నేను నమ్మాను.. ఆచరించాను.. ఫలితాలను చూపించాను

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

నా నడక నేల మీదే.. నా ప్రయాణం సామాన్యులతోనే, పేదవర్గాలతోనే..

మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ.. 98.5 శాతం హామీలు నెరవేర్చాం

పరిపాలనలో పారదర్శకత తీసుకొచ్చేలా నాలుగేళ్ల పాలన సాగింది 

డీబీటీ ద్వారా రూ.1,97,473 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం

రాజకీయ వ్యవస్థలో గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టాం

2021–22లో 11.23 శాతం ఆర్థిక వృద్ధిరేటుతో దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచాం 

2021–22లో తలసరి ఆదాయం 14.02 శాతం పెరిగిన రాష్ట్రం కూడా మనదే..

మనందరి ప్రభుత్వంలో రేషన్‌కార్డులు ఒక కోటి 46 లక్షలకు పెంచాం

సచివాలయం, వలంటీర్లు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, డిజిటల్ లైబ్ర‌రీలతో గ్రామ స్వరూపాన్ని మార్చాం

గవర్నమెంట్‌ బడులతో కార్పొరేట్‌ స్కూల్స్‌ పోటీపడేలా చేస్తున్నాం

‘‘నా నడక నేల మీదే.. నా ప్రయాణం సామాన్యులతోనే, పేదవర్గాలతోనే.. నా యుద్ధం పెత్తందార్లతోనే.. నా లక్ష్యం పేదరిక నిర్మూలనే.. కాబట్టే నా ఎకనామిక్స్‌ వేరే. 
పేద కుటుంబాలు బలపడితేనే పేద కులాలు బాగుంటాయి. పేద కుటుంబాలతో పాటు పేద కులాలను బలపరిస్తేనే వారికి అన్ని సాధికారతలు ఇస్తేనే సమాజం బాగుంటుంది. సమాజంలోని అన్ని ప్రాంతాలను బలపరిస్తేనే రాష్ట్రం కూడా బాగుంటుంది. ఇది నేను నమ్మాను.. ఆచరించాను.. ఫలితాలను చూపించాను. ఇదే నా ఎకనామిక్స్, ఇదే నా పాలిటిక్స్, ఇదే నా తండ్రిని చూసి నేను నేర్చుకున్న హిస్టరీ. ఇవన్నీ కలిపితేనే మీ జగన్‌’’

– అసెంబ్లీలో సీఎం వైయస్‌ జగన్‌

అసెంబ్లీ: ఎన్నికలు అవ్వగానే మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేసే సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ.. మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథం అని, ప్రజలు పెట్టుకున్న ఆశలనీ, ఆ ఆశలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది అని నిరూపిస్తూ గొప్ప మార్పు తెచ్చామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ 98.5 శాతం హామీలను అమలు చేశామని సగర్వంగా తెలియజేస్తున్నానన్నారు. డీబీటీ ద్వారా రూ.1,97,473 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా అందరికీ మంచి చేశామన్నారు. విలువలు, విశ్వసనీయతే పునాదులుగా పరిపాలన చేస్తున్నామన్నారు. 

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎం వైయస్‌ జగన్‌ పూర్తి ప్రసంగం

నేడు 4వ బడ్జెట్‌ ప్రవేశ పెట్టే సందర్భంగా అందరం సమావేశమయ్యాం. మన ప్రభుత్వం వచ్చి 3సంవత్సరాల 9 నెలల కాలంలో ఏం చేసామో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. నాలుగు సంవత్సరాలు గడవకముందే 98.5 శాతం  మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసిన తర్వాత దేవుడి దయతో ఈసభలో సగర్వంగా నాలుగో బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నాం. ఎన్నికల మేనిఫెస్టో ∙విషయంలో పార్టీలు చూపవలసిన నిబద్ధతకు సంబంధించి మనం తీసుకువచ్చిన  గొప్ప మార్పు. 

రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అర్థం తెలియజేసేలా ప్రభుత్వంపై నమ్మకం పెరిగేలా పాలనలో పారదర్శకత తీసుకొచ్చే విధంగా నాలుగేళ్ల మన పాలన సాగిందని సగర్వంగా చెప్పగలుగుతున్నాను. రాజకీయ వ్యవస్థలో గొప్ప మార్పును తీసుకురాగలిగాం. మన ప్రభుత్వ పాలనలో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, చివరికి ఎవరికి ఓటు వేసారన్నది కూడా చూడకుండా మంచి చేస్తామని ఎన్నికల వేళ ఏదైతే చెప్పామో.. ఆ చెప్పిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను తూచా తప్పకుండా అందరికీ అందించామని మనస్ఫూర్తిగా, సంతోషంగా, సగర్వంగా చెప్పగలగుతున్నాను.

నా వాళ్లు, కాని వాళ్లు అని ప్రజలను విభజించే జన్మభూమి కమిటీలను పూర్తిగా రద్దు చేసి, ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ నావాళ్లే అనే గొప్ప సందేశాన్ని ఈ నాలుగేళ్ల కాలంలో ఇవ్వగలిగాం. ఇది కూడా మనం తీసుకువచ్చిన గొప్ప మార్పు.

రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తు బాగుందని నమ్మితేనే దాన్ని అభివృద్ధి అంటారు. ఇచ్చిన మాట ప్రకారం పేదరికంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలోని పిల్లలు కానీ, పెద్దలు కానీ, వృద్ధులుగానీ మూడు తరాలకూ మేలు చేసే విధంగా 1,97,473 కోట్ల రూపాయిలు డీబీటీ ద్వారా  బటన్‌ నొక్కి, ఎక్కడా లంచాలకు తావులేకుండా, వివక్షకు చోటులేకుండా గొప్ప మార్పు తీసుకురాగలిగాం. వ్యవస్థలోకి మనం తెచ్చిన ఈ మార్పు మనం చేసిన అతి గొప్ప మార్పు అని తెలియజేస్తున్నాను. 

గతంలో కుటుంబాల చరిత్రను మార్చలేని వారు, కులాల చరిత్రను మార్చలేని వారు. ఆర్థిక విషయాలపై ఎవరికీ అర్థం కాని విధంగా పైపైన మాట్లాడి గొప్పగా చెప్పుకునేవారు. అప్పట్లో బడ్జెట్‌ను చూస్తే ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. ఏ లెక్క ఏమిటీ.. ఎవరికి ఎంత ఖర్చు చేశారనేది బడ్జెట్‌ మీనింగే అర్థం కాని పరిస్థితుల్లో బడ్జెట్‌లు ప్రవేశపెట్టి గొప్ప గొప్ప మాటలు చెప్పుకున్నారు. చివరకు ప్రజలకు ఏం మంచి జరిగింది అంటే ఎవ్వరి దగ్గర సమాధానం లేని పరిస్థితి ఉండేది. 

మన పాలనలో మన పాలనలో ఇంటి ఇంటికి, మనిషి మనిషికి ఏం మేలు జరిగింది అని గడప గడపకూ వెళ్లి అక్కా మీ కుటుంబానికి ప్రభుత్వం నుంచి జరిగిన మంచి ఇది అని ఏకంగా ప్రింట్‌ చేసి వివరాలతో సహా వారికి చెప్పి.. మీకు మంచి జరిగిందని మీరు భావిస్తే మన ప్రభుత్వానికి, మీ బిడ్డ ప్రభుత్వానికి మద్దతు పలకండి అని సగర్వంగా మన ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి జరిగిన మంచిని వివరించగలిగిన గొప్ప స్థానంలో ఈ 45 నెలల పరిపాలన సాగిందని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇది మనందరి ప్రభుత్వానికి ఉన్న నైతికత, నిబద్ధతకు ఉదాహరణ.

రాష్ట్ర పరిపాలన వ్యవస్థలో జరిగిన కొన్ని మార్పులను ముందుగా ప్రస్తావిస్తాను..
రాష్ట్రంలో 2019 నాటి వరకు గమనిస్తే రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటే 26 జిల్లాలు అయ్యాయి. 13 మంది కలెక్టర్లు 26 మంది కలెక్టర్లు అయ్యారు. ఇంతకుముందు 13 జేసీలు ఉంటే 26 జేసీలు అయ్యారు. ఇంతకుముందు 13 ఎస్పీలు ఉంటే ఇప్పుడు 26 ఎస్పీలు ఉన్నారు. ఈ రకంగా వ్యవస్థలోకి పెరిగిన జిల్లాల వల్ల ఆటోమెటిక్‌గా ప్రతి జిల్లాలో సంబంధిత అధికారులు కూడా డబల్‌ అయ్యాయి. రాష్ట్ర ప్రజలకు పరిపాలన సేవలు రెట్టింపు కావడం, అధికారులు, అధికారం కూడా ప్రజలకు మరింతగా చేరువైంది. ఇది డీసెంట్రలైజేషన్‌లో భాగంగా తీసుకువచ్చిన మరో మార్పు. 

రాష్ట్రంలో 2019 వరకు ఉన్న రెవెన్యూ డివిజన్లు ఇంతకుముందు 51 ఉంటే.. ఈరోజు రెవెన్యూ డివిజన్లు ఏకంగా 76కు తీసుకెళ్లాం. మనందరి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు నెలకొల్పాం. ఈ సచివాలయాల్లో మన పిల్లలు అక్కడే ఉద్యోగం చేస్తూ శాశ్వత ఉద్యోగస్తులుగా అక్షరాల 1.34 లక్షల మంది కనిపిస్తున్నారు. ప్రతి సచివాలయంలో 600 పౌరసేవలు గ్రామస్థాయిలోనే ఎటువంటి లంచాలకు, వివక్షకు తావులేకుండా అందుతున్నాయి. 

ప్రతి 50 ఇళ్లకు చెయ్యి పట్టుకొని నడిపించేందుకు ఒక వలంటీర్, గ్రామ సచివాలయాలతో అనుసంధానమై అక్షరాల 2.65 లక్షల మంది వలంటీర్లుగా గ్రామంలో ప్రతి ఇంటిని కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ మంచి చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. మారు మూల పల్లెలు, పట్టణాల్లో ఎక్కడ చూసినా పౌర సేవల్లో ఇదొక గొప్ప విప్లవం. ఇది మనందరి ప్రభుత్వం ప్రజల కోసం తీసుకువచ్చిన మరో మార్పు. 

