గొప్పగా చదివి మన రాష్ట్ర ఖ్యాతిని పెంచాలి

అన్ని రంగాల్లో ప్రపంచాన్ని శాసించే స్థాయికి మన పిల్లలు ఎదగాలి

విద్యార్థుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ సూచ‌న‌

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద 357 మంది విద్యార్థులకు రూ.45.53 కోట్లు జమ

క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి విడుదల చేసిన సీఎం వైయస్‌ జగన్‌

విదేశీ విద్యా దీవెన విప్లవాత్మక అడుగు.. రాబోయే రోజుల్లో రాష్ట్ర ఖ్యాతిని పెంచుతుంది

మన పిల్లలు పెద్ద కంపెనీలకు సీఈవోలుగా రాణించాలని మనసారా మంచి అన్నగా కోరుకుంటున్నా 

ఎక్కువమందికి ప్రయోజనం చేకూర్చేలా వార్షిక ఆదాయ పరిమితి రూ.6 నుంచి రూ.8 లక్షలకు పెంపు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.1.25 కోట్లు, ఇతర నిరుపేద విద్యార్థులకు రూ.1 కోటి సాయం

గతంలో అరకొర ఫీజులు ఇచ్చి విదేశీ విద్య పథకాన్ని పూర్తిగా నీరుగార్చారు

2016–17లో ఏకంగా రూ.318 కోట్ల బకాయిలు పెట్టేసి స్కీమ్‌కు ఎగనామం

తాడేపల్లి: ‘మన పిల్లలు గొప్పగా చదవాలి.. ప్రపంచాన్ని శాసించే విధంగా పెద్ద పెద్ద కంపెనీలకు సీఈవోలుగా, ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలి.. మన ఆంధ్రరాష్ట్ర ఖ్యాతిని పెంచాలి, పిల్లల విదేశీ చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదనే సదుద్దేశంతో అనేక మార్పులు చేసి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని సంతృప్తస్థాయిలో అమలు చేస్తున్నా’మని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నాణ్యమైన విద్యకు పట్టం కడుతూ క్యూఎస్‌ లేదా టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌ ప్రకారం ఎంపిక చేసిన 21 ఫ్యాకల్టీలకు సంబంధించి ప్రపంచంలోనే టాప్‌–50 యూనివర్సిటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. 

ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేకుండా అర్హులైన విద్యార్థులను సాచ్యురేషన్‌ పద్ధతిలో ఎంపిక చేసి వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సపోర్టు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలకు రూ.1.25 కోట్ల వరకు ఫీజుల సపోర్టు ఇవ్వడం జరుగుతుంది. ఇతర నిరుపేద పిల్లలకు కూడా కోటి రూపాయల వరకు సపోర్టు చేసే కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.6 నుంచి రూ.8 లక్షల వరకు పెంచడం జరిగిందని చెప్పారు. 

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అమలు చేశారు. అర్హులైన 357 మంది విద్యార్థులకు రూ.45.53 కోట్లను కంప్యూటర్‌ బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. అంతకు ముందు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.  

‘విదేశీ విశ్వవిద్యాలయాలకు వెళ్లే విద్యార్థులకు విమాన, వీసా చార్జీల నుంచి ప్రతి అడుగులోనూ వారిని చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ ద్వారా జరుగుతుంది. 

టాప్‌ 50 యూనివర్సిటీల్లో సీటు సాధించిన సామాన్యుడు, పేదవాడు ఆ యూనివర్సిటీల్లో చదువుకోగలిగే పరిస్థితి ఉందా, ఫీజులు ఎలా ఉన్నాయని ఒక్కసారి  గమనిస్తే.. 

చికాగో యూనివర్సిటీలో ఎంబీఏ చదవాలంటే రూ.1.32 కోట్లు, యూనివర్సిటీ ఆఫ్‌ మాంచస్టర్‌లో ఎంఎస్‌ చేయాలంటే రూ.1.2 కోట్లు, కార్నిగి మిలన్‌ యూనివర్సిటీలో ఎంబీఏ రూ.1.16 కోట్లు, లండన్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఎంబీఏ రూ.1.13 కోట్లు, కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్‌ రూ.1.11 కోట్లు, న్యూయార్స్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ రూ.1.09 కోట్లు, ఇన్సియడ్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఫ్రాన్స్‌లో ఎంబీఏ రూ.88 లక్షలు, హావర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఎంబీఏ రూ.68.86 లక్షలు, ఎంఐటీలో ఎంబీఏ రూ.67 లక్షలు, యూసీబక్లీలో ఎంఎస్‌ రూ.61 లక్షల నుంచి రూ.2.06 కోట్ల వరకు ఫీజులు ఉన్నాయి. మచ్చుకకు పది మంచి యూనివర్సిటీలో ఫీజులు ఇవి. 

ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాత కాలేజీల్లో ప్రతిభ గల మన పిల్లలకు సీట్లు వచ్చినా, సామాన్యుడికి, పేదరికంలో ఉండే పిల్లలకు ఇంత ఫీజులు కట్టి ఇలాంటిప్రఖ్యాత కాలేజీల్లో చదివే పరిస్థితి సాధ్యమేనా అన్నది ఈ స్కీమ్‌ గురించి ఆలోచన చేసినప్పుడు నాకు తట్టిన మొదటి ఆలోచన. ఇలాంటి కాలేజీల నుంచి మన పిల్లలు చదివి బయటకు వస్తేనే.. ప్రపంచాన్ని శాసించే విధంగా టాప్‌ మోస్ట్‌ కంపెనీల్లో సీఈవోలుగా, ఉన్నత స్థానాల్లో ఉంటారు. ఇటువంటి కాలేజీల్లో సీట్లు దొరికిన మన పిల్లలను మనం సపోర్టు చేయలేకపోతే మన పిల్లలను లీడర్స్‌గా ఎలా చూడగలుగుతామనేది ఈ ఆలోచనకు ప్రేరణ. 

