దేశ చరిత్రను మార్చేది చదువే..

తిరుపతి సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

గొప్ప కార్యక్రమం అమలుచేస్తున్నందుకు సంతోషంగా ఉంది

జగనన్న విద్యా దీవెన త్రైమాసికం కింద 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లు జమ చేస్తున్నాం

విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు రూ.10,994 కోట్లు వెచ్చించాం

విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం

గత ప్రభుత్వం, మన ప్రభుత్వానికి మధ్య మార్పును గమనించండి

35 నెలల పాలనలో డీబీటీ ద్వారా రూ.1,38,894 కోట్లు అందించాం

మనం చేస్తున్న మంచి చూసి దుష్టచతుష్టయానికి కడుపుమంట

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు దొంగల ముఠా మనపై దుష్ప్రచారం చేస్తోంది

ప్ర‌శ్నాపత్రాలు లీక్‌ చేసేది టీడీపీ వారే.. నానా యాగీ చేసేది కూడా వారే..

బాలికలపై అత్యాచారం చేసేవారిని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఎందుకు చూపదు

మహిళలపై దాడులు చేస్తే ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదు

దేవుడా.. రక్షించు నా రాష్ట్రాన్ని.. ఎల్లో మీడియా నుంచి, ఎల్లో పార్టీ నుంచి

తిరుపతి:  ‘‘చదువు అనేది గొప్ప ఆస్తి.. ఎవరూ దొంగిలించలేని ఆస్తి. తలరాతలు మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది. చదువు అనేది ఒక మనిషి చరిత్రను, ఒక కుటుంబ చరిత్రను, ఒక సామాజిక చరిత్రను, ఒక రాష్ట్ర చరిత్రను, దేశ చరిత్రను మారుస్తుందని నమ్మే వ్యక్తిని నేను. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 10.85 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చడం సంతోషంగా ఉంది’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తిరుపతి తారకరామ స్టేడియంలో జగనన్న విద్యాదీవెన నగదు జమ కార్యక్రమాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. జగనన్న విద్యా దీవెన పథకం 2022 జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించి 10.85 లక్షల మంది విద్యార్థులకు గానూ వారి తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లను సీఎం వైయస్‌ జగన్‌ జమ చేశారు. ఇప్పటి వరకు విద్యా దీవెన కింద రూ.10,994 కోట్లు వెచ్చించామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. తిరుపతి తారకరామ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అక్కచెల్లెమ్మలను, విద్యార్థులను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..
‘‘జగనన్న విద్యా దీవెన ఎంతో గొప్ప పథకం. ఒక మంచి కార్యక్రమం దేవుడి దయతో సాగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పథకం ద్వారా 10.85 లక్షల మంది విద్యార్థులకు గానూ 9.73 లక్షల తల్లుల ఖాతాల్లోకి నేరుగా రూ.709 కోట్లు జమ చేయడం సంతోషంగా ఉంది. ఫీజులు కట్టలేక పేద విద్యార్థులు చదువుకు దూరంగా కాకూడదు. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు చూశా. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అప్పులపాలైన పరిస్థితి చూశా. 

నాన్నగారి హయాంలోనే పూర్తిఫీజురీయింబర్స్‌మెంట్‌ అందేది. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నీరుగార్చాయి. గత ప్రభుత్వ పరిస్థితులు పూర్తిగా మార్పులు చేసి.. గొప్ప విప్లవాన్ని తీసుకువచ్చాం. నాన్నగారు పేద పిల్లల గురించి, అక్కచెల్లెమ్మల గురించి, తల్లిదండ్రుల గురించి ఒక్క అడుగు ముందుకేస్తే.. జగన్‌ ఆ తండ్రికి తగ్గకొడుకుగా.. తండ్రి ఒక అడుగు వేస్తే.. జగన్‌ నాలుగు అడుగులు ముందుకేస్తున్నాడు. మన సమాజ గతినే మార్చగలిగే.. పేదరికం నుంచి బయటకు తీసుకురాగలిగే.. గొప్ప విప్లవమే.. చదువుల మహా విప్లవం. 

