్టు కాదు. అతడు బానిసగా బతుకుతున్నట్టే. అతను భావాల పరంగా ఖైదీయే’’ అన్నారు బాబా సాహెబ్ అంబేద్కర్. –ఒక మనిషి అస్తిత్వానికి మూలం, స్వేచ్ఛా స్వాతంత్రాలకు అర్థం ఏమిటంటే... అతనికి లేదా ఆమెకు ఆలోచనలు, భావాల పరంగా స్వాతంత్య్రం ఉండటం. తన అభివృద్ధికి, తన కుటుంబం అభివృద్ధికి అవకాశాలు ఉండటం. రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్యా స్వాతంత్య్రాలు వారికి ఉండటం. తరతరాల పెత్తందారీ సంకెళ్ళనుంచి పేదలు బయటపడి ఎదిగే వాతావరణం ఉండటం. – పేద వర్గాలకు అటువంటి భావపరమైన, ఆలోచనల పరమైన మరింత స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఇవ్వటానికి త్రికరణ శుద్ధిగా... పేదల ప్రభుత్వంగా, ప్రజా ప్రభుత్వంగా కట్టుబడ్డాం అని స్పష్టం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 76 సంవత్సరాల పూర్తయి... 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటూ... మరొక్కసారి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జైహింద్.