గతంలో ఈ పరిస్థితి ఎలా ఉండేది అనేది గమనిస్తే.. 
గతంలో కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చే పరిస్థితి. ఎస్సీ, ఎస్టీలకు అయితే రూ.15 లక్షల వరకు ఇచ్చేవారు. గతంలో ఇచ్చిన రూ.10 లక్షలు ఎక్కడా, ప్రస్తుతం మన ప్రభుత్వం అందిస్తున్న రూ.1.16 కోట్ల సాయం ఎక్కడా అనేది పిల్లలు, తల్లిదండ్రులు ఆలోచించాలి. గతంలో ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా.. అది కూడా అప్లికేషన్‌ పెట్టుకున్నవారికి కాకుండా రికమండేషన్‌ ఉన్నవారికే మాత్రమే ఇచ్చేవారు. అది కూడా సరిగ్గా ఇచ్చారంటే అదీ లేదు. 2016–17లో ఏకంగా రూ.318 కోట్ల బకాయిలు పెట్టేసి స్కీమ్‌ను పూర్తిగా నీరుగార్చిన పరిస్థితిని గతంలో చూశాం. 

ఈరోజు విదేశీ విద్యా దీవెన పథకంలో మార్పు తీసుకువచ్చి పారదర్శక పద్ధతిలో అమలు చేస్తున్నాం. ఏ ఒక్కరికైనా అర్హత ఉండి టాప్‌ 50 కాలేజీల్లో 21 ఫ్యాకల్టీస్, దాదాపు 350 కాలేజీల్లో సీట్లు సాధించినా వారి చదువుకి ప్రభుత్వం పూర్తి సహాయ, సహకారాలు అందిస్తోంది. ఎక్కువ మంది పిల్లలకు ప్రయోజనం చేకూరాలని వార్షిక ఆదాయం 6 నుంచి రూ.8 లక్షలకు పెంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. 

అప్లికేషన్‌ పెట్టుకుంటే ఒక్క రూపాయి లంచం ఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా, వివక్షకు తావులేకుండా, ఎవరు, ఏ బ్యాక్‌గ్రౌండ్, ఏ పార్టీ వారు అనేది కూడా చూడకుండా అత్యంత పారదర్శకంగా మన పిల్లలకు తోడుగా ఉండే గొప్ప అడుగుల మన ప్రభుత్వం వచ్చిన తరువాత దేవుడి దయతో చేయగలిగామని గర్వంగా చెబుతున్నాను. 

విదేశీ విద్యా దీవెన విప్లవాత్మక అడుగు. ఇది రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతిని పెంచుతుంది. రాబోయే తరాలు గుర్తుపెట్టుకునేలా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇంతగా సపోర్టు చేస్తున్న రాష్ట్రం దేశంలో ఏదీ లేదు. ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే టాప్‌ 50 యూనివర్సిటీల్లో ఎవరికి సీట్లు వచ్చినా కూడా పారదర్శకంగా సపోర్టు చేస్తున్న ఏకైక రాష్ట్ర మనది మాత్రమే. 

పిల్లలు గొప్పగా ఎదగాలి. పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద సీఈవోలుగా, లీడర్లుగా రాణించాలని మనసారా మంచి అన్నగా కోరుకుంటున్నాను. 

ఈ పథకానికి పిల్లలందరికీ నాలుగు వాయిదాల్లో అందిస్తున్నాం. ఇమిగ్రేషన్‌ కార్డు పొందిన విద్యార్థులకు మొదటి వాయిదా, మొదటి సెమిస్టర్‌ ఫలితాల అనంతరం విద్యార్థులకు రెండో వాయిదా, రెండో సెమిస్టర్‌ టర్మ్‌ ఫలితాలు విడుదల అనంతరం మూడో వాయిదా, విజయవంతంగా నాల్గవ సెమిస్టర్‌ పూర్తిచేసి మార్క్‌ షీట్‌ అప్లోడ్‌ చేసిన తరువాత చివరి విడతగా నాల్గవ వాయిదా ఇచ్చేలా స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాంను డిజైన్‌ చేసి పిల్లలందరికీ తోడుగా ఉండే గొప్ప మార్పు జరుగుతుంది. 

పోస్ట్‌ గ్రాడ్యుయేషన్, అండర్‌ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ వీరందరికీ టాప్‌ 50 యూనివర్సిటీల్లో 21 ఫ్యాకల్టీలో సీట్లు ఎక్కడా వచ్చినా అప్లికేషన్‌ పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సాయం చేసి తోడుగా ఉంటుందని మరోసారి భరోసా ఇస్తున్నా..

మన ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమం వల్ల మన పిల్లలకు ఇంకా మంచి జరగాలని, విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఎటువంటి భారం పడకూడదని, అప్పుల భయం లేకుండా పిల్లలను గొప్ప చదువులకు పంపించాలి.. ఆ పిల్లలు విదేశాలకు వెళ్లి గొప్పగా చదివి మన రాష్ట్ర ఖ్యాతిని ఇంకా పెంచాలనే మంచి సంకల్పంతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి దేవుడు ఆశీర్వదించాలని, పిల్లలందరికీ రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. 
 

Back to Top