ఈ విప్లవాన్ని దెబ్బతీయడానికి గతంలో ఎన్నెన్నో ప్రభుత్వాలు.. ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాయి. పెద్ద చదువులు చదువుకుంటున్న పేద విద్యార్థులు, వారు అనుభవిస్తున్న క్షోభను ఏ ఒక్కరూ పట్టించుకోని పరిస్థితి. నా పాదయాత్రలో విద్యార్థుల కష్టాలను, వారి తల్లిదండ్రుల కష్టాలను నా కళ్లారా చూశా. ఎప్పుడు విద్యా దీవెన, వసతి దీవెన గురించి మాట్లాడాల్సి వచ్చినా.. నా కళ్ల ఎదుట జరిగిన ఘటనను బహుశా ఎప్పుడూ మర్చిపోలేను. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు పడుతున్న అవస్థలు, తల్లిదండ్రులు అప్పులపాలవుతున్న పరిస్థితులు చూడలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు నా పాదయాత్రలో కళ్లారా చూశా. అటువంటి పరిస్థితులు ఇక మీదట రాకూడదని.. గడచిన మూడేళ్లుగా వంద శాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌ అమలుచేసే జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించాం. 

విద్యా దీవెన పథకానికి ఎన్నెన్ని మార్పులు జరిగాయో.. మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయాలని అడుగుతున్నా.. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి వచ్చిన మార్పు గమనించండి. క్రమం తప్పకుండా ప్రతి అడుగులోనూ పిల్లలకు తోడుగా నిలబడుతున్నాం. క్రమం తప్పకుండా పూర్తి ఫీజురీయింబర్స్‌ మెంట్‌ ఇవ్వడమే కాకుండా.. అవినీతికి తావులేకుండా నేరుగా తల్లుల అకౌంట్‌లోనే నగదు జమ చేస్తున్నాం. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజులు చెల్లిస్తున్నాం. జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి 10.85 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 9.73 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లు జమ చేస్తున్నాం. 

ఇప్పటి వరకు విద్యా దీవెన, వసతి దీవెన రెండు పథకాలకే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా అక్షరాల రూ.10,994 కోట్లు ఇవ్వగలిగాం. ఈ ఖర్చును మన పిల్లల మీద పెట్టుబడి పెట్టే ఖర్చు కిందే భావిస్తున్నాం. ఈ పెట్టుబడి వల్ల రాబోయే రోజుల్లో కుటుంబాల తలరాతలు మారుతాయి. పేదరికం నుంచి కుటుంబాలు బయటకు వస్తాయి. పిల్లల చదువుల కోసం మనం చేస్తున్న మేలు ఏమిటీ..? మనల్ని విమర్శించేవారు చేసిందేమిటీ అని ఆలోచన చేయాలి. 

గత ప్రభుత్వంలో వందశాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్న జగనన్న వసతి దీవెన వంటి పథకం అమలైందా..? పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు. 2017–18, 2018–19 సంబంధించిన రూ.1778 కోట్లు గాలికి వదిలేస్తే.. ఆ బకాయిలను కూడా చిరునవ్వుతో కట్టింది మీ అన్న ప్రభుత్వం.. మీ తమ్ముడి ప్రభుత్వం. 

క్రమం తప్పకుండా ఈ స్థాయిలో పెద్ద చదువులు చదువుతున్న మన పిల్లలకు జగనన్న వసతి దీవెన లాంటి పథకం గత చంద్రబాబు పాలనలో ఏనాడైనా అమలైందా..?  మన కాలేజీల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి..? మన పిల్లలు చదివే చదువులు ఎలా ఉన్నాయి..? జాబ్‌ ఓరియంటెడ్‌గా చదువులు ఉన్నాయా లేదా..? ఏ మార్పులు చేయాలనే ఆలోచనలు ఏరోజు అయినా గత చంద్రబాబు పాలనలో చేశాడా..? పిల్లల చదువుల భారాన్ని ఎలా తగ్గించుకోవాలనే దిక్కుమాలిన ఆలోచన చేశారే తప్ప.. చదువుల గురించి ఆలోచనలు ఏరోజూ చేయలేదు. 

