ఈసారి మ‌న టార్గెట్ @175

 మైలవరం నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భేటీ

తాడేప‌ల్లి: వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175కు 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంద‌డ‌మే మ‌న టార్గెట్ అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు,  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో గురువారం  మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ..  

 

గడప గడపకూ.. గొప్ప కార్యక్రమం:
    మరో 16 నెలల్లో ఎన్నికలు రానున్నాయి. అందుకు చాలా టైమ్‌ ఉంది కదా అని అనుకోవద్దు. గడప గడపకూ కార్యక్రమంతో ప్రజలవైపు  అడుగులు వేగంగా వేస్తున్నాం. ఆ అడుగులు చూస్తే, ఏ స్థాయిలో ఉన్నాయంటే..
    మైలవరం నియోజకవర్గంలో సుమారు 89 శాతం ఇళ్లకు మేలు జరిగింది. వివిధ పథకాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా దాదాపు రూ.900 కోట్ల నగదు నియోజకవర్గంలోని ఇళ్లకు చేరింది. ప్రతి ఇంట్లో ఎంతెంత మేలు జరిగిందన్న పూర్తి వివరాలు కూడా ఉన్నాయి. ఇంత మంచి చేసిన ప్రభుత్వానికి మీ ఆశీస్సులు కావాలన్న గొప్ప కార్యక్రమం. ఎక్కడైనా, ఎవరైనా మిగిలిపోయి ఉంటే, వారిని వదిలేయకుండా మంచి చేయడం కోసం కూడా గడప గడపకూ కార్యక్రమం. 

ఆ నిధులతో ఎంతో అభివృద్ధి:
    మరోవైపు ప్రతి సచివాలయంలో అభివృద్ధి పనుల కోసం రూ.20 లక్షలు కేటాయించాం. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లాలి. ప్రతి సచివాలయంలో కనీసం 2 రోజులు తిరగాలి. కనీసం రోజుకు 5 లేక 6 గంటలు గడపాలని చెబుతున్నాం. దాని వల్ల ఎమ్మెల్యేలు మీకు దగ్గర అవుతారు. దాంతో సచివాలయాలు కూడా మీకు మరింత చేరువవుతాయి. ఇంకా రూ.20 లక్షల పనుల వల్ల గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయి. వీటన్నింటి కోసమే గడప గడపకూ కార్యక్రమం.

మరింత వేగంగా అడుగులు:
    వచ్చే జనవరి నుంచి అడుగులు ఇంకా వేగంగా ముందుకు పడనున్నాయి. బూత్‌ కమిటీలు ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లు. వారిలో ఒకరు మహిళ. వారిని ఎమ్మెల్యే ఎంపిక చేస్తారు. అలాగే ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గృహ సారథులు. ఒక తమ్ముడు. ఒక చెల్లెమ్మ ఉంటారు. వారు ప్రతి పథకాన్ని ప్రజలకు ఇంకా బాగా అందజేస్తారు. ప్రతి పనిలో భాగస్వామ్యులవుతారు. తద్వారా ఏ ఒక్కరూ మిస్‌ కాకుండా చూస్తారు.

టార్గెట్‌ 175:
    ఈసారి మన టార్గెట్‌ 175కు 175. అదే మన లక్ష్యం. అది కష్టం కూడా కాదు. ఎందుకంటే గతంలో ఏనాడూ లేని విధంగా ఇవాళ పరిపాలన సాగుతోంది. కుప్పంలో గతంలో వేరే పార్టీ గెలవలేదు. కానీ ఇవాళ సర్పంచ్‌ పదవులు, మున్సిపాలిటీతో సహా, అక్కడ అన్నీ గెల్చాం.
    గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటే, 89 శాతం ఇళ్లకు పూర్తి పారదర్శకంగా ప్రతి ఒక్కటి అందుతోంది. ఎక్కడా అవినీతికి తావు లేదు.
సచివాలయాలు ఇంటి గడప వద్దే సేవలందిస్తున్నాయి. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వలంటీర్లు. ప్రతి 50 ఇళ్లకు ఇక వలంటీర్‌. ప్రతి ఒక్కరిని చేయి పట్టుకుని నడిపిస్తున్న వ్యవస్థ.

మారుతున్న గ్రామాల రూపురేఖలు:
    ప్రతి గ్రామంలో ఇంగ్లిష్‌ మీడియమ్‌ స్కూల్‌. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మార్పు. 6 నెలల్లో డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌ రాబోతున్నాయి. ఇంకా ఆర్బీకేలు. ప్రతి అడుగులో రైతు చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. విలేజ్‌ క్లినిక్‌లు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌. ఆ విధంగా గ్రామాలు రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. సచివాలయాలు మొదలు విలేజ్‌ క్లినిక్స్‌ వరకు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

టార్గెట్‌ సాధ్యమే:
    ఇంకా ఎక్కడా అవినీతికి తావు లేకుండా పథకాలు అందుతున్నాయి.
గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటే 89 శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. కాబట్టి 175 సీట్లు గెల్చుకోవడం సాధ్యం. కాగా, అందుకు రెండు జరగాలి.
    ఒకటి యథావిథిగా పథకాలు అమలు చేయడం కాగా, రెండోది మీరు, ఎమ్మెల్యే కలిసి, అందరూ ఒక్కటై.. మనం చేస్తున్న పనిని ప్రతి ఇంట్లో వివరించి, వారి ఆశీర్వాదం తీసుకోవాలి. అలా అందరూ కలిసికట్టుగా పని చేస్తే మొత్తం 175 సీట్లు గెల్చుకోగలం. ఇవన్నీ సవ్యంగా జరగడం కోసమే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నాం.

     మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌. పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి (ఎంపీ), మర్రి రాజశేఖర్‌ (మాజీ ఎమ్మెల్యే) తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top