దుష్టచతుష్టయంతో మన యుద్ధం 

ఒంగోలు సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందా..?

చంద్రబాబులా మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తే అమెరికా అవుతుందా..?

సంక్షేమ పథకాలు ఆపేయాలని ఎల్లో పార్టీ, ఎల్లో మీడియా, ఎల్లో దత్తపుత్రుడు అంటున్నారు

మనందరి ప్రభుత్వంపై నిత్యం గోబెల్స్‌ ప్రచారం

దుష్టచతుష్టయం మాటలను మీరు ఒప్పుకుంటారా..?

పేదరికం నిర్మూలనకు మీ జగన్‌ చేస్తున్నది మంచా?, చెడా? ఆలోచన చేయండి

మనమిచ్చే సంకేతంతో వారందరికీ జ్ఞానోదయం కావాలి

మంత్రివర్గంలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు

సామాజిక న్యాయం మాటల్లో కాదు.. చేతల్లో చేసి చూపించాం

ఒంగోలు: ‘‘రాష్ట్రంలో పేదలకు జరుగుతున్న మంచిని ఓర్వలేక కడుపుమంటతో విషం చిమ్ముతున్న రాక్షసులతో, దుర్మార్గులతో మనమంతా యుద్ధం చేస్తున్నాం. మనం చేస్తున్న మంచి పాలన వద్దని, మా బాబు పాలనే కావాలని, సంక్షేమ పథకాలు ఆపేయాలని దుష్టచతుష్టయం (చంద్రబాబు, రామోజీరావు, ఏబీఎన్, టీవీ5, దత్తపుత్రుడు) అంటుంది’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఒంగోలు సభలో 35 నెలల్లో వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం చేసిన మంచిని వివరించిన సీఎం వైయస్‌ జగన్‌.. ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా చేస్తున్న దుర్మార్గాలపై, తప్పుడు రాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. రాష్ట్రం శ్రీలంక అవుతుందా..? చంద్రబాబు మాదిరిగా మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తే.. అమెరికా అవుతుందా..? అని దుష్టచతుష్టయాన్ని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

‘అవినీతి లేకుండా నేరుగా బ్యాంకు అకౌంట్‌కు డబ్బులు జమ చేసిన ఇలాంటి ప్రభుత్వాన్ని, మనసున్న పాలనను గతంలో ఎప్పుడైనా చూశారా అని మీరే గుండెల మీద చేతులు వేసుకొని మనఃసాక్షిని అడగండి. 

ఈనాడు పత్రికలో రాస్తున్న రాతలు.. ప్రభుత్వం డబ్బు పంచే తమాషాలు ఇక ఆపాలంట. జగన్‌ ప్రభుత్వ నిర్వాకంతో మరో శ్రీలంకగా రాష్ట్రం, ఉచితంతో ఆర్థిక విధ్వంసం ఇవి.. రోజూ చంద్రబాబు, రామోజీరావు, ఏబీఎన్, టీవీ5 దుష్టచతుష్టయాలన్నీ కలిసి రాస్తున్నారు. 

అక్కచెల్లెమ్మలకు, రైతులకు, చదువుకుంటున్న పిల్లలకు, అవ్వాతాతలకు, పేదరికంలో ఉండి అలమటిస్తున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, అగ్రవర్ణాల్లో ఉన్న నా పేదలకు పథకాలు అమలు చేయడానికి వీల్లేదట. రోజూ పేపర్లలో, టీవీల్లో డిబేట్లు పెట్టి చేస్తున్న ప్రచారం ఇదే. తెలుగుదేశం పార్టీ ఏం చెప్పదలుచుకుందో.. వారి అధికార గెజిట్‌ పేపర్లలో ఈనాడుతో చెప్పిస్తారు. ప్రభుత్వం డబ్బు పంచే తమాషాను ఆపాలని రాయిస్తాడు. రోజూ ఇటువంటి రాతలే చూస్తున్నాం. 

నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు, పేద వర్గాల్లో అందుతున్న ఈ పథకాలను ఆపేయాలని ఎల్లో పార్టీ, ఎల్లో మీడియా, వారిద్దరికీ ఎల్లో దత్తపుత్రుడు. ఈ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందట. ఏకంగా గోబెల్స్‌ ప్రచారం మొదలుపెట్టారు. పేదలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందట.. కానీ, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను చంద్రబాబు మాదిరిగా అమలు చేయకపోతే.. ఎన్నికలు అయిపోయిన తరువాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తే రాష్ట్రం అమెరికా అవుతుందట. ఇది ఈనాడు పత్రిక నిర్వచనం. 

సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందట. పేదలకు ఇవ్వకుండా ఆ డబ్బు పాలకుల జేబుల్లోకి వెళ్తే అమెరికా అవుతుందట. ఇది దుష్టచతుష్టయం సారాంశం. ఇలాంటి రాక్షసులతో, దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నాం. సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. తద్వారా పాలకులు కాకుండా.. ప్రజలు బాగుపడితే.. రాష్ట్రం ఏమైనా శ్రీలంక అవుతుందా అని ప్రజలు ఆలోచన చేయాలని కోరుతున్నా.. పథకాలు ప్రజల చేతుల్లోకి నేరుగా వెళ్తే.. జీవన ప్రమాణాలు మెరుగవుతే.. మన రాష్ట్రం ఏమైనా శ్రీలంక అవుతుందా అని ఆలోచన చేయాలి. పథకాలన్నీ ఆపేయాలని, చంద్రబాబుకు ఓటేస్తే ఈ పథకాలన్నీ ఆపేస్తాడని చెప్పకనే చెబుతున్నారు ఎల్లోమీడియా ప్రబుద్ధులు. 

దీనికి మీరు ఒప్పుకుంటారా.. అని ప్రజలనే అడుగుతున్నా. మనందరి ప్రభుత్వంలో 44.50 లక్షల మంది తల్లులకు మంచిచేస్తూ 84 లక్షల మంది పిల్లలను బడిబాట పట్టిస్తూ అక్షరాల ఇప్పటి వరకు రూ.13,022 కోట్లు జగనన్న అమ్మఒడిని ప్రవేశపెట్టాం. అమలు చేస్తున్నాం. ఈ పథకాన్ని ఆపాలనేది దుష్టచతుష్టయం ఉద్దేశం.. ఇందుకు మీరు ఒప్పుకుంటారా..? 

మనందరి ప్రభుత్వంలో ఏకంగా 52.40 లక్షల రైతులు, కౌలు, అసైన్డ్, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ రైతు కుటుంబాలకు వైయస్‌ఆర్‌ రైతు భరోసా కింద ఇప్పటి వరకు రూ.20,162 కోట్లు నేరుగా అందించాం. ఇలాంటి పథకాన్ని ఆపేయాలనేది ఎల్లో పార్టీ, ఎల్లో మీడియా ఉద్దేశం.. ఇందుకు మీరు ఒప్పుకుంటారా..? అక్కచెల్లెమ్మలు రెండు చేతులు పైకెత్తి సంకేతం ఇవ్వడం వల్లనైనా కనీసం చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5కి బుద్ధి వస్తుందని ఆశిద్దాం. ప్రజలు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది. అది తెలిసినా వక్రీకరించే దుర్బుద్ధితో ఇటువంటి కార్యక్రమాలు చేసేవారందరికీ మనం ఇచ్చే సంకేతంతో జ్ఞానోదయం అవుతుంది. 

మనందరి ప్రభుత్వంలో ఏకంగా 25 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ.. 45–60 సంవత్సరాల వయసులో గల అక్కచెల్లెమ్మల కోసం వైయస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా చేయి పట్టుకొని నడిపిస్తున్నాం. క్రమం తప్పకుండా రూ.18,750 ఏటా చేతుల్లో పెటి.. నాలుగేళ్ల పాటు వరుసగా రూ.75 వేలు ఇస్తూ.. రిలయన్స్, ఐటీసీ, అమూల్‌ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసి జీవనోపాధి చూపించి.. అక్షరాల రూ. 9,180 కోట్లు వైయస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా అమలు చేశాం. ఈ పథకాన్ని ఆపేయాలనేది వీరి ఉద్దేశం.. దీనికి మీరు ఒప్పుకుంటారా..? 

