అక్కచెల్లెమ్మలకు తోడుగా తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్‌లు

విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో 500 వాహనాలను ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

ఎయిర్‌ కండీషన్డ్‌తో అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చాం

ఈ వాహనాల్లో తల్లీబిడ్డను సురక్షితంగా ఇంటికి చేరుస్తాం

నాడు–నేడుతో ఆస్పత్రుల వ్యవస్థ రూపురేఖలు మారుస్తున్నాం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం

అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నా

విజయవాడ: ‘ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు మంచి జరగాలని మన ప్రభుత్వం మొట్టమొదటి రోజు నుంచి అడుగులు వేస్తోంది. గర్భవతులైన చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రసవం అనంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు వైయస్‌ఆర్‌ తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్‌ ఎయిర్‌ కండీషన్డ్‌ వాహనాలను ప్రారంభిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవ అనంతరం తల్లీ బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం వైయస్‌ఆర్‌ తల్లీబిడ్డ వాహనాలను సిద్ధం చేసింది. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వేదికగా 500 తల్లీబిడ్డా ఏపీ ఎక్స్‌ప్రెస్‌లను సీఎం వైయస్‌ జగన్‌ జెండా ఊపి ప్రారంభించారు. 

డాక్టర్‌ వైయస్‌ఆర్‌ తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్‌ వాహనాల ప్రారంభానికి ముందు అక్కచెల్లెమ్మలను ఉద్దేశించి  సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. 

‘దేవుడి దయతో మరోమంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దాదాపుగా 500 నూతన ఎయిర్‌కండీషన్డ్‌ వాహనాలను ప్రారంభిస్తున్నాం. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు మంచి జరగాలని ఈ ప్రభుత్వం మొట్టమొదటి రోజు నుంచి అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే గర్భం దాల్చిన వెంటనే చెల్లెమ్మలకు అండగా, తోడుగా ఉంటూ రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. గర్భవతి అయిన చెల్లెమ్మ 108 ఫోన్‌ కొట్టిన వెంటనే వాహనం వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లడమే కాకుండా.. నాణ్యమైన సేవలను ఆస్పత్రుల్లో అందిస్తున్నాం. డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలు కలిగిన మందులు కూడా ఆ చెల్లెమ్మల చేతుల్లో పెడుతున్నాం. ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకునేటప్పుడు ఆ చెల్లెమ్మ ఇబ్బంది పడకుండా ఉండేందుకు సీజేరియన్‌ అయితే రూ.3 వేలు, సాధారణ ప్రసవం అయితే రూ.5 వేలు ఆరోగ్య ఆసరా కింద అందజేస్తున్నాం. తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్‌ ఎయిర్‌ కండీషన్డ్‌ వాహనంలో ఇంటి వరకు చేర్చి ఆ చెల్లెమ్మకు అన్ని రకాలుగా తోడుగా ఉండే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 

గతంలో ఎలాంటి పరిస్థితి ఉండేదో చూశాం. అరకొర వాహనాలు, అవి కూడా అందుబాటులో ఉండే పరిస్థితి కూడా లేదు. ఉన్న వాహనాల్లో వసతులు సరిగ్గా లేని పరిస్థితి నుంచి పూర్తిగా మెరుగైన పరిస్థితిలోకి తీసుకువచ్చాం. 108, 104, తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్‌లు, నాడు–నేడుతో ఆస్పత్రి వ్యవస్థ రూపురేఖలు మార్చుతున్నాం. వీటన్నింటి వల్ల అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దేవుడి దయతో ప్రారంభిస్తున్నా. ఇంకా మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను’ అని సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 
 

Back to Top