తిరుపతిలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సీఎం వైయస్ జగన్ విజ్ఞప్తి 

 పెండింగ్‌లో ఉన్న రూ. 32,625.25 కోట్ల బకాయిలు  వెంటనే మంజూరు చేయాల‌ని విన‌తి

న్యూఢిల్లీ: తిరుపతిలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ(ఎన్‌ఎఫ్‌ఎస్‌యు) ఏర్పాటు చేయాల్సిందిగా అమిత్‌షాకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బుధ‌వారం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్రయాదవ్ ను క‌లిసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గురువారం హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్చించారు. 

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు విన్న‌వించిన అంశాలు:

 నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ:
"ప్రపంచ స్ధాయి విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌ రాష్ట్రంలోని గాంధీనగర్‌ కేంద్రంగా నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఢిల్లీ, గోవా, త్రిపురలలో క్యాంపస్‌లు కూడా స్ధాపించింది. 
 జాతీయ ప్రాముఖ్యత దృష్ట్యా  ఫోరెన్సిక్‌ సైన్స్, క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్, సెక్యూరిటీ బిహేవియరల్‌ సైన్స్‌ మరియు క్రిమినాలజీ రంగాల్లో పరిశోధనలు నిర్వహిస్తూ ఫోరెన్సిక్‌ నిపుణుల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉన్న కొరతను సైతం తీరుస్తూ... కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా క్రిమినల్ జస్టిస్ ఇనిస్టిట్యూట్‌లను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది."

ఈ నేపధ్యంలో దక్షిణ భారత దేశంలో ఫోరెన్సిక్‌ రంగంలో సేవలందించే అటువంటి సంస్ధ లేని లోటు, దానిని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను  కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చిన సీఎం.
అందులో భాగంగా ఇప్పటికే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటూ, విద్యారంగంలోనూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతిలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ ఏర్పాటు అంశాన్ని పరిశీలంచాలని హోంమంత్రి అమిత్‌షాకు విన్నవించిన సీఎం. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఉచితంగా అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రికి తెలిపిన సీఎం.

 

 •  ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని హోం మంత్రికి వివరించిన సీఎం.
 •  రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు సుదీర్ఘకాలం గడిచినప్పటికీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేర్చలేదని, రెండు రాష్ట్రాల మధ్య ఇంకా కీలక అంశాలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదని హోంమంత్రికి వివరించిన సీఎం. 
 •  2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద చెల్లించాల్సిన బకాయిలు అలానే ఉన్నాయన్న సీఎం. 2014–15 కు సంబంధించిన రూ.18,330.45కోట్ల బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు మొదలైన వాటి రూపేణా మొత్తంగా రూ. 32,625.25 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే మంజూరు చేయాలని కోరిన సీఎం. 
 •  పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చు చేసిన రూ.2,937.92  కోట్ల రూపాయలను రెండేళ్లుగా చెల్లించలేదు. ఈ డబ్బును వెంటనే చెల్లించాల్సిందిగా విజ్ఞప్తిచేసిన సీఎం. 
 •  తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల కరెంటు బకాయిలను వెంటనే ఇప్పించాల్సిందిగాహోం మంత్రిని కోరిన సీఎం. 
 •  జాతీయ ఆహార భద్రతా చట్టంలో నిబంధనలు హేతుబద్ధంగా లేవని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్న విషయాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకు వచ్చిన సీఎం.
 • రాష్ట్రంలో అర్హత ఉన్న 56 లక్షల కుటుంబాలు పీఎంజీకేఏవై కింద లబ్ధి పొందడం లేదని, నెలకు సుమారు 3 లక్షల టన్నులు రేషన్‌ బియ్యం కేంద్రం వద్ద మిగిలిపోతున్నాయని, ఇందులో 77వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే అర్హులందరికీ ఆహార భద్రతా చట్టం వర్తింపు చేసినట్టువుతుందని... ఈమేరకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన సీఎం. 
 •  రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కల్పనపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరిన ముఖ్యమంత్రి. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అవశ్యమని, పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని పునరుద్ఘాటించిన సీఎం.
 •  రాష్ట్రాంలో జిల్లాల పునర్విభజన తర్వాత వాటి సంఖ్య 26కు చేరిందని, కేంద్రం కొత్తగా మంజూరుచేసిన 3 కాలేజీలతో కలుసుకుని ఇప్పటికి 14 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయని తెలిపిన సీఎం. మిగిలిన 12 జిల్లాలకు వెంటనే మెడికల్‌ కాలేజీలు మంజూరుచేయాలని హోంమంత్రిని కోరిన సీఎం.
 •      కడపలో నిర్మించనన్న సీల్‌ప్లాంటుకు సరిపడా ఖనిజాన్ని అందుబాటులో ఉంచడానికి ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని కోరిన సీఎం.
 •      విశాఖలో 76.9 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని, ఈ ప్రాజెక్టుకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరిన సీఎం. 
 •  రాయలసీమ లిఫ్ట్‌ఇరిగేషన్‌ స్కీంకు సంబంధించి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్రమంత్రిని కోరిన సీఎం. 
 •  రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్‌రిజర్వాయర్లకు సంబంధించి పలు అంశాలను వివరించిన సీఎం. 
 •  కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, కృష్ణా రివర్‌ మేనేజిమెంట్‌ బోర్డు యొక్క అన్ని ఆపరేషనల్‌ ప్రోటోకాల్స్‌ను, ఒప్పందాలను, ఆదేశాలను ఉల్లంఘిస్తోందని పేర్కొన్న సీఎం. 
 •  తెలంగాణ ప్రభుత్వం అనధికారకంగా, ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండానే  పెద్ద ఎత్తున నిర్మిస్తున్న పాలుమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(3టీఎంసీలు), దిండి పథకాలను 800 అడుగులు వద్ద నిర్మిస్తున్న విషయం ఇదివరకే కేంద్రం దృష్టికి తీసుకు వచ్చామని తెలిపిన సీఎం. 
 •  ‘‘ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం 974 కిలోమీటర్ల విస్తారమైన తీరప్రాంతంతో అపారమైన ఆర్ధిక కార్యకలాపాలకు అనువుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులలో మూడు గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టులను అభివృద్ది చేస్తున్నాం.  రామాయపట్నం ఓడరేవుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి, 2024 నాటికి పోర్ట్‌ కార్యకలాపాలు కూడా ప్రారంభం కానున్నాయి. 
 • మిగిలిన రెండు పోర్టుల కోసం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్ట్‌లలో పర్యావరణ అనుమతులు మంజూరుకు మీ సహకారం అందించాలని కోరుతున్నాం.’’ అని కేంద్రమంత్రిని కోరిన సీఎం.
 •   పంప్డ్‌ స్టోరేజ్‌ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి అనుకూలమైన స్ధలాలను గుర్తించడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందంజలో ఉందని, అదే విధంగా పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుల ప్రమోషన్‌ కోసం పాలసీని కూడా రూపొందించిందని, ఆ తరహా ప్రాజెక్టులలో ఎర్రవరం, కురికుట్టి, సోమశిల, అవుకు వంటి చోట్ల ఏర్పాటు జరుగుతోందని, ఆ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హోం మంత్రి అమిత్‌షాను కోరారు. 

 

Back to Top