చంద్రబాబు పాలనలో ప్రభుత్వ బడుల్లో సౌకర్యాల గురించి గత ప్రభుత్వం ఎప్పుడైనా పట్టించుకుందా..? చంద్రబాబు పాలనలో ప్రభుత్వబడుల్లో మన పిల్లల్ని గొప్పగా చదివించాలని, నాడు–నేడు లాంటి పథకంతో బైలింగ్వల్‌ టెక్ట్స్‌ బుక్స్‌ తీసుకువచ్చి.. ఇంగ్లిష్‌ మీడియం చదువులు.. చంద్రబాబు హయాంలో ఉన్నాయా..? పేదలు ఎప్పుడూ తెలుగు మీడియంలోనే చదవాలి.. బాబు లాంటి వారికి అణిగిమణిగి ఉండాలనిచేసే దిక్కుమాలిన ఆలోచనలకు, ఈరోజు మన ఆలోచనకు తేడా ఎంతో ఆలోచన చేయాలి. 

గతంలో జగనన్న అమ్మఒడి లాంటి పథకం ఏరోజైనా అమలైందా..? మన ప్రభుత్వంలో పిల్లలను చదువుల బాట పట్టించండి.. మీకు తోడుగా మీ అన్న ఉన్నాడు.. భరోసా ఇస్తూ పిల్లలకు బడికి పంపించే తల్లికి రూ.15వేలు అందించిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఏనాడైనా ఉందా..? 

నాడు–నేడు ద్వారా ప్రభుత్వ బడులను పూర్తిగా మార్చాం. నాడు–నేడు పథకం కోసం రూ.8 వేల కోట్లు వెచ్చించాం. ప్రభుత్వ బడుల్లో ఇవాళ ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాం. నాడు–నేడు లాంటి పథకం చంద్రబాబు ఏరోజైనా అమలు చేశారా..? ప్రభుత్వ బడులు మూసేద్దామన్న ఆలోచనతోనే గత ప్రభుత్వం పనిచేసింది. యూనిఫాం, నోట్‌బుక్స్, బైలింగ్వల్‌ టెక్ట్స్‌ బుక్స్, డిక్షనరీ జగనన్న విద్యా కానుక పథకం వంటి పథకం ఏరోజైనా చంద్రబాబు పాలనలో జరిగిందా..? గతంలో పాఠ్యపుస్తకాలు స్కూళ్లు తెరిచిన 6,7 నెలలకు వచ్చేవి. అవికూడా అరకొరగానే ఇచ్చేవారు. ఇటువంటి దారుణమైన పరిస్థితి చంద్రబాబు హయాంలో సాగింది. 

గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేసింది. 8, 9 నెలల పైచిలుకు బకాయిలు పెట్టారు. పిల్లలు స్కూళ్లకు రాకుంటేనే మంచిదని గత ప్రభుత్వ ఆలోచన.గతానికి, ప్రస్తుతానికి తేడాను గమనించండి. రోజుకో మెనూతో మంచి పౌష్టికాహారంతో మధ్యాహ్న భోజనం అందించాలని గతంలో చంద్రబాబు ఆలోచన చేశారా అని అక్కచెల్లెమ్మలు గమనించాలి. జగనన్న గోరుముద్ద పథకంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. రూ.1900 కోట్లు ఖర్చు చేస్తున్నాం.

మన పాలనలో కేవలం విద్యారంగం మీద.. మన పిల్లల చదవులకు ఉపయోగపడే పథకాల మీద 35 నెలల కాలంలో 
మనబడి నాడు–నేడు మొదటి విడతలో 15715 స్కూళ్ల రూపురేఖలు మార్చడం కోసం అక్షరాల రూ.3698 కోట్లు ఖర్చు చేశాం. రెండో దశ కింద 26,451 స్కూళ్లలో నాడు–నేడు జరుగుతుంది. దీని కోసం రూ.8 వేల కోట్లు ఖర్చు చేసేందుకు శ్రీకారం చుట్టాం. 

