అమరావతి: ఉత్తరాంధ్రకు తుపాన్ ముప్పు నేపథ్యంలో ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఈ విషయంలో ఎటువంటి లోపం ఉండకూడదని స్పష్టం చేశారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజుల పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్న సీఎం జగన్ వెంటనే జవాద్ తుపాన్ పరిస్థితులపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి సుచరిత కూడా ఇందులో పాల్గొన్నారు. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలివీ.. ►ఎక్కడా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలి. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాన్ ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు అందుబాటులో ఉంచాలి. ►సహాయ చర్యల్లో ఏ లోపం ఉండకూడదు. జిల్లాలకు వెళ్లిన ప్రత్యేక అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ►సహాయ శిబిరాల్లో ఆహారం నాణ్యత చాలా ముఖ్యం. మంచినీరు, టాయిలెట్లు.. ప్రతి ఒక్కటీ పరిశుభ్రంగా ఉండాలి. ►అన్ని జిల్లాలలో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలి. మరోసారి అన్ని చోట్ల పరిస్థితులను సమీక్షించండి. అదనపు బృందాలను కూడా అందుబాటులో ఉంచాలి. ►ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ► చెరువులు, కాల్వలు, రిజర్వాయర్ల కట్టల పరిస్థితి ఎలా ఉందో పరిశీలించండి. ఎక్కడైనా గండ్లు, బలహీనంగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే జల వనరుల శాఖ అధికారుల దృష్టికి తెచ్చి అత్యవసర మరమ్మతులు చేపట్టండి. ►ఇప్పటికిప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు తుపాన్ ముప్పు లేనప్పటికీ అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి.