ప్రజావేదికను ఎల్లుండి కూలగొట్టిస్తాం

  సీఎం జగన్ సంచలన ప్రకటన 

ఇక్కడి నుంచే తొలగింపును మొదలుపెడతాం

అక్రమంగా, అవినీతితో ఈ భవనాన్ని కట్టారు 

అమ‌రావ‌తి: అక్రమ కట్టడాల తొలగింపును ఇక్కడి నుంచే ప్రారంభిస్తాం’ అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.  ప్రజావేదిక అన్నది అవినీతితో కట్టిన అక్రమ నిర్మాణం. రేపు పొద్దున ఈ తప్పును మరొకరు చేయకుండా మేం ఆదర్శంగా నిలుస్తామ‌ని,  అందుకోసం ప్రజావేదికను ఎల్లుండి నుంచి కూలగొడతామ‌ని పేర్కొన్నారు.ఎవరైనా సామాన్యులు ఇలాంటి బిల్డింగ్ ను కట్టి ఉంటే ఇప్పటికే తొలగించేవాళ్లని చెప్పారు. ప్రభుత్వమే అక్రమ నిర్మాణాలు చేపడితే బాధగా అనిపించదా? అని ప్రశ్నించారు. సోమ‌వారం నిర్వ‌హించిన క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట్లాడారు. 
మనం కూర్చున్న ఈ బిల్డింగ్ చట్టబద్ధమయినదేనా?  దీన్ని నిబంధనలకు విరుద్ధంగా, చట్టానికి విరుద్దంగా, అవినీతి సొమ్ముతో కట్టారు. ఓ ఇల్లీగల్ బిల్డింగ్ లో ఇంతమంది అధికారులం ఇల్లీగల్ అని తెలిసీ సమావేశం జరుపుకుంటున్నాం. గరిష్ట వరద వస్తే ఇది మునిగిపోతుంది అని ఏకంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒకరు ఈ లేఖను ఇచ్చారు. అందువల్లే అనుమతిని జారీచేయలేమని ఆయన స్పష్టం చేశారు. అయినా టెండర్ అంచనాలను రూ.5 కోట్ల నుంచి రూ.8.9 కోట్లకు పెంచి నిర్మించారు. ఇందుకోసం ఇద్దరు బిడ్డర్లు రాగా, ఒకరిని ఉద్దేశపూర్వకంగా తప్పించారు.  ఇలాంటివి ఉపేక్షించేది లేద‌ని హెచ్చ‌రించారు.

సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలుచేసేందుకు ప్రతి 50 ఇళ్లకు గ్రామ వాలంటీర్లను నియమిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ తెలిపారు. ఈ గ్రామ వాలంటీర్లు అవినీతికి పాల్పడకూడదన్న ఉద్దేశంతోనే వీరికి నెలకు రూ.5,000 గౌరవవేతనం అందజేస్తున్నామని చెప్పారు. ఒకవేళ ఎవరైనా గ్రామ వాలంటీర్లు పొరపాటు చేస్తే ఫిర్యాదు చేయడానిక ఏకంగా సీఎం ఆఫీసులోనే కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. 

కేవలం 50 ఇళ్ల పరిధిలోనే ఉంటారు కాబట్టి వేగంగా విచారణను పూర్తిచేయవచ్చన్నారు. ఒకవేళ తప్పు జరిగినట్లు తేలితే గ్రామ వాలంటీర్లను విధుల నుంచి వెంటనే తొలగిస్తామని హెచ్చరించారు. ఈరోజు అమరావతిలోని ప్రజావేదికలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్ మాట్లాడారు. ఈ నేపథ్యంలో ప్రజావేదికపై జగన్ విమర్శలు గుప్పించారు. ఈ ప్రజావేదికను నిబంధనలను తుంగలో తొక్కి నిర్మించారని దుయ్యబట్టారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top