మనందరి ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన 10,778 రైతు భరోసా కేంద్రాలు గ్రామ స్థాయిలోనే కనిపిస్తున్నాయి. ఇందులో విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి సేవ రైతన్నకు తోడుగా ఉంటూ.. చెయ్యి పట్టుకొని నడిపించే ఒక గొప్ప వ్యవస్థ గ్రామస్థాయిలోనే అందుబాటులో ఉంది. ఆర్బీకేల్లో అక్షరాల 10,778 మంది అగ్రికల్చర్‌ అండ్‌ హార్టికల్చర్‌ గ్రాడ్యుయేట్లు ఈరోజు ప్రతి గ్రామంలో పనిచేస్తూ రైతన్నలకు తోడుగా ఉంటున్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి ఆర్బీకేలు, సేవలు చూస్తే పెద్ద సున్నా కనిపిస్తుంది. ఇది మనం గ్రామస్థాయిలో తీసుకువచ్చిన మరో గొప్ప మార్పు అని తెలిపేందుకు సంతోషిస్తున్నాను. 

గతంలో మండలానికి ఒక సర్వేయర్‌ ఉంటే గొప్ప సంగతి. ఆ సర్వేయర్‌ దొరికినప్పుడు లంచాలు ఇస్తే తప్ప సమయం ఇవ్వని పరిస్థితి. అలాంటిది మన ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో, పట్టణాల్లోని వార్డుల్లోనూ నియమించిన సర్వేయర్లు 10,185 మంది. మండలానికి ఒక సర్వేయర్‌ లేని పరిస్థితి నుంచి ఈరోజు 10,185 మంది సర్వేయర్లు గ్రామస్థాయిలో సచివాలయంలో అందుబాటులో ఉంటున్నారు. వీరి ద్వారా 100 సంవత్సరాల తరువాత మళ్లీ ఇవాళ సమగ్ర భూసర్వే చేపట్టి కబ్జాలకు, భూవివాదాలకు శాశ్వతంగా స్వస్తి పలికేలా అడుగులు వేస్తున్న ప్రభుత్వం మనది. ఇది మనందరి ప్రభుత్వం తీసుకువచ్చి మరో గొప్ప మార్పు. 

రాష్ట్రంలో 2019 వరకు ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఎన్ని అని చూస్తే కేవలం 11. ఈ 45 నెలల కాలంలో మరో 17 మెడికల్‌ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించబడుతున్నాయి. మన వైద్య, ఆరోగ్య రంగం మీద మనం చూపుతున్న శ్రద్ధకు ఇదొక నిదర్శనం. 

రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరు పోర్టులు ఉంటే.. రాబోతున్నవి, నిర్మాణంలో ఉన్నవి మరో 4. షిప్పింగ్‌ హార్బర్లు మరో 9 నిర్మాణం అవుతున్నాయి. రాష్ట్రంలో 7 వేల మెగావాట్లకు సంబంధించి కేవలం రూ.2.49కే మరో 25 సంవత్సరాల పాటు అందుబాటులో ఉండేలా.. సంవత్సరానికి 17 వేల మిలియన్‌ యూనిట్లు వ్యవసాయానికి పగటిపూటే అందుబాటులో ఉండేలా ఉచిత కరెంటుకు డోకా లేకుండా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం కూడా మనదే. 

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా మూడేళ్లుగా దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానం కూడా మన రాష్ట్రం నిలిచింది. ప్రస్తుతం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఇచ్చే ప్రక్రియలో మూడు సంవత్సరాల క్రితం మార్పులు చేశారు. ఆ ప్రక్రియలో భాగంగా పరిశ్రమలు పెట్టిన వారి అభిప్రాయలు తీసుకొని, వారి అభిప్రాయాల మేరకు ర్యాకింగ్‌లు ఇస్తున్నారు. రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలవడం, మూడేళ్లు వరుసగా మొదటి స్థానంలో నిలవడం గొప్ప తార్కాణం అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

గతంలో రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా పారిశ్రామిక సంస్థలు, పారిశ్రామిక వేత్తలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావడం మనం చూస్తున్నాం. దావోస్, విశాఖ సమ్మిట్‌లో కూడా ఇదే విషయాన్ని గమనించాం. పారిశ్రామిక రంగంలో తిరుగులేని మార్పులకు ఏరకంగా శ్రీకారం చుట్టడానికి ఇదొక నిదర్శనం. 

28 రాష్ట్రాల భారతదేశంలో 2021–22లో అత్యధికంగా 11.23 శాతం ఆర్థిక వృద్ధిరేటుతో దేశంలోనే నంబర్‌ వన్‌గా మన రాష్ట్రం ఉంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయాన్ని చూస్తే.. 14.02 శాతం పెరిగిన రాష్ట్రం కూడా మనదే అని సగర్వంగా తెలియజేస్తున్నాను. దేవుడి దయ వల్ల, ప్రజల కష్టంతో, మంచి పరిపాలనతో ఇదంతా సాధ్యమైంది. 

గ్రామం నుంచి రాష్ట్ర రాజధానుల వరకు అడుగడుగునా ఈ 45 నెలల పాలనలో మార్పు కనిపిస్తోంది. మీ జగన్ మార్క్‌ కూడా కనిపిస్తుంది. ఈ 45 నెలల పాలనలో ఏ గ్రామాన్ని తీసుకున్నా.. ఆ గ్రామంలో ప్రస్పుటంగా కనిపిస్తున్న మార్పులను గమనించాలని కోరుతున్నా.. దాదాపు ప్రతి గ్రామంలో మనం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు కనిపిస్తాయి. అందులో మన పిల్లలు 10 మంది ఉద్యోగం చేస్తూ చిరునవ్వుతో గుడ్‌ మార్నింగ్‌ చెప్పే పరిస్థితి మన గ్రామంలో కనిపిస్తోంది. వీరి ద్వారా 600లకు పైగా సేవలు గ్రామాల్లోనే అందుతున్నాయి. అదే గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ కూడా చెయ్యి పట్టుకొని ప్రజలను ప్రతి సేవా కార్యక్రమంలోనూ తోడ్పాటునిస్తూ సేవలందిస్తున్న కార్యక్రమం కూడా అక్కడే కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే అదే గ్రామంలో రైతు భరోసా కేంద్రం కూడా కనిపిస్తుంది. ఆ రైతు భరోసా కేంద్రంలో అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌ ఈ–క్రాప్‌ డేటా నమోదు చేస్తూ.. పంట విత్తనం నుంచి కొనుగోలు వరకు రైతన్నకు తోడ్పాటును అందిస్తున్న కార్యక్రమం కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే.. వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌ కనిపిస్తోంది. వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌లో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ (బీఎస్సీ నర్సింగ్‌ డిగ్రీ) అక్కడే ఉంటూ దాదాపు 105 రకాల మెడిసిన్‌ ఇస్తూ, 14 రకాల డయాగ్నస్టిక్‌ టెస్టులు చేస్తూ ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టుతో అనుసంధానమై అక్కడే సేవలు అందిస్తున్న పరిస్థితి అదే గ్రామంలో కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే రాబోతున్న డిజిటల్‌ గ్రంథాలయాలు కనిపిస్తాయి. అన్‌లిమిటెడ్‌ బాండ్‌ విడ్త్‌తో ఇప్పటికే 4 వేల గ్రామాలకు ఫైబర్‌ ఆప్టిక్‌ గ్రిడ్‌ కూడా చేరుకుంది. మిగిలిన 13 వేల పంచాయతీలకు ఈ డిసెంబర్‌ నాటికి బాండ్‌ విడ్త్‌ చేరుతుంది. డిజిటల్‌ లైబ్రరీలు క్రియేట్‌ చేసి అన్‌లిమిటెడ్‌ బాండ్‌ విడ్త్‌ ద్వారా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఫెసిలిటేట్‌ చేసే విధంగా డిజిటల్‌ లైబ్రరీలు కూడా అదే గ్రామస్థాయిలో కనిపించనున్నాయి. అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు వేస్తే.. నాడు–నేడుతో మారిన ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు అదే గ్రామంలో కనిపిస్తాయి. మరో కొద్ది దూరంలో పేద అక్కచెల్లెమ్మల చేతికి మనం ఇచ్చిన ఇళ్ల స్థలాలు, ఆ స్థలాల్లో నిర్మాణం అవుతున్న ఇళ్లు కనిపిస్తాయి. ఇళ్లు కూడా కాదు కాలనీలు కనిపిస్తాయి. ఇవన్నీ గ్రామస్థాయిలో ఏ గ్రామం తీసుకున్నా.. ప్రస్పుటంగా చెప్పినవన్నీ ఎవరికైనా కనిపించే గొప్ప అభివృద్ధిని గ్రామస్థాయిలోనే చూపించగలిగాం. ఇది కేవలం నాలుగు సంవత్సరాలు కూడా పూర్తికాకముందే మన ప్రభుత్వం గ్రామస్థాయిలోనే తీసుకువచ్చిన గొప్ప మార్పు అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. 

గత ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు వారు అందించిన పెన్షన్‌ కేవలం 1000. అది కూడా కేవలం 39 లక్షల మందికి. మనందరి ప్రభుత్వంలో దేవుడి దయతో ఏకంగా పెన్షన్‌ అందుకుంటున్నవారు గ్రామస్థాయిలో చూస్తే 64 లక్షల మంది ఉన్నారు. మనందరి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పెన్షన్‌ను రూ.2250కి పెంచి ఇప్పటికే రూ.2750కి తీసుకెళ్లాం. రేపు బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టబోతున్నాం.. ఆ బడ్జెట్‌లో జనవరి వచ్చేసరికి పెన్షన్‌ రూ.2750 నుంచి రూ.3 వేలకు కూడా తీసుకెళ్తాం.. ఆ తరువాతే ఎన్నికలకు వెళ్లే కార్యక్రమం జరుగుతుందని చెప్పడానికి గర్వపడుతున్నా. 

పెన్షన్‌ కూడా 1వ తేదీన సూర్యోదయానికి ముందే ఇంటింటికీ వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్‌మార్నింగ్‌ చెప్పి ఇంట్లోని ప్రతి అవ్వకు, ప్రతి తాత చేతుల్లో పెన్షన్‌ పెట్టే కార్యక్రమంలో రాష్ట్రంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎక్కడా లేదని నేను చెప్పగలను. మనందరి ప్రభుత్వం తీసుకువచ్చిన మరో గొప్ప మార్పు. 

మనందరి ప్రభుత్వంలో రేషన్‌కార్డులు ఒక కోటి 46 లక్షలకు పెంచాం. రాష్ట్రంలో ఏ పల్లెలో అయినా, ఏ పట్టణంలో అయినా రేషన్‌ బియ్యం మన వీధికే వచ్చి, మన ఇంటి ముంగిటే అందించే వ్యవస్థ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా..? ఎక్కడా లేదు. మన దగ్గర కాపీ కొట్టి మిగిలిన రాష్ట్రాలు ఎలా చేయాలని మన దగ్గర తర్ఫీదు తీసుకున్న తరువాత అడుగులు ముందుకుపడుతున్న రోల్‌ మోడల్‌ స్టేట్‌గా మన రాష్ట్రం ఉంది. రేషన్‌ షాపుల దగ్గర గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన దుస్థితిని నివారించి, రాష్ట్ర వ్యాప్తంగా 9,260 డెలివరీ వ్యాన్‌లతో నాణ్యమైన శార్టెక్స్‌ మధ్యస్తు సన్నబియ్యాన్ని నెల నెలా డోర్‌ డెలివరీ చేస్తున్న ప్రభుత్వం మరెక్కడైనా ఉందా..? అని నేను అడుగుతున్నా. ఇది మన ప్రభుత్వం వల్ల వచ్చిన ఇంకో గొప్ప మార్పు అని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. 