జగనన్న విద్యా కానుక ద్వారా 47.32 లక్షల మంది పిల్లలకు మేలు చేస్తూ ఇప్పటి వరకు రూ.1500 కోట్లకు పైగా ఖర్చు చేశాం. స్కూళ్లు తెరిచేరోజునే ఈ సంవత్సరం ఇచ్చే విద్యాకానుకకు మరో రూ.900 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 

జగనన్న గోరుముద్ద కింద మార్చిన మెనూతో 44 లక్షల మంది పిల్లలకు మేలు చేస్తూ.. కోవిడ్‌ సమయంలో ఆ పిల్లలకు మంచి చేస్తూ.. రూ.1900 కోట్లు ఖర్చు చేస్తున్నాం.

వైయస్‌ఆర్‌ సంపూర్ణ ద్వారా 34.28 లక్షల మంది గర్భిణులు, బాలింతలు, 6  సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. గతంలో 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే.. మనం సంవత్సరానికి రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ 35 నెలల్లో రూ.4900 కోట్లు ఖర్చు చేశాం. 

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు అక్షరాల రూ.10,994 కోట్లు ఖర్చు చేశాం. 

ఇదేకాకుండా 35 నెలల కాలంలో జగనన్న అమ్మ ఒడి పథకం కింద రూ.13,023 కోట్లు ఖర్చు చేశాం. మళ్లీ జూన్‌లో అమ్మ ఒడికి మరో రూ.6400 కోట్లు ఇవ్వనున్నాం. ఈ చర్యలన్నీ తీసుకున్నాం కాబట్టే ఈరోజు రాష్ట్రంలో మార్పు కనిపిస్తుంది. 

1నుంచి 10 వరకు చదివే పిల్లల సంఖ్య.. గత చంద్రబాబు హయాంలో 2018–19తో పోల్చితే.. ప్రైవేట్, గవర్నమెంట్‌ స్కూళ్లలో పిల్లల సంఖ్య 70.43 లక్షలు అయితే.. ఈ రోజు 73 లక్షలకు చేరిందని సగర్వంగా తెలియజేస్తున్నాను. కేవలం ప్రభుత్వ బడులే తీసుకుంటే.. గతంలో 2018–19లో గవర్నమెంట్‌ బడుల్లో చదివిన పిల్లలకు కేవలం 37.20 లక్షలు అయితే.. ఈరోజు ఆ సంఖ్య 44.39 లక్షల మందికి చేరింది. ఈ రకమైన మార్పు, నమ్మకం ఆ పిల్లలకు, తల్లులకు ఎందుకు వచ్చాయి.. ఎవరి వల్ల జరుగుతుందని ఆలోచన చేయాలి. 

పండ్లు పండే చెట్టు మీదనే రాళ్లు పడతాయని, ఇంతగా మనం మంచిచేస్తున్నాం కాబట్టే.. ప్రజలందరి అభిప్రాయం మనకు అనుకూలంగా ఉంటే దాన్ని జీర్ణించుకోలేక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో పాటు చంద్రబాబు.. నలుగురు కలిసి దొంగలముఠా. దుష్టచతుష్టయం అని అంటాం. మనం మంచిచేస్తుంటే కడుపుమంట.. జీర్ణించుకోలేరు. వక్రీకరణలు, అబద్ధాలు, గోబెల్స్‌ ప్రచారంలో భాగంగా.. ఒకే అబద్ధం నలుగురు కలిసి వందసార్లు చెప్పిందే చెప్పి నిజం అని నమ్మించే ప్రయత్నం ఈ దుష్టచతుష్టయం చేస్తుంది. 

