అర్బన్‌ ప్రాంతాల్లో కరోనా నియంత్రణపై సీఎం సమీక్ష

దుకాణాల ముందు ధరల పట్టిక కచ్చితంగా ఉండాలి

అరటి, టమాటా రైతులకు ఇబ్బందులు లేకుండా చూడండి

ఖాళీగా ఉన్న మార్కెట్‌ యార్డుల చైర్మన్లను నియమించండి

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం

తాడేపల్లి: కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసుల వివరాలను అధికారులు సీఎంకు అందజేశారు. కొత్తగా 17 కేసులు నమోదయ్యాయని, వీరిలో చాలా మంది ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్నారని తెలిపారు. ఢిల్లీ వెళ్లినవారిని గుర్తించి పరీక్షలు చేసి వైద్యం అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

అర్బన్‌ ప్రాంతాల్లో కరోనా నియంత్రణ చర్యలపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. సర్వే నిరంతరాయంగా కొనసాగాలని సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారు ముందుకొచ్చి ఆరోగ్య వివరాలు అందించాలని కోరారు. వారు ముందుకు రాకుంటే కుటుంబ సభ్యులకే నష్టం కలుగుతుందన్నారు. షెల్టర్లలో ఉన్నవారికి కరోనా లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. అర్బన్‌ ప్రాంతాల్లో రైతుబజార్లు, మార్కెట్ల వికేంద్రీకరణపై సీఎం వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. దుకాణాల ముందు ధరల పట్టికను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. 

అదేవిధంగా పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి తీసుకుంటున్న చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ అధికారులతో చర్చించారు. రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని, అరటి, టమాటా రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. నిల్వ చేయలేని పంటల విషయంలో సమస్యలను పరిష్కరించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో జనతా మార్కెట్‌లపై ఆలోచన చేయాలని సూచించారు. 

ఆక్వా రైతులు, ఆక్వారంగ  అనుబంధ పరిశ్రమలపై సీఎం వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. 69 ప్రాసెసింగ్‌ యూనిట్లలో 41 చోట్ల పనులు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. అమెరికా, చైనాలకు ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

నిత్యావసర కొనుగోలుకు ప్రజలు గుమిగూడకుండా చూడాలని ఆదేశించారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించేలా చూడాలన్నారు. పట్టణాలు, నగరాల్లో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి ఒంటి గంట వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతించాలని సూచించారు. మార్కెట్‌ యార్డుల చైర్మన్లు ఇందులో భాగస్వాములు కావాలన్నారు. ఖాళీగా ఉన్న మార్కెట్‌ యార్డుల చైర్మన్లను భర్తీ చేసి టాస్క్‌ఫోర్స్‌లో భాగస్వామ్యం చేయాలని అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. సాయం చేయాలనుకునేవారు టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను సంప్రదించాలని సూచించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top