గత ప్రభుత్వంలో శిథిలమైన పరిస్థితుల్లో ఉన్న గవర్నమెంట్‌ బడులు. అలాంటి బడులు మరో రెండేళ్లు గడిస్తే కార్పొరేట్‌ బడులు సైతం గవర్నమెంట్‌ బడులతో పోటీపడే పరిస్థితి తీసుకువస్తూ.. గవర్నమెంట్‌ బడిని సీబీఎస్‌ఈ ఇంగ్లిష్‌ మీడియంతో తీర్చిదిద్దగలుగుతామని, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తామని, 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్‌ రూమ్‌లోనూ ఇంటరాక్టీవ్‌ ప్లాట్‌ప్యానల్స్‌ ఏర్పాటు చేసి విద్యా విధానాన్ని డిజిటల్‌ యుగంలోకి తీసుకెళ్తామని, గోరుముద్ద మెనూ నుంచి పిల్లల డ్రస్‌ వరకు అన్నింట్లో ఇంతలా ఒక మేనమామలా ముఖ్యమంత్రే శ్రద్ధ తీసుకోవడాన్ని జగనన్న విద్యా దీవెన వందశాతం ఫీజురీయింబర్స్‌మెంటే కాక వసతి దీవెనతో పిల్లలందరికీ తోడుగా ఉండే పరిస్థితిని గత ప్రభుత్వంలో ఏనాడైనా జరిగిందా..? ఇలాంటి మార్పు ఊహకైనా అందుతుందా..? అని అడుగుతున్నా.. ఆలోచన చేయమని కోరుతున్నా.. 

మరో రెండేళ్లు గడిస్తే 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్‌రూమ్‌లోనూ ఇంటరాక్టీవ్‌ ప్లాట్‌ప్యానల్స్‌తో పిల్లలకు చదువులు గవర్నమెంట్‌ బడుల్లో చెప్పడం మొదలుపెడితే కార్పొరేట్‌ బడులు దీనికి పోటీపడేలా వారు కూడా 6వ తరగతి నుంచి ఇంటరాక్టీవ్‌ ప్లాట్‌ప్యానల్స్‌ పెట్టి గవర్నమెంట్‌ బడులను కాపీ కొట్టి కాంపిటీషన్‌కు వచ్చే పరిస్థితి మరో రెండేళ్లలో జరుగుతుంది. ఇప్పటికే 15,200 పైచిలుకు స్కూల్స్‌లో 6వ తరగతి నుంచి ఉన్న 5800 బడుల్లో 30,230 క్లాస్‌ రూమ్‌లలో ఈజూన్‌లో స్కూల్స్‌ తెరిచే సమయానికి ఇంటరాక్టీవ్‌ ప్లాట్‌ప్యానల్స్‌తో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు రాష్ట్ర వ్యాప్తంగా వస్తాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 

8వ తరగతి నుంచి ట్యాబ్‌లు ఇస్తున్నాం. వచ్చే ఏడాది కూడా ఇదే కార్యక్రమం జరుగుతుంది. గవర్నమెంట్‌ బడులు ట్యాబ్‌లు ఇస్తున్నాయి కాబట్టి కార్పొరేట్‌ బడులు కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ ఎంత గొప్పగా మార్పులు జరుగుతున్నాయని చెప్పడానికి ఉదాహరణలు. 

మనబడి నాడు–నేడుతో రూపం మారుతున్న స్కూళ్లు, కాలేజీలు ఏకంగా 45 వేలు. వచ్చే తరం పిల్లల భవిష్యత్తు కోసం మన ప్రభుత్వం తీసుకువస్తున్న మరో గొప్ప మార్పు అని చెప్పడానికి సంతోషపడుతున్నాను. 

నవరత్నాలు..
అమ్మ ఒడి పథకంతో పిల్లలను చదివించే తల్లులకు రూ.15 వేల సాయం చేయడం అనే ఆలోచన గతంలో ఎప్పుడూ చూసింది లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో చూడలేదు. మనందరి ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాల్లోనే కేవలం అమ్మ ఒడి అనే పథకం ద్వారా 44.48 లక్షల మంది తల్లుల చేతుల్లో పెట్టిన సొమ్ము మొత్తం 19,674 కోట్ల రూపాయలు. అమ్మ ఒడి అనే పథకం కోసం కేవలం పిల్లలను బడులకు పంపించమని ప్రోత్సహించేందుకు చేసిన వ్యయం. 75 శాతం హాజరు కచ్చితంగా ఉండాలని మంచి మేనమామలా తాపత్రయపడి పిల్లల చదువుల కోసం ఆరాటపడుతూ తెచ్చిన గొప్ప పథకం. ఇది చదువులను ప్రోత్సహిస్తూ మనం ప్రభుత్వం తీసుకువచ్చిన మరో గొప్ప మార్పు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 

  • రైతు భరోసా అనే పథకం ద్వారా 52.38 లక్షల మంది రైతన్నలకు ఈ నాలుగేళ్ల కాలంలో ఈ ఒక్క పథకం ద్వారా అందించిన సాయం రూ.27,062 కోట్లు. కౌలు రైతులకు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ రైతులకు సైతం ఈ సాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మనది అని చెప్పడానిక గర్వపడుతున్నాను. 
  • బీమా ప్రీమియంగా రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా.. మొత్తం బీమా సొమ్మును తానే చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా మనదే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇలా 44.05 లక్షల మంది రైతులకు అక్షరాల రూ.6872 కోట్లు పరిహారంగా అందించిన ప్రభుత్వం మనది. 
  • ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నావడ్డీ, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, ఎంఎస్‌పీకి ఏ మాత్రం కూడా తగ్గకుండా ఆహార ధాన్యాల కొనుగోలు, ధాన్యం సేకరణ, ఆర్బీకేల ద్వారా ఈ–క్రాపింగ్, ఆర్బీకే వ్యవస్థ ఇలా ప్రతి ఒక్క విషయంలో చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా వ్యవసాయ రంగంలోకి మార్పులు తీసుకువచ్చిన ప్రభుత్వం కూడా మనదే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

45–60 సంవత్సరాల మధ్యలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా అండదండలు అందిస్తున్న వైయస్‌ఆర్‌ చేయూత లాంటి పథకం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు.. దేశంలో కూడా ఎప్పుడూ, ఎక్కడా జరగలేదు. ఈ రోజు ఆంధ్రరాష్ట్ర అక్కచెల్లెమ్మలకు మాత్రమే జరుగుతుంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు మనందరి ప్రభుత్వం అక్షరాల 26.40 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు అందించిన మొత్తం రూ.14,129 కోట్లు అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఐటీసీ, రిలయన్స్, అమూల్‌ వంటి పెద్ద సంస్థలను తీసుకువచ్చి అక్కచెల్లెమ్మల జీవనోపాధికి సంబంధించి మార్గాలు చూపిస్తూ బ్యాంక్‌లను కూడా మమేకం చేస్తూ దారి చూపించిన గొప్ప వ్యవస్థను చేయూత పథకం ద్వారా తీసుకువచ్చాం. 

సున్నావడ్డీతో అక్కచెల్లెమ్మలను ఒకవైపు ఆదుకుంటూ మరోవైపున పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడేందుకు వైయస్‌ఆర్‌ ఆసరా ద్వారా రూ.25 వేల కోట్లను నాలుగు విడతల్లో చెల్లిస్తామని మాటిచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం మూడో విడత చెల్లింపునకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758 కోట్లను 78.74లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగామని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

గత ప్రభుత్వానికి ఎన్నికల్లో వాగ్దానం చేయడం, ఎన్నికలు అయిపోయిన తరువాత మోసం చేయడం, పొదుపు సంఘాలన్నింటినీ దెబ్బతీయడం మన కళ్ల ఎదటనే చూశాం. గత ప్రభుత్వంలో ఔట్‌ స్టాండింగ్‌ లోన్స్, ఎన్‌పీఏల కింద దాదాపుగా 18 శాతం అక్కచెల్లెమ్మలందరూ ఆ స్థాయికి దిగజారిపోతే.. ఏ, బీ గ్రేడ్‌ సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌లోకి దిగజారిపోయాయి. ఈ రోజు ఔట్‌స్టాండింగ్‌లోన్స్‌ కేవలం 0.5శాతం. అంటే 99.5 శాతం అక్కచెల్లెమ్మలు సంతోషంగా కడుతున్నారు. 

వైయస్‌ఆర్‌ కాపు నేస్తం ద్వారా 3.56 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.1518 కోట్లతో సాయం చేయగలిగాం. వైయస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం ద్వారా మరో 3.94 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.595 కోట్లు ఇప్పటికే ఇవ్వగలిగామని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి పథకాలతో అక్కచెల్లెమ్మల సాధికారతను తమ విధానంగా మార్చుకొని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం మనది అని గర్వంగా చెప్పగలను. 

జీడీపీ గ్రోత్‌రేట్‌ 11.23 శాతానికి పెరిగాం. ఆ స్థాయిలో గ్రోత్‌రేట్‌ మన రాష్ట్రంలో రావడానికి కారణం గురించి ఆలోచిస్తే.. యాక్టివిటీ లెవల్స్‌ ఆ లెవల్‌లో సపోర్టు పొంది ఉండాలి. ప్రధానంగా జీడీపీ పెరుగుదల గమనిస్తే.. గవర్నమెంట్‌ ఎంప్లాయిమెంట్‌ గురించి ఒకసారి గమనిస్తే.. ఐదున్నర కోట్ల జనాభా.. 4 లక్షల ఉద్యోగాలు. మనం వచ్చిన తరువాత 4 లక్షలను 6 లక్షల ఉద్యోగాలు చేయగలిగాం. కానీ, ఐదున్నర కోట్ల జనాభాలో 6 లక్షల ఉద్యోగాలు. పెద్ద పెద్ద పరిశ్రమలు ఇవన్నీ చూసుకుంటే మరో 15, 20 లక్షల ఉద్యోగాలు. ఉద్యోగాలు ఎక్కవగా ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో ఉన్నాయి. ఒక్కో ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌ కనీసం 10 మందికి ఉపాధి కల్పిస్తోంది. గతంలో 1.10 లక్షల ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉంటే మన ప్రభుత్వం ఏర్పడిన తరువాత మరో 1.56 లక్షల ఎంఎస్‌ఎంఈలు చేరాయి. చెయ్యి పట్టుకొని వారిని నడిపిస్తూ ప్రోత్సాహాన్ని ఇస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న ఇండస్ట్రియల్‌ ఇన్సెంటీవ్స్‌ అన్నీ క్లియర్‌ చేస్తూ ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం తోడుగా ఉందని భరోసానిస్తూ అడుగులు వేయిస్తున్నాం. 

మరో పెద్ద రంగం వ్యవసాయం. వ్యవసాయరంగం మీద అక్షరాల 62 శాతం మంది జనాభా ఆధారపడి ఉన్నారు. ఇటువంటి వ్యవసాయ రంగంలో రైతన్నలకు తోడుగా ఉంటూ రైతు భరోసా సొమ్మును సమయానికి ఇవ్వడం, ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవన్నీ క్రమం తప్పకుండా ఇస్తూ ఆర్బీకేల ద్వారా రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాం కాబట్టి వ్యవసాయ రంగం నిలదొక్కుకుంది. 

  • సెల్ఫ్‌ ఎంప్లాయీడ్‌ సెక్షన్స్‌.. వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా ద్వారా 1.20 లక్షల మత్స్యకార కుటుంబాలకు రూ.422 కోట్ల సాయం చేసి.. వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేశాం. 
  • వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం ద్వారా 82 వేల కుటుంబాలకు రూ.778 కోట్లు అందించగలిగాం. వారి కాళ్ల మీద వారు నిలబడేలా తోడుగా చేశాం. 
  • వైయస్‌ఆర్‌ వాహన మిత్ర, జగనన్న తోడు, జగనన్న చేదోడు, లా నేస్తం వంటి వినూత్న పథకాలు అమలు చేస్తున్నాం. 
  • జగనన్న చేదోడు ద్వారా 15 లక్షల మంది ఫుట్‌పాత్‌ వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులకు తోడుగా నిలబడ్డాం. స్వయం ఉపాధి కల్పించుకొని వారి కాళ్ల మీద వారు నిలబడగలగడం, ఈ బలహీనవర్గాలకు అండదండగా తోడుగా నిలబడిన ఏకైక ప్రభుత్వం మనది అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇవన్నీ చేయగలిగాం కాబట్టే వీటి అన్నింటికీ తోడు 30.75 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి.. 22 లక్షల ఇళ్లు వేగంగా నిర్మిస్తున్నాం కాబట్టే సిమెంట్, స్టీల్, లేబర్‌ అన్నీ కూడా బూస్ట్‌లా తయారయ్యాయి కాబట్టే ఈ రకమైన గ్రోత్‌తో దేశానికే ఆంధ్రరాష్ట్రంలో రోల్‌ మోడల్‌గా నిలబెట్టగలిగాం. 

ప్రపంచాన్నే వణికించిన కోవిడ్‌ సమయంలో ఆ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్న రాష్ట్రాల్లో దేశంలో అగ్రగామిస్థానంలో మన రాష్ట్రం ఒకటిగా నిలబడింది. 

వైద్య రంగంలో కనీవినీ ఎరుగని విధంగా ప్రివెంటీవ్‌ కేర్‌లో ఒక కొత్త అధ్యయనాన్ని రాస్తూ ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టును తీసుకువచ్చాం. గ్రామంలోనూ, పట్టణ ప్రాంతాల్లోనూ మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు అక్షరాల 10,550 క్లినిక్‌లు గ్రామస్థాయిలోనే ఏర్పాటు కాబడ్డాయి. గ్రామంలో ఉన్న విలేజ్‌ క్లినిక్స్‌ దగ్గర నుంచి మొదలు పెడితే పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, డిస్ట్రిక్ట్‌ ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రులు వీటన్నింటినీ నాడు–నేడుతో వాటి రూపురేఖలు పూర్తిగా మారుస్తూ వాటన్నింటినీ నేషనల్‌ స్టాండెట్స్‌కు తీసుకువచ్చే గొప్ప అడుగులు వైద్యరంగంలో జరుగుతున్నాయి. మన ప్రభుత్వం తీసుకువచ్చిన మరో గొప్ప మార్పు అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

మరో ముఖ్యమైన అంశం..
గత ప్రభుత్వంలో గమనిస్తే.. గ్రామంలో ఉన్న మహిళా పోలీసులు ఎంత మంది అని చూస్తే సున్నా.. ఈ రోజు మనందరి ప్రభుత్వంలో నియమించిన గ్రామ, వార్డు స్థాయిలో ఉన్న మహిళా పోలీసులు అక్షరాల 15 వేల మంది. 

అమ్మ ఒడి, ఆసరా, సున్నావడ్డీ, చేయూత, 30 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణం, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాలు ఇవన్నీ మహిళా పక్షపాత ప్రభుత్వంగా మనం వేసిన ముందడుగులు అయితే.. వీటన్నింటితో పాటు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా దిశ యాప్‌ను తీసుకువచ్చాం. గొప్ప అడుగు మనం వేశాం. దిశ యాప్‌ ఇప్పటికే 1.36 కోట్ల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో డౌన్‌లోడ్‌ అయ్యి ఉంది. 1.17 కోట్ల మంది వారి ఫోన్లలో రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకున్నారు. ఆపదలో ఉన్నప్పుడు ఏ అక్కచెల్లెమ్మ అయినా ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కినా, ఐదుసార్లు ఆ ఫోన్‌ను చేసినా వెంటనే 10 నిమిషాల్లో పోలీస్‌ సోదరుడు వచ్చి ఏమైందని భరోసా ఇచ్చే గొప్ప అడుగు ఈ రాష్ట్రంలో పడింది. దిశ యాప్‌తో పాటు దిశ బిల్లును తీసుకువచ్చాం. కేంద్రం వద్ద ఆమోదం అవసరం. ఇప్పటికే దిశ పోలీస్‌ స్టేషన్లు కనిపిస్తున్నాయి. దిశ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు ప్రతి జిల్లాలో కనిపిస్తున్నారు. అక్కచెల్లెమ్మలకు తోడుగా, అండగా నిలబడేందుకు తీసుకువచ్చిన గొప్ప మార్పులు అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

ఎలాంటి లంచాలకు తావులేకుండా, ఎలాంటి వివక్ష చోటులేకుండా పారదర్శకంగా, నేరుగా ప్రజల ఖాతాల్లోకి నేరుగా డీబీటీ ద్వారా అక్షరాల రూ. 2 లక్షల కోట్లు జమ చేయగలిగాం. భారతదేశం చరిత్రలోనే ఏ రాష్ట్రంలో చూసుకున్న కూడా ఈ స్థాయిలో డీబీటీ జరిగిన రాష్ట్రం లేనేలేదు అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇందులోనూ 76 శాతం నేరుగా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అందజేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇది మనందరి ప్రభుత్వం తీసుకువచ్చిన గొప్ప అతిపెద్ద మార్పు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 

గత ప్రభుత్వంలో ఏది కావాలన్నా లంచం, వివక్ష... ఈరోజు మన ప్రభుత్వంలో అవి ఎక్కడా కనిపించకుండా నేరుగా బటన్‌ నొక్కుతున్నాం. అవి అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ అవుతున్నాయి. 

నాకు ఇండస్ట్రీ ఎంత ముఖ్యమో.. వ్యవసాయం కూడా అంతే ముఖ్యం. నాకు ఐటీ ఎంత ముఖ్యమో.. చిరువ్యాపారులు నా బీసీ, ఎస్సీ కుల వృత్తుల్లో ఉన్నవారూ అంతే ముఖ్యం. వీరందరూ ఎలా బతకగలుగుతున్నారనేది కూడా అంతే ముఖ్యం. నాకు ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ముఖ్యమో.. నెల నెల పెన్షన్లు తీసుకుంటున్న నా అవ్వాతాతలు కూడా అంతే ముఖ్యం. మనందరి ప్రభుత్వం ద్వారా సంక్షేమం, అభివృద్ధి పథకాల సొమ్ము అందుకుంటున్న నిరుపేద అక్కచెల్లెమ్మలు, వారి కుటుంబాలు, వారి బాగోగులు కూడా అంతే ముఖ్యమని చెప్పడానికి సభ ద్వారా చెప్పడానికి గర్వపడుతున్నాను. వారి సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, జెండర్‌ సాధికారతలు అంతకంటే ముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మనసులో పెట్టుకొని నా మంత్రి మండలిలో మన ప్రభుత్వం ఇచ్చే నామినేటెడ్‌ పదవుల్లో, ఆలయ బోర్డుల్లో, ఏఎంసీల్లో, స్థానిక సంస్థల్లో ఇలా ఏ రంగంలో చూసుకున్నా.. సామాజిక న్యాయంతో పాటు రాజకీయ న్యాయం కూడా అంతే ప్రస్పుటంగా కనిపిస్తుందని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఈ పదవుల్లో కనీసం సగం వాటా అక్కచెల్లెమ్మలకు ఇచ్చేలా, సగం వాటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కుటుంబ సభ్యులకు నిండు మనసుతో ఇవ్వడం కూడా నాకు అంతే ముఖ్యం అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఈ దిశగా ప్రతి అడుగు ఒక దీక్షగా వేయగలిగాం అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. 

నా నడక మాత్రం నేల మీదే.. నా ప్రయాణం సామాన్యులతోనే.. నా ప్రయాణం పేదవర్గాలతోనే.. నా యుద్ధం పెత్తందార్లతోనే.. నా లక్ష్యం పేదరిక నిర్మూలనే.. కాబట్టే నా ఎకనామిక్స్‌ వేరే. 
పేద కుటుంబాలు బలపడితేనే పేద కులాలు బాగుంటాయి. పేద కుటుంబాలతో పాటు పేద కులాలను బలపరిస్తేనే వారికి అన్ని సాధికారతలు ఇస్తేనే సమాజం బాగుంటుంది. సమాజంలోని అన్ని ప్రాంతాలను బలపరిస్తేనే రాష్ట్రం కూడా బాగుంటుంది. ఇది నేను నమ్మాను.. ఆచరించాను.. ఫలితాలను చూపించాను. ఇదే నా ఎకనామిక్స్, ఇదే నా పాలిటిక్స్, ఇదే నా తండ్రిని చూసి నేను నేర్చుకున్న హిస్టరీ. ఇవన్నీ కలిపితేనే మీ జగన్‌. 

ఇన్ని విప్లవాత్మక మార్పులు చేసిన ప్రభుత్వం, ఇంతగా పేదవాడికి తోడుగా ఉన్న ప్రభుత్వం, ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసిన మనందరి ప్రభుత్వం.. సామాజిక న్యాయం, మహిళా న్యాయం, రైతన్నలకు న్యాయం వీటన్నింటినీ దైవ కార్యాలుగా భావించి నిబద్ధతతో అడుగులు వేస్తున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు ఎప్పటికీ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. 

Back to Top