వాళ్లు(గత ప్రభుత్వం) గుడులు కూలిస్తే.. మనం నిర్మించాం. వాళ్లు విగ్రహాలను విరిచేస్తే.. మనం ప్రతిష్టించాం. వారు రథాలను తగలబెడితే.. మనం నిర్మించాం. వారు రైతును కుంగదీస్తే.. మనం నిలబెడుతున్నాం. వారు మన పల్లెలను దెబ్బతీస్తే.. ప్రతి పల్లెలోకి ప్రభుత్వ సేవలను గ్రామ, వార్డు సచివాలయాలను,వలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చాం. గడప వద్దకే సుపరిపాలన తీసుకువచ్చేలా దేశానికే మార్గనిర్దేశం చేశాం. ప్రభుత్వ బడులను, ఆస్పత్రులను మూయాలని ప్రయత్నిస్తే.. మనం పరిస్థితిని మార్చేశాం. వారు ఎన్ని ఆటంకాలు కలిగించినా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం తీసుకువస్తున్నాం. ఎన్నికల వేళవారి మాటలు కోటలు దాటుతాయి.. అబద్ధాలతో ఇష్టంవచ్చినట్టు మాటలు చెబుతారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మాటలను నెరవేర్చారా లేదా అని ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నికలప్పుడు మాటిస్తారు.. అధికారంలోకివచ్చిన తరువాత మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేస్తారు. మేనిఫెస్టో వారి వెబ్‌సైట్‌లో కూడా దొరకని పరిస్థితి. మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పట్ల, అగ్రవర్ణాల్లోని పేదలను వాడుకునే కార్యక్రమమే చేశారు. బలహీనవర్గాలంటే ఓటు బ్యాంకుగా చూశారు. 

ఈరోజు గమనించండి.. నిండు మనసుతో కేవలం బటన్‌నొక్కితే చాలు డీబీటీ ద్వారానే అక్షరాల 35 నెలల కాలంలో రూ.1,38,894 కోట్లు నేరుగా బటన్‌ నొక్కి.. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో పంపించే గొప్ప పాలన సాగుతోంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. సుపరిపాలన సాగుతోంది. ఇదంతా ప్రతి ఒక్కరి కళ్లకు కనిపిస్తుంది. జరిగిన మేలు కళ్లకు ప్రస్పుటంగా కనిపిస్తుంది కాబట్టే చంద్రబాబుకు, ఆ బాబును అధికారంతో పాటు గత మూడు దశాబ్ధాలుగా మోసి, ఎదిగిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. నలుగురు కలిసిన దొంగల ముఠాకు కడుపుమంట, బీపీ రోజూ పెరుగుతుంది. విద్యావ్యవస్థలో ఇన్ని గొప్ప మార్పులు, పథకాలను ప్రజలు మర్చిపోవాలని పేపర్, టీవీల ద్వారా అబద్దాలతో ప్రచారం చేస్తూనే ఉన్నారు. 

దుష్ప్రచారంలో మలుపు తిప్పి.. విద్యా దీవెన పథకం ఈరోజు ఇస్తున్నామని తెలిసి.. వాళ్లే ప్రశ్నాపత్రాలు వారికి సంబంధించిన, వారి హయాంలో మంత్రిగా పనిచేసిన వారి స్కూళ్ల నుంచే ప్రశ్నాపత్రాలు వాట్సాప్‌ ద్వారా లీక్‌ చేయించి.. ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. పేపర్‌ లీక్‌లో రెండు నారాయణ స్కూళ్లు, మూడు చైతన్య స్కూళ్ల నుంచి జరిగాయి. ఎవరా నారాయణ.. చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేయలేదా..? వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమం చేస్తూ.. ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ప్రశ్నాపత్రాలు లీక్‌ చేసి.. డైవర్ట్‌ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. జగనన్న ఈరోజు విద్యా దీవెన పథకం అమలు చేస్తున్నాడు.. ఎక్కడ మంచిపేరు వస్తుందో అనే కడుపుమంటతో కుళ్లు, కుతంత్రాలు చేస్తున్నారు. 

మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 1.3 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలిస్తూ.. సచివాలయాలు తీసుకువచ్చాం. దాన్ని చూడలేక దుష్టచతుష్టయం ఆరోజు పేపర్‌ లీక్, మరోటంటూ నానా యాగీ చేసిన పరిస్థితులు గుర్తుతెచ్చుకోండి. దేశ చరిత్రలోనే ఒక రికార్డుగా మనందరి ప్రభుత్వం అక్షరాల కనీవినీ ఎరుగని విధంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల చేతికి ఇచ్చాం. 18.40 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతుంది. ఆ మంచిని ఓర్చుకోలేని వీరు.. ఆ లబ్ధిదారులను రెచ్చగొట్టే విధంగా తప్పుడు రాతలు, తప్పుడు మాటలు మాట్లాడుతున్న పరిస్థితులను గమనించండి. 

ఎల్లో మీడియా గుంట నక్కల కంటే హీనంగా మనం చేస్తున్న మంచిని ప్రజల్లోకి వెళ్లనివ్వకూడదని అడ్డుతగిలే కార్యక్రమం గమనించండి. చివరకు టిడ్కో ఇళ్లను కట్టలేక వదిలేశారు. మనం ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తుంటే.. ఎలాంటి రాళ్లు వేస్తున్నారోగమనించండి. అక్కచెల్లెమ్మలకు మన ప్రభుత్వం చేస్తున్న మంచికి పరదాలు కట్టేందుకు అత్యాచారాలు అంటూ కొత్తగా ప్రచారాలు మొదలుపెట్టారు. 

గత వారం, పది రోజులుగా రాష్ట్రంలో అతలాకుతలం అయిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆశ్చర్యం కలిగించింది. మహిళా సంక్షేమంలో, ఆర్థిక సాధికారత, రాజకీయ సాధికారతలో, మహిళల రక్షణ విషయంలో ఇలా ఏ విషయం తీసుకున్నా.. రాష్ట్రమే కాదు.. దేశ చరిత్రలో కూడా ఏ ప్రభుత్వం కూడా చేయనంత చిత్తశుద్ధితో మీ అన్న, తమ్ముడు అడుగులు ముందుకేస్తున్నాడు. అక్కచెల్లెమ్మల మనసుల్లో జగన్‌ నిలిచిపోతాడని బురదజల్లేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. 

అక్కచెల్లెమ్మల రక్షణ కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్‌ను తీసుకొచ్చాం. ఫోన్‌లో ఎస్‌ఓఎస్‌ నొక్కినా, ఫోన్‌ ఐదుసార్లు షేక్‌ చేసినా పోలీస్‌ సోదరుడు వచ్చి ఆరా తీసే పరిస్థితి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జరుగుతున్న సంఘటనల మీద దోషులు ఎవరైనా, ఎంతటి వాళ్లైనా చర్యలు తీసుకుంటున్నాం. వైఫల్యం ఉంటే పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులైనా వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. వ్యవస్థల్లో మార్పులు వచ్చాయి. ఈ మధ్యనే విజయవాడలో అత్యాచారం జరిగిందని, గుంటూరులో ఏదేదో జరిగిందని, విశాఖలో ఏదేదో జరిగిపోతుందని నానా యాగీ చేశారు. బాలికల మీద, మహిళల మీద దాడికి ప్రయత్నించినవారు.. అత్యాచారం చేసిన దుర్మార్గులు ఎవరూ అనేది ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి చెప్పదు, టీవీ5 చూపదు.. కారణం ఏంటంటే.. బాలిక మీద అత్యాచారం చేసింది టీడీపీ నాయకులే.. ఇటువంటి దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. 

ఏడుకొండల స్వామిని మనం కోరగలిగింది ఒక్కటే.. దేవుడా.. రక్షించు మా రాష్ట్రాన్ని.. ఈ ఎల్లో మీడియా నుంచి, ఈ ఎల్లో పార్టీ నుంచి,  నీతుల రెండు నాల్కలు సాచి.. బుసలు కొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుంచి, దూర్తుల నుంచి, దుష్టచతుష్టయం నుంచి రక్షించు దేవా అని తిరుపతి వెంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నాను. 
 

తాజా వీడియోలు

Back to Top