తాడేపల్లి: బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని, దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ పండుగ జరుపుకుంటారన్నారు. ఈ పండుగ సమయంలోనే ముస్లింలు పవిత్రమైన మక్కా యాత్రకు వెళ్లడం సంప్రదాయంగా భావిస్తారన్నారు. భక్తి భావానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు సంకేతమైన పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని సీఎం వైయస్ జగన్ ఆకాంక్షించారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కాంక్షించారు. ``ఇబ్రహీం జీవితం మనందరికీ ఆదర్శం`` బక్రీద్ పండుగ సందర్భంగా సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. ``త్యాగం, ప్రేమ, సహనం వంటి సద్గుణాల సందేశమే బక్రీద్. నమ్మిన సిద్ధాంతం కోసం చివరికి ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఇబ్రహీమ్ జీవితం మనందరికీ ఆదర్శం. మంచి కోసం, ధర్మ సంస్థాపన కోసం ఈరోజు త్యాగోత్సవం జరుపుకొంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు`` తెలిపారు.