విజయవాడ: వైయస్ఆర్ అవార్డులు అందుకుంటున్న వారంతా తమ రంగాల్లో వారి జీవితాలను అర్పించిన వారు... మన హేరిటేజ్‌ను తమ భుజాల మీద మోసిన వారు.. వీరంతా మన జాతి సంపద అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన వైయస్ఆర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీర్, వైయస్ విజయమ్మ, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే.. ఎందరో మహానుభావులు అందరికీ ఈ శుభ సందర్భంలో వందనాలు. ఈరోజు ఇక్కడ మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గౌరవనీయులు గవర్నర్ గారికి, నా మంత్రివర్గ సహచరులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సన్మాన స్వీకర్తలు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ అవతరించి నేటికి 67 సంవత్సరాలైంది. వరుసగా ఈరోజుకు లెక్కేసుకుంటే ఇది మూడో సంవత్సరం ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. మన రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో దశాబ్దాలుగా సుసంపన్నం చేసిన మహనీయులను గౌరవిస్తూ వైయస్ఆర్ అవార్డులతో సత్కరించే ఈ సంప్రదాయం మూడు సంవత్సరాలుగా చేస్తున్నాం. మన సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ వివిధ రంగాల్లో ఆకాశమంత ఎదిగినా సామాన్యులుగానే ఒదిగి ఉన్న అసామాన్యులకు ఇస్తున్న అవార్డులు ఇవి. ఈ సంవత్సరం 27 మందికి వైయస్ఆర్ అవార్డులతో సత్కరిస్తున్నాం. ఇందులో నలుగురికి అచీవ్‌మెంట్, 23 మందికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ప్రదానం చేయబోతున్నాం. తెలుగుతనానికి, తెలుగు మాటకు, తెలుగు వాడి గుండె ధైర్యానికి మన పల్లెలు, మన పేదలు, మన రైతుల మీద మమకారానికి, మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం డాక్టర్ వైయస్ఆర్ గారి పేరిట ఏటా రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అవార్డులు ప్రదానం చేస్తుంది. డాక్టర్ వైయస్ఆర్ గారి హయాంలో వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం ఇలా ఏ రంగాన్ని తీసుకన్నా అంతకు ముందున్న చరిత్ర గతిని మారుస్తూ ఎన్నో ముందడుగులు పడిన పరిస్థితులు మనమంతా చూసినవే. ఇలాంటి రంగాల్లోనే మన వ్యవసాయానికి, మన చేనేతకు, మన తప్పెటగుళ్లకు, మన జానపదానికి, మన రంగస్థలానికి, మన అభ్యుదయ వాదానికి, మన హేతు వాదానికి... సాటి మనుషులకు చేస్తున్న సేవలకు ఇలా పలు రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న గొప్ప వ్యక్తులకు ఈ ఏడాది అవార్డుల్లో చోటు దక్కింది. ఈ అవార్డులు అందుకుంటున్నవారు అంతా కూడా తమ రంగాల్లో వారి జీవితాన్ని అర్పించిన వారు, మన వారసత్వాన్నితమ భుజాల మీద మోసిన వారు. వీరంతా మన జాతి సంపద. ఈరోజు సమాజం ఇచ్చిన గుర్తింపు ఆధారంగా ప్రదానం చేస్తున్న ఈ అత్యున్నత అవార్డుల్లో చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఈ మూడు సంవత్సరాల్లో సామాజిక న్యాయం సంపూర్ణంగా వర్ధిల్లింది. ఈ అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని సీఎం తన ప్రసంగం ముగించారు.