గుంటూరు: కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఒక యజ్ఞంలా చేపడుతున్నామని, ఆ యజ్ఞానికి గుంటూరు జిల్లా భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయం నుంచి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కోవిడ్‌తో సహజీవనం చేయడం తప్ప వేరే మార్గం లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న ఆయుధం వ్యాక్సినేషన్ మాత్రమే.. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉధృతంగా చేపట్టి ప్రజలకు ఆరోగ్య భద్రత మెరుగ్గా ఇవ్వగలుగుతామన్నారు. వలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కచ్చితంగా దేశానికి కూడా ఆదర్శంగా నిలుస్తామన్నారు. వ్యాక్సినేషన్ ఇలా కూడా చేయొచ్చు అని దేశానికి కూడా చెప్పే పరిస్థితి కొద్ది రోజుల్లో జరుగుతుందన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు ఇంకా మిగిలి ఉన్నాయని, ఆ 6 రోజుల ప్రక్రియ పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపడతామని సీఎం వైయస్ జగన్ అన్నారు. గుంటూరు జిల్లా భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయంలో వ్యాక్సిన్ తీసుకున్న సీఎం వైయస్ జగన్.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సచివాలయం, వైద్య సిబ్బందితో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోవిడ్ వ్యాక్సినేషన్‌పై సీఎం వైయస్ జగన్ ఏం మాట్లాడారంటే.. 'వార్డు సచివాలయాలను, రాబోయే రోజుల్లో గ్రామ సచివాలయాలను ఒక యూనిట్‌గా తీసుకొని వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో ఒక యజ్ఞంలా చేయాల్సిన అవసరం ఉంది. ఆ గ్రామంలో, ఆ వార్డు పరిధిలో ఉన్న వలంటీర్లు, ఆశా వర్కర్లు.. ప్రతి ఇంటికి వెళ్లి డోర్ టు డోర్ తిరిగి 45 సంవత్సరాల పైబడి ఉన్న వారి వివరాలను పేర్లతో సహా నమోదు చేసుకుంటారు. పలానా తేదీకి వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని ముందుగానే వారికి వివరిస్తారు. నిర్ణయించిన తేదీన ఆ గ్రామంలో, వార్డుకు డాక్టర్ల బృందం చేరుకుంటారు. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు, దీనికి తోడు 104 వెహికిల్‌లో కూడా ఒక డాక్టర్ ఉంటారు. ఎమర్జెన్సీ సేవల కోసం 108 కూడా అందుబాటులోకి తీసుకువస్తారు. గ్రామ సచివాలయంలోని నర్సులు, పీహెచ్‌సీలోని నర్సులు అందరూ కలిసి నిర్ణయించిన తేదీలో వలంటీర్లు, ఆశా వర్కర్లు తీసుకువచ్చిన లిస్టును టిక్ పెట్టుకుంటూ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేస్తారు. ఎవరైనా గ్రామంలో మిగిలిపోయి ఉంటే టిక్‌ల ద్వారా తెలిసిపోతుంది. ఆ మిగిలిపోయిన వారి ఇంటి దగ్గరకు వెళ్లి వ్యాక్సినేషన్ చేయించుకోవాలని, దాని ఉపయోగాలను తెలియజేసి.. వాళ్లకు వ్యాక్సిన్ ఇస్తారు. మొత్తం గ్రామం, మొత్తం వార్డులో ఉన్న వారికి వ్యాక్సినేషన్ పూర్తవుతుంది. ఇదొక యజ్ఞంలా సాగుతుంది. రాష్ట్రంలో వ్యాక్సిన్ పొందని వ్యక్తులు ఎవరూ ఉండరు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిర్దేశాల ప్రకారం 45 సంవత్సరాల వయస్సు పైబడి ఉన్నవారికి వ్యాక్సినేషన్ చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి సూచన వచ్చింది. రాబోయే రోజుల్లో తక్కువ వయస్సు ఉన్నవారికి కూడా వ్యాక్సిన్ వేయాలని చెప్పినప్పుడు మళ్లీ కొనసాగించడం జరుగుతుంది. ప్రస్తుతానికి 4 నుంచి 6 వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. కొద్దిగా ఎక్కువ సమయం పట్టినప్పటికీ.. 90 రోజుల్లో అందరికీ వ్యాక్సినేషన్ చేయగలుగుతామని సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇదే మాదిరిగా డ్రైవ్ కింద తీసుకొని చేయాలంటే కొంత సమస్య వస్తుంది. ఎందుకంటే.. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి. కేవలం ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికల కమిషన్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని నిర్ణయం తీసుకుంటే.. కేవలం ఆరు రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుంది. ఎన్నికల తరువాత వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఆటంకాలు ఉండవు. ఎన్నికలు అంటే అధికారులు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంతా భాగస్వామ్యం కావాల్సి వస్తుంది. రెండూ చేయడం కాస్త కష్టం అవుతుంది. ఈ రోజు కొత్త ఎస్‌ఈసీ బాధ్యతలు తీసుకుంటున్నారు కాబట్టి.. ఆరోగ్య శాఖ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, డీజీపీ అందరూ వెళ్లి రాష్ట్రంలోని ఉన్న సమస్యలు ఎస్‌ఈసీకి వివరిస్తారు. రాష్ట్ర పరిస్థితులపై కొత్త ఎస్‌ఈసీకి కూడా అవగాహన ఉంది కాబట్టి త్వరితగతిన ఈ 6 రోజుల ప్రక్రియ పూర్తిచేస్తారని నాకు నమ్మకం ఉంది. ఎన్నికలు పూర్తయిన వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా యుద్ధ ప్రాతిపదికన ఇదే మాదిరిగా రాష్ట్రమంతా 90 రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయగలం అని సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది. కోవిడ్‌ను ఆపలేం, వస్తుంది.. పోతుంది. కోవిడ్‌తో సహజీవనం చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న ఆయుధం వ్యాక్సినేషన్. ఉధృతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడితే.. ఆరోగ్య భద్రత మెరుగ్గా ఇవ్వగలుగుతాం. వలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కచ్చితంగా దేశానికి కూడా మనం ఆదర్శంగా నిలుస్తూ.. వ్యాక్సినేషన్ ఇలా కూడా చేయొచ్చు అని దేశానికి కూడా చెప్పే పరిస్థితి కొద్ది రోజుల్లో జరుగుతుంది. అందరికీ మంచి జరగాలని మనసారా ఆశిస్తూ.. దేవుడి దయ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నా’ అని సీఎం వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.