మనందరి ప్రభుత్వంలో 78.75  లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచిచేస్తున్నాం. గతంలో చంద్రబాబు మోసం చేసి.. రుణమాఫీ హామీని ఎగ్గొట్టి, చివరకు సున్నావడ్డీ పథకాన్ని రుద్దు చేసి.. బాబు నిర్వాకం వల్ల అక్కచెల్లెమ్మల అప్పుల తడిచిమోపెడై.. 18.36 శాతంగా ఎన్‌పీఏలుగా, అవుట్‌ స్టాండింగ్‌లుగా తయారై, అక్కచెల్లెమ్మలంతా ఎదురీత ఈదుతుంటే.. అటువంటి వైయస్‌ఆర్‌ ఆసరా పథకం రూ.25,517 కోట్లు ఈ చంద్రబాబు చేసిన నిర్వాకం వల్ల అక్కచెల్లెమ్మలు అప్పుల ఊబిలో పడ్డారు. వారిని కాపాడేందుకు అక్షరాల రూ.12,758 కోట్లు వైయస్‌ఆర్‌ ఆసరా ద్వారా అక్కచెల్లెమ్మలను ఆదుకునే కార్యక్రమం చేస్తే ఆ పథకాన్ని ఆపేయాలనేది వీరి ఉద్దేశం.. ఇందుకు మీరు ఒప్పుకుంటారా..? 

మనందరి ప్రభుత్వంలో 31 లక్షల నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలిచ్చాం. గతంలో సంవత్సరాల తరబడి ముఖ్యమంత్రులుగా పాలన చేశారు. ఏ ఒక్కరూ నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇంటి స్థలం, ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆలోచన చేయలేదు. మన ప్రభుత్వం అక్షరాల 31 లక్షల అక్కచెల్లెమ్మలకు వారి పేరుతో ఇంటి స్థలాలు ఇచ్చి.. ఆ స్థలాల్లో ఇళ్లు కట్టించే గొప్ప కార్యక్రమం చేశాం. ఆ ఇళ్లు పూర్తయితే ఒక్కొక్కరి చేతుల్లో రూ.5–10 లక్షలు ఆస్తి ఇచ్చినట్టు అవుతుంది. మొత్తంగా 31 లక్షల కుటుంబాలకు అక్షరాల రూ.2–3 లక్షల కోట్ల నేరుగా వారి చేతుల్లో పెట్టినట్టు  అవుతుంది. ఇటువంటి గొప్ప పథకం ఆపేయాలనేది వీరి ఉద్దేశం.. దీనికి అక్కచెల్లెమ్మలు ఒప్పుకుంటారా..? 

18.5 లక్షల పంపుసెట్లకు సంవత్సరానికి రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తూ ఉచితంగా కరెంట్‌ ఇస్తున్నాం. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన జరుగుతున్న మంచిని చూశాం. జగనన్న గోరుముద్ద ద్వారా మంచి ప్రజలందరికీ తెలుసు. నాడు–నేడు ద్వారా ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నాం. నాడు–నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మారిపోతున్నాయి. వైయస్‌ఆర్‌ రైతు భరోసా, సున్నావడ్డీ, వైయస్‌ఆర్‌ పంటల బీమా, ఇన్‌పుట్‌సబ్సిడీ, ఉచిత విద్యుత్‌ వంటి గొప్ప పథకాలు రాష్ట్రంలో అమలువుతున్నాయి. వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ అనే మంచి పథకాన్ని ఒంగోలు వేదికగా మూడో ఏడాది అమలు చేస్తున్నాం. 

వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక ద్వారా 62 లక్షల మంది జీవితాల్లో వెలుగులు కనిపిస్తున్నాయి. వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం ద్వారా అక్షరాల 1 లక్ష మంది చేనేత కుటుంబాలకు మంచి జరుగుతుంది. వైయస్‌ఆర్‌ కాపు నేస్తం ద్వారా 3.3లక్షల అక్కచెల్లెమ్మలకు మంచి జరుగుతుంది. వైయస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం ద్వారా 4 లక్షల మంది అగ్రవర్ణాల్లో పేద అక్కచెల్లెమ్మలకు మంచి జరుగుతుంది. జగనన్న చేదోడు ద్వారా రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లు అక్షరాల 3 లక్షల మంది కుటుంబాలకు మంచి జరుగుతుంది. జగనన్న తోడు పథకం ద్వారా చిరువ్యాపారులు అక్షరాల 14.16 లక్షల మందికి మంచి జరుగుతుంది. వైయస్‌ఆర్‌ వాహన మిత్ర ద్వారా 2.75 లక్షల మంది సొంత ఆటోలు, క్యాబ్‌లు ఉన్న డ్రైవర్ల కుటుంబాలకు మంచి జరుగుతుంది. వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ద్వారా అక్షరాల 95 శాతం ప్రజలకు గొప్ప మేలు జరుగుతుంది. వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా ద్వారా ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్‌ చేయించడమే కాకుండా.. ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేల చొప్పున పెట్టి పంపిస్తున్న గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా.. పేదరికంలో ఉండి అలమటిస్తున్న ప్రజలు 80 శాతం మంది. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లో పేదలకు మీ జగన్‌ చేస్తున్నది మంచా.. చెడా అనేది మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయండి. 

ఈ పథకాలన్నీ నిలిపివేయాలని ఎల్లో పార్టీ, ఎల్లోమీడియా, వారి దత్తపుత్రుడు అడుగుతున్నారు. మీ తరఫున నేను ప్రశ్నిస్తున్నాను.. మీరు కూడా ప్రశ్నించండి. ఇటువంటివారు నిజంగా మనషులేనా అని అడగండి. ఇటువంటి వారు రాజకీయ పార్టీలు నడపడానికి అర్హులేనా.. ఇటువంటి వారు ప్రజాజీవితంలో ఉండటానికి అర్హులేనా..? చంద్రబాబు హయాంలో అయినా, మన హయాంలో అయినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అదే.. చేస్తున్న అప్పులూ అవే. చంద్రబాబు కంటే మనం చేస్తున్న అప్పు కాస్తోకూస్తో తక్కువే. మరి అలాంటప్పుడు ప్రజలకు మంచి జగన్‌ ఎలా చేయగలుగుతున్నాడు.. ఆ చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడనేది అందరూ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయాలి. 

కారణం.. జగన్‌ బటన్‌ నొక్కుతున్నాడు.. ఆ సొమ్ము నేరుగా ప్రజల దగ్గరకు చేరుతుంది. చంద్రబాబు పాలన అంతా ఆయనకు మంచి చేసుకోవడం, ఆయన చుట్టూ ఉన్న రామోజీరావు, ఏబీఎన్, టీవీ5, గ్రామాల్లో జన్మభూమి కమిటీలకు మంచి చేసుకోవడం కోసం బాబు పాలన సాగింది. అదే బడ్జెట్, అదే రాష్ట్ర వనరులు, అవే అప్పులు అయినా చంద్రబాబు పాలన ఒక మాదిరిగా ఉంది. అంతకంటే తక్కువ అప్పులు చేసిన జగనన్న పాలన చంద్రబాబు కంటే చాలా చాలా గొప్పగా ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

రాష్ట్రంలో కనీవినీ ఎరుగని విధంగా విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. 70 మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం. సామాజిక న్యాయం అనేది మాటల్లో కాదు.. చేతల్లో కనిపిస్తుంది. మొదటి దఫ మంత్రి వర్గంలో56 శాతం ఇవ్వడం ఒక చరిత్ర అయితే.. ఇప్పుడు 70 శాతం ఇవ్వడం మహా చరిత్ర. 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉంటే.. వారిలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అయితే.. మళ్లీ అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కొనసాగించడం మహా విప్లవం. గత పాలనలో 42 శాతం, 48 శాతం ఇస్తే గొప్ప అనుకునేవారు. అలాంటిది ఈరోజు 56 శాతం, 70 శాతం కనిపిస్తుంది. మంత్రివర్గంలో 11 మందిని కొనసాగిస్తే అందులో 9 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. ఇంతకంటే సామాజిక న్యాయం ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా..? 

ఎక్కడో ఎందుకు ఈ ఎల్లో సభ్యులు నివాసం ఉంటున్న విజయవాడనే తీసుకోండి. జనరల్‌ స్థానంలో విజయవాడ మేయర్‌ బీసీ మహిళ. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్‌గా జనరల్‌ స్థానంలో బీసీ మహిళ కనిపిస్తుంది. కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో చైర్మన్‌గా బీసీ ఉన్నారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటివి చూశారా..? 13 జిల్లాల జిల్లా పరిషత్‌ చైర్మన్లలో 9 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. సామాజిక న్యాయం అనేది మాటలు చెప్పి.. ప్రజలను ఉపయోగపెట్టుకొని చెత్తబుట్టలో పడేసే రోజులు పోయాయి. సామాజిక న్యాయం మాటల్లో కాదు.. చేతల్లో చేసి చూపిస్తున్న ప్రభుత్వం మీ అన్నది, మీ తమ్ముడిది, మీ జగన్‌ది అని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

దేవుడు ఆశీర్వదించాలని, ప్రజలందరి దీవెనలతో ఇంకా గొప్పగా పరిపాలన సాగించాలి,  ప్రజలకు ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. 

తాజా ఫోటోలు

Back to Top