బద్వేల్: వెనకబడిన బద్వేల్ ప్రాంతంలో సెంచరీ ప్లైబోర్డ్స్ గ్రీన్‌ఫీల్డ్ ఉత్పత్తి ప్లాంట్‌కు భూమిపూజ చేయడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం సీఎం వైయస్ జగన్ బద్వేల్ చేరుకున్నారు. బద్వేల్ నియోజకవర్గం గోపవరం వద్ద సెంచరీ ప్లైబోర్డ్స్ పరిశ్రమకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. దాదాపు రూ.1,600కోట్ల పెట్టుబడితో సుమారు 2,500 మందికి ప్రత్యక్ష ఉపాధి, పరోక్షంగా 5 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే పరిశ్రమ రావడం సంతోషంగా ఉందన్నారు. ప్లాంట్ కలప మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఉన్న సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు మేలు జరుగుతుందని, పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. సెంచరీ ప్లైబోర్డ్స్ సంస్థ ద్వారా బద్వేల్ ప్రాంతానికి, మూడు జిల్లాల రైతులకు మంచి జరుగుతుందన్నారు. రైతులు ముందుకువచ్చి కోఆపరేటివ్ సొసైటీకి ల్యాండ్‌ను ఈ ప్లాంట్‌కు అందించడం.. ఆ రైతులకు వేరే చోట రెండు ఎకరాల చొప్పున భూములు ఇవ్వడం.. బద్వేల్ ప్రాంతానికి మంచి జరగాలని, అందరూ అన్ని రకాలుగా తోడ్పాటును అందించారు. ప్లాంట్ ఏర్పాటుకు ముందుకువచ్చిన సజ్జన్, కేశవ్ ఇద్దరికీ ప్రభుత్వం తరఫు నుంచి అన్ని రకాల సహాయ, సహకారాలు ఉంటాయన్నారు. బద్వేలు రెవెన్యూ డివిజన్ మంజూరుతో పాటు.. నూతన భవనానికి రూ.6 కోట్ల మంజూరుచేశామని ముఖ్యమంత్రి చెప్పారు. రెవెన్యూ డివిజన్‌తో పాటు దాదాపు రూ.500 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఎస్‌ఏకేఎన్‌లో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటవుతుందని సీఎం చెప్పారు.