తాడేపల్లి: రాబోయే రోజుల్లో గ్రామాల రూపురేఖలు మారబోతున్నాయని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన జీడిపల్లి రిజర్వాయర్ నీటి ఆధారంగా దేవరకొండ, ముట్టాల, తోపుదుర్తి, సోమరవాండ్లపల్లి రిజర్వాయర్‌లను నిర్మించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్ వర్చువల్ విధానంలో రిజర్వాయర్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. అదే ధరతో..ప్రాజెక్టు కెపాసిటీ పెంచుతూ పనులు.. ఈ పథకంలో భాగంగా మూడు జలాశయాల నిర్మాణాలకు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం. నిజంగా ఈ పథకాన్ని ఎన్నికల సమయంలో కాకుండా, ఆ తరువాత పనులు ఏమాత్రం చేపట్టకుండా వదిలివేశారు. ఇప్పుడు పనులు మొదలు పెట్టడమే కాకుండా కేపాసిటీ పెంచుతూ, మూడు రిజర్వాయర్లకు శంకుస్థాపన చేస్తున్నాం. అదే ధరతో ఈ రోజు పనులు ప్రారంభిస్తున్నాం. గతంలో ఏ స్థాయిలో ప్రాజెక్టులను గాలికివదిలేశారో అర్థం చేసుకోవాలి. ఈ రోజు మంచి కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. ఆ రోజు పాదయాత్ర ద్వారా ఈ నియోజకవర్గంలో వెళ్తుంటే ప్రజలు చూపిన ప్రేమాభిమానాలు మరిచిపోలేదు. ఈ రోజు హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా రాయలసీమలో దాదాపు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. హంద్రీనీవాలో భాగంగా జీడిపల్లె నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా 5.40 టీఎంసీల సామర్థ్యంతో ఎగువ పెన్నా జలాశయానికి కాల్వ , ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ, సొమరవాళ్ల జలాశయం నిర్మాణానికి ఈ రోజు పనులు ప్రారంభిస్తున్నాం. వీటి ద్వారా సుమారు 75 వేల ఎకరాలకు సాగునీరు, పలు ప్రాంతాలకు తాగునీరు కూడా అందుతుంది. గతంలో ఏం జరిగింతో మీ అందరికి తెలుసు. ఏ రకంగా రూ.804 కోట్ల వ్యయంతో 2018 జనవరి 24న ఒక జీవో మాత్రం ఇచ్చి, ఆ తరువాత పనులు జరగలేదు. అదే సొమ్ముతో ఆ రిజర్వాయర్‌తో పాటు మరో రెండు రిజర్వాయర్లను అదనంగా నిర్మిస్తున్నాం. మరో 3.3 టీఎంసీల స్టోరేజీ కేపాసిటీ పెంచుతున్నాం. దాదాపుగా మూడేళ్లు అవుతుంది. ఈ మూడేళ్లలో మామూలుగా ప్రాజెక్టు కాస్ట్ పెంచుతారు. ఇదే ధరతో రిజర్వాయర్ల కేపాసిటీ పెంచి అదే ప్రాజెక్టుల పనులు చేపడుతున్నామంటే..ఏ స్థాయిలో లంచాలను మనం కట్టడి చేస్తున్నామో ఇదే మంచి నిదర్శనం. ఈ పథకం ద్వారా 90 రోజుల్లో ఐదు జలాశయాల్లో 7.21 టీఎంసీల నీరు నింపి బెలుగుప్ప, కూడేరు, ఆత్మకూరు, కంబదూరు, కనగానపల్లె, చెన్నెకొత్తపల్లి, రాప్తాడు గ్రామాల్లో 75 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ఇందు కోసం 5171 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. జీడీపల్లె జలాశయం నుంచి ఎగువ పెన్నా జలాశయం వరకు 53.45 కిలోమీటర్ల ప్రధాన కాల్వ, 4 ఎత్తిపోతల పథకాలు, 110 కాంక్రీట్ కట్టడాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆత్మకూరు, కొత్తపల్లి, బాలవెంకటాపురం, మద్దెల చెరువు వద్ద నాలుగు ఎత్తిపోతల పథకాలు వస్తున్నాయి. ఎగువ పెన్నా జలాశయం ద్వారా 10 వేల ఎకరాలు, ముక్త్యాల జలాశయం ద్వారా 18700, తోపుదుర్తి ద్వారా 18 వేలు, దేవరకొండ ద్వారా 19 వేల ఎకరాలు, ఈ ఐదు జలాశయాల ద్వారా 75 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ సాగునీరు అందితే ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దేవుడి దయతో ఇప్పటికే అనంతపురం జిల్లా పరిస్థితులు మెరుగు అవుతాయని నమ్ముతున్నాను. దేవుడి ఆశీర్వాదంతో గత రెండేళ్లుగా మంచి వర్షాలు కురుస్తున్నాయి. జలాశయాలు నిండి పొర్లుతున్నాయి. దేవుడి దయ, మీ అందరి దీవెనలతో ఎన్నికల ప్రణాళికలోని ప్రతి పథకం చేయగలుగుతున్నాం. చేయూత, ఆసరా, రైతు భరోసా, అమ్మ ఒడి, నాడు-నేడు, ప్రతి గ్రామంలో ఇంగ్లీష్ మీడియం, విలేజీ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, గోడౌన్లు, కోల్డు స్టోరేజీలు తీసుకువచ్చి రాబోయే రోజుల్లో గ్రామాల రూపురేఖలు మారుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి అనేక మంచి పనులు చేసేందుకు దేవుడు తనకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ..ఈ రోజు మూడు రిజర్వాయర్లకు శంకుస్థాపన చేస